శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 23:03:11

అందమైన రంగుల నది

అందమైన రంగుల నది

దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఓ నది ఉంది. ఎంతో అందంగా, చూడగానే కన్నుల విందుగా ఉంటుంది.  నది అంతా గులాబీ రంగులో ఆకట్టుకుంటుంది. దీని పేరు ‘కనో క్రాస్టాలీస్‌'. ఈ నదిని ‘రెయిన్‌బో రివర్‌' అని కూడా అంటారు.  వైవిధ్యంగా ఉండే ఈ రంగును చూసి పర్యటకులంతా మంత్రముగ్ధులు అవుతారు. ఈ ప్రాంతంలో ‘మకరేనియా క్లేవిగెరా’ అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వాటి వల్లే ఈ నది రంగు అలా ఉంటుంది. ఈ ప్రాంతానికి లక్షల ఏండ్ల చరిత్ర ఉంది. దీన్ని ‘షీల్డ్‌ ఆఫ్‌ గయానా’గా అభివర్ణిస్తారు. ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లల్లో ఖనిజాలు ఉండటంతో నదికి ఈ రంగు వచ్చిందని కొందరు అంటారు.

ఖనిజాలతో పాటు, రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల... ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగలేవని చెబుతారు. ఈ మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్‌ మాత్రమే పెరుగుతాయి.

భూమిలోని ఖనిజాలకు అనుగుణంగా ఈ పూల రంగు ఉంటుంది. అమెజాన్‌ అడవి, ఆండియన్‌ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడ కలిశాయి. నీటి మొక్కలు పెరిగే ఈ ప్రాంతంలో వేరువేరు జోన్లు ఉన్నాయి.  ఒకప్పుడు దీన్ని ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు. కానీ, పర్యాటకంగా అభివృద్ధి చెందే కొద్దీ ఆ అభిప్రాయం పోతోంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూసి అందరూ మురిసిపోతుంటారు.