శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 08, 2020 , 23:14:22

ఒక బతుకమ్మ కథ

ఒక బతుకమ్మ కథ

బతుకమ్మ కోరిక అసాధారణమైంది ఏం కాదు. అయినప్పటికీ తన కోరిక తీరుతుందనే నమ్మకం ఏమాత్రం లేదు.  ‘అది తీరకుంటనే నా చెత్త మట్టిలో కలిసిపోతే నా బతుకే దండుగ’ అనుకుంటూ కాలం గడుపుతున్నది. ఆమెకు ఇప్పుడు డబ్భు ఏండ్లు దాటాయి.

దగ్గరి బంధువులతో కోరిక విషయమై ఎన్నోసార్లు చెప్పుకుంది, కానీ ‘అబ్బో..నీ కొడుకులకూ కోడండ్లకు చెప్పితే వింటరా..మా మీదికి లొల్లికే వత్తరూ.. మా ఇంటి ముచ్చట మీకేం పట్టి అంటరు’ అన్నారు.

బతుకమ్మ అత్తగారింట్లో అడుగు పెట్టినప్పటి నుండీ ఇప్పటివరకూ పరిస్థితులకు రాజీపడిందే తప్ప, తన కోర్కెలు తీర్చుకునేందుకు ఏనాడూ తాపత్రయ పడ్డది లేదు. ఆమెకు ఏడుకొండలవాడంటే  మహాభక్తి. తిరుపతికి వెళ్లి స్వామిని కనులనిండా దర్శనం చేసుకొని తరించాలనీ పట్టుచీర కట్టుకోవాలనీ ఎంతో ఉండేది. ఆ పచ్చని కోరికలు ఎప్పటికప్పుడు ఎదురొచ్చే అవసరాలకు మోడుబారి, కష్టాల గాలిదుమారాలకు నేలకూలి, పేదరికపు చెదలకు బలై నామరూపాలు లేకుండా పోయాయి.

బతుకమ్మ పెనిమిటి నారాయణ, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, అతడి వెనుక ఇద్దరు చెల్లెండ్లు ఉన్నారు కానీ, అతడికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు శూన్యం. అతడు బట్టల కొట్టులో గుమాస్తా, నడుముకు చుట్టూ రాని తువ్వాలు లాంటి జీతం, ఆడబిడ్డలు బడికి వెళ్తే ఇంటెడు చాకిరీ చేస్తూ ఉండేది. ఆమె సహనాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారూ బంధువుల నుండి మన్ననలు లభించాయి. ఆడబిడ్డల పెండ్లిండ్లు, కాన్పులూ, రాకపోకలూ, సంప్రదాయాలూ, ముగ్గురు కొడుకుల పోషణా, వారి చదువులూ, అప్పులూ ఆందోళనలూ, అనారోగ్యాలూ, అత్తామామల అవసానదశా, వారి చావులూ, అన్నింటినీ ఎదుర్కొంటూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చింది. నగ్నపాదాలతో ముళ్ళ బాట జీవితాన్ని ఇప్పటి వరకు కొంత పూరిస్తూ వచ్చింది. మిగిలిన ఖాళీని తన కోరిక తీర్చుకొని భర్తీ చేసుకోవాలని అనుకుంటున్నది.

బతుకమ్మ కొడుకులు ముగ్గురు. మొదటి వాడు జనగామలో, రెండోవాడు కాజీపేటలో, మూడో వాడు వరంగల్లో ఉంటున్నారు. ఎవరి సంసారాలూ వారివి. ఎవరి కష్టసుఖాలు వారివి. ఎవరి స్వార్థ్ధాలు వారివిగా జీవిస్తూ ఉన్నారు. బతుకమ్మ ప్రతి నెలా ఒకరివద్ద ఉంటూ కాలం గడుపుతున్నది.

ఈ రోజుతో చిన్న కొడుకు వద్ద వ్యవధి ముగిసిపోతోంది. రేపు ఉదయం పెద్దకొడుకు వద్దకు వెళ్లవలసిందే.

కలికి గాంధారి వేళా...కీచురాళ్ల రొద నిరాటంకంగా మోగుతున్నది.

