బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sunday - Aug 09, 2020 , 00:46:17

భవిష్యత్తు అంతా.. ఐటీదే అనిపించింది!

భవిష్యత్తు అంతా.. ఐటీదే అనిపించింది!

‘లక్ష్యం చిన్నప్పుడే ఏర్పరచుకోవాలి. నిత్య సాధన, నిరంతర అన్వేషణ ఉంటేనే అనుకున్న స్థాయికి చేరుకోగలం’ అంటున్నాడు వొంటర్‌పల్లి వెంకట్‌రెడ్డి. ఆయనది పల్లెటూరు నేపథ్యమే. కానీ అక్కడే ఆగిపోలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాడు. అంచెలంచెలగా ఎదిగి ఎందరికో ఆదర్శమయ్యాడు. ఒకవైపు కెరీర్‌.. మరోవైపు తెలంగాణ ఉద్యమం - రెండింటినీ బ్యాలెన్సింగ్‌ చేస్తూ సరికొత్త జీవితాన్ని నిర్మించుకున్న సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పర్ట్‌ వొంటర్‌పల్లి వెంకట్‌రెడ్డి ‘లైఫ్‌ జర్నీ’ ఈ వారం.

మాఊరు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం వొంటర్‌పల్లి. మా ఊరి పేరూ నా ఇంటిపేరూ ఒక్కటే. ఇలా ఉండటం చాలా అరుదు. అది నా అదృష్టం కావచ్చు. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నా వ్యవసాయం చేసేవాళ్లు. ఊరితో పొలంతో మాకు బాల్యం నుంచే అనుబంధం ఉండేది. పక్కా పల్లెటూరు కాబట్టి, చిన్నప్పుడే జీవితం అంటే ఏమిటో అర్థమైంది. అప్పుట్లో ఇంతలా టెక్నాలజీ లేదు. సౌకర్యాలూ లేవు. స్కూల్‌కి వెళ్లాలంటే రోజూ 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. సైకిల్‌ ఉంటే సైకిల్‌ మీద.. లేకపోతే కాలినడకన. అప్పుడే, జీవితంలో ఏదైనా సాధించాలి, మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని.. పైకి రావాలన్న లక్ష్యం ఏర్పడింది.

 హైదరాబాద్‌ నేర్పింది 

పదో తరగతి అయిపోయింది. కామారెడ్డిలో ఇంటర్‌ చేశాను. డిగ్రీ ఎక్కడ? హైదరాబాద్‌ అయితే, కరెక్ట్‌ అనిపించింది. విషయం ఇంట్లో చెప్పాను. సంతోషించారు. అన్ని జాగ్రత్తలూ చెప్పి హైదరాబాద్‌ పంపించారు. నా ఆలోచనలకు హైదరాబాదే బెటర్‌ అనిపించింది. 1998లో మా తమ్ముడు జగన్‌ను తీసుకొని హైదరాబాద్‌కు వచ్చేశాను. బీసీఏ ఎంట్రెన్స్‌ రాశాను. మంచి ర్యాంక్‌ వచ్చింది. జగన్‌.. నేను.. ఇంకొంతమంది కజిన్స్‌తో కలిసి చిక్కడపల్లి.. నారాయణగూడల్లో కిరాయికి రూమ్‌ తీసుకొని ఉండేవాళ్లం. అదొక కొత్త అట్మాస్పియర్‌. అప్పటివరకు ఊరే ప్రపంచం. ఆ తర్వాత పట్టణం. కానీ బీసీఏకు వచ్చే సరికి పూర్తి నగర వాతావరణం. పంట పొలాలు.. చేనూ చెలకలతో మమేకమై ఉన్న మేం పెద్దపెద్ద బంగ్లాలు.. కాలేజీలు.. రద్దీ రోడ్లను చూస్తూ సంబురపడి పోయేవాళ్లం. కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఫీలయ్యేవాళ్లం. మొత్తానికి 2001లో బీసీఏ పూర్తయింది, అదీ ఫస్ట్‌ క్లాస్‌లో. ఊరుగాని ఊర్లో ఏం చదువుతారో అనుకున్నారు అమ్మానాన్న. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యేసరికి చాలా సంతోషించారు. 2001లో బీసీఏ అంటే పెద్ద చదువే కదా మరి!

