మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 01:02:30

పదకొండేండ్లకు పెరిగే.. మేళ్లచెర్వు శివలింగం!

పదకొండేండ్లకు పెరిగే.. మేళ్లచెర్వు శివలింగం!

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది రాష్ట్రంలోనే పేరెన్నిగకన్న క్షేత్రాల్లో ఒకటి. స్వయంభు శంభులింగేశ్వర ఆలయాలు చాలా ఉన్నా మేళ్లచెర్వు ఆలయం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయానికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. 

మేళ్లచెర్వు లింగోద్భవుడి ఆకృతి ఇంతింతై వటుడింతై అని ఏటా పెరుగుతుంటాడు. ప్రతి పదకొండు ఏండ్లకు అంగుళం చొప్పున పెరుగుతుందని చెబుతారు. ఇంకో విశిష్టత ఏందంటే ఉపరితలంపై ఉన్న నాభి నుంచి ఎంత తీసినా గంగమ్మ ఊరుతూనే ఉంటుంది. గరిటతో, పాత్రతో, చేతితో తీసినకొద్దీ లింగంపై ఉన్న రంధ్రం నుంచి నీరు పైకి వస్తుంటుంది. ఖాళీని భర్తీ చేస్తూ నిండుగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ లింగోద్భవుడు అర్ధ నారీశ్వరుడు. వెనక జడ ఆకారంలో అమ్మవారి రూపం ఉండటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయాన్ని చూసేందుకు నిరంతరం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మేళ్లచెర్వు శైవ క్షేత్రం కాకతీ ప్రతాపరుద్రుడు పాలించిన కాలంలో వెలుగు చూసింది. 1311 ప్రాంతంలో యాదవులు స్థానికంగా పశువులు మేపుతుండగా ప్రతి రోజూ ఓ గోవు వచ్చి ఇప్పుడు శివలింగం ఉన్న ప్రాంతంలో పాలాభిషేకం చేస్తుండేది. అలా ఒకరికి కలలో అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించమని శివయ్య కోరినట్టు, ఆ క్రమంలో ఊపిరిపోసుకున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రం అనంతర కాలంలో అభివృద్ధి చెందుతూ వచ్చిందని ప్రతీతి. logo