గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 16, 2020 , 00:32:58

లోకల్‌ జీవితాన్ని గ్లోబల్‌గా చూపించాలి!

లోకల్‌ జీవితాన్ని గ్లోబల్‌గా చూపించాలి!

తెలంగాణ చారిత్రక నేపథ్యంలో విస్తారమైన కథలు, సార్వజనీన అంశాలు కలబోసిన ఆసక్తికరమైన ఘట్టాలున్నాయని.. చక్కటి ప్రణాళికతో కృషి చేస్తే వాటిని గొప్ప సినిమాలుగా వెండితెర దృశ్యమానం చేయవచ్చని అన్నారు యువ దర్శకుడు సాగర్‌చంద్ర. ‘అయ్యారే’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి వినూత్న కథా చిత్రాలతో దర్శకుడిగా మంచిపేరు సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం నిజాం నేపథ్య ఇతివృత్తంతో ఓ భారీ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానికతను విశ్వవ్యాప్తం చేయడమే కళ నిజమైన లక్ష్యమని అంటున్న సాగర్‌చంద్ర ‘బతుకమ్మ’తో ముచ్చటిస్తూ పంచుకున్న మనోభావాలివి..

మా స్వస్థలం నల్గొండ. ఇంటర్‌ వరకు అక్కడి పబ్లిక్‌ స్కూల్లోనే చదివాను. నాన్న మారం రాంచంద్రారెడ్డి నేతాజీ హైస్కూల్‌ను నడిపేవారు. నా అసలు పేరు కళాసాగర్‌. నాన్న పేరు కలిసొచ్చేలా సాగర్‌చంద్ర అని పేరు మార్చుకున్నా. అమ్మ సునీత గృహిణి. పాఠశాల రోజుల నుంచే నేను చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నా. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశాను. అనంతరం మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లాను. మా యూనివర్సిటీకి అనుబంధంగా ఓ ఫిల్మ్‌ స్కూల్‌ ఉండేది. అక్కడ జరిగే షూటింగ్స్‌ చూడటం.. కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయం వల్ల దర్శకత్వంపై ఆసక్తి కలిగింది. దాంతో నేను కూడా ఫిల్మ్‌స్కూల్లో చేరాను. కోర్స్‌ పూర్తి చేసుకున్న అనంతరం ఏడాదిన్నర పాటు అమెరికాలోనే ఉద్యోగం చేశాను. ఆ తర్వాత దర్శకుడిగా నా కలల్ని సాఫల్యం చేసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాను. రవిబాబు, మధుర శ్రీధర్‌రెడ్డిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. ‘అయ్యారే’ చిత్రం ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేశా.

శిక్షణ కన్నా సృజన ముఖ్యం

ఫిల్మ్‌ స్కూల్లో శిక్షణ తీసుకోవడం దర్శకత్వానికి షార్ట్‌కట్‌లా ఉపయోగపడుతుంది. మనలోని సృజనాత్మక శక్తుల్ని ఓ పద్ధతి ప్రకారం కార్యరూపంలో పెట్టడానికి ఫిల్మ్‌స్కూల్‌ దోహదం చేస్తుంది. అంతిమంగా దర్శకత్వమనేది క్రియేటివ్‌ ఆర్ట్‌. ఓ వ్యక్తిలో  కళ తాలూకు సహజాతాలు ఉంటేనే రాణిస్తారు. సృజన లేకుండా ఎంత పెద్ద ఫిల్మ్‌స్కూల్లో ట్రెయినింగ్‌ తీసుకున్నా సక్సెస్‌ కాలేం. పరిశ్రమలో కొన్ని వందల మంది సహాయ దర్శకులుగా పనిచేస్తుంటారు. అందులో అతికొద్ది మంది మాత్రమే నిరంతర ప్రయత్నాలు చేస్తూ తమలోని ప్రతిభను మెరుగుపరచుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటారు. దర్శకులుగా సక్సెస్‌కావాలంటే శిక్షణ కంటే క్రియేటివ్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యం.

