ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 29, 2020 , 23:10:09

వాస్తు

వాస్తు

ఒకరి ఇంటి నీడ  మరొక  ఇంటి మీద పడకూడదు అంటారు నిజమా?  -  వి. సౌందర్య, తుర్కపల్లి

ఏ నీడలు అయినా ‘వెలుతురు’ను నిరోధిస్తాయి అనే విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకే ఇల్లు, దానీ స్థల వైశాల్యం, నిర్మాణం సరిగ్గా చూసుకోవాలి. చక్కగా కట్టుకోవాలి. మనిషికి, మనిషికీ మధ్య దూరం అనేది ఎంతముఖ్యమో కరోనా వస్తే కానీ అర్థం కాలేదు. కాబట్టి  ఇంటింటికీ మధ్య దూరం ఉంటే  ఏ ఇల్లు నీడ ఎవరి మీదా పడకుండా ఉండదు. మీరు పక్క ఇంటి నీడ పడుతుందని బాధ పడాల్సిన పనిలేదు. ముందుగా మీ ఇంటిలోకి చక్కగా సూర్యుని వెలుతురు చక్కగా వచ్చే విధంగా మీ ఇంటిని సవరించుకోడి. మీ ఇంట్లో సహజమైన వెలుగు ఉంటే ఎవరి ఇంటి నీడ ఏమీ చేయదు. 


ఫ్రెంచ్‌ విండోలు పెట్టవచ్చా? అవి లెక్కలోకి వస్తాయా? -సాధూరాం, కొండమడుగు

ఇంటికి  విండోలు అవసరమే కానీ మొత్తానికి మొత్తం ఓపెన్‌గా కనబడాలనే విధానం ఇంటిని పూర్తిగా బయట పడేసినట్టుగా చేస్తుంది. ఇల్లును విలాసవస్తువు  అనుకోవద్దు. ఇల్లు ఒక తల్లి లాంటిది.  మంచి, చెడు  కానుపు పానుపు, దుఃఖం సుఖం కలగలిసిన ఉగాది పచ్చడి లాంటిది కుటుంబ సంసారం. అంతా ఓపెన్‌ ఉండాలని పెద్ద పెద్ద ఫ్రెంచ్‌ విండోలు పడక గదులకు పెట్టడం మంచిది కాదు. అసలు  విండో అనేది గోడకు  రెండు అడుగుల ఎత్తులో పెట్టుకోవాలి. ఏ పురుగు, పాము తల ఎత్తి లోపలికి రావడానికి సాహసించదు. మీరు ఫ్రెంచ్‌ విండోలను హాలుకు పెట్టుకోండి. పడక గదులకు, కిచెన్‌కు పెట్టొద్దు.  ఇంటిలో ఎంత టెంపరేచర్‌ ఉండాలి అనేది కిటికీలు నియంత్రిస్తాయి. ఆ ఫ్రెంచ్‌ విండోలు కూడా లెక్కలోకి వస్తాయి. 


మా ఇంటికి ఉత్తరం వైపు  రోడ్డు ఉంది. తూర్పు చాలా  పొడవుగా ఎక్కువ స్థలం ఉంది. మంచిదేనా? - పి. కృష్ణస్వామి, ఎంకిరాల

జ. ఇల్లును స్థలాన్ని బట్టి సరైన చోట కట్టాలి. స్థలం ఎంతో ఉండొచ్చు. కానీ అందరూ పెద్ద స్థలం  ఉందని పెద్ద ఇల్లు కట్టలేరు. తూర్పు ఎంత ఎక్కువ స్థలం వదిలితే అంత మంచిది అని కూడా అనుకుంటారు. అది చాలా తప్పు. ‘సమతూకం’.. శాస్త్రంలో  ముఖ్యమైనది.  ఎక్కువ ఏదైనా మంచిది కాదు. మీకు తూర్పులో ఉన్న పొడవైన స్థలాన్ని మీ ఇంటికి తూర్పులో ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగతా భాగాన్ని వేరు చేసే విధంగా మధ్యలో  ఒక ‘గోడ కట్టండి’. అదే మీ తూర్పు కాంపౌండ్‌ కావాలి. అందులోకి వెళ్లటానికి వీలుగా తూర్పు ఈశాన్యంలో నాలుగు అడుగుల గేటు పెట్టుకోండి. మీ ఇంటికి సరైన కొలతలతో ప్రహరీ ఉంటే ఇల్లు గొప్పగా ఉంటుంది. అన్నీ చూపించుకొని సరి చేసుకోండి.

సుద్దాల సుధాకర్‌ తేజ

[email protected]

Cell: 7993467678


logo