ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 00:46:52

కళాత్మక సారథులు

కళాత్మక సారథులు

దర్శకుడి ఊహకు అందమైన ఆకృతినిస్తారు కళా దర్శకులు. సమకాలీనతకు కొత్త హంగులు దిద్దడంతో పాటు వెండితెరపై గతానికి పునఃసృష్టి చేస్తారు. సినీ నిర్మాణంలో ఆర్ట్‌ డైరెక్టర్స్‌ సృజనాత్మక భూమికను పోషిస్తారు. కథానుగుణంగా అబ్బురపరిచే సెట్స్‌తో తమ ప్రతిభను చాటుకుంటారు. ‘ఆర్ట్‌ డైరెక్టర్స్‌గా రాణించాలనుకునే వారికి కళపై ఆరాధనతో పాటు విషయశోధన చేసే జిజ్ఞాస ఉండటం చాలా అవసరం’ అంటున్నారు తెలంగాణకు చెందిన కళా దర్శకులు రామకృష్ణ-మౌనిక దంపతులు. ‘అందాల రాక్షసి’ ‘రంగస్థలం’ ‘అంతరిక్షం’ ‘యాత్ర’ వంటి చిత్రాలతో ఆర్ట్‌డైరెక్టర్స్‌గా మంచిగుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రానికి వారు కళాదర్శకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘బతుకమ్మ’ పలకరించినప్పుడు రామకృష్ణ-మౌనిక దంపతులు చెప్పిన విశేషాలివి..

సినిమా స్థాయి, కథా పరిధి ఎంత పెద్దదైనా సరే...నిర్మాతలు కేటాయించిన బడ్జెట్‌ కంటే తక్కువ వ్యయంలోనే నాణ్యమైన ఆర్ట్‌వర్క్‌ అందించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ‘సాహసం’ చిత్రానికి మేమే పనిచేశాం. ఆ సినిమాలో కథానుగుణంగా సెట్‌లు కీలక భూమిక పోషించాయి. ఎలాంటి గ్రాఫిక్స్‌ హంగులు ఉపయోగించకుండా  అన్నీ ఒరిజినల్‌ సెట్స్‌నే నిర్మించాం. ఆ సెట్స్‌ను తెరపై చూసిన చాలా మంది గ్రాఫిక్‌ వర్క్‌ అనుకున్నారు. అంత గొప్ప క్వాలిటీతో తీర్చిదిద్దాం.  ఆ సినిమా ఆర్ట్‌ వర్క్‌కు భారీ వ్యయం అయిందనుకుంటారు. వాస్తవానికి నిర్మాతలు కేటాయించిన బడ్జెట్‌కంటే తక్కువలోనే ఆ సెట్స్‌ను వేశాం. ‘అంతరిక్షం’ సినిమా కోసం శాటిలైట్‌, స్పేస్‌షిప్‌ సెట్‌ వేశాం. ఈ సినిమాలో  మా పనితనానికి ప్రశంసలు లభించాయి. తక్కువ బడ్జెట్‌లో సృజనాత్మకంగా అత్యుత్తమ ఫలితాల్ని అందించాలన్నదే  మా లక్ష్యం. ఆ కారణంగానే మాతో పనిచేసిన నిర్మాతలందరూ మా వర్క్‌పట్ల సంతృప్తిగా ఉన్నారు.

స్క్రిప్ట్‌కు అనుగుణంగానే సెట్స్‌

 స్క్రిప్ట్‌ రాసుకునే సమయంలోనే సెట్‌ ఎలా ఉండాలనే విషయంలో దర్శకులకు ఓ విజన్‌ ఉంటుంది.  వారి ఊహలకు అనుగుణంగా సెట్స్‌ను తీర్చిదిద్దడమే కళా దర్శకుల పని. ఈ క్రమంలో దర్శకుడికి, ఆర్ట్‌ డైరెక్టర్‌కు మధ్య ఎక్కడా సృజనాత్మకమైన విభేదాలు వచ్చే అవకాశం ఉండదు. అయితే  స్క్రిప్ట్‌పేపర్‌ మీదుండే దర్శకుడి రైటింగ్‌ విజువల్‌కు, ఆర్ట్‌ డైరెక్టర్‌ క్రియేటివ్‌ విజువలైజేషన్‌కు చాలా తేడా ఉంటుంది. సెట్‌ వేయడానికి ముందు ఇద్దరూ పరస్పరం ఆలోచనల్ని పంచుకుంటారు. కళా దర్శకులు చేసే సూచనల్ని దర్శకులు పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే దర్శకుడి విజన్‌ను పూర్తిగా గౌరవిస్తూ కళా దర్శకులు పనిచేస్తారు.  దర్శకుడి తాలూకు సృజనాత్మకతను తెరపై మరింత ఉన్నతీకరించడంలోనే ఆర్ట్‌డైరెక్టర్‌ ప్రతిభాపాటవాలు తెలుస్తాయి.