బతుకమ్మ గోడకు ఒరిగి కూర్చొని ‘మల్ల ఈడీకి ఒచ్చేదాక నేను బతుకాలే..ఈడనే నా పానంబోవాలే...ఏడుకొండల ఎంకన్నా...జెర నా మొర ఆలకించు తండ్రీ..’ అంటూ చేతులు జోడించి గాలిలోకి ఎత్తింది.

ఆమె నిస్సహాయతా ఆందోళనా రాబందై గుండెను చీల్చేస్తూ ఉంటే కనుగుడ్లు తల్లడిల్లి ద్రవించాయి. కండ్ల కొలుకుల మత్తళ్ళు దాటి, ముఖం మీద జీవితం తోడిన కాలువల్లోంచి అశ్రుధారలు పరుగులు తీసి కుడిచేయి మట్టమీద రాలాయి. ఆమె దుఃఖాన్ని తాగేసిన చీకటి మత్తులో బందీ అయిన వీధికుక్కలు రోదిస్తూ ఉన్నాయి. మది చెదిరిన వేపచెట్టు ఆకుల్ని రాల్చుకుంది. ఆ విషాదాన్ని చూస్తూ ఉన్న తూర్పు రొమ్ము బాదుకుంటూ గొళ్ళున తెల్లవారింది. 

బతుకమ్మ చిన్నకొడుకు పండ్లు తోముకుంటూ ఉన్నాడు.

‘లచ్చినారీ’ జీరగొంతుతో  పిలిచింది    బతుకమ్మ.

             ‘.... ... ...’

‘ ఓరి లచ్చినారీ..’ గొంతు పెంచింది.

            ‘.... ... ...’

‘ అరేయ్‌ లచ్చినారీగా..’ మరింత పెంచింది గొంతు.

అతడు ‘త్తుపుక్‌' మంటూ ఉమ్మాడు.‘ ఏందే.. నీయమ్మా..పొద్దుగాలనే ఏమో ఎత్తిపోయినట్టు లేసి కూసున్నవ్‌.. ఒకటే పిల్సుడు పిలుత్తానవ్‌' అంటూ విసుక్కున్నాడు.

‘ అయ్యా.. నా జీవి యాడబోయినా ఈడీకే ఏసుకచ్చి మీ నాయిన దాపుకే పెట్టాలె బిడ్డా..’ 

అంది బతుకమ్మ.

‘ నీయవ్వా.. నీ సావు పాడుగానూ..జనగామ నుంచి కాజీపేట నుంచి పీనుగ ఏసుకచ్చుడంటే ఉత్తగనే అయితాదే..ఇది కిరాయి కొంపాయే.. ఈడనేమో మీ ముసల్దాని పానం ఇంట్ల పోకుంట సూసుకో..లేకుంటే ఇల్లు కాలిజేయి అనవట్టే.. నాదేమో ఎల్లీ ఎల్లని సంసారమాయే..ఇంత తక్కువల ఇల్లు మల్ల యాడ దొరుకది..నీ పానం ఈడ పోవొద్దని దేవునికి నిత్తే మొక్కుతానవ్వా..ఏ అన్నగాడు పైస ఇచ్చేటట్టు లేదు..వాళ్ళది కూడ నా లెక్కనే ఉండే...నా మెడకే పడుద్దని దమదమ కావట్టే.. సచ్చినంక సెత్త యాడబోతే ఏందే అవ్వా..ఏమో తగని కోరిక కోర వడితివీ..’ అంటూ నుదురు కొట్టుకున్నాడు.

‘ ఏందవ్వ.. ఏమన్న కోట్లు సంపాయించి పెట్టినవా..సచ్చిన్నాడు నోట్లే పెడుదామంటే నల్ల బూసల్ల తెల్లరాయి లేదు..ఆలుమొగలు ఏరు సంసారం బెడితిరి.. అన్ని నాకి కూసుంటిరీ..బొంబాయికి బీమండికి బతుకపోయినోళ్లు శవాన్ని ఈడిదాక ఏసుకచ్చుకుంటరా...ఇయ్యల్ల ఈడికెళ్లి పోయినవంటే మల్ల వంతు వరకు ఈడికి రావద్దనే కోరుకుంటాన్న..ఏమన్న సంతపిల్లున్నదా..కిరాయికొంప.. ఏరుగుళ్లు ఉచ్చలు పోసుకుంటే ఎవరు చెయ్యాలె.. ఏదో జీవి పోయిన కాడికచ్చి తలగోరు పెడతడు...వత్తడు..’ అంది చిన్నకొడలు.

