గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:27:24

నా దోస్తు టామ్‌

నా దోస్తు టామ్‌

దోస్తులు లేని మనుషులుంటరా? ఎక్కడన్న కనవడితే నాకు సూపియ్యుండ్రి. మీకున్నట్టే నాక్కూడ మస్తుగ దోస్తులు. వాడకట్టు దోస్తులు. బడి దోస్తులు. కాలేజీ దోస్తులు. ఊరి సోపతోల్లు. పనిజేసే ఆఫీస్‌ దోస్తులు. గిట్ల కథల్‌ రాస్తా. రాసేటోల్లల్లగుడ దోస్తులున్నరు. మన షోకులని వట్టి దోస్తులు. వేరే రాష్ర్టాల దోస్తులు. ఫారెన్‌ దోస్తులు. మనసుంటి తోలు (గోధుమ) రంగోళ్ళు. నల్ల రంగోళ్ళు. తెల్లోళ్ళు. ఇప్పుడు మీకు జెప్పవోయే కథ ఓ తెల్లాయన గురించి. పేరు టామ్చాప్లిన్‌. అందరు మొదటి పేరుతో టామ్‌ అని పిలుస్తరు.  

దిల్లీల పనిజేస్తున్నప్పుడు నాకు టామ్‌ తోటిదోస్తానీ శురయ్యింది. నల్పై ఏండ్ల కిందటి ముచ్చట ఇది. నేను పనిజేసే ఆఫీస్కు కెనడా సర్కారోళ్ళది ఒక పెద్ద ప్రాజెక్ట్‌ అచ్చింది. ఐతే ఆ ప్రాజెక్ట్‌ ఒక కెనడా ఎన్జీవో (వాలెంటరీ ఆర్గనైజేషన్‌)కు మొదలిస్తరు. ఆల్లనుంచి మా ఆఫీస్కిస్తరు. ఈ ప్రాజెక్ట్ని నడిపేది, దేశమంతా పనుల్జూసేది, నతీజలు సూపేది అంతా మా సంస్థదే. కెనడాల ఉన్న ఎన్జీవో ఆఫీస్లనే టామ్‌ పనిజేస్తడు. ఈయనే ఈ ప్రాజెక్ట్‌కు బాసన్నట్టు.  మా ఆఫీస్ల ఈ ప్రాజెక్ట్‌ జిమ్మెదారి నాది. 

మన దేశంల ఈ ప్రాజెక్ట్‌ పని పదిహేడు రాష్ర్టాలల్ల ఉంటది. అయిదేండ్లల్ల పనిని అయిపోగొట్టాల. పని ఎైట్లెతున్నదో సూసెతందుకు ఆర్నెల్లకొకసారి టామ్‌ కెనడా నుంచి డిల్లికస్తుండే. మా డైరెక్టర్తో మీటింగులు జేస్తుండే. నాతోని కూసోని మీటింగులు, ఇసాబ్‌ కితాబులు అడిగి సూస్తుండే. ఇవన్నయినంక ఫీల్డ్‌ విజిట్‌ కోసం మేమిద్దరం కలిసి ప్రతిసారి రెండు రాష్ర్టాలకు పోయి, ఊర్లు తిరిగి, పనులు చూసి, ప్రాజెక్ట్‌ గురించి ఆడొల్లు, మొగొల్లతోని మళ్ల మీటింగులు వెట్టి దినమంతా కష్టపడి తిరిగెటోల్లం. ఇద్దరం ప్రాజెక్ట్‌ పని మంచిగ కావాలని ఎప్పుడు మాట్లాడు కొంటూ ప్లాన్లు జేసేది.

