మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 22:28:58

డాటర్‌ ఆఫ్‌ శకుంతలాదేవి

డాటర్‌ ఆఫ్‌ శకుంతలాదేవి

‘శకుంతలాదేవి - హ్యూమన్‌ కంప్యూటర్‌'.. అమెజాన్‌ ప్రైమ్‌లో వ్యూస్‌ పంట పండిస్తున్నది. ఈ చిత్రంలో శకుంతలాదేవి కూతురిగా.. విద్యాబాలన్‌తో పోటీపడి నటించింది సాన్యా మల్హోత్రా. ముక్కుమీదే కోపం ఉన్నట్టు కనిపించే ఆ అమ్మాయితో ముచ్చట్లు..

‘దంగల్‌'కు ముందు రెజ్లింగ్‌ గురించి కొంచెం కూడా అవగాహన లేదు సాన్యాకి. కానీ ఆ సినిమా కోసమే శిక్షణ తీసుకొంది. మొత్తానికి, తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
‘పటాకా’ కోసం రాజస్థాన్‌ యాస, భాష నేర్చుకొంది. పాలు పితకడం, పిడకలు కొట్టడం ప్రాక్టీస్‌ చేసింది. కుండల్లో నీళ్లు నింపి, మూడు కుండలూ ఒకేసారి తలపై పెట్టుకొని బ్యాలెన్స్‌ చేసింది. క్యారెక్టర్‌కు ప్రాణం పోయడానికి అంత కష్టపడింది.
ఈ ఏడాది, తన పుట్టిన రోజునాడు హ్యారీపోటర్‌ నటుడు డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ అమ్మడు. 
కరోనా సమయంలో చిన్న యాక్సిడెంట్‌ జరిగింది. తన వేలు విరిగిపోయింది. వెంటనే, దవాఖానలో చేరి సర్జరీ చేయించుకుంది. ‘దేవుడే నన్ను కాపాడాడు’ అంటూ గుండెలమీద చేతులు వేసుకుంటుంది సాన్యా.  
25 ఫిబ్రవరి, 1992న ఢిల్లీలో జన్మించింది సాన్యా. ఒక డ్యాన్స్‌ ఫెస్ట్‌ కోసం.. కొరియోగ్రాఫర్‌గా ముంబైకి వచ్చింది. ఆ సిటీ నచ్చి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. తనది ఉంగరాల జుట్టు. దంగల్‌ సినిమా కోసం కట్‌ చేస్తుంటే, ఏడుపు వచ్చేసిందట. మంచి భోజనప్రియురాలు. కానీ, కొన్నిసార్లు పొట్టకాల్చుకోవాల్సి వస్తుంది. ప్రెట్టీ ఫిట్‌ అనే ఒక ప్రోగ్రామ్‌ కోసం బట్టలు కూడా పిండింది పాపం! 
‘మేం మంచి స్నేహితులం.  తను పని విషయంలో అంకితభావంతో ఉంటుంది. కష్టపడటంలో తనే నాకు స్ఫూర్తి’ అని వివరిస్తుంది సాన్యా స్నేహితురాలు, సహనటి ఫాతిమా.  దంగల్‌లో నటించిన సాన్యా, ఫాతిమా డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.  అది చూసి ఇద్దరూ నవ్వుకున్నారట.
అన్నట్టు, తను కవయిత్రి కూడా. సోషల్‌మీడియాలో చిన్నచిన్న కవితలు పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.  మాస్క్‌ ఇండియా పేరుతో జరిగిన సోషల్‌ మీడియా ఉద్యమంలోనూ పాల్గొన్నది. 
సాన్యాకి పిల్లులంటే ఇష్టం. తను ఒక కిట్టీని పెంచుకుంటున్నది. దాని పేరు లైలా. ‘లాక్‌డౌన్‌కు ముందు వరకూ లైలా మా ఇంట్లో వాళ్లకు దగ్గరగా ఉండేది. ఇప్పుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నది’ అంటూ సోషల్‌ మీడియాలో తన పెట్‌ లవ్‌ గురించి పోస్ట్‌ చేసింది. 
డ్యాన్స్‌ అంటే పిచ్చి. ట్యాప్‌ డ్యాన్సింగ్‌ అంటే చాలా ఇష్టమని చెబుతున్నది. ఎప్పటికైనా ఆ డ్యాన్స్‌ నేర్చుకొని తీరుతానంటున్నది. చాలా యాడ్స్‌లో కనిపించింది. ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్‌లో సినిమా గురించి ఇంటర్న్‌షిప్‌ చేసింది. బొమ్మలు కూడా  గీస్తుంది. 


logo