అదే కష్టమైన పని..

కళా దర్శకత్వంలో అన్నింటికంటే కష్టంగా అనిపించేది సమయాభావం. ఇరవై రోజుల పనిని పదిరోజుల్లోనే పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు తెలియకుండానే ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే ఎలాంటి టెన్షన్స్‌లోనైనా పని నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నదే మా సిద్ధాంతం. సమకాలీన నేపథ్య కథా చిత్రాలకు తక్కువ సమయంలోనే సెట్స్‌ వేయొచ్చు. కానీ చారిత్రక, ఫిక్షన్‌ చిత్రాలకు మాత్రం అనుకున్న సమయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే గతాన్ని పునఃసృష్టించడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది.

పనిలో వైవిధ్యం కనబరచాలి

కళా దర్శకులుగా అన్ని జోనర్స్‌ సినిమాలు చేయాలన్నదే మా లక్ష్యం. హిస్టారికల్‌, పీరియాడికల్‌, సైన్స్‌ఫిక్షన్‌, ఫాంటసీ...ఏ తరహా సినిమాకైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కళా దర్శకత్వంలో కూడా ప్రయోగాలు చేసినప్పుడే ప్రతిభ ఆవిష్కృతమవుతుంది.  సృజనాత్మకమైన సంతృప్తి దొరకాలంటే పనిలో కూడా వైవిధ్యం కనబరచాలి.  ఇప్పటివరకు మేము పనిచేసిన చిత్రాల్లో అందాల రాక్షసి, సాహసం, రంగస్థలం, అంతరిక్షం, యాత్ర చిత్రాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ప్రస్తుతం తమిళం, హిందీలో జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ చిత్రంతో పాటు తెలుగులో సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రాన్ని చేస్తున్నాం. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. చిత్రసీమ నిరంతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అందుకుఅనుగుణంగానే ఆర్ట్‌డైరెక్షన్‌లో కూడా మార్పులొస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్ట్‌ వర్క్‌ ఎక్కువగా  డిజిటలైజ్‌ కావడంతో పాటు అవకాశాలు కూడా పెరుగుతాయి.ఏదీ సులభంగా రాదు

సినీ పరిశ్రమలో కళా దర్శకులుగా రాణించాలనుకునే వాళ్లకు ప్రతిభతో పాటు సమయపాలన, కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. దర్శకనిర్మాతలు కోరిన టైమ్‌లో వర్క్‌ డెలివరీ చేయడం చాలా ముఖ్యమని భావించాలి. సెట్‌ నిర్మాణంలో ఆలస్యం జరిగితే అది ఆర్టిస్టుల డేట్స్‌ మీద కూడా ప్రభావం చూపుతుంది.  ప్రొడక్షన్‌ డిజైనింగ్‌లో సక్సెస్‌ కావాలంటే ఎంతో కష్టించి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్ట్‌ వర్క్‌లో ఏదీ సులభంగా కార్యరూపం దాల్చదు. ప్రాపర్టీలో గుండుసూది మొదలుకొని రాకెట్‌ తయారి వరకు ఒకే విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్ట్‌ గురించిన విషయ పరిజ్ఞానంతో పాటు పరిశోధన చేసి కొత్త విషయాల్ని తెలుసుకునే సామర్థ్యం ఉండాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆర్ట్‌ డైరెక్షన్‌లో హిస్టరీ, సైన్స్‌, మేథమెటిక్స్‌, క్రియేటివిటీ అన్నీ మిళితమై ఉంటాయి.

‘రంగస్థలం’తో టర్నింగ్‌ పాయింట్‌... 