రెండేండ్లల్ల నేను టామ్‌ మంచి దోస్తులమైనం. ఇంటి సంగతులు, పిల్లల ముచ్చట్లు చెపుతుండే. కెనడా రాజధాని ఆటావాలో జిందగీ ఎట్లుంటది, కర్సులెట్లుంటయ్‌ అన్ని ఓపిగ్గా సంజాయిస్తుండే. మన ఉర్లల్ల ఫారనోళ్లకు ఎట్ల మర్యాద జేస్తరు, ఎట్ల నమస్తేలు జెయ్యాల గిసుంటియి అన్ని నేను చెప్పి కొత్తతనం పోగొట్టిన. మస్తు ప్రశ్నలడుగుతుండే. మన కారపు తిండ్లు తింటుండే. షికాయత్‌ చెయ్యకపోతుండే. పన్నెండువేల కిలోమీటర్ల దూరం నుండి అచ్చినందుకు ఎప్పుడూ పని ధ్యాసే! మన పద్ధతులని, పనితీర్లని గమనిస్తుండే. రాత్రి తినేటప్పుడు బగ్గ మాట్లాడుకొనేది. టామ్‌ ఐర్లాండ్‌  దేశంల పుట్టిండు. ముప్పై ఏండ్లప్పుడు దేశం వదిలి కెనడాకు పోయిండట. మంచిగనిపిచ్చి అక్కడి మనిషైపోయిండు. భార్య టీచర్‌. ముగ్గురు బిడ్డలు. మంచోడు. మన మహాత్మా గాంధీ అంటే మస్తు ఇష్టం. అటెన్బరో తీసిన గాంధీ సీన్మాను రెండుమూడుసార్లు సూసిండట. 

ఎప్పటిలెక్కనే ఆర్నెల్లు కాంగనే టామ్‌ దిల్లీ అచ్చిండు. ఈసారి కర్నాటక రాష్ట్రం పోవాలని మొదలే అనుకోని ప్రోగ్రాం జేసినం. బెంగుళూరోళ్ళకు మేం వచ్చే సంగతులు చెప్పినం. ఊర్లల్ల పని సూసేందుకు అక్కడినుండి రైళ్ల వొవాల. టిక్కట్లను రిజర్వు చేయించుమని మా ఆఫీసోళ్ళు మొదలే చెప్పిండ్రు. దిల్లీల పనికాంగానే హవాయిజాజ్‌ ల బెంగుళూరు చేరుకున్నం. తెల్లారి మీటింగులు అయినంక రాత్రి రైలులో గుల్బర్గా పోవాల. 

సాయంత్రం మీటింగు నడుమ చాయ్‌ తాగుతున్నప్పుడు ఆఫీసోళ్ళు రెండు రైళ్ల టిక్కట్లను మా చేతుల పెట్టిండ్రు. టామ్‌ తీస్కొని టిక్కెట్లని సూసిండు. తెల్లమనిషి మొఖం మెల్లగా ఎర్రగైంది. టిక్కెట్లనిచ్చినాయనకు సమజ్‌ వట్టక పరేషన్‌ అయితుండు. 

టామ్‌ బెర్తు ఏసి బోగిది. నాదేమో సెకండ్‌ క్లాసు డబ్బా. అప్పటికే నేను టామ్‌ని రెండేండ్ల నుంచి మంచిగనే అర్థం చేసుకొన్న. కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలిసింది. కెనడాలో గిట్ల జెయ్యరు. అందరినీ సమానంగా సూస్తరు. తేడాలు సూపిస్తే తప్పుకింద లెక్కనట. 

నా దిక్కు సూపించుకుంటా “ఈయన టిక్కెట్‌ గిట్లెందుకుంది? ఇద్దరిది ఒకటే క్లాసుండాల కదా?” టిక్కెట్లనిచ్చినాయన్ని అడిగిండు టామ్‌.

మొఖం ఎట్లనో వెట్టి “ఇప్పుడు సీజన్‌. దొరకలేదు. నీ ఏసి టిక్కట్‌ సుగ మస్తు కష్టంగా దొరికింది” అన్నడు. ‘ఎట్లనన్న సర్దుకొండ్రి’ అన్నట్టు నాదిక్కు సూసిండు.  

ఎవ్వల్లు మాట్లాడలేదు. రెండు నిమిషాల్దాక సప్పుడే లేదు. మేము ఒకండ్ల మొఖాలు ఒకల్లం పిసపిసగా సూసుకొన్నం. 

“అయితే నాది కూడా సెకండ్‌ క్లాస్‌కి మార్చు” అనుకుంట టామ్‌ టిక్కెట్లని చేతులో పెట్టేందుకు చేయి సాచిండు. టిక్కెట్లనిచ్చినాయిన గబ్రాయించిండు. ఏం చేసుడు అని పరేషన్‌ అయితుండు. తెల్లాయిన సెకండ్‌ క్లాస్‌ల ఎట్ల వొతడు?.... ఆ గుబులే పట్టుకున్నది ఆయనకు. 

