గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 00:07:32

సత్తెపు మనుషులు

సత్తెపు మనుషులు

మెల్లెగ అల్వాటైతున్నది. తొలుత తొలుత గద అంత కొత్త కొత్తగున్నది. ఉగాండాల గీ ‘కంపాలా’ల అడుగువెట్టినసంది మస్తుగున్నది. అయిదోతరగతి పరీచ్చలైపోయ్యినంక ఒచ్చే తాతిల్లన్ని ఒడిశిపోయినంక, ఆరోతరగతి తొలుత నాడు మల్ల ఇస్కూలుకి పొయ్యే పోరనికెట్లుంటదో, నాగ్గిట్ల అట్లే కొత్త కొత్తగున్నది. కొత్త డ్రస్సూ, కొత్త పుస్తకాలూ, కొత్త దోస్తుగాళ్ళూ, కొత్త టీచర్ల లెక్క, ఈడ గూడ కొత్త అఫీసూ, కొత్త పనీ, కొత్త మనుసులూ, కొత్త రోడ్లూ, అంత కొత్తకొత్తగనే ఉన్నది. మెల్లెగ సదురుకుంటున్న. 

 దినాం మా ఇంటికి అవుతలి గల్లీల ఉన్న మా ఎఫ్‌.సీ. శ్రీధర్‌ సారెంబడి అఫీసుకు పోవుడు, మల్లొచ్చేటప్పుడు ‘బో డబోడా’ అనే బైకు టాక్సీ ఎక్కి రావుడైతున్నది. మెల్లెగ రోడ్లు గుర్తు పడ్తున్న. గీడ పొయ్యేటందుకు ఓ రోడ్డు.. ఒచ్చేటందుకు ఇంకో రోడ్డు అన్నట్లు...గదే మనదిక్కు వన్‌ వే ట్రాఫిక్‌ లెక్క.     బాజార్ల పేర్లు గూడ మతికి పెట్టుకున్న. గమ్మతు పేర్లు. మేముండేదేమో ‘బుగులోబీ’ అనే బాజారు, మల్ల ఆఫీసుదిక్కు బజారు పేరు ఇంకా గమ్మతుగుంటది ‘నుక్రుమా’ అంటరు. అది ఇంగిలీసుల ‘NKRUMAH’ అని రాస్తరు. దాన్ని ఎట్ల పల్కాల్నో నాకైతే తెల్వది.

     నాకు బండి సుదురాయించలే అఫీసోళ్ళు. ఇస్తమన్నరు గని లైసెన్సు లేకుండ ఎందుకుతియ్యి తిప్పలని నేనే తీస్కోలే. రేపటెల్లుండి అదొచ్చినంక అప్పుడు తిరుగొచ్చని ఏడ తిర్గకుండ ఉన్న. ఆఫీసు ఇల్లు తప్ప వేరే దిక్కు పోలే. ఏడికన్న పోనీకె గూడ తీరదు. ఇంటికొచ్చేట్యాల్లకే ఆరున్నరా ఏడైతది. ఇగ పొద్దుమూకుతనే ఉంటది, గియ్యాల్లప్పుడు ఏడ తిరుగుతమంటాని ఊకుంటం. ఇంకో గమ్మతేందంటే గీ కంపాలాల అన్ని దుక్నాలూ, ఆఫీసులూ ఆరుగొట్టంగ మూతవడ్తయి. తర్వాత ఒక్క దుక్నం గూడ ఖుల్ల ఉండది.

     ఏడుగంటలైనంక ఒక్క పురుగు గూడ రోడ్లమీద తిరుగది. కర్ఫ్యూ లెక్కనే ఉంటది. పొద్దటిసంది కష్టవడి పనిజేశినంక జల్ది ఇంటికొయ్యి పెండ్లాం పిల్లలతోటి ఉండనీకే ఇట్ల ఇంతెజాం జేసిండ్రంట. నాకైతే మస్తనిపించింది. మనదిక్కు గూడ అట్ల ఆరుగొట్టంగ అన్నీ బందువెడితే ముద్దుగుంటది. లేకుంటే తెల్లంజావున రెండుగొట్టంగ ‘రాంకీ బండి’ మీద దోశ తినుడేంది, తెల్లారిందాంక నెక్లేసు రోడ్ల తిరుగుడేంది. ఎనకవడ్డ దేశం అంటాని గీ ఉగాండాని అంటరుగని ఈళ్ళ తాన మనం నేర్సుకునుడు చానున్నది.

