బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:44:38

చక్కనైన.. చిక్కుడు కుడుములు!

చక్కనైన.. చిక్కుడు కుడుములు!

వినాయక చవితికి కుడుములు చేయడం సంప్రదాయం. సాధారణంగా, బియ్యం పిండితో చేస్తుంటారు. కానీ తెలంగాణలో చేసే ఈ కుడుములు చాలా ప్రత్యేకం. ఆవిరిమీద ఉడికే ఈ వంటకాన్ని ఆవురావురుమంటూ తినేస్తారు. ఏదైనా పచ్చడి తోడైతే, ‘ఆహా ఏమి రుచి!’ అనాల్సిందే. చిక్కుడుతో చేసే ఆ చక్కనైన కుడుముల గురించి.. 

ఒకప్పుడు ప్రతి ఇంట్లో చిక్కుడు పాదు ఉండేది. వండినా, పండినా బయటి వాళ్లకు ఇచ్చేవారు. లేదంటే, చెట్టుమీదే ఎండిపోవాల్సిందే. అలా కాకుండా ఉండేందుకు ఈ వంటకాన్ని కనిపెట్టారు తెలంగాణ ఆడపడుచులు.
చిక్కుడుతోనే కాకుండా ఆనప గింజలు, పచ్చి కందికాయ గింజలతో కూడా ఈ కుడుములు చేస్తుంటారు. ఇందులో నూనె వాడకం తక్కువ. పైగా, ఆవిరితో కాబట్టి కట్టెల పొయ్యి మీద ఉడికించేస్తారు. సమయం, డబ్బూ ఆదా అవుతుందని కూడా ఇలా ఎక్కువగా చేసేవారు.
దీపావళి చుట్టాలకు వీటిని స్నాక్స్‌గా పెట్టడం ఆనవాయితీ. పైగా ఇవి రెండుమూడు రోజులు  నిల్వ ఉంటాయి. చిక్కుడు కాయలను ఒలిచి, వాటిని నీటిలో నానబెట్టాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి, బియ్యం రవ్వ, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. చిక్కుడు కాయలనూ, పచ్చిమిర్చినీ కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, ఉల్లి ఆకు వేసి కలుపుకోవాలి. వీటిని బియ్యం పిండి మిశ్రమంలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. చిన్న ముద్దలుగా చేసి ఆవిరిమీద ఉడికించుకోవాలి. వీటిని అన్నం, చపాతీలలో సైడ్‌ డిష్‌గా కూడా తింటారు. 
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, చర్మవ్యాధుల నివారణకు ఈ వంటకంలోని పచ్చి మిరపకాయలు బాగా పనిచేస్తాయి. పచ్చిమిర్చిల్లో ఐరన్‌ పుష్కలం. రోగనిరోధక శక్తి పెరుగడానికి కూడా పచ్చిమిర్చిని ఉపయోగించాలి. ఉల్లి ఆకులో విటమిన్‌-సి, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. జలుబు, కంటి సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది. క్యాన్సర్‌ నివారణలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉల్లి ఆకులను ఉపయోగిస్తారు. 
కొత్తిమీరలో క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు అధికం. విటమిన్‌ -ఎ, బి1, బి2, సి, ఐరన్‌ లోపాల వల్ల మనల్ని చుట్టుముట్టే వ్యాధులు దరిచేర కూడదంటే, ఆహారంలో కొత్తిమీరను చేర్చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపునొప్పి, ఉబ్బసం, అలర్జీ బాధలు, నోటి దుర్వాసన, దంతాలు పుచ్చిపోవడం తదితర సమస్యలకు చెక్‌ పెట్టాలంటే కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే, చిక్కుడు కుడుముల్లో ఇంకొంత కుమ్మరించాలి.  
చిక్కుడు కాయల్లో ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. జీర్ణ సంబంధ రుగ్మతలు, డయేరియా, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు నియంత్రణలోకి రావాలంటే, మనం తినే ఆహారంలో చిక్కుడు కాయలను చేర్చాలంటారు నిపుణులు. గుండె ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల సమస్యలకు చిక్కుడు కాయలు బాగా ఉపయోగపడుతాయి.  
నిద్రలేమితో బాధపడే వారికి, హార్మోన్ల అసమతుల్యంతో ఇబ్బందిపడే వారికి చిక్కుడు కాయలు బాగా పనిచేస్తాయి. వీటిలోని పొటాషియం కండరాల వృద్ధికి, పనితీరుకి తోడ్పడుతుంది. బియ్యం పిండి వల్ల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. జీర్ణసమస్యలు కూడా తలెత్తవు. 


logo