“మీరు... మీరు... సెకండ్‌ క్లాస్‌ డబ్బాలవోతరా? మీరు చేసే పని కాదన్నట్టుగా మొఖం బెట్టి మెల్లగా అడిగిండు. నావైపు కూడా చూసిండు. 

టామ్‌కి ఆయన పరిస్థితి సమజ్లవట్టింది. ఓదార్పు గొంతుతో “ఎందుకు ప్రయాణించకూడదూ? మహాత్మా గాంధీ సెకండ్‌ క్లాస్‌ రైలు ప్రయాణం చెయ్యలేదా? ఎదురు ప్రశ్న ఏసిండు. 

ఆఫీసాయనకి ఎంజేయాల్నో సమజ్‌ కాలేదు. ఈ చిక్కుముడి నుంచి ఎట్ల బయటవడాలో అని కుడిదిలవడ్డ ఎలుక లెక్క కనవడ్డడు.

టామ్‌ నెమ్మదిగా, ఓదార్చుతూ “ప్లీజ్‌, ఎలాగైనా నా టిక్కెట్‌ క్యాన్సెల్‌ చేసి, నాకు కూడా సెకండ్‌ క్లాస్‌ టిక్కెట్‌ చేయించు. మేమిద్దరం ఒకే పనికి పోతున్నాం. వేర్వేరు క్లాసు డబ్బాల్లో ప్రయాణం చేయడాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను” చెప్పిండు. 

టామ్‌ మొహం ఇంకా ఎర్రగనే ఉన్నది. తెల్ల రంగు అచ్చేతందుకు టైం పడుతున్నది. 

మీటింగ్‌ కతమ్‌ జేసుకొని, హోటల్‌కు పోయినం. రాత్రి తొమ్మిది రైలుకు వోవుడు. ఫ్రెష్‌ అయినం. డిన్నర్‌ చేసినం. రైల్వే స్టేషన్‌ చేరుకొన్నం. ప్లాట్‌ ఫార్మ్‌ చేరుకొని ఎదిరిచూస్తున్నం. ఐదు నిమిషాలు అయిందో లేదో, ఆఫీసాయన రానే అచ్చిండు. 

“టామ్‌. ఇదిగో మీ టిక్కెట్లు” చేతిలో పెడుతూ ముసిముసిగా నగుకుంటా నా దిక్కు సూసిండు. ఎందుకు నగుతున్నడో నాకు సమజ్‌ కాలేదు.

టామ్‌ టిక్కెట్లని చూసిండు. నా చేతిల పెట్టిండు. 

ఇద్దరికీ ఏసి బోగీలో రిజర్వేషన్‌! 

“ఎట్ల దొరికినయ్‌? సీజన్‌ అని, కష్టమని చెప్పినవ్‌ గదా? ఆశ్చర్యంతో టామ్‌ అడిగిండు.

“మీరింతగా పట్టువడితే, నేను మా పెద్ద సార్‌ (ఎగ్సిగ్యూటివ్‌ డైరెక్టర్‌) దగ్గరికి పోయిన. మీ టిక్కెట్‌ బద్లాయించుడు ఇషయం చెప్పిన. సార్‌ బాగా ఆలోచించిండు. ఆయన తెలిసినోళ్లతోని మాట్లాడిండు.  రైల్వే డిపార్ట్మెంట్‌ పెద్దాయనతో సుగా మాట్లాడిండు. మన పనయ్యిపోయింది.” 

మేము పోయే రైలు మెల్లగా ప్లాట్‌ ఫార్మ్‌ దగ్గరికస్తున్నది. 

* * *

మా ప్రాజెక్ట్‌ జోరుగా నడిచింది. టామ్‌ ప్లాన్‌ ప్రకారంగా ప్రతి ఆర్నెల్లకు అచ్చిండు. ఇద్దరం కలిసి మిగతా రాష్ర్టాలకు పొయినం. ప్రాజెక్ట్‌ ఐదవ సంవత్సరంలోకి అడుగువెట్టింది. ప్రతి ట్రిప్పుల టామ్‌ను మా ఇంటికి డిన్నర్కి పిలిసిన. మాంచిగ కలిసిపోతుండే. అరేండ్ల మా కొడుకుతోటి మాట్లాడుతుండే. ఆడుకొంటుండే. మా కుటుంబంతోటి దోస్తానీ ఇంకా చిక్కవడ్డది. బిడ్డలకియ్యమని చిన్నచిన్న కానుకలని టామ్‌తో మేము పంపేది.  