తెలంగాణ నేపథ్యంలో 

స్థానికతను విశ్వవ్యాప్తం చేయడమే ప్రతి కళ లక్ష్యమని నేను విశ్వసిస్తాను. లోకల్‌గా ఉన్న జీవితాన్ని గ్లోబల్‌గా చూపించే ప్రయత్నంలోనే ఆర్ట్‌ ఉన్నతీకరించబడుతుంది. తెలంగాణ చరిత్రలో మరుగున పడిన, ప్రపంచానికి తెలియాల్సిన కథలెన్నో ఉన్నాయి. అందుకు సరైన తరుణం ఇదే అనుకుంటున్నా. అయితే ప్రామాణికమైన విషయ సేకరణతో కథను సిద్ధం చేసుకోవాలి. ఓ ప్రణాళిక ప్రకారం కథల్ని తయారుచేసుకోవాలి. అన్ని వనరుల్ని ఉపయోగించుకొని ప్రయత్నాలు చేస్తే తెలంగాణ నేపథ్యంలో గొప్ప సినిమాలొస్తాయి. నేను నిజాం నేపథ్యంలో ఓ చారిత్రక కథ రాసుకున్నా. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. కాల్పనిక అంశాలతో ఓ తెలంగాణ యోధుడి గురించి అందులో చెప్పబోతున్నా.

కథ డిమాండ్‌ను బట్టి డైలాగ్స్‌ 

సంభాషణల రచన విషయంలో దర్శకుల ఆలోచనా ధోరణి సినిమాల్ని బట్టి ఉంటుంది. కొన్ని కథలకు డైరెక్టరే డైలాగ్స్‌ రాసుకోవడం బాగుంటుంది. మరికొన్ని కథలకు రైటర్స్‌ను తీసుకోవడం సత్ఫలితాలనిస్తుంది.  కథ డిమాండ్‌ ప్రకారం సంభాషణల విషయంలో దర్శకులు నిర్ణయాలు తీసుకుంటారు.

సైన్స్‌, హిస్టరీ నేపథ్యంలో వెబ్‌సిరీస్‌..

‘ఆహా’ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌ చేయబోతున్నా. దానికి నేను ప్రొడ్యూసర్‌ కమ్‌ షోరన్నర్‌గా వ్యవహరిస్తా. రచన కూడా నేనే చేస్తున్నా. సైన్స్‌,  టెక్నాలజీ, హిస్టరీ కలబోసిన డాక్యూ డ్రామా జోనర్‌లో ఆ సిరీస్‌ ఉంటుంది.  ఆర్టిస్టుల అవసరం అంతగా ఉండదు. ఈ సిరీస్‌ను వినూత్నంగా డిజైన్‌ చేశాం.  ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను తీసుకుంటే  ఆమె కుమారుడు దామోదరరావు బాల్యంలోనే యుద్ధంలో చనిపోయాడని అందరూ అనుకుంటుంటారు. కానీ అలా జరగలేదు. అతను భారతదేశంలోని  తొలి ఫొటోగ్రాఫర్స్‌లో ఒకరు. ఆయన మునిమనవడు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌రంగంలో పనిచేస్తున్నాడు. ఈ మధ్యే అతన్ని ఫోన్‌ ద్వారా కాంటాక్ట్‌ అయ్యాం. ఇలాంటి చరిత్రకు తెలియని విషయాల్ని ‘ఆహా’ సిరీస్‌లో చెప్పబోతున్నాం.  న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనకుండా ఉంటే ఏం జరిగేది? న్యూక్లియర్‌ బాంబులు ఎలా పనిచేస్తాయి? వంటి సైంటిఫిక్‌ అంశాల్ని కూడా ఆ సిరీస్‌లో ఆవిష్కరిస్తాం. ఈ సిరీస్‌కు ‘బియాండ్‌ టెక్ట్స్‌బుక్‌' అనే పేరును పరిశీలిస్తున్నాం.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ హిందీ రీమేక్‌

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' సినిమా తెలుగు రీమేక్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమా విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా 14రీల్స్‌ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నా. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నా. రెండుమూడు భారీ సంస్థలతో డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. 2021లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌మీదకు వెళ్తుందనుకుంటున్నా.

సూడో రియాలిటీ..