‘జ్యో అచ్యుతానంద’ చిత్రంలో మేము వేసిన హౌస్‌సెట్‌ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. చాలా మంది అది నిజమైన ఇల్లే అనుకున్నారు. దర్శకుడు సుకుమార్‌గారు కూడా ఆ సెట్‌ గురించి తెలుసుకొని మా పనితనానికి ఇంప్రెస్‌ అయ్యారు.  దాంతో ‘రంగస్థలం’ చిత్రానికి కళా దర్శకులుగా మాకు అవకాశమిచ్చారు. ‘రంగస్థలం’ చిత్రకథ ఎనభై దశకంలో నడుస్తుంది. సబ్జెక్ట్‌ వినగానే  ఆర్ట్‌ డైరెక్షన్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని అర్థమైంది. 80దశకం నాటి కోనసీమ గ్రామీణ వాతావరణాన్ని పునఃసృష్టించాల్సి రావడం ఓ సవాలుగా అనిపించింది. సినిమాలో పాత్రధారులు వాడే వస్తువులు మొదలుకొని...ఆనాటి రోడ్లు, రవాణాకు ఉపయోగించే వాహనాల వరకు ప్రతి అంశంలో విస్తృతమైన పరిశోధన చేశాం. క్షేత్రస్థాయిలో తిరిగి ప్రామాణికమైన విషయ సేకరణ చేశాం. ఆనాటి పల్లె సంస్కృతి, గ్రామీణ వాతావరణం తాలూకు కచ్చితమైన రెఫరెన్స్‌లు ఎక్కడా అందుబాటులో లేవు. దాంతో సొంతంగా రీసెర్చ్‌ చేసి నాటి కాలమాన పరిస్థితుల్ని యథాతథంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. హైదరాబాద్‌లో వేసిన రంగస్థలం గ్రామీణ సెట్‌లోనే అధికభాగం చిత్రీకరణ జరిగింది. ఎనభైల నాటి పల్లెవాతావరణం ఉట్టిపడేలా సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని అందరూ ప్రశంసించారు.

ఆర్ట్‌ డైరెక్షన్‌లో కెరీర్‌ బాగుంది..

కళా దర్శకత్వంలోకి ప్రవేశించి ఔత్సాహికులకు కెరీర్‌పరంగా మంచి భవిష్యత్తు ఉంది. వెబ్‌సిరీస్‌లు, చిన్న సినిమాలు మొదలుకొని ప్యాన్‌ ఇండియా మూవీస్‌ వరకు ప్రతి దానిలో ఆర్ట్‌వర్క్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒకప్పుడు సినిమా, కమర్షియల్‌ యాడ్స్‌ తప్ప కళా దర్శకులు పనిచేయడానికి వేరే ఇతర మార్గాలు ఉండేవి కావు. ఇప్పుడు ఎన్నో మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి.  ఒకటిరెండు సినిమాల్లో మన క్రియేటివ్‌ స్కిల్స్‌ను చూపిస్తే భారీ ప్రాజెక్ట్‌లలో అవకాశం సంపాదించుకునే వీలుంది.

రామకృష్ణ: హైదరాబాద్‌ శివారులోని ఏలూరు నాచారం నా స్వస్థలం. బాల్యం నుంచే చిత్రలేఖనం, సినిమాలంటే చాలా ఆసక్తి ఉండేది. ఆ మక్కువతోనే పెయింటింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేశాను. అనంతరం పుణే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి ప్రొడక్షన్‌ డిజైనింగ్‌, ఆర్ట్‌ డైరెక్షన్‌లో పీజీ కోర్సు చేశాను. తొలుత బాలీవుడ్‌ పరిశ్రమలో కొన్ని సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. ‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో కళాదర్శకులుగా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది.

మౌనిక: నేను ఢిల్లీలో పుట్టిపెరిగాను. తొలుత ఆర్కిటెక్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాను. ఆ తర్వాత పుణే ఇనిస్టిట్యూట్‌లో ఆర్ట్‌ డైరెక్షన్‌, ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ కోర్స్‌ చేశాను. అక్కడే రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. తెలుగులో మేము ఇద్దరం చేసిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ ఆర్ట్‌ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును గెలుచుకొని మా సినీ ప్రయాణానికి శుభారంభాన్నిచ్చింది.


logo