డిన్నర్‌ అయినంక హోటల్కి పోయేముందు మావోడికి ‘బాయ్‌' చెప్పేందుకు వాడి రూమ్‌కు పోతుండే. నిద్రలున్న వాడి తలపై చేతులెట్టి ప్రేమతో నిమిరి ముద్దు వెడుతుండే. 

నాకు ఇంకో ఉద్యోగం అచ్చింది. రాజీనామా చేసి వేరే ఆఫీసుల చేరిన. అది కెనడా గవర్నమెంట్‌ ఆఫీస్‌.  నేను వదిలిన రెండు మూడేండ్లకు, టామ్‌ రిటైర్‌ అయ్యిండు. గిట్లగాంగనే మేము విడిపోయినమనుకుంటున్నరా? మా దోస్తానీ కతం అయిందనుకుంటున్నరా? కతమైతే కథెందుకు రాస్తుంటి. మా రెండు కుటుంబాల నడుమ దోస్తానీ ఇంకా చిక్కవడ్డది!

టామ్‌ రిటైర్‌ అయినంక చూపులేని పిల్లలకి పుస్తకాలు చదువుడు మొదలువెట్టిండు. రేడియో స్టేషన్ల సదువుతే ఆ పిల్లలు పాఠాలు ఇంటరట. ఆయనకి నాటకాలంటే పానం. యాక్టర్లకు ఎట్ల జెయ్యాల్నో చెప్పుతడట.  దర్శకత్వం చేసుడు మస్తు ఇష్టం. ఆటావాలో థియేటర్‌ గ్రూప్‌ ఉన్నదట. మంచి డైరెక్షన్‌ చేసినందుకు టామ్‌కు అవార్డులు అచ్చినయ్‌. 

మా జిందగీలు నడుస్తున్నయ్‌. టామ్‌ ఆటావాలో. మాది దిల్లిలో...  

నన్ను మా ఆఫీసోళ్ళు మూడు వారాల ట్రెనింగ్‌కని ఆటావాకి పంపిండ్రు. అంటే టామ్‌ ఉంటున్న కెనడా రాజధానికే. మస్తు కుశయ్యింది. దోస్తుని ఆరేడు ఏండ్లకు మల్ల కలుస్తానని!

ట్రెనింగ్‌ నడిచింది. శని, ఆదివారాలు ఖాళీ. టామ్‌ హోటల్‌కచ్చి ఆళ్ళింటికి తీస్కవోతుండే. ఆటావా పట్నం అంతా తిప్పిండు. చూడాల్సినవి సూపిండు. సుట్టుపక్కలున్న వాటినిసుగ సూపిచ్చిండు. దావతులు చేసిండు. బిడ్డల్ని, అల్లుల్లని పిలిసిండు. నేను టామ్‌ తమ్మున్నైపోయిన. ఇంటికి దూరంగున్నా నాకు ఇంట్లనే ఉన్నట్టనిపిచ్చింది. 

ట్రెనింగ్‌ అయిపోయింది. టామ్‌, ఆయన భార్య హోటల్‌ కచ్చి ఏర్‌ పోర్ట్కు తీస్కపోయిండ్రు. మా కండ్లల్ల నీళ్ళు. మల్ల ఎప్పుడు కలుస్తమో ఏమో? అసలు కలిసే అవకాశమే లేదు. ట్రెనింగ్‌ పుణ్యాన కలుసుకున్నాం. ముగ్గురం గట్టిగా అలుముకున్నం.

నేను దిల్లి చేరుకున్న. 

* * *

ఏండ్లు గడుస్తున్నయ్‌. కొత్త పంచాంగాలస్తున్నయ్‌. పాత వడుతున్నయ్‌. అధికార పార్టీలు మారుతున్నయ్‌. రాజకీయ రంగులు మారుతున్నయ్‌. కొత్త టెక్నాలజీలు ఆచ్చి దూరమోల్లను దగ్గర జేసినయ్‌. ప్రతి క్రిస్మస్‌కు టామ్‌, ఆయన భార్యతో  ఫోన్ల మాట్లాడెటోన్ని, ఈమెయిల్లో అపుడప్పుడు ఉత్తరాలు రాసుకొనేది. 

