శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:22:48

మంగయ్య అదృష్టం

మంగయ్య అదృష్టం

(బ్రహ్మకు ఇతర దేవతలకు మధ్య ‘టెస్ట్‌ కేస్‌'గా నిలిచాడు మంగయ్య. అతని మీద ఇరువర్గాలూ తమ యుక్తులను పన్నుతున్నాయి. ఇంతలో... రౌడీ రాజ్యంలో వెలుగుతున్న మంగయ్య బాబుకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించాడు విధాత. ఆ అవకాశం ఎంతవరకు వెళ్లింది? ఓటమి అంచుల్లో ఉన్న మంగయ్య జారిపోయాడా... జోరందుకున్నాడా? మీరే చదవండి...)

మాహ్మ విరోధి దేవతలే ఆ దృశ్యం చూచి విస్తుపోయారు. ఇది వారి మహిమే ఐనా వారే తమ కార్య కౌశల్యాన్ని నమ్మజాలలేదు. ‘ఏమద్భుతం!!’ అంటూ యమధర్మరాజు స్పందించాడు. ‘ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు?’ అని ప్రశ్నించాడు. గుడ్లప్పగించి చూస్తూ. ప్రాణాలు లాక్కుపొయ్యే కౌశలం తప్ప ఆయనకు మరే అన్నెంపున్నెం తెలియదు పాపం. కంటి స్పెషలిస్టుకు కాలెక్కడుంటుందో తెలియనట్టు. ‘యమరాజా! తామెంత భోళా దేవుడండీ! ఆ పత్రికల్లో వచ్చిందంతా నిజంగా జనం కాదండీ. మన దేవతల్లోనే కొందరు విశేషజ్ఞులు పత్రికలకై ఛాయాచిత్రాలు తీసిన కెమెరాల్లో కలిగిన విభ్రమప్రభావం. ట్రిక్‌ ఫోటోగ్రఫీ ద్వారా వారలా కనిపించే అట్టు చేశారు సార్‌!’ అని విశదీకరించాడొక టెక్నాలజీ విశేషజుడైన వేల్పు. 

ఏమైతేనేం, పరమయ్య నామినేషన్‌ పరమ వైభవోపేతంగా జరిగిపోయింది. కొందరు మంగయ్య అనుచరులు ఆ భవ్యదృశ్యాన్ని చూచి ఓర్వలేక అక్కడక్కడ కొన్ని నాటుబాంబులు పేల్చారు. బాంబుల కంటే తొక్కిడిలోనే ఎక్కువమంది మరణించారు. నామినేషన్నాటక ప్రేక్షకుల్లో అక్కడే హాజరై ఉన్న యమరాజుకు తలవని తలంపుగా బోనస్‌ కింద అనేక ప్రాణాలు హస్తగతమయ్యాయి. ఈ విధంగా పరమయ్య నామినేషన్‌ నరబలి కూడా ఒక ముఖ్య భాగంగా రూపొందింది.

మంగయ్య విరోధి దేవతలు ఈసారి ఏ మాత్రం ఏమరి ఉండదలచుకోలేదు. గతంలో తమ ప్రమత్తత వల్ల అనేక మార్లు మోసపోయిన అనుభవం పదేపదే వారికి గుర్తొచ్చింది. ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ మంగయ్య ఇప్పటికీ తన ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాడు. ఎన్ని అంతఃకలహాలున్నా పార్టీ బలం వాడికి ఉండనే ఉంది. చివరి వారంలోనే అంతా తల్లకిందులైన ఎన్నికల ఉదంతాలెన్నో ఇటీవల దేవతల దృష్టికి వచ్చాయి. అప్పుడప్పుడు చివరి రోజు కూడా అనర్థం జరగొచ్చు. ఇదంతా సాకల్యంగా ఆలోచించి పెను తుఫానులా పర్యటిస్తున్న మంగయ్యను ఎదుర్కొనాలంటే ఒకే ఒక ఉపాయం తోచింది దేవతలకు - మంగయ్యను కదలకుండా చేయడం.

