సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Aug 09, 2020 , 00:25:23

చెంచాడు చెన్నంగి పచ్చడితో..

చెంచాడు చెన్నంగి పచ్చడితో..

ఐతారం దావత్‌ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వేరు. ఇక్కడి రుచులూ అభి రుచులూ కూడా వేరు. కాకపోతే, కాలంతోపాటు కొన్ని కనుమరుగవుతూ ఉంటాయి. అలాంటి కొన్నింటిలో చెన్నంగి పచ్చడి ఒకటి. చెన్నంగి ఆకులు సకల పోషకాలకూ చిరునామా. ఇక పచ్చడి తిన్నామా.. అదిరిపోవాల్సిందే!

  • చెన్నంగి మొక్క ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. కాబట్టి, దీనికి నీళ్లు పెట్టాలనీ, ఎరువులేసి పెంచాలనీ ఉండదు. ఒకప్పుడు పొలాల గట్ల మీదా, తుప్పల మీదా కనిపించేవి. ఒకసారి పచ్చడి పెడితే, వారం వరకూ నిల్వ ఉంటుంది. కాబట్టే, పొలం పనులు చేసేవారు ఈ పచ్చడిని సద్దితో తీసుకెళ్లేవాళ్లు. 
  • ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో, పల్లెల్లో తరచూ చెన్నంగి పచ్చడి చేసుకుంటారు. ఈ ఆకులను పొడి చేసి నిల్వ పెట్టుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు  నోటికి రుచిగా ఉంటుంది. పత్యంగా కూడా తినిపిస్తారు. 
  • కడాయిలో నూనె పోసి జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. వీటిని వేరుగా తీసుకోవాలి. దీంట్లోనే మరికొద్దిగా నూనె పోసి ఆకులను పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి. దీన్ని చల్లార్చి, ముందు వేయించుకున్న వాటితో కలిపి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టి పచ్చడిలో కలిపితే సరిపోతుంది.
  • బాలింతలకు చెన్నంగి పచ్చడి పెట్టడం ఆనవాయితీ. దీన్నే కసివింద పచ్చడి అనీ, సెర్నా పచ్చడి అనీ  పిలుస్తారు. దీని గింజలను నీగ్రో సెర్నా అని పిలుస్తారు. 
  • ఆ గింజలను పొడి చేసి కాఫీ చేస్తారు. అందుకే, అది పేదవారి కాఫీ పొడి అయింది. 
  • మానసిక శక్తికోసం, గుండెకు బలం రావడం కోసం ఆయుర్వేద వైద్యులు ఇచ్చే మందుల్లో ఈ ఆకును ఉపయోగిస్తుంటారు. చెన్నంగి ఆకు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. జీర్ణశక్తిని ఇస్తుంది. అలాగే మలబద్ధ్దకాన్ని తగ్గిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. చెన్నంగి ఆకులతో తెల్ల కుసుమ వ్యాధి కూడా తగ్గుతుంది. ఎముకల పుష్టికి కూడా ఈ ఆకు ఉపయోగపడుతుంది. పాము విషానికి విరుగుడుగానూ పనిచేస్తుంది.
  • పచ్చడిలో వేసే వెల్లుల్లి బీపీకి మంచి ఔషధం. గుండెపోటును నివారించడంలో వెల్లుల్లి సమర్థంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి వైద్యులు కూడా సిఫార్సు చేస్తుంటారు. ఇందులో యాంటీబయాటిక్‌ లక్షణాలు కూడా ఎక్కువ. అజీర్తి సమస్యలను నివారిస్తుంది. అధిక రక్తపోటు కలిగిన వారికి నువ్వుల్లోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో నువ్వులు చాలా మేలు చేస్తాయి.  
  • పచ్చడిలోని ఆవాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఇందులోని ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. జీలకర్రలోని పొటాషియం బీపీ, గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. చింతపండులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఐరన్‌ గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. ధనియాలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు సహాయపడుతుంది. చెడు కొవ్వును తగ్గిస్తుంది. కరివేపాకులోని యాంటీ హైపర్‌ గ్లిసమిక్‌ రక్తనాళాల్లోని గ్లూకోజ్‌ని కంట్రోల్‌ చేస్తుంది.


logo