గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Aug 29, 2020 , 23:19:12

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

మట్టి తడిసిన వాసన

పిడికెడు మట్టిని చేతపట్టినప్పుడు... అది మనకు కవిత్వం వినిపిస్తే ఎలా ఉంటుంది. కాలి కింది ధూళి రేణువేదో అక్షరాన్ని పలికిస్తే ఎలా ఉంటుంది. అలా ఉంటుంది ఈ కవి వచనం. ‘ఈ లోకంలో కవిత్వముండని క్షణం/ అక్షరం శిథిలమైన మరు క్షణం/ పంచభూతాల్లోకి నన్ను నేను/ పరమాణువులుగా విసిరేసుకుంటాను’ అంటూ తన అస్తిత్వం అక్షరమే అని చెప్పుకునే అరుదైన కవి. ‘ఈనాడు నేను జీవిస్తున్నానంటే, రేపు నువ్వొస్తావనే కదా’ అని విరహగీతాలు పాడినా... మాటిమాటికీ మట్టి వైపే పరుగు తీస్తాడు. ఒక్కసారైనా మట్టినై పుట్టాలనుంది/ నదులరక్తంలో అడుగంటి కలిసిపోయి/ పచ్చగా నవ్వాలనుంది... అంటూ పలవరిస్తాడు. చాలా తేలికైనా పదాలతో, సూటిగా సాగే వాక్యాలతోనే చురుక్కుమనే తాత్వికతను పలికిస్తాడు. ఇటు అభ్యుదయం.. అటు ప్రణయం, ఓవైపు భావుకత... మరోవైపు వైరాగ్యం! మనసు స్పందించిన ప్రతి సందర్భానికీ అక్షరంలోకి మార్చిన కవి ఇతను. ‘మట్టి పైన మానవునికెంత ఆశో/ మనిషి అంటే కూడా/ మన్నుకు అంతే మమకారం’ అంటూ అంతిమసత్యాన్ని చాటిన వేదాంతి ఇతను.మట్టినై పుట్టాలనుంది

రచయిత: డా॥ బి.బాలకృష్ణ

పుటలు: 128     వెల: 80/-

ప్రతులకు: 040-27678430


కొన్ని మంచి కథలు

‘ప్రకృతీ స్త్రీయేగా! అందుకే స్త్రీ జీవితం కూడా ఆ ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది’ అనే వాక్యాలతో మొదలవుతుందీ పుస్తకం. ఈ సంపుటిలో పరుచుకున్న వస్తువేదో చెప్పకనే చెబుతుంది. ఇందులో దాదాపుగా ప్రతి కథా, మహిళలకు సంబంధించినవే. కానీ వేటికదే వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు చూసీచూడకుండా వదిలేసిన పార్శ్వమేదో కళ్లకు కనిపిస్తుంది. భర్త చేతిలో మోసపోయిన ‘లక్ష్మమ్మ’ తిరిగి తన కాళ్లమీద నిలబడే నిబ్బరాన్ని సాధించే ‘ఆమెలాగా ఎందరో’, స్నేహితురాలి మరణంతో తల్లడిల్లిన పాప మనసును పలకరించే ‘ఉగాది’, ఫేస్‌బుక్‌ వ్యామోహం మీద సంధించిన సెటైర్‌ ‘వలలో చేపలు’... ఈ సంపుటిలోని 16 కథలూ అలరిస్తాయి. అమెరికాలో స్థిరపడ్డారు కాబట్టి, కొన్ని కథల్లో అక్కడి జీవితాలను కూడా పరిచయం చేస్తారు. తన తొలి కథాసంపుటితోనే మంచి రచయిత్రిగా నిరూపించుకున్నారు.ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

రచయిత్రి: శ్రీసత్య గౌతమి

పుటలు: 216 వెల: 100

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు


మరో మజిలీ

కొవిడ్‌ ప్రాణాంతకం. నిజమే! ఏమరపాటుగా ఉంటే... శ్వాసను లాగేసుకుంటుంది. కాదనలేం! కానీ జీవితపు విశ్రాంతి దశలో ఉన్నవారి పట్ల ఈ వైరస్‌ మరింత కర్కశంగా ప్రవర్తిస్తుంది. ఒకవైపు త్వరగా వైరస్‌ సోకే ప్రమాదం, మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల ఒంటరితనం.... వృద్ధులకి శాపంగా మారింది. ఇది వాళ్లకి ఓ యుద్ధమే! దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు వీళ్లు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రంలోని సభ్యులు. ఆ విశేషాలని మనతో పంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు, సమైక్యంగా దాన్ని ఎలా ఎదుర్కొన్నారో చెబుతున్నారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న కొందరి పరిచయాలు కూడా కనిపిస్తాయి. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చి, ఇక్కడి నలుగురిలో ఒకరిగా మారిపోయిన జీవితాలెన్నో అబ్బురపరుస్తాయి. వీటితో పాటు ఆ సంస్థ పూర్వాపరాలు, కొవిడ్‌ లాంటి వైరస్‌ల చరిత్ర, కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలు... ఈ పుస్తకాన్ని సమగ్రంగా మార్చేశాయి.లాక్‌డౌన్‌ ప్రస్థానం

పరుచూరు జమున, తమ్మారెడ్డి టాన్య, పి. సరస్వతి

పుటలు: 44   వెల: 50/-

ప్రతులకు: చండ్రరాజేశ్వరరావు ఫౌండేషన్‌, హైదరాబాద్‌-84


logo