     ఇగ అయితారం పొద్దుగాల నాస్త గిట్ల చేశినంక నేను, తమ్ముడు వాసు, పెద్దన్న కల్శి కూరగాయల మండికి పోతే ఆడ అందరు ఆఫ్రికా జనాలు మమ్ముల సూడంగనే ‘మోడీ’ ‘మోడీ’ అని పల్కరిస్తుంటే పానం లేసొచ్చినట్లుంటది. ప్రేమగ పల్కరిచ్చి చేతిల చెయ్యేసి ముచ్చట్లు చెప్తుండేటోళ్ళు. ఒచ్చేటప్పుడు ఇన్ని చాపలో, కోడో లేకుంటే ఇంత మేక మాంసమో తెచ్చుకోని కమ్మగ ఒండుకోని తింటుంటిమి.

     ఈడికి ఒచ్చిన కొత్తల అట్ల దినాం ఆఫీసు బందు జేసినంక బయటికొచ్చి, పక్కపోంటున్న కాంప్లెక్స్‌ లకెళ్ళి అవుతలవడి పెద్దరోడ్డు మీదికి ఒచ్చి పడుతుంటి. ఆడ ‘బోడబోడా’ ఎక్కి ఇంటికొస్తుంటి. ఆ కాంప్లెక్స్‌ ల కెళ్ళి ఒచ్చేటప్పుడు ఒక దుకునంల ఒక పెద్ద మనిసి కూసోని నన్నే చూసేటోడు. నాకంటే అయిదారేండ్లు పెద్దోనిలెక్క ఉన్నడు. రంగురంగుల బుస్కోటు, నల్ల పట్లాము, జగ్గున మెరిశే బూట్ల తోటి మంచిగ తయారయ్యి ఉంటుండే. కర్రెగ కట్టెబొగ్గసోంటి నలుపు, దొడ్డు పెదాలు, చిన్న కండ్లు, గొర్రెబొచ్చసోంటి నెత్తెంటికలు. నాయంత ఒడ్డూ పొడుగూ ఉన్నడు. దినాం నన్ను సూశి నవ్వేటోడు. నవ్వినప్పుడు తెల్ల పండ్లు బయటపడుతుండే, ఆయన నల్లటి నలుపు మొకంల ఆ తెల్లటి నవ్వు ఏందో మెరుపు మెరిసినట్లు గొడుతుండే. నన్ను సూశి నవ్వేట్యాల్లకు నేను పరేషానయిన. నాకర్తమే కాలే, నన్ను సూశి ఎందుకట్ల నవ్వుతున్నడో. నేను సూశి సూడనట్లు మొకం తిప్పుకోని పొయ్యేటోన్ని. దినాం గిదే తంతు. ఏం సమజ్గాకున్నది. 

     ఓనాడు ఇన్నొద్దులసంది ఈ పెద్దమనిసి దినాం నన్ను సూశి ఎందుకు నగుతుండో తెల్సుకుందామనిపించి ఆయన కాడికి పొయ్యిన. నేను రావుడు సూశి, కుర్సీల కూసున్నాయన లేసి నిలవడి అట్లే నగుకుంట నాకు షేక్‌ హ్యాండు ఇయ్యనీకే చెయ్యి సాపి చేతిల చేయ్యేశి లోపటికి కొంచవొయ్యి కూసోవెట్టి, ‘ఎట్లున్నరు, బాగున్నరా?’ అని అడిగిండు.నేనుగూడ మర్యాదకు, ‘నేను బాగున్న, మీరెట్లున్నరు?’ అంటాని అడిగితి. ఆయనగూడ బదులిచ్చిండు.

ఇగ ఈడిదాంక ఒచ్చినంక అడగకుండ ఎట్లుంట? ఆ పెద్దమనిసి దిక్కే సూసుకుంట, ‘నన్ను సూశి దినాం గట్ల నవ్వుతున్నరెందుకు?’ అంటాని దైర్నం సేసి అడిగితి.నా కండ్లల్ల కండ్లువెట్టి సూశి మల్ల నగిండు ఆ పెద్దమనిసి.‘మీ ఆరోగ్యం ఎట్లున్నది,’ అంటాని ప్రేమగల్ల గొంతుతోటి అడిగిండు. నా చెయ్యి ఇంకా ఆయన చేతిలనే ఉన్నది.‘బాగున్నది, అయినా ఎందుకడుగుతుండ్రు?’‘సంతోషం’, అని బదులిచ్చి మల్లడిగిండు.‘మీ ఇండియన్స్‌ కి ఏందన్న తీరని దుఃఖమున్నదా?’‘ఏం లేదు,’ చెప్పిన. ‘ఒక మనిసి ఎదురుపడి నగుకుంట పల్కరియ్యరు, ఎదుటోడు పల్కరిచ్చినట్లు నగితే ఎందుకట్ల మొకం మాడ్సుకుంటరు?’     ‘అసోంటిదేం లేదు.’‘గీ చిన్న జిందగీల తెల్వని మనిసి ఎదురుపడినప్పుడు నగుకుంట పల్కరిస్తే ఎంత మంచిగుంటది?’

-కొట్టం రామకృష్ణారెడ్డి


logo