శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:30:26

మనోళ్ళే!

మనోళ్ళే!

బతుకుదెరువు కొరకు దేశాలు పట్టుకోని పోతరంటే ఏందో అనుకున్న గని అది నాకుగూడ సుట్టుకుంటదని కలలగూడ అనుకోలే.

మొదాలే నాది ప్రైవేటు నౌక్రీ నాయే. ఒక యాడాది ఉజ్జోగంల ఉంటే, రెన్నెళ్ళు ఉత్తగనే ఉండుడైతున్నది. అందుకని మోక దొరికిందాని దేశంగాని దేశం ఆఫ్రికాల ‘ఉగాండా’ ల నౌక్రి అంటే తట్టా బుట్ట సదుర్కోని బయలెల్లిన. నాకు రక్తం పంచుకొని పుట్టిన తమ్మినసోంటోడు, కాదు కాదు కాస తమ్ముడే ’వాసు’ గీ నౌక్రి చూసిపెట్టిండు. దగ్గెర దగ్గెర పదహారు గంటల ప్రయాణం తర్వాత ఆడి ఏర్‌ పోర్ట్‌ ’ఎంటెబీ’ ల దిగితి.

ఏర్‌ పోర్ట్‌ బయటికిపోయే తోవల నా పేరు ఒక అట్టముక్క మీద రాసుకోని నిలవడ్డాయన తానికి పోయి ’అది నేనే’ అంటాని చెప్పిన. నోటినిండ నగుకుంట పల్కరిచ్చి చేతిల చెయ్యేసి ‘ఎట్లున్నరు’ అంటాని అడిగిండు. ఆయన పేరు ‘ఫ్రాన్సిస్‌' అంట, నన్ను తోల్కపొయ్యి పార్కింగ్ల ఉన్న కారు డిక్కీల నా సందుగలు వెట్టి నన్ను కూసోమన్నడు. నల్లగ తుమ్మమొద్దోలె ఉన్నడు ఫ్రాన్సిస్‌. చెయ్యెత్తు మనిషి, మట్టసంగ ఉన్నడు. కారు చాలయ్యింది. ఏర్పోర్ట్‌ కెల్లి ఉగాండా రాజధాని ‘కంపాలా’ కి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు. ఇదే మొదలు ఈ దేశం రావుడు. సుట్టుపక్కల సూసుడే సరిపోయింది. అప్పుడే ఆనెలిశినట్లున్నది రోడ్లపక్కల నీల్లు సిన్నగ పారుతున్నయి. సూపు ఆనినంత వరకు సుట్టూ ఆకుపచ్చ కొండలు, ఆటినిండ చెట్లు, ఆడొకటి ఈడొకటి పెంకుటిండ్లు కండ్లకింపుగ కానొచ్చింది. ఉగాండా మొత్తం ఏడుకొండల మీద ఉన్న దేశమంటాని చెప్పిండు ఫ్రాన్సిస్‌. తిరుపతి ఎంకన్నను తల్సుకొని రెండు చేతులెత్తి మొక్కుకున్న.

పోయినంత పోడువు ఫ్రాన్సిస్ను యాదో ఒకటి అడుగుతనే ఉన్న. నడ్మ రెండు మూడు చిన్న ఊర్లు తగిల్నయి. రోడ్లపక్కల మన ఊర్ల దిక్కు అంగట్ల లెక్కనే గొట్టినయ్యి. బట్టలు, ప్లాస్టిక్‌ సామాన్లు, కూరగాయలు, గిట్ల అనేకం కనవడ్డయి. మోరం గడ్డ, కందగడ్డ, చామగడ్డ, ఇంకా మన పక్క రాష్ట్రంల దొరికే పెండలం గడ్డలు, ఇక్కడిదిక్కు ఆటిని ’కసావా’ అంటరంట. గట్లనే పెద్ద చామగడ్డలసోంటి ’యాం’, ఆలుగడ్డలు, అరటికాయ గెలలు, ఆటిని ఆల్ల బాసల ‘మటూకే’ అంటరంట. అన్ని సిన్నపోరనికి చెప్పినట్లు చెప్తనే ఉన్నడు. 

పోయినంత నెరువు సుట్టు పచ్చగనే ఉన్నది. ఎర్రనేలలు. మెత్తటి బంగారమసోంటి భూమి, ఉత్తగ ఏలుతోటి భూమిలకు జొనిపి ఏ ఇత్తనమేసినా అల్కగ పెరిగేటంత సత్తువగల్ల భూములు. నా పానం లేసొచ్చినట్లయ్యి కొట్టుకున్నది. ఫ్రాన్సిస్ను మాటలల్ల పెట్టి తెలుసుకున్నదేందంటే, ఎండాకాలంల రెండ్రోజులకొక్కసారన్న ఆన వడ్తదంట. ఇగ ఆనకాలమైతే దినాం ఒకసారి కొట్టి పోతదట. దిల్‌ ఖుషయ్యింది నాకు. 

ఆఖరికి కంపాలా కొచ్చినం. నన్ను సూశి మా ‘వాసు’ మస్తు ఖుషయ్యిండు. ఉరుక్కుంటొచ్చి అబ్బలిచ్చుకున్నడు. రెండుదినాలు మా తమ్మినెంబడె తిరిగిన. ఆడ ఎట్లుండాలే, ఎట్ల మెలగాలే చెప్పిండు. సూపెర్‌ మార్కెట్లు సూపెట్టిండు. కూరగాయల మండి సూపెట్టిండు. నేను, తమ్ముడు ఇంక మా పెద్దన్న అంటాని పిల్సుకునే ఎంకన్న ముగ్గురం ఒక మూడు బెడ్రూం ఫ్లాట్‌ల ఉన్నం. ముగ్గురం బలవంతపు బ్రహ్మచారులమే. అంటే ఫోర్సుడు బ్యాచిలర్స్‌ అన్నట్లు. స్వయంపాకం. అంట్లు తోమనీకే, ఇల్లూకనీకే, బట్టలుతకనీకే ‘జమీల’ అనే ఆమె పనిచేస్తుండేటిది.

