గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 08, 2020 , 23:21:02

మంగయ్య అదృష్టం

మంగయ్య అదృష్టం

అదే సమయంలో ఎన్నికలొచ్చాయి. భారతదేశంలో వాటిని గురించి దేవతలకేమీ తెలియదు. ఈ కొత్త ఘట్టం వారికెంతో వాచామగోచరంగా తోచింది. ఐనా పోరాటం సాగించకతప్పదు. ఇంతవరకూ వచ్చాక ఇక తిరోగమనానికి ఆస్కారం లేదు. ఆ కొద్ది సమయంలో అన్ని వివరాలు సేకరించి అన్ని విద్యలూ అభ్యసించవలసిందే. వేరు మార్గమే లేదు.

బ్రహ్మకు ఇతర దేవతలకు మధ్య మొదలైన తగాదాలో మంగయ్య పావులా మారాడు. అతన్ని ఎలాగైనా ఓడించాలని సకల దేవతలూ పాచికలు వేస్తున్నారు, బ్రహ్మ ఆశీస్సులు ఉన్న మంగయ్య అదృష్టం మాత్రం... ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నది. పాము కూడా పూలదండై పలకరిస్తున్నది. ఆ పోరు సాగుతున్న తీరు ఇది..

నిజం చెప్పాలంటే ఇది దేవతల రెండు ముఠాల ప్రాక్సీ యుద్ధమే కాబట్టి ఇందులో అరమరంటూ లేదు. ఉండడానికి వీల్లేదు. అందుకనే ఎంతో ఉపాయంగా దుర్గారావు తానే స్వయంగా మంగయ్యను తన డమ్మీగా అంగీకరించే అట్టు చేశారు. ఇంక వాడెలా పోటీ చేస్తాడు, వెధవ? హమ్మయ్య! బెడద వదిలిపోయింది, వచ్చే ఐదేళ్ళవరకు అనుకున్నారు చివరకు. దుర్గారావు నామినేషన్‌ కాగితాలన్నీ దేవతలు స్వయంగా చూచుకుని, ఎందుకైనా మంచిదని బృహస్పతికి కూడా చూపించి ఆయన క్లియరెన్స్‌ తీసుకుని ఫైల్‌ చేయించారు. ఇంతటితో మంగయ్యగాడి ఆట కట్టిందని ఎంతో ధీమాతో ఉన్నారు.

పార్టీ ఆదేశానుసారం దుర్గారావుకు ‘డమ్మీ’గా మంగయ్య నామినేషన్‌ దాఖలు చేశాడు. స్క్రూటినీ అవగానే అతను ఉపసంహరించుకోవాలి. దుర్గారావు నామినేషన్‌ ఎలాగూ స్వీకరించబడుతుంది. అంత అత్యధిక శ్రద్ధతో తయారుచేయించిన నామినేషన్‌ పత్రంలో ఈషణ్మాత్రమైన పొరపాటైనా, ఉండటానికి వీల్లేదు. ఉపసంహరించుకున్న తరువాత ఇంక మంగయ్యకు మిగిలేదేమిటి? వాడికుండే ప్రాముఖ్యమేమిటి? ఐదేళ్ళు దుర్గారావుకు ఊడిగం చేస్తూ ఉండిపోవలసిందే కదా! వయోవృద్ధులకు మాత్రమే సర్వసాధారణంగా దొరికే ఎం.ఎల్‌.సి. ఈ కుర్రకుంకకెలాగూ దొరకదు.

ఈలోపు దుర్గారావు భార్యతో వీడిటీవల సంపాదించిన ప్రత్యేక సంబంధాన్ని గురించి ఇంతో అంతో కొంతో దుర్గారావుకు తెలిసే ఉంటుంది. ఇలాంటి విషయాల్లో దేశమంతా కోడై కూసినా భర్తకు మాత్రం సాధారణంగా తెలియదనే మాట నిజమైనా, తెలియడమూ తెలియకపోవడమూ మధ్య అనేక మధ్యంతర స్థితులు ఉండవచ్చు. ఐనా, ఎన్నడో అసందిగ్ధంగా తెలియకపోదీ నగ్నసత్యం, అప్పుడేం చేస్తాడు పాపం దుర్గారావు? తలవంపులు తప్పించుకోవాలంటే మంగయ్యను తరిమివేయడంకన్న గత్యంతరం ఏముంటుందాయనకు? అప్పుడు మళ్ళీ స్మగ్లర్లో అంతకన్న భయంకరులో తప్ప దిక్కెవ్వరౌతారు వాడికి? కాబట్టి ఇంతటితో వీడి కథ సమాప్తం, బ్రహ్మదేవుని పరువు ప్రతిష్ఠలు గంగపాలవడం తథ్యం! జై బ్రహ్మ విరోధ దేవతా ముఠాకు జై!

