గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 00:52:03

ఇటు జానపదం..అటు మోక్షపథం

ఇటు జానపదం..అటు మోక్షపథం

‘నమో వేంకటేశా నమో తిరుమలేశా’ అంటూ శ్రీనివాసుని సన్నిధిలోని అనుభూతి కలిగించినవాడు. ‘కాలం మారిపోయే’ అంటూ ఇహలోకాన్ని పరిచయం చేసినవాడు. జానపదాలకి కొత్త పథాన్ని చూపినవాడు. సినీపాటల పూదోటలో పసిడిపూలు పూయించిన కవీశ్వరుడు. అటు సంప్రదాయ భాషా సౌందర్యంతో, ఇటు లలితగీతాల మాధుర్యంతో తన ప్రత్యేకతను చాటిన కవి ఆచ్చి వేణుగోపాలాచార్య.

కవిగా, పండితుడిగా, సినీగేయరచయితగా ప్రైవేటు గీతాలకర్తగా సుపరిచితులైన ఆచ్చి వేణుగోపాలాచార్య హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌ లో 1930 జూన్‌ 12 న జన్మించారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తి రీత్యా కవి. భాషావేశం ఆవహించిన గొప్ప పండితుడు. తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతభాషల్లో దిట్ట.

మొదట్లో హిందీ సినిమా పాటల్ని తెలుగులోకి అనువదించుకుని అదే బాణీలో పాడి అందరిని అలరించేవారు. అలా బూర్గుల రామకృష్ణారావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. ప్రైవేటు గీతాలు, గేయాలు రాసి పేరు సంపాదించుకున్న క్రమంలో కె.బి.తిలక్‌ ‘ముద్దుబిడ్డ’ సినిమా తీస్తున్నారని తెలిసింది. వెంటనే ఆయనను కలుసుకుని తను రాసిన ‘చుక్కల చీరకట్టుకుని పట్టుగుడ్డ రైక తొడుగుకుని’ అనే జానపదగీతాన్ని వినిపించారు. తిలక్‌కు అది బాగా నచ్చి పెండ్యాల సంగీతంలో జిక్కి గారితో పాడించి రికార్డ్‌ చేయించారు. అలా  1956 -1975 మధ్యకాలంలో అద్భుతమైన పాటల్ని అందించారు.

పాటలున్నాయ్‌.. పేరు లేదు!

ఆ తరువాత ‘వేంకటేశ్వర మహాత్మ్యం’(1960) సినిమా కోసం ఆయన ‘చిలకా చిక్కావో ఈనాడు’, ‘పదవే పోదాము గౌరీ’,  పాటలు రాశారు. వాటిని సినిమాల్లో వాడుకుని కూడా టైటిల్స్‌ లో ఆయన పేరు వేయలేదు. ఆ సినిమా కోసమే  ‘జయ జయ జయ శ్రీవేంకటేశా’ అనే భక్తిగీతాన్ని రాయించుకుని కూడా సినిమాలో ఉపయోగించుకోలేదు. అదే తరువాత ప్రైవేటు గీతంగా ప్రసిద్ధికెక్కింది. ‘శ్రీ తిరుపతమ్మకథ’(1963)లో ‘శ్రీవేంకటేశా దయాసాగరా’ పాటతో పాటు ఇంకా మూడు పాటలు రాశారు. అయినా టైటిల్స్‌ లో అతని పేరు కనబడదు. ఇలా 2, 3 సినిమాల్లో పాటలు రాసినా ఆయన పేరు వేయకపోవడం చాలా బాధాకరం. తెలుగు సినీరంగంలో ఆయన విస్మృత కవి. ఆ తర్వాత ఎన్‌.టి.రామారావు సూచన మేరకు తన పేరులో ‘ఆచార్య’ను తొలగించుకుని వేణుగోపాల్‌గా స్థిరపడ్డారు. అలా వేణుగోపాల్‌ పేరుతో చాలా సినిమాలకు పాటలు రాశారు.

ఏ ఉద్వేగమైనా...

ఆయన భక్తిపాటలు రాయడంలో చాలా ప్రత్యేకత కనబరిచేవారు. ‘అమూల్యకానుక’(1961) లోని  ‘ఏలమరిచేవో ఈశా’, ‘మహేశ్వరీ త్రిభువనపాలనీ’, ఇంకా ‘రాఘవేంద్ర మహాత్మ్యం’ మొదలైన కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు ఆయన రాసిన  పాటలు మనల్ని భక్తిప్రపత్తుల్లో ముంచెత్తుతాయి. జానపద గీతాల్లోనూ ఆయన కలం కొత్త అడుగులేసింది. ‘అమూల్యకానుక’(1961) లోని ‘కాలం మారిపోయే అబ్బీ’, ‘వీరాధివీరుడు’ (1961) లోని ‘కసి ఉసి ఉసి కసి ఉన్నదాన్నిరా’, ‘కష్టసుఖాలు’(1961)లోని ‘కారు షికారే జోరు’, ‘సోమవార వ్రత మహాత్మ్యం’ (1963) లోని ‘వయ్యారీ నేనోయ్‌ వలపింతు’, ‘సౌభాగ్యవతి’(1975) లోని ‘ఎందుకింత కంగారు ఓ సింగారయ్య’ వంటి జానపద గీతాలు ఆయన కలం బలాన్ని చాటుతాయి. ఆయన రాసిన ప్రేమగీతాలు కూడా ఎంతో విశిష్టమైనవి. ‘పచ్చని సంసారం’(1961) లోని  ‘ఆశలు మురిపించు ఈయనెవ్వరే’, ‘తలచుకుంటే ఆహా చిలికె నాలో ముదమే’, ‘నను చేరవోయి రాజా’, ‘మోహనా నీ మాయలు మనసున’లాంటి ప్రణయగీతాలు  ప్రేమసంద్రంలో ఓలలాడిస్తాయి.

భాగ్యనగరపు బండల పాట!

తెలుగు సినీరంగంలో ఆచ్చి వేణుగోపాల్‌ పేరును  నిలబెట్టిన పాట ’అమాయకుడు’(1968) లోని ’పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ చూపించు సూపు నిండ పిసల్‌ పిసల్‌ బండ’ అనే పాట.  జానపదశైలిలో రాసిన ఈ పాట అందరి నోళ్ళలో నానుతుండేది. ఇప్పటికి తెలుగు సినీ జానపదగీతాల జాబితాలో ఈ పాటకు ప్రత్యేకస్థానముంది. హైదరాబాద్‌ లో ఉన్న శాలిబండ, అల్లబండ వంటి ’బండల్ని’ ఈ పాటలో పదాలుగా ప్రయోగించారు. అప్పట్లో ఈ పాటను బండల పాట అనేవారట. ఆ బండల పాట ఇప్పటికీ గుండె గుండెల్లో నిండి ఉంది.దాదాపు 12 సినిమాల్లో 50 వరకు పాటలు రాశారు. హిందీ, కన్నడం వంటి డబ్బింగ్‌ సినిమాలకు కూడా పాటలు రాశారు. హిందీ సినిమా ‘నాసిక్‌' లో కూడా ఆయన పాటలు రాయడం విశేషం. అంతేకాకుండా ‘యాదగిరి మహాత్మ్యం’ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. మరపురాని మధురగీతాల్ని మనకందించిన ఆచ్చి వేణుగోపాలాచార్య 2016 ఫిబ్రవరి 25న పరమపదించారు.

-తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682


logo