రెండొద్దులయ్యినంక నేను డ్యూటిల షరీకయిన. మేమున్న ఫ్లాటుకు అవుతలి గల్లీల మా అఫీసు ఫైనాన్సు కంట్రోలర్‌ ఎఫ్‌.సి అని పిలుసుకునే మా శ్రీధర్‌ సారెంబడి ఆఫీసుకొయ్యి, సాయంత్రం ఆఫీసయ్యిపోయినంక ‘బోడబోడా’ అంటాని పిల్సే బైకు టాక్సిల ఇంటికొచ్చేటోన్ని. పొద్దుగాల తొమ్మిదింటినించి సాయంత్రం ఆరు గొట్టిందాంక డ్యూటి. శనివారం సగం పూట. అయితారం సెలవు.

 ఆఫీస్ల షరీకయిన ఆరం దినాలు నాకు సిన్న గోస కాకున్నది. అందరు మనుషులు  ఒకటే తీర్గ కొడుతున్నరు. ఏర్పాటు తెలుస్తలేదు. నల్లటి మొకాలు, బూరు బూరు నల్లెంటికల నెత్తి, నగితే బయటపడే తెల్లటి పండ్లు. ఆఫీసుకొచ్చిపోయేటోళ్ళు, అండ్ల పనిచేసేటోల్లు అందరు మూస పోసినట్లు ఒక్కతీర్గనే కన్లవడ్డరు. మెల్లెగ ఒక ఆరం దినాలయినంక అందర్ని గుర్తుపట్టుడు షురూ చేసిన.

అందరు మనలెక్కనే ఉన్నరు. కాకపోతే నల్లగున్నరంతే. ఆడోళ్ళయితే ఇంకింత ముద్దుగున్నరు. రంగురంగుల ఫ్రాకులు, స్కర్ట్లు, రకరకాల బట్టలేస్కోని, పెట్టుడు ఎంటికలతోటి అల్లిపిచ్చుకునే తీరొక్క జడలతోటి మిలమిల మెరిసిపోయేటోళ్ళు. 

అసలందమంటే అక్కడోల్లదే. ఎంత అందమైనోళ్ళు ఆళ్ళు, ఆడైనా మగైనా. అంత నల్లగ ఉన్నా అంత గనం అందం ఆళ్ళల్ల నాకెట్లకన్లవడ్డదో నా కర్తం కాలే. మస్తు ముద్దుగుంటరు. రైలుబొగ్గు గిట్ల మెరిసినట్లు మెరుస్తుంటరు. నాకెంత సోంచాయించినా ఆళ్ళ అందం ఆళ్ళ మొకంల ఉన్నదా, ఆళ్ళ రంగులున్నదా అనేది అర్తమే కాలే.

అట్లనే ఆయల గూడ ఆఫీసయిపోయినంక బయటికొచ్చి బైకు టాక్సి మాట్లాడుకోని, ఎనక కూసోని పోతున్న దిక్కులు సూసుకుంట. సగం దూరం పొయ్యిందో లేదో, ఆడ జరంత దూరంల ఉన్న సిగ్నలు కాడ బండి ఆపిండు డ్రైవరు. ఆడ కన్లవడ్డడు నాకు ఆయన. మా చిన్నతాత. నడ్సుకుంట పోతున్నడు. నేను బండిమీదికెళ్ళి ఒక్క దుంకు దుంకి మా తాత తానికి ఉర్కిన. ఆ బండి డ్రైవరు నా ఎనకనే పిల్సుకుంట ఉర్కొచ్చిండు.

నేను ఉరుక్కుంట పొయ్యి మా చిన్నతాత చెయ్యి పట్టుకోని ‘తాతా’ అంటాని పిలిస్తి.

ఆయన ఎనకకు మళ్ళి నన్ను చూసి నగిండు. అప్పుడు యాదికొచ్చింది నాకు మా చిన్న తాత సచ్చిపోయి అయిదేండ్లయ్యిందన్న సంగతి.  

నా కండ్లు బైర్లుకమ్మినయి. ఆయన అచ్చం మా చిన్న తాతలెక్కనే ఉన్నడు.

‘ఏమయ్యింది అంటాని’ అడిగిండు నేనాపిన మనిసి.‘మీరు మా చిన్న తాత లెక్కనే కొట్టిండ్రు, ఏమనుకోకుండ్రీ’ అన్న.

ఆ మనిసి నోటి పండ్లన్ని కన్లవడేటట్టు నగి నన్ను దగ్గర్కి తీస్కోని అబ్బలిచ్చుకున్నడు, ప్రేమగ పెయ్యంత నిమిరిండు. ఆయన మాట్లాడుతుంటే మా తాత మాట్లాడినట్లె అనిపించింది. ఆయనను ఇడిసి పెట్టి రానీకే నాకు వశం కాలే.

అప్పుడర్తమయ్యింది నాకు. కడుపునిండ నవ్వే నవ్వుల, పాణమెల్లగొట్టుకొనే ప్రేమల తోటే ఆళ్ళు అంత అందంగ కన్లవడుతరని.


logo