శుభస్యశీఘ్రమంటూ ఆ రాత్రే వారా కార్యక్రమం పూర్తి చేయించారు. ఒక దొమ్మీ సంఘటనలో ఇరుక్కుని మంగయ్య బాగా దెబ్బలు తిన్నాడు. చొక్కామీద రక్తం చిందింది. అంతే!... కథ అమాంతం అడ్డం తిరిగింది. మంగయ్య అనుయాయులు క్షణంలో వాడిని ఆసుపత్రికి చేర్చారు. అక్కడ మంగయ్యకు సానుభూతిపరుడైన ఒక డాక్టరు మంగయ్య కుడిచేయిపై, ఎడమకాలుపై, పెద్దపెద్ద కట్లు మీద కట్లు కట్టి ఆ పైన ఏ జంతువు రక్తమో పుష్కలంగా పులిమి భయంకరంగా తయారు చేశాడు. తల చుట్టూరా ఉల్లిపొరల లాంటి బాండేజీలు అనేకం బిగించి ఇప్పుడో అప్పుడో చచ్చిపోవడం ఖాయమన్నట్టు ఓటర్లందరికీ కనిపింపచేశాడు. హృదయ విదారకమైన ఆ గాయాల వేషంతో మంగయ్య ఊరేగింపు ఊరూరా ప్రత్యక్షమైంది. ఆ రక్తమంతా మంగయ్యది కాదని ఎవరంటారు, నిజంగా వాడిది కాకున్నా? ఆ క్షణం నుంచి ఎన్నికల చివరి వరకూ మంగయ్య ప్రచార సర్వస్వం ప్రతి గ్రామంలో ఆ కరుణ రసభరిత దృశ్య ప్రదర్శనంతోనే ముందుకు సాగింది. కొందరి మాట నమ్మాలంటే ఆ కొద్ది రోజుల్లో నియోజకవర్గమంతటా పర్యటించడం కష్టమనిపించడం వల్ల ముగ్గురినో నలుగురినో మంగయ్యలను అలాంటివే కట్లతో సహా తయారు చేసి మొత్తం గ్రామాల్లో ప్రదర్శించారని వదంతి.

చూస్తూ చూస్తూనే వోటర్ల హృదయాల్లో సానుభూతి కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. విశేషించి మహిళా ఓటర్ల కరుణాతిరేకం గంగా ప్రవాహ సదృశంగా ఎన్నికలను ముంచెత్తింది. ఎక్కడ విన్నా ‘అయ్యో పాపం! అయ్యో పాపం!’ అన్నదే ఏకైక నినాదమైంది. మేనిఫెస్టోలు మాయమైపోయాయి. ఉపన్యాసాలూ, బహిరంగ సభలూ పట్టించుకున్నవాడే లేడు. కన్నీళ్ళతో కళ్ళు నిండిపోతే మంగయ్యకు పడ్డ ఓట్లతో డబ్బాలు నిండిపోయాయి. ‘మనం కంగారుపడి వాణ్ణి కదలకుండా చేద్దామనుకుంటే మన పీఠమే కదలిపోయింది’ అంటూ వాపోయారు బ్రహ్మ విరోధులైన దేవతలు. భర్త చేతి దెబ్బల కన్నా ఎవరో తోడికోడలు నవ్వినందుకు బాధపడ్డట్టు మంగయ్య గెలుపు కన్నా భాగ్యలేఖన శాఖవారి అపహాస్యానికి బ్రహ్మ విరోధి దేవతలు విపరీతంగా బాధపడ్డారు.

ఎన్నికల ఫలితాలు తెలిసిన వెంటనే మంగయ్య కట్లూ, బాండేజీలూ క్షణంలో అదృశ్యమైపోయాయి. వాటి ఉద్దేశం పూర్తయి పోయినందున ఇక వాటి ఉపయోగమేమీ లేదు. ఇప్పుడు తాను సంపూర్ణారోగ్యవంతుడుగా కనపడాలి. దుర్గారావు భార్య, మంగయ్య సహాయార్థం స్వర్గపాతాళాల్లోనూ (అంటే కేంద్ర రాష్ట్ర రాజధానులన్న మాట) భగీరథ కృషి చేసింది. మంగయ్య విరోధులైన దేవతలు కూడా అంతటితో ఆగక రంగంలోకి లంఘించారు. మళ్ళీ ఏమైనా సరే మంగయ్య మంత్రి కాకూడదని వారి పంతం. మామూలు పరిస్థితుల్లో అది అసంభవం కూడా. మొత్తానికి ఈ ప్రయత్నంలో మాత్రం వారు దాదాపు కృతకృత్యులయ్యారనే చెప్పాలి... మంగయ్య పూర్వ చరిత్ర సర్వ విదితం కాబట్టి. ఎందుకైనా మంచిది ప్రయత్న లోపం ఉండకూడదని దేవతలు మంగయ్య అఘాయిత్యాలనూ, క్రూరకృత్యాలనూ ప్రత్యేకంగా వర్ణిస్తూ సంపాదకీయాలూ, వ్యాసాలూ ఢిల్లీ పత్రికల్లో కుప్పించారు. ఇక మంగయ్యకేమీ ఆస్కారముంటుంది మంత్రి పదవికి?

