సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:56:16

తేట తేనెలు చిలుకు పలుకు..

తేట తేనెలు చిలుకు పలుకు..

కవిగా, లలిత గీత రచయితగా, పరిశోధకుడిగా విశేషమైన ప్రతిభను చాటిన వ్యక్తి డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ. 1980లో అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ‘పిల్ల జమీందార్‌' సినిమాలో ‘నీ చూపులోన విరజాజి వాన’ అనే పాట రాశారు. ప్రణయం, భక్తి, ప్రబోధం.. ఇలా ఏ అంశమైనా హృదయానికి హత్తుకునేలా రాయగల పదునైన కలం ఆయనది. భాషా సుగంధం, భావ పరిమళం ఆ సాహిత్యంలో మెండుగా కనబడతాయి. బాణీకి అనుగుణంగా రాసినా స్వేచ్ఛా భావగీతాల్లానే అనిపిస్తాయి వడ్డేపల్లి పాటలు.

లలిత గీత రచయితగా, కవిగా ఆధునిక తెలుగు సాహిత్యంలో డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ స్థానం విశిష్టమైంది. ఆయన 1949 జూలై 30న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో పుట్టారు. మొదట గేయాలు, లలిత గీతాలు రాశారు. దాదాపు 30  కవితా సంపుటాలు వెలువరించారు. ‘తెలుగులో లలిత గీతాలు’ ప్రధాన అంశంగా పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు.  ఆయన ప్రతిభాపాటవాలను గమనించిన అక్కినేని నాగేశ్వరరావు 1980లో ‘పిల్ల జమీందార్‌' సినిమాలో గీత రచయితగా అవకాశం కల్పించారు. ఆ సినిమాలో వడ్డేపల్లి రాసిన ‘నీ చూపులోన విరజాజి వాన’ అనే ప్రణయగీతం అందరి ప్రశంసలూ అందుకున్నది. అంతకు ముందే ప్రసిద్ధనటి భానుమతి ప్రోత్సాహంతో ‘రచయిత్రి’ (1979) సినిమాలో ‘నీవే లేని ఈ జీవితమే’ అనే పాట రాశారు. అయితే, ఆ చిత్రం ఆలస్యంగా విడుదలైంది. పద లాలిత్యం, భాషా కౌశలం వడ్డేపల్లి పాటల్లోని ప్రత్యేక లక్షణాలు.

ప్రబోధాత్మకం:

ప్రబోధ గీతాలు రాయడంలోనూ ఆయన సిద్ధహస్తులు. ‘యుగకర్తలు’(1986)లో ‘తాగినోడి నోటి మాట తందనాన వేదమంట’ అనే పాటలో ‘వస్తుందో రాదో గాని రామరాజ్యము, అయ్యో వల్ల

కాడు అవుతుంది ప్రజాస్వామ్యము’ అంటారు. సంఘనీతిని, దేశభక్తిని చాటి చెప్పే ప్రబోధాంశాలు ఈ పాటలో కనబడుతాయి. ‘ఎక్కడికెళ్తుందో మనసు’(2005)లో ‘తేట తేనెలు చిలుకు పలుకు నా తెలుగు’ పాట తెలుగు భాషాసంస్కృతిని, జాతి ఔన్నత్యాన్ని తెలుపుతుంది. ‘పెద్దరికం’(1993)లోని ‘ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే’ పాట ఇప్పటికీ పెళ్ళి వేదికల వద్ద సందడి చేస్తూనే ఉంటుంది. తెలుగు సినిమాల్లోని మొదటి పది పెళ్ళిపాటల్లో ఈ పాట స్థానాన్ని సంపాదించుకుందని గూగుల్‌ సర్వేలో తేలిం ది. భక్తి గీతాల్లోను ఆయనది ప్రత్యేక స్థానం. 

‘భైరవ ద్వీపం’ (1994)లోని ‘అంబా శాంభవి భద్రరాజగమనా కాళీ హైమవతీ త్రినయనా’, ‘పిలిస్తే పలుకుతా’(2002)లోని ‘సమతామమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం’ మొదలైన పాటలు గొప్ప ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తాయి. అనువాద గీతాలు రాయడంలోనూ వడ్డేపల్లి నేర్పరి. ‘పోలీసు కర్తవ్యం’(2004)లోని ‘దొంగవయసే దోచెను సొగసే’, ‘గూఢచారి నెం.1’ (2004)లోని ‘చిట్టెమ్మా నీ మీద ఒట్టమ్మా’ పాటలు ఆయన అనువాద ప్రతిభను, భాషాపటిమను తెలియజేస్తాయి.

ఆణిముత్యాలు..

‘అమృత కలశం’(1981)లో రాసిన ‘సిగ్గాయె సిగ్గాయెరా స్వామీ బుగ్గంత ఎరుపాయెరా’ అనే జావళీ, ‘కొండపిడుగు’(1985)లోని ‘కొండగాలి వీచింది కొంటె పిల్ల వలచింది’, ‘రహస్య గూఢచారి’(1987)లోని ‘నేను నిను విడువలేను హృదయరాణి’, ‘దిగ్విజయం’(1987)లోని ‘చెలి నీ చూపే గులాబై తాకే’, ‘ఏంటి బావా మరీను!’(1992) లోని ‘ఆకుచాటు పిందెవైనా సోకుగా ఉన్న జాణ’, ‘మొగుడూ పెళ్ళాల దొంగాట’(1992)లోని ‘రంభైనా నీ ముందు రద్దులేవే రాధమ్మా’, ‘లీడర్‌'(1994)లోని ‘ఏదో కోరిక-కొరుక్కుతింటోందిరా’, ‘సర్కస్‌ సత్తిపండు’ (1997)లోని  ‘రంగురంగుల లోకమే సర్కస్‌', ‘లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌'(2017)లోని ‘మిస మిసలాడే కిస్‌మిస్‌' వంటి ప్రణయగీతాలెన్నో ఆయన కలం నుంచి జాలువారాయి.
దాదాపు 200 సినిమా పాటలు రాసిన వడ్డేపల్లి ‘ఎక్కడికెళ్తుందో మనసు’(2005), ‘లావణ్య విత్‌ లవ్‌ బాయ్స్‌'(2017) అనే సినిమాలకు దర్శకత్వం వహించి బహుముఖ ప్రజ్ఞను చాటుకొన్నారు. కవిగా, సినీకవిగా నిరంతర సాహితీ యాత్రికుడు డా.వడ్డేపల్లి కృష్ణ.


logo