టామ్‌ వయస్సు పెరుగుతున్నది. మోకాళ్ళ నొప్పులు మొదలైనయ్‌. ఆప్రెషన్‌ అయింది. చేతిల కట్టే! మా కొడుకు ఇంజినీరింగ్‌ అయిపోగొట్టిండు. రెండేండ్లు ఐటి కంపెనీల పనిజేసిండు. నేను కెనడా సర్కారు ఆఫీసులనే చిక్కువడ్డ. అండ్లనే పనిజేస్తున్నా. నా తలెంట్రుకలు తెల్లవడుతున్నయ్‌. రంగేసుడు మొదలయ్యింది.

మా వోడికి కెనడా వ్యాపార రాజధానైనా టొరంటోలో ఏం.బి.ఏ. సీటొచ్చింది. టామ్‌ బాగా కుషయ్యిండు. చిన్నప్పుడు తలమీద చేతేసిన పిల్లోడు, ఇప్పుడు వాళ్ళ దేశంకు సదుకునేందుకు అస్తున్నడని. ఆటావా నుంచి టొరంటో ఐదు గంటల బస్సు / రైలు ప్రయాణం. సదువైపోయింది. డిగ్రీ సర్టిఫికెట్‌ తీసుకొనేటప్పుడు (గ్రాడ్యుయేషన్‌ పండగ) తల్లితండ్రులు సూసెతందుకు పోతరు. మేముగూడ ప్లాన్‌ ఏసుకొన్నం. పోయినప్పుడు టామ్‌ని మల్ల కలుస్తమని. మస్తు ఖుషీతోని ఎదిరి సూసినం. కానీ, అస్సలు టైంకు పెద్దపనొచ్చి పోవుడు కాలేదు. టామ్‌కు ఫోన్ల చెప్పి బాధపడ్డం.

మా ఇద్దరి మనసు టోరంటోలోనే ఉంది. ఆ రోజు గ్రాడ్యుయేషన్‌ పండగ. కొడుకు సర్టిఫికట్‌ తీసుకుంటడు. మావొడితోని మాట్లాడినం. సదువైపోయినందుకు సంతోషమైంది. జల్దే నౌక్రి దొరుకతదని చెప్పిండు. 

తెల్లారి మావోడు ఫోన్‌ జేసిండు. గ్రాడ్యుయేషన్‌ పండగకి మేము లేని లోటు మావోనికి కాకుండా, టామ్‌, ఆయన భార్య అచ్చిండ్రని, ఆడిటోరియంల కూసోని ప్రోగ్రాం సూసిండ్రని సంతోషంగా చెప్పిండు. దినమంతా మావోనితో గడిపివాళ్ళు వాపస్‌ పోయిండ్రట. ఈ మాటలినంగనే మా ఇద్దరి కండ్లల్ల నీళ్ళు. ఏ బంధమని పిలాల? సుట్టం గాదు, రక్తబంధం లేదు. మన దేశమాయన కాదు. స్నేహ బంధంల గింత తాకత్‌ ఉన్నదా అని ఏడ్చిన. అల్లిద్దరికి మనసుల మొక్కుకున్నం. 