అంతటితో పీడ వదిలిందనుకున్నారు. ఐతే ఏ దేవతల మహిమో కానీ, ఆ పరిస్థితి మంగయ్యకు సరిగ్గా సరిపోయేట్టు, మంచి దర్జీ వాడిచే కుట్టించుకున్న చొక్కావలె తయారైంది. ఇంకేముంది? మంగయ్యను ఢిల్లీ పత్రికల్లో ఎంత దుయ్యపట్టితే అంతే అధికంగా అతనిపట్ల ఢిల్లీ అధికార వర్గాల్లో అదొక వర్ణించరాని నిష్కారణ సహానుభూతి ఉబికి వచ్చింది. మామూలుగా రాజకీయాల్లో ఒక్క వ్యక్తి పై ఇంతటి సానుభూతి పుట్టుకురావడం అట్టే జరగదు. పరస్పర సంహారమే రాజకీయాల లక్షణం. కాని అప్పుడప్పుడు అనేక చిత్ర విచిత్ర పరిణామాలు కూడా రాజకీయాల్లో తలవని తలంపుగా ప్రత్యక్షమౌతుంటాయి. మంగయ్య అంత చెడ్డవాడే ఐతే సూటిగా ఈ మంత్రి పదవి ప్రసక్తి వచ్చిన ముహూర్తంలోనే ఇంత ముమ్మరంగా, నిర్ధాక్షిణ్యంగా, ఏదో పుట్టి మునిగినట్టు, ఇన్నిన్ని ప్రచారపు జాగిలాలను ఒక్కుమ్మడి అదే పనిగా వాడి పైకి ఉసికొల్పవలసిన ప్రత్యేకావసరమేం వచ్చింది?... ఇంతకాలం దుర్గారావుకు కుడి భుజంగా, ఎంతో విశ్వసనీయుడుగా, స్వయంకృషితోనే పైకి వచ్చిన ‘సెల్ఫ్‌ మేడ్‌' వ్యక్తిగా మంగయ్యను చిత్రించడం జరుగుతూ వచ్చింది. ఔనా?... మరి ఇప్పుడు హఠాత్తుగా మొదలైన ఈ ఘోర ప్రతికూల ప్రచారాన్ని ఏదో తెర వెనుక భాగోతం కన్న మరేమనుకోవాలి? ... పరిణామతః ఢిల్లీలో ‘సెల్ఫ్‌ మేడ్‌' మంగయ్యపైన అతిశయించిన ఆత్మీయులవల్ల రాష్ట్ర మంత్రివర్గంలో అతణ్ణి చేర్చడం జరిగింది. వ్యతిరేక దేవత లు లబలబ లాడిపోయారు.

రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కొంతకాలంగా ఎంతో మెతకగా నడుస్తోందనీ, ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి విషమించక తప్పదనీ, అంచేత వెంటనే ముఖ్యమంత్రిని మార్చడం తప్ప శరణ్యం లేదనీ, తనంత తానే ఎలా బుడ బుడ బయలుదేరిందో కానీ ఎవ్వరూ ఊహించక ముందే రాష్ట్రంలో నాయకత్వం మారనున్నదనే వాతావరణం ఏర్పడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు, పెద్దమనిషి, స్వాతంత్య్ర సేనాని, నీతిపరుడు, బుద్ధిమంతుడు... వగైరా వగైరా అని స్తోత్ర పాఠాలు వల్లించినవారే ఇలా ప్లేటు ఫిరాయించడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. అసలే రాజకీయాల ఆంతర్యం తెలుసుకోవడం అతి దుస్తరమంటే ఈ మంగయ్య వ్యవహారంలో అమీ తుమీ తేల్చుకోవాలని కృత నిశ్చయులైన రెండు దేవతల ముఠాలు ఢీకొనడం కూడా అదనపు చిక్కు తెచ్చి పెట్టింది - కాకర తీగె వేప చెట్టుపైకి పాకినట్టు... సరే, మాటవరుసకు ముఖ్యమంత్రిని మారుస్తారనుకోండి. కొత్తవాడెవడౌతాడు మరి? ఏం, మంగయ్యే ఎందుకు కాకూడదు?... కాని మంగయ్య పేరు ఉచ్ఛరించగానే జనాలందరికీ వాంతి వచ్చి అమాంతం డోక్కున్నంత పనైంది. వెంటనే ఆ పేరు పక్కకు పెట్టేశారు ఏకగ్రీవంగా. వ్యతిరేక దేవతలు కూడా లెక్కలేనన్ని డెలిగేషన్‌లను పుష్కలంగా డబ్బిచ్చి ఇండియన్‌ ఏర్‌లైన్స్‌ టిక్కెట్లు కట్టలు కట్టలుగా ఢిల్లీలో అరవగలిగిన నోరున్న ప్రతివాడికీ పంపిణీ చేసేశారు. వారి తెలివితేటలతో మంగయ్యంటే రాష్ట్రంలో అందరూ, అంటే అందరూ అసహ్యించుకుంటున్నారని స్పష్టంగా తెలియ వచ్చేటట్టు చేశారు.


logo