ఈ ఊహాజగత్తులో విహరిస్తూ అమందానందం అనుభవిస్తున్నారు బ్రహ్మేతర దేవతా ప్రముఖులు. అన్ని విధాలా భోగవిలాసాలకు అలవాటుపడ్డ వాళ్ళు కనుక తమ పనేదో విజయవంతం కానుండడం చూచి ఇన్నేళ్ళ శ్రమను ఉపశమింపజేసి కొంత విశ్రాంతి వినోదాల నాస్వాదించడానికని అంగారక గ్రహం పైన ఒక  నిసర్గ సుందర స్థలానికి అప్సరా సమూహ సమేతులై వెళ్ళి హాయిగా గడపడం ప్రారంభించారు.

పాపం, కొద్ది సమయం గడిపారో లేదో దిక్కులు పిక్కటిల్లేటట్టు భూగ్రహం వైపు నుంచి ఒక మహా విస్పోటనం వినవచ్చింది. అటు వైపందరూ దృష్టి సారించి చూచే సరికి అందరూ నిర్ఘాంతపోయే మహా అనర్థం జరిగినట్టు స్పష్టంగా కనిపించింది. అదొక అంగారక ప్రకంపన కారకమైన అనుభవం. ఆ దౌర్భాగ్య గ్రహం భూమి తనపై నివసించే వారికి సుఖం చేకూర్చడమలా ఉంచి ఇతర గ్రహాలకు వెళ్ళి విశ్రమించే వారిని కూడా కలత పెట్టకుండా ఉండదు కదా! అని వాపోవసాగారు... తృప్తిగా సోమపానం చేసి అప్సరాలింగన ప్రమత్తులై ఉన్న ఆ నీలింపులు చిందరవందరైన వస్ర్తాలతో, చింపిర జుట్లతో, ఒడళ్ళంతటా వ్యాపించిన మంటలతో అవమానాన్ని భరించలేని అశ్రుధారలతో... అసలు జరిగిందేమో కనుక్కుందామని అర్ధ నిమీలిత నేత్రాలతో భూగ్రహంలో విరాజిల్లుతున్న భారతదేశం వైపు దృష్టి సారించారు.. ఎంతో అయిష్టంతో అయ్యయ్యో! ఇంతకూ వాళ్ళనుకున్న విజయం వారికి చేకూరనే లేదని తేలిపోయింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పరమశ్రద్ధాసక్తులతో బృహస్పతితో సహా అందరి బుద్ధి కుశలతల నుపయోగించి సిద్ధం చేసి దాఖలు చేయించబడిన అధికార అభ్యర్థి దుర్గారావు నామినేషన్‌ పత్రం త్రోసిపుచ్చ బడి తత్పరిణామంగా మంగయ్యను పార్టీకి అధికారిక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది! దేవతల ‘షాక్‌' అవర్ణనీయమని వేరే చెప్పనవసం లేదు.

“అదెలా సాధ్యమౌతుంది? దుర్గారావు నామినేషన్‌ పత్రంలో లోపమేదీ లేదే” అని అరిచాడొక వేల్పు.

మరొకమారు అందరూ తమ దివ్య దృష్టి తో సూక్ష్మంగా పరిశీలించారు. ఈసారి కూడా ఏ లోపమూ కనిపించలేదు. చివరకు ఎటూ తోచక ‘ఇదీ ఒక రిగ్గింగేమో!’ అన్నాడొకడు.

‘రిగ్గింగా? అబ్బే, ఇలాంటి రిగ్గింగెక్కడా ఎన్నడూ వినలేదే!’ అని ఖండించాడు మరొక దేవత.

ఇంతలో బృహస్పతి కంఠస్వరం వినవచ్చింది. “మిత్రులారా! ఇది రిగ్గింగనేది ముమ్మాటికీ నిజం. మానవ మాత్రులింతవరకు కని పెట్టి అమలు చేస్తున్నది ఓటుపత్రం రిగ్గింగు మాత్రమే. కానీ బ్రహ్మదేవుడుగారి శాఖవారు ప్రప్రథమంగా నామినేషన్‌ పత్రపు రిగ్గింగనే సరిక్రొత్త కళను కని పెట్టారు. వాళ్ళు నిజంగా చేసిందేమంటే నామినేషన్‌ పత్రాన్నే మార్చేశారు. తత్‌ స్థానే తప్పులతడకైన మరొక పత్రం రిటర్నింగాఫీసరు ముందుకు తేబడింది. అసలు పత్రం మాయమైంది కనుక మనమేమీ రుజువు చేయలేం!”

నిరాశాపారావారంలో మునకలు వేస్తూ, నయా పైసలంత మొహాలతో, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, వెంట వచ్చిన అప్సరసలను, సోమరసభండారంతో పాటు పరాయి గ్రహం పైనే వదిలేసి వాళ్ళ అతీగతీ పట్టించుకోకుండా దేవతలందరూ హడావుడిగా భూమండలానికి పరుగు తీశారు. పాపమా అప్సరసలతో అంగారక గ్రహ నివాసులెలా వ్యవహరించిందీ తెలియలేదు. సోమరసభండారం మాత్రం అనతి కాలంలోనే అంతా మాయమైనట్టు కానవచ్చింది.