మా కొడుక్కు నౌకరచ్చింది. టొరంటోలో అపార్ట్మెంట్‌ తీసుకొని ఉండుడు మొదలువెట్టిండు. అప్పుడు చిన్న ఆశ శిగురేసుడు మొదలైంది.  టామ్‌ని మళ్ళీ ఓసారి కలుస్తానన్న అత్యాశ! కొడుకు దగ్గరికి ఒక్క పారన్న పోతం గదా, అప్పుడు ఆటావా పోయి ఎట్లనన్నకలొచ్చు. సూడంగా సూడంగా ఏండ్లు గడిశి పోవట్టే. నేను 2015ల రిటైరైన. మాకు మంచి మోఖా అనుకోని మావోడి దగ్గరికి ఓ నాలుగు నెల్లు ఉండేందుకు పోయినం. ఓ నెలగాంగనే టొరంటో నుండి ఆటావా పోయినం. వారం రోజులున్నం. హోటల్ల ఉండద్దని టామ్‌ మొదలే మాతోటి మాట తీసుకున్నడు. ఇల్లు పెద్దగుంటది, ఆల్లతోనే ఉండాలని ప్రేమతో జెప్పిండు. నాకు, నా భార్యకు ‘కెనడా డే’ (మన చబ్బీస్‌ జనవరి పండగ లెక్క) సంబరాలని సూపిచ్చిండు. దినమంతా పండగే. దోస్తులతోని కలిపిచ్చిండు. బిడ్డల కుటుంబాలతో కలిపిండు. అందరినీ డిన్నర్‌కు పిలిచిండు. మస్తు మర్యాదలు జేసిండు. టామ్‌ వయస్సు ఎనభై దాటింది. కాళ్లనొప్పులు ఇంకా ఎక్వయినై. ఇంకేదో అప్రెషన్‌ అయ్యిందట. కారు నడుపుడు బందైందట. బయట పనులకి ఆయన భార్యనే. వారం రోజులు బాగా కుషీగా గడిపి టొరంటోకి వాపస్‌ అచ్చినం.

*  *  *

మా దోస్తానీ ఇంకా చిక్కవడ్డది. గోదావరి నదిమీద సొన్న (నిర్మల్‌ దగ్గరి ఊరు) దగ్గర గట్టిన నూరేండ్ల బిడ్జి తీరుగా గట్టి వడ్డది. నాలుగేండ్ల కొత్త క్యాలెండర్లు గోడకెక్కినయ్‌. దిగినయ్‌. తెలంగాణ కొత్త రాష్ట్రమైంది. కొత్త రాష్ట్రం రూపు రేఖల్ని మారుస్తున్నది. నేను దిల్లినుండి నిర్మల్‌కి మారిన. అయిదారు నెల్లకొకసరి టామ్‌కి  ఈమెయిల్‌ పంపుతా. జవాబస్తది. నడుముకి ఇంకో ఆప్రెషన్‌ అయ్యిందట. నడుసుడు ఇంకా తగ్గిందట.

కొత్త సంవత్సరమచ్చుడేమోగాని కరోనాని తీస్కచ్చింది.  చైనాలో మొదలై మెల్లమెల్లగా ఒక్కొక్క దేశంల అడుగేసుకుంటూ ఖండాలని దాటుకుంటా వోతున్నది. పేపర్‌ సదువుతున్న. కెనడాల సుగ కరోనా శురైందట. ఆ దేశ ప్రధానమంత్రి భార్యకు కరోనా తలిగిందని సదివిన. గబ్రాయించి వెంటనే టామ్‌కు ఈమేయిల్‌ పంపిన. ముసలోల్లు ఎగిరిపోతున్నరని సదివిన. టీవీల సుగ సూసిన. భయమేసింది. 

రోజు జవాబుకోసం ఎదిరిసూసిన. రెండు రోజులాయే. మూడాయే. జవాబు రాలేదు. అద్దనుకున్న ఏదో కీడు మనస్సుల. గుబులవుడు మొదలైంది. కరోనా తన ప్రతాపాన్ని సూపుకుంటా ఉరుకుతున్నది. ఎగవడుతున్నది. ఎసుంటి జవాబస్తదో అని నేను పరేషాన్‌. టామ్‌, ఆయన భార్యది, ఇద్దరిదీ, ఒకటే ఈమెయిల్‌ ఐడి.  అయిదారు రోజులు గిట్లనే పరేషానైన! ఎట్లున్నరో ఏమో?

పొద్దున లేసి లాప్‌ టాప్ల  ఈమెయిల్లను చూస్తున్న. జవాబచ్చింది. టామ్‌ భార్య రాసింది. టామ్‌ మోకాళ్ళ నొప్పులతోటి బాగ అవస్థ వడుతున్నడట. భరించలేని నొప్పట. ఫిజియోథెరపి కోసం రోజూ దావఖానకు పోవాల్నట. ఆల్షమైనందుకు ఏమనుకోవద్దని అన్ని సంగతులు రాసింది. 

పానం కుదటవడ్డది మాకు. 

నా జిగ్రి దోస్త్‌ ఇంకా పది కాలాలు బతకాల. మనసులో కోరుకొని దినమంతా ఉషారుగా గడిపిన.