హీరోల్ని దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ కథా రచన చేయను. అయితే స్క్రిప్ట్‌ ఓ దశకు చేరుకున్న తర్వాత ఫలానా హీరో అయితే బాగుంటుందనే భావన కలుగుతుంది. అప్పుడు అందుబాటులో ఉన్నవారికి కథ చెప్పి మెప్పించే ప్రయత్నం చేస్తాను. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథను సూడో రియాలిటీ అనే జోనర్‌లో రాసుకున్నా. అదొక ప్రయోగమని చెప్పొచ్చు. ఆ తరహా కథల్లో వాస్తవ ఘటనల పరంపర మధ్య పాత్ర మాత్రం ఊహాత్మకంగా సాగుతుంటుంది. పాత్ర ఓ భ్రమ, అబద్ధం అనిపిస్తూనే దాని చుట్టూ ఉన్న సంఘటనలు మాత్రం నిజంగానే జరుగుతుంటాయి.

దాసరి ప్రశంసతో జీవితకాల ఆనందం

ఓ దర్శకుడిగా ఆర్ట్‌ ఫార్మాట్‌లో కథను చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కథాబలమున్న చిత్రాల్ని కమర్షియల్‌ పంథాలో ఆవిష్కరిస్తాను. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూసిన తర్వాత దాసరి నారాయణరావుగారు నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ‘ఇలాంటి సినిమా తీశావంటే నీకు ఏ అరవై ఏండ్లు ఉంటాయనుకున్నా. నీలాంటి యువకుడు ఈ స్థాయిలో సినిమా తీశాడంటే నమ్మశక్యంగా లేదు. నీలో ఇమాజినేషన్‌ అద్భుతంగా ఉంది. ఇంకా వివాహం కాకుండానే.. సినిమా కథలో కూతురు పాత్ర తాలూకు ఉద్వేగాల్ని చక్కగా ఆవిష్కరించావు. ైక్లెమాక్స్‌లో నాకు కన్నీళ్లొచ్చాయి. జీవిత సారాన్ని వడబోసిన అనుభజ్ఞుడైన వ్యక్తిలా సినిమా తీశావు’ అని దాసరి గారు నన్ను ప్రశంసించారు. ఆయనలాంటి దిగ్దర్శకుని  మెచ్చుకోలు జీవితకాల ఆనందాన్నిచ్చింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు నంది అవార్డును స్వీకరించడం గొప్ప అనుభూతి.

మల్టిపుల్‌ జోనర్స్‌లో సినిమాలు

ఆర్‌.కె.నారాయణ్‌ రచనల్ని నేను బాగా ఇష్టపడతాను.  సంక్లిష్టమైన అంశాల్ని కూడా చాలా సరళంగా చెబుతుంటారాయన. ఇక సినిమాల పరంగా అన్ని జోనర్స్‌ చూస్తుంటాను. ఎందరో దర్శకులు నా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశారు. ‘శంకరాభరణం’ చిత్రాన్ని ఎంతగానో  ఇష్టపడతాను. ‘ఇడియట్‌' సినిమా చూసి కూడా ఎంజాయ్‌ చేస్తాను. సినిమా పరమైన అభిరుచుల విషయంలో ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదు. డైరెక్టర్‌గా మల్టిపుల్‌ జోనర్స్‌లో ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా.

ఊసరవెల్లి తత్వం ఉండాలి..

సినిమా కథ చెప్పడంలో దర్శకులు ఊసరవెల్లి తత్వాన్ని అవలంబించాలన్నది నా సిద్ధాంతం. ఏదో ఒక పంథాకు పరిమితమైపోతే సృజనాత్మక శక్తుల్ని పరిపూర్ణంగా వ్యక్తపరచలేం. నా తొలి చిత్రం ‘అయ్యారే’లో సమాజంలోని  మోసాల్ని వ్యంగ్యాత్మకంగా చూపించాను.  ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంలో యథార్థాల్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. నా తదుపరి  సినిమాల కోసం యాక్షన్‌ అంశాలు మేళవించిన ప్రేమకథతో పాటు, ఓ చారిత్రక ఇతివృత్తాన్ని సిద్ధం చేసుకున్నా. ఏ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నా వాణిజ్యపంథాలోనే వెండితెర దృశ్యమానం చేయాలన్నది నా ఫిలాసఫీ. ప్రతి సినిమాకు వైవిధ్యమైన ప్రజెంటేషన్‌ ఉండాలని నమ్ముతాను.logo