మంగయ్య పేరు ఊరూరా అప్పుడే గోడల మీదికి అధిరోహించింది. పాపం దుర్గారావుకు ముక్కు నేలకు రాసినంత పనైంది. ఒకవైపు తన భార్య మంగయ్య కోసం అహర్నిశలు పనిచేస్తూ, తనతో కూడా చాకిరీ చేయిస్తూ ఉంటే అవర్ణనీయమైన అవమానం భరిస్తూ ఇక రాజకీయ సన్యాసం తప్ప మరో ఆలోచనే లేకుండా పోయిందా పెద్దమనిషికి. ఏంచేస్తాడు మరి? ఆయన దురవస్థ చూచి తెలిసిన జనమంతా, చిరునవ్వులు నవ్వుతున్నారు. దుర్గారావు చేయగలిగిందల్లా సిగ్గు చంపుకోవడం మాత్రమే!

మంగయ్యకు ఇన్ని విధాల అనుకూలంగా పరిస్థితులు రూపొందినా ఎన్నికల్లో మాత్రం అనుకున్నంత కలిసివచ్చే లక్షణాలు కనిపించలేదు. ఎంతో కాలంగా ప్రజలకు సేవచేస్తూ వచ్చిన దుర్గారావుకీ దుర్గతి ఆ మంగడి వల్లనే పట్టిందనిన్నీ, మీదుమిక్కిలి పైకి ఎవ్వరూ మాట్లాడకున్నా అందరికీ తెలిసిన దుర్గారావు ఇంటి లోపలి గుట్టు పెద్దవారందరికీ మంగయ్య పై మరింత ఆగ్రహాన్ని కలిగించింది. దుర్గారావుకి పట్టించిన గతి వాడు మనకేం గతి పట్టిస్తాడో అనే దిగులు కూడా ఎందరినో పట్టుకుంది. కాకిపిల్ల కాకికి ముద్దయితే, ఎవడి భార్య(కనీసం) వాడికి అంతే అవడం సహజమే కదా! కాబట్టి స్వభార్య రక్షణ తత్పరులైన ఎందరెందరో మంగయ్యను వ్యతిరేకించారు.

మంగయ్యను ఓడించే ప్రయత్నంలో బ్రహ్మవిరోధ ముఠా దేవతలు వాడికి వ్యతిరేకంగా అన్ని విధాలా ఒక యోగ్యుడైన ఒక స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించారు. పరమయ్య అనే ఆ అభ్యర్థికి అన్ని హంగులూ ఉన్నాయి... డబ్బు, పెద్ద సంఖ్యలో కులబలం, అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం, అత్యున్నత విద్యాబుద్ధులు, ప్రజా సేవకై ప్రసిద్ధికెక్కిన కుటుంబ చరిత్ర ఇత్యాదులన్నీ.. ఇన్నింటితోపాటు ప్రస్తుత ఎన్నికల్లో మంగయ్య విరోధులైన దేవతల అనుగ్రహం పరమయ్య మీద ఇంతా అంతా కాదు. లక్ష్మీదేవి అంతకుముందెన్నడూ ఎవ్వరూ పెట్టనంత ఖర్చు పరమయ్య ఈ ఎన్నికల్లో పెట్టేటట్టు ఆయన మీద కనకవర్షం కురిపించింది. ఇదివరలో ఒక్కొక్క వోటుకు మహా అయితే వంద రూపాయలిచ్చే లక్ష్మీపుత్రులు అభ్యర్థులుగా ఉన్నారంటేనే అబ్బురమనిపించదు. ఇప్పుడు తన పుత్రులను తలదన్ని సాక్షాత్‌ లక్ష్మీదేవి తాను అనుగ్రహించి పరమయ్య ప్రతి ఓటుకు కొన్ని వేల రూపాయలు మంచినీరూ కాక, ఉప్పునీరైనా కాక, మురికినీటి ప్రాయంగా ఖర్చు పెట్టే అట్టు ఆశీర్వదించింది.

పరమయ్య ప్రాభవం మొదట ఆయన నామినేషన్‌ దాఖలు చేసిననాడే అందరి కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ అనేకులు మూర్చపోయే అట్టు చేసింది. నామినేషన్‌ పత్రం దాఖలైనప్పుడు దేశంలో ఎన్నికల చరిత్రలోనే కనీవినీ, చివరకు ఊహించైనా ఎరుగని జనసమూహం భూనభోంతరాళాలు దద్దరిల్లే అట్టు హర్షధ్వానాలు చేస్తూ గుమిగూడింది. ఏ వైపు చూసినా, ఆ జన సముద్రం క్షితిజానికి అవతలి వరకూ ఓలలాడుతున్నట్టే కనిపించింది. మరుసటి రోజు పత్రికల్లో మొదటి పేజీలు మొత్తం ఆ పరమయ్య భక్త సమూహంతోనే ఓతప్రోతంగా ప్రత్యక్షమయ్యాయి. 
logo