మలుపు తిప్పిన మీటింగ్‌ 

బీసీఏ అయిపోయింది కదా? తర్వాత ఏం చేద్దాం? అనే ఆలోచనలో ఉన్నాను. హైదరాబాద్‌లో ఏదో మీటింగ్‌ జరుగుతుందంట.. చాలా పెద్దది అని తెలిసింది. ఖాళీగానే ఉన్నాం కదా, చూసొద్దాంలే అని వెళ్లాను. మామూలుగా నేను మీటింగ్‌లకు, కార్యక్రమాలకు వెళ్లను. కానీ ఏదో తెలంగాణ మీటింగ్‌ అనేసరికి వెళ్లాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నా. తెలంగాణ మీద ఉన్న అభిమానం అలాంటిది. జై తెలంగాణ అనేసరికి రోమాలు నిక్కపొడుచుకునేవి. ఏప్రిల్‌ 27వ తేదీన పరేడ్‌గ్రౌండ్‌.. కేసీఆర్‌గారి మీటింగ్‌. పొద్దున్నే రెడీ అయి వెళ్లాను. రాత్రికి జై తెలంగాణ జెండాతో తిరిగి రూమ్‌కి వచ్చాను. ఆ మీటింగ్‌ నాలో మరింత కసి పెంచేలా ఉపయోగపడింది. వనరులు మన దగ్గరకు ఏవీ రావు.. వాటిని మనమే సృష్టించుకోవాలి అనేది స్పష్టంగా అర్థమైంది. కాబటి,్ట ఖాళీగా ఉండొద్దు అనుకున్నా. ఎంసీఏ ఎంట్రెన్స్‌ రాశాను. మంచి ర్యాంక్‌ వచ్చింది. అరోరా కాలేజీలో సీటు దొరికింది. ఎంసీఏ చేస్తూనే ఒక కాల్‌సెంటర్‌లో నైట్‌ డ్యూటీ చేసేవాడిని. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కాలేజీ. డ్యూటీ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు. 

పెద్ద కంపెనీలో పని 

కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నప్పుడు టెక్నాలజీపై అవగాహన వచ్చింది. అప్పుడు నా నెల జీతం రూ.2500. ఎంసీఏ తర్వాత ఇంకో మెట్టు పైకి ఎక్కాలనే కసి మొదలైంది. కేసాఫ్ట్‌ అనే స్టార్టప్‌లో ఐదువేల జీతానికి ఉద్యోగంలో చేరాను. ఏదైనా మంచి ఆఫర్‌ వస్తే బాగుండు అని ఎదురుచూస్తున్న సమయంలో జీటా అనే పెద్ద కంపెనీ నుంచి పిలుపు వచ్చింది.  

ఉద్యమంలో ఐటీ 

ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతున్నది. అప్పుడే తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది. ఒకవైపు కెరీర్‌.. మరోవైపు అస్తిత్వ పోరాటం. సందిగ్ధంలో పడ్డాను. వాస్తవానికి అప్పుడప్పుడే ఎదుగుతున్న నాకు ఉద్యోగమూ అవసరమే. అదే సమయంలో ఉద్యమ భాగస్వామ్యమూ అవసరమే అనిపించింది. రెండింటినీ పద్ధతిగా ప్లాన్‌ చేసుకున్నాను. నాలాగా ఐటీ కంపెనీల్లో చేసేవాళ్లు ఉద్యమం పట్ల సానుకూలంగా ఎందుకు లేరు అన్న కోణంలో అధ్యయనం చేశాను. అది సానుకూలంగా లేకపోవడం కాదు.. ఐటీతో తెలంగాణకేమిటి సంబంధం అన్న దురభిప్రాయంతో వాళ్లు ఉన్నారని అర్థమైంది. కేసీఆర్‌ సందేశాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఐటీ ఉద్యోగుల ఆలోచనల్ని మార్చేందుకు ఒక అడుగు వేశాను. ఐటీలో ఉద్యోగులతో చర్చలు మొదలుపెట్టాను. మనమెందుకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయకూడదు? అని ప్రశ్నించేవాడిని. తెలంగాణ వస్తే ముందుగా బాగుపడేది ఐటీనే అనే అవగాహన వాళ్లలో కల్పించాను. మెల్లగా ఐటీలో కూడా ఉద్యమం గురించి చర్చించుకోవడం మొదలైంది. చాలా సంతోషం కలిగించిన విషయం అది. 2010 లో తెలంగాణ ఐటీ జేఏసీ పెడదాం అనే ప్రతిపాదన తీసుకొచ్చాను. నాతోపాటు శశి, ప్రవీణ్‌గుప్తా, ప్రసాన్‌.. మా తమ్ముడు జగన్‌ వొంటర్‌పల్లితో కలిసి ఐటీ ఉద్యోగుల జేఏసీ ప్రారంభించాం. కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, తదితరులు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణ ఉద్యమం అంటే ఐటీ.. ఐటీ అంటే తెలంగాణ ఉద్యమం అనేట్లు కార్యక్రమాలు చేశాం. ఐటీకి శని.. ఆదివారాలు సెలవు కాబట్టి ప్రతీ శనివారం కేపీహెచ్‌బీ కాలనీలో సమావేశం అయ్యేవాళ్లం. తెలంగాణ వాదనను వినిపించేందుకు ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌లను ఉపయోగించాం. కౌంటర్లు.. ప్రతి కౌంటర్లతో మేధావులు అనుకునేవాళ్లకూ ముచ్చెమటలు పట్టించాం. 

