ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 01:08:52

విదేశాల్లో ఫేమస్‌.. సిర్నాపల్లి పాలకోవా!

విదేశాల్లో ఫేమస్‌.. సిర్నాపల్లి పాలకోవా!

సిర్నాపల్లి కోవా రుచి మధురాతి మధురం. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో దీనిని తయారుచేస్తారు. ఈ కోవాకు ఖండాంతర ఖ్యాతి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రామంలో సుమారు 40-50 కుటుంబాలు ఉంటాయి. ఊరిలో ప్రతి ఇల్లూ పాడి సంపదతో అలరారుతుంది. పాలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి గ్రామస్తులు కులవృత్తిగా, కుటీర పరిశ్రమగా కోవా తయారీని ఎంచుకున్నారు. 50 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచనే నేడు వారి కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుంది. 3 లీటర్ల పాలతో కేజీ పాలకోవా తయారవుతుంది. కేజీ పాలకోవా రూ.300-350 వరకు విక్రయిస్తుంటారు. రోజుకు 50-60 కేజీల వరకు కోవాను తయారు చేస్తూ సుమారు 12,000- 14,000 వరకు సంపాదిస్తుంటారు. ఒక్కో రైతు రోజుకు సుమారు 2కిలోల కోవాను తయారు చేస్తారు. కరోనా నేపథ్యంలో రాకపోకలు తగ్గడంతో వ్యాపారం కొద్దిగా తగ్గినా ఇక్కడి పాలకోవా అంటే విదేశాల్లో ఉండేవారు సైతం మక్కువ చూపుతారు. కోవా తయారీకి సుమారు 3 గంటల సమయం పడుతుంది. పాలతో పాటు పంచదార, ఇతర సుగంధ ద్రవ్యాలు చేర్చడం వల్ల మంచి రుచి వస్తుంది. కొంత మంది వ్యాపారులు సైతం ఇక్కడికి వచ్చి కోవాను కొనుగోలు చేసి నిజామాబాద్‌, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ లాభాలు పొందుతుంటారు. విదేశాల్లో ఉండే తమ కుటుంబసభ్యులు, బంధువుల కోసం ప్రత్యేకంగా కోవాను కొనుగోలు చేసి పంపుతుంటారు. అలా అమెరికా, దుబాయి, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు సైతం సిర్నాపల్లి పాలకోవా ఎగుమతి అయ్యిందంటే చెప్పుకోవచ్చు కోవా రుచి ఎలా ఉంటుందో.విదేశాల్లో ఉండే వారు కూడా ఈ కోవా టేస్ట్‌కు ఫిదా అవుతున్నారు. logo