గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 01:12:45

40 కిలోమీటర్ల పొడవైన.. ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ!

40 కిలోమీటర్ల పొడవైన..  ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ!

‘ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ తెలుసు. కానీ.. ‘ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ’ తెలుసా? చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇది మన చరిత్ర. మనం తెలుసుకొని రేపటి తరానికి తెలియజెప్పాల్సిన చరిత్ర. 

శిథిల శిలా శాసనాలు, ఒరిగిన కోట కుడ్యాల సాక్షిగా రాచకొండ రమణీయత ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్కో నిర్మాణంలో ఒక్కో వైశిష్ట్యం. రాజుల ఏలుబడిలో తెలంగాణమెంతటి సుభిక్షమో, సురక్షితమో, సస్యశ్యామలమో ఆ కట్టడాలు, చుట్టూ ఉన్న ప్రహరీలను బట్టి చూస్తేనే తెలుస్తుంది. ఎంతో ఘనమైన చరిత్ర, ఎన్నో వైభవాలు కలగలిసిన రతణాల కొండ రాచకొండ. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో నిర్మించిన రాచకొండ కోట ఒక అద్భుతం. 40 కిలోమీటర్ల మేర గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణగా పిలువబడే గోడ ఉండటం ఇక్కడి అద్భుతం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలోనూ మూడంచెల గస్తీ వ్యవస్థ కలిగిన అంతఃపురం, రాజమందిరం, రాణివాసం ఉండటం అత్యద్భుతం. 10 గుట్టల నడుమ శత్రుదుర్భేద్యంగా, పకడ్బందీగా రాజుగారి గుట్టలో కోట ఉంటుంది. ఆనాడే వాస్తును పాటించి కట్టిన ఇండ్లు, ఆలయాలు ఉన్నాయి. ఆలయాల రాతి శిలలపై శిల్పలు అద్భుతంగా చెక్కిన ప్రకృతి చిహ్నాలు ఉన్నాయి. కొండలపైనే చెరువులు, నీటి కొలనులు తవ్విన ఆనవాళ్లు ఉన్నాయి. అశ్వాలతో, గజములనెక్కి రాజులు సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతుబట్టని రీతిలో నిర్మించిన సంకెళ్లబావి, రాజుగారి గుట్ట ప్రాంతంలో వసంతోత్సవ కళా భవనం నేటికీ కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ గొప్ప చరిత్ర ఉంది. రేచర్ల ప్రభువులు సాహిత్యకళా పోషణ.. శిఖరాయమానమై తెలుగు వైభవానికి, శోభకు కారణమయ్యాయి. వీటన్నింటినీ కలుపుతూ శత్రుదుర్భేద్యంగా 40 కిలోమీటర్లకు మించి ప్రహరీ గోడ ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెప్తున్నారు చరిత్రకారులు. ఈ గోడ గురించి, దాని చుట్టూ ఉన్న చరిత్ర గురించి నేటి తరానికి, రాబోయే తరానికి తెలియకుంటే... ఈ రాజ్యమునేలిన రాజుల చరిత్ర, రాచకొండ పట్నపు వైభవం, రాజాచలపు వీరత్వం, ధీరత్వం, శూరత్వం, ఈ కోటలకు రాళ్లెత్తిన ఈ ప్రాంతపు మట్టి మనుషుల నెత్తుటి ధారల విలువ ఉట్టిగనే మట్టిలో కలిసిపోతాయి. 


logo