మాటల్లో చెప్పలేని సంతోషం 

2012.. ఐటీ జేఏసీని ఐటీఈఎస్‌ జాక్‌గా పునర్వ్యవస్థీకరించాం. వరుసగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించేవాళ్లం. ఉద్యమానికి సాంకేతిక అవసరం కాబట్టి ప్రతీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మరికొంత మందిని చేర్చుకొని మా సంఘాన్ని బలోపేతం చేస్తుండేవాళ్లం. 

రెండు సంవత్సరాలు అలాగే సాగింది. ఆ రెండేండ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేశాను. 2014లో కోట్లాది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నేను.. నాతో పనిచేసిన అందరూ ఎక్కువగా ఆనందించిన సమయం అది. ‘ద బిల్‌ ఈజ్‌ పాస్డ్‌' అనగానే మేం పడ్డ సంబురం ఇప్పుడు మాటల్లో చెప్పలేనిది.

ఎక్కడో మారుమూల ప్రాంతంలో స్కూల్‌కి వెళ్లడానికే ఆపసోపాలు పడ్డ నేను ఇప్పుడు తెలంగాణ ఐటీలో ఒక స్థాయికి ఎదిగాను. లక్ష్యానికి సంబంధించి ఆలోచనలు చిన్నప్పుడే వస్తాయి ఎవ్వరికైనా. కాకపోతే వాటిని క్యాచ్‌ చేయగలగాలి. అది నేను ఇంటర్‌ అయిపోయిన వెంటనే చేశాను కాబట్టి, ఇంతవరకు రాగలిగాను. సక్సెస్‌ కాగలిగాను. కేసీఆర్‌గారు అంటుంటారు కదా.. ‘మనిషెప్పుడూ పుట్టిన తర్వాత నేర్చుకుంటడు తప్ప.. నేర్చుకొని పుట్టడు’ అని. అది వందకు వందశాతం నిజం. నా లైఫ్‌ జర్నీయే దానికొక ఉదాహరణ.

లండన్‌ అనుభవం 


సీఎంఎం ఐటీ కంపెనీలో నేను అసోసియేట్‌ వరకు ఎదిగాను. ఆన్‌సైట్‌ అవకాశాల కోసం విదేశాలు కూడా వెళ్లాల్సి వచ్చింది. మూడు సంవత్సరాలు లండన్‌లో ఉన్నాను. ప్రపంచ అత్యుత్తమ బీమా కంపెనీలో పనిచేశాను. అక్కడ కూడా ఖాళీగా ఉండలేదు. మన సంస్కృతీ.. సంప్రదాయాలకు జీవం పోస్తూ ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేశాం. కానీ ఎంతోకాలం లండన్‌లో ఉండలేకపోయాను. మనం తెలంగాణ కోసం ఎంత ఫైట్‌ చేశాం. ఉద్యమంలో ఎందర్ని భాగస్వాములను చేశాం. అంతచేసి తెలంగాణ ప్రగతిని చూస్తూ ఉండాలి కానీ.. దూరంగా వెళ్లిపోతే ఎలా అన్న ఆలోచనతో ఇండియాకు తిరిగొచ్చేశాను. నా ఐడియాలకు ఒక రూపం ఇస్తూ తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఒక సంస్థను ఏర్పాటుచేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. నా ప్రతీ మలుపులోనూ నాకు వెన్నంటి ఉంటున్న నా తమ్ముడు జగన్‌.. భార్య దీపతి.. నా పిల్లలు మెచ్చుకునేలా ఆ పని ఉండాలనుకుంటున్నాను. ఉంటుంది కూడా. logo