గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 22:47:31

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

జ్ఞాపకాల పరిమళం

కాలేజ్‌లో అడుగుపెట్టనంత వరకు అది ఓ చదువు చెప్పే భవనం మాత్రమే! కానీ అందులో ఒకో రోజు గడిచేకొద్దీ... స్నేహానికీ జీవితానికీ, చదువుకూ భవితకూ వారధిగా నిలిచే ప్రయాణం అని తెలిసొస్తుంది. అందుకే చాలా కళాశాలల పూర్వవిద్యార్థులు దశాబ్దాలు గడిచినా, తమ కాలేజి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. అలాంటి ఓ విలక్షణ ప్రయత్నమే ఇది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1945 (తొలి బ్యాచ్‌) 2015 వరకు చదువుకున్న పూర్వవిద్యార్థుల అనుభవాల దొంతర ఇది. ఒకో బ్యాచ్‌ జ్ఞాపకాలు, వారిలో లబ్దప్రతిష్ఠుల వివరాలతో ఆసక్తి కలిగిస్తుంది. ఈ జ్ఞాపకాలకు మరింత వన్నెలద్దుతూ... అడుగడుగునా అందమైన బొమ్మలు, ప్రముఖుల కవితలు పలకరిస్తాయి. కాలేజీ జీవితాన్ని గుర్తుచేసే చారిత్రక సన్నివేశాలూ, మర్చిపోలేని సంప్రదాయాల వివరణ ఉంటుంది. పూర్వవిద్యార్థులకు ఇది ఎలాగూ అమృతభాండమే... ఇలాంటి జ్ఞాపకాలను ఇష్టపడేవారికీ మంచి అనుభూతిని అందిస్తుందీ పుస్తకం.

భక్తిపూర్వక ప్రహేళికలు

హైందవ సాహిత్యంలో రామాయణ, భారత, భాగవతాలది సాటిలేని స్థానం. ఎంత చదివినా ఏదో మిగిలిపోయిందని తోచేంత గాఢత, విశ్లేషించిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త అర్థం స్ఫురించేంత మార్మికత వాటి సొంతం. ఆయా గ్రంథాల పట్ల మన ఎరుకను పరీక్షించుకునే అవకాశం కల్పిస్తుందీ పుస్తకం. భారత, భాగవత, రామాయణాలకు సంబంధించి చెరో 20 ప్రహేళికలతో దీనిని రూపొందించారు. తేలిక నుంచి కఠినతరం వరకు రకరకాల ఆధారాలు మన విజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. పేర్లు, స్థలపురాణాలు మొదలుకొని నాటి సంప్రదాయాల వరకు విస్తృతమైన పరిజ్ఞానం కనిపిస్తుంది. లోతైన అధ్యయనం చేసిన వారు వీటిని పరిష్కరించుకోవచ్చు. ప్రాథమిక జ్ఞానం ఉన్నవారు జవాబులను గమనించుకుని తృప్తి పడవచ్చు. ప్రహేళికలతో పాటు, అక్కడక్కడా పౌరాణిక విషయాలను చర్చించడం బాగుంది. ఈ ప్రహేళికల రూపకల్పన వెనుక అసాధారణ ప్రయాస కనిపిస్తుంది. అందుకు పూనుకున్న రచయిత అభినందనీయులు.

అచ్చమైన మనిషి కథ

వందల కథలు రాసిన సీనియర్‌ రచయిత వడలి రాధాకృష్ణ వెలువరించిన ఏడో కథా సంకలనం ఇది. రచయిత ప్రతి కథా మానవీయ కోణంలోంచే సాగుతుంది. అయినా... ఏ కథకి ఆ కథ విభిన్నంగా తోచడం విశేషం. స్వతహాగా కవి కావడంతో సన్నివేశాలని రక్తి కట్టించాల్సిన చోట పదవిన్యాసం చేస్తారు. ఈ సంకలనంలోని 18 కథలూ పాఠకులను అలరించేవే. పాట మరచిన పల్లవి, ఎడారి మొలక, మంచినీటి సముద్రం, నేలమీద నక్షత్రాలు... ఇలా చాలా శీర్షికలు విరోధాభాసంగా కనిపిస్తాయి. అసాధ్యమైన సందర్భాలలో సైతం మానవత్వం అద్భుతాలు చేస్తుందని సూచించడమే వాటి ఉద్దేశం. విగ్రహాలను ‘నిమజ్జనం’ చేసే ఉపాధిలో ఉంటూ... తనే అలలకు బలైపోయిన బొట్టియ్య కథ, ఒకరికి చేసిన మేలు ఏదో ఒకరోజు మనకి సాయపడుతుందని సూచించే ‘ఋణానుబంధం’, సవతుల మధ్య పోరుకు అసాధారణమైన పరిష్కారం సూచించే ‘నీడలు-నైజాలు’... ఇలా ప్రతి కథా చివరికంటూ అలుపు లేకుండా చదివిస్తుంది.


logo