ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:12:08

గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోవచ్చా?

గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోవచ్చా?

గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోవచ్చా?- కే. గోవింద్‌, బర్కత్‌పుర

చాలా పల్లెల్లో ‘శాస్త్రపద్ధతి’ పాటించిన  గుడులు ఉన్నాయి.  కానీ, పట్టణాల్లో ఎన్నో గుళ్లు సందుల్లో, ఇండ్ల మధ్యన ఉన్నాయి. గుడి ఎక్కడ కట్టినా దానికి నాలుగు వైపులా రోడ్లు ఏర్పాటు చేసి ఒక ప్రాకారం ఏర్పరచి అందులో గుడి కట్టాలి. అలా ఉన్న గుడులకు వీధుల అవతల ఇండ్లు కట్టుకోవడం దోషం కాదు.  నేరుగా ఎప్పుడు కూడా శివాలయానికి ఎదురుగా, విష్ణువు ఆలయానికి వెనుక ఇండ్లు కట్టవద్దు. మన స్థలానికి పక్కన ఎదురుగా రోడ్డు వచ్చిన తర్వాత, ఈ రోడ్డు అవతల గుడి ఉంటే దోషం ఉండదు. ఒకవేళ మనకు పక్కనే గుడి ఉంటే మన స్థలంలో కొంతమేర సల్థం వీధికి వదిలి ఆ తర్వాత ప్రహరీ కట్టి దానిలో ఇల్లు కట్టుకోవాలి. మీ ఇంటిని జాగ్రత్తగా ప్లాను చేసుకొని కట్టుకోండి.

ఇంటిని ఎవరి పేరుతో కట్టుకోవాలి? పిల్లల పేర్లతో కట్టుకోవచ్చా? - ఆరె సాయిలు, మరిపడగ, జనగామ జిల్లా

గృహం, దాని వ్యక్తిగత శరీరగత నిర్మాణ విధివిధానాలను బట్టి  గృహ ఫలితాలు ఉంటాయి. అంటే పేరు కన్నా మనిషి అంతరంగమే గొప్పది. పేరు ప్రాధాన్యం వేరు,  దాని ధ్వని, ఆ ‘పిలుపు’ ద్వారా కలిగే స్పందనలు పక్కన పెడితే.. ఇంటి విషయంలో ఎవరి ‘పేరు’ మీద ఇల్లు కట్టొచ్చు అనేదాని కన్నా కట్టే విధానమే ప్రధానం. మీరు ప్రత్యేకంగా ‘పేరు బలం’ గురించి అడిగారు కాబట్టి,  యజమాని పేరుమీద కట్టడం ముఖ్యం. కారణం పిల్లలు రేపు యజమానులు కాక తప్పదు. కాబట్టి, ఇంటి పోషక కర్తల పేరు మీద నిర్మాణం చేయడం వల్ల ఇంటి ఎదుగుదల, ముహూర్త బలం ఇంటి యజమానికి ఎంతో దోహద పడతాయి. మీరు ముహుర్తాన్ని యజమాని పేరు మీదే చూపించుకోండి. అంటే భార్య, భర్త పేరులో ఎవరి పేరుతో బలమైన ముహూర్తం ఉంటే వారిపేరు మీద నిర్మాణం చేయవచ్చు. 

ఒకరి పేరు మీద కొన్న భూమిని వేరే వాళ్లు కొని ఇల్లు కట్టుకోవచ్చా?- ప్రేమలత, కొలనుపాక

స్థల ప్రాధాన్యం, దాని వృద్ధి రేటు అంతా కూడా ఆ స్థలం పేరు మీదకన్నా దాని లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.  ఎవరి పేరు మీద స్థలం ఉన్నా, వేరొకరు అపార్టుమెంట్లల్లో ‘కాపురం’ ఉంటున్నారు. అవన్నీ అందులో ఉండేవాళ్ల పేర్లమీద ఉండవు కదా? వాళ్లంతా బాగుండటం లేదా? మీరు వేరేవాళ్ల పేరుతో ఉన్న భూమిని కొంటున్నారు.. అన్నప్పుడు, మీరు మీ పేరుమీదకు మార్చుకుంటారు కదా? అప్పుడు అనుమానం ఏముంది? ఎవరు, ఎప్పడు, ఎవరివద్ద కొన్నా తమ పేర్లు మార్చుకొని రిజిస్ట్రేషన్‌  చేసుకోవాల్సిందే. ఒకవేళ కమర్షియల్‌ అవసరం కోసం లీజుకు తీసుకున్నా ఇబ్బంది కాదు. మీరు సొంతదారు కానంత మాత్రాన  భేదం ఉండదు. మీరు ఏది కట్టినా, రెంటుకు ఉన్నా, ఆ నిర్మాణం బాగుందా లేదా? అది ఉండదగిందా లేదా అని చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. 

పిరమిడ్‌ ఆకారంలో ఇల్లు కట్టుకోవచ్చా?- ఇంద్రాణి, కొత్తపేట

మన పల్లెల్లో పెంకుటిండ్లు, కమ్మల ఇండ్లు అన్నీ పిరమిడ్‌ ఆకారంలోనే ఉంటాయి. పిరమిడ్‌ కప్పు మన దేశానికి కొత్తకాదు. అతిప్రాచీన నిర్మాణ విధానంలో మన సంస్కృతి దానినే ఆచరించింది. గోపుర ఆకార నిర్మాణాలే అన్నీ.  మన పూరి గుడిసెలో ఉన్న ‘కౌశలం’, సైన్స్‌, విదేశాల అద్దాల హాట్స్‌లలో ఉండదు. ‘షోకేసులు’ గృహాలు కాలేవు.  ముఖ్య విషయం ఏమిటంటే... పిరమిడ్‌ విధానంలో దిశలు తప్పక పాటించాలి. నలభై ఏండ్ల క్రితం ఏ పల్లెటూరూ దిశలకు విరుద్ధంగా లేదు. నేడు పట్టణ, నగరాలు దిశలకు అనుకూలంగా లేవు. గృహం కట్టడం అంటే దానికో పద్ధతి, నిర్దిష్టమైన కొలతలు ఉంటాయి. పైగా ఇల్లు మొత్తం పిరమిడ్‌ ఆకారంలో కట్టడం అంటే దానిలోని గదుల విభాగం జాగ్రత్తగా చేయాలి. ప్రతి గదీ పిరమిడ్‌ కప్పులను కలిగి ఉండేలా, దాని ఔన్నత్యాన్ని పొందే నిర్మాణం చేయాలి. 


logo