‘ ఏందవ్వా..ఏందో మబ్బులనే లొల్లికే కూసున్నావూ..పరాకత్గా..పో..నువ్‌ చెప్పుకున్నోల్లను ఒచ్చి చెయ్యిమనుపో నీ సావు..ఓ..జాగలు బంగ్లాలు సంపాయించి ఇచ్చినోల్లనే మెడలువట్టి నూకుతాండ్లు అవుతలికి..నీకు గంజిపోసుడే ఎక్కువ..ఈడనెల ఆడనెల ఉండుకుంట కాలమెల్లదియ్యక ఏందవ్వా.. సచ్చినంక షెత్త యాడబోతే ఏమున్నది..’ అంది చిన్నకొడలు.

బతుకమ్మ తలవంచుకొని కూర్చుంది.

‘నీ యవ్వా..ఓ...నా పెనిమిటి దాపున్నే పెట్టాలె.. నా అత్తమామల బొక్కలు పోయిన కాన్నే నా బొక్కలు పోవాలే... ఓ..లేకుంటే నా బతుకే దండుగ..జెర మీరు నా కొడుకులకు చెప్పాలే.. అని యెదురైనోల్లకల్ల చెప్పవడితివీ..నా ఇజ్జతి తీసి పెంటమీద ఎయ్యవడితివీ..చెప్పెటోడు పైసి త్తడా..పరికిత్తడా..చెప్పేటానికేమున్నదీ..ఎవ్వడైనా చెప్తడూ... ఏదీ నా ముందటికి రమ్మనూ..’ అన్నాడు చిన్నకొడుకు.

‘అవును బిడ్డలాలా..మీకు మీ పెండ్లాలకు చెప్పే దమ్ములు ఎవలకు లెవ్వు’ అంది బతుకమ్మ.

‘ఏందవ్వా..ఏందో మబ్బులనే లొల్లికే కూసున్నావూ..పరాకత్గా..పో..నువ్‌ చెప్పుకున్నోల్లను ఒచ్చి చెయ్యిమనుపో నీ సావు..ఓ..జాగలు బంగ్లాలు సంపాయించి ఇచ్చినోల్లనే మెడలువట్టి నూకుతాండ్లు అవుతలికి..నీకు గంజిపోసుడే ఎక్కువ..ఈడనెల ఆడనెల ఉండుకుంట కాలమెల్లదియ్యక ఏందవ్వా.. సచ్చినంక షెత్త యాడబోతే ఏమున్నది..’ అంది చిన్నకొడలు.

‘అవ్వా..ఇన్నన్ని చాయబొట్లు అది పొత్తది.. తాగి సక్కగ జనుగామ్‌ బస్సెక్కు.., లొల్లి పెట్టకు..ఎవలన్నింటే ముసల్దాన్ని గోస పెట్టుకుంటాన్లు అనుకుంటరు..’ అన్నాడు చిన్న కొడుకు.

‘కుక్కల కొడుకులు ముగ్గురు బదురుకున్నారూ..మీ చాయబొట్లొద్దూ...మీ బుక్కెడు బువ్వొద్దూ.. నేను ఎవ్వనింటికి పోనూ..నా సావేదో నేనే సత్తా..’ అంది బతుకమ్మ.

‘ఏ..పో..అవ్వా పో..నీకు పించను ఒత్తదని బిర్రు..’ అంది చిన్నకోడలు.

      ‘నీ అడ్డమైన మొకంల ఉచ్చపొయ్య..ఆ పించను ఆ కారటు నాకేమెరుకనే..ఆ పైసల మొకము నాకేమెర్క.. ఎవ్వని దగ్గరుంటే వాడే తీసుకోవట్టే..’ 

‘బరాబరి తీసుకుంటరూ..ఏమన్న ఎకురాలకొద్దీ సంపాయించి ఇచ్చినవా..మేమేమన్న పండిచ్చుక తింటన్నమా..’

‘ అయ్యో..సాలెనుక సాలున్నదే బిడ్డా.. నీకిద్దరు మొగ పోరాగాండ్లున్నరు.. రేపు మూతిమీద తంతరుండు.. నాకు ముందట నీకు ఎనుక’ 

అంది బతుకమ్మ.

ఊతకర్రా సంచీ పట్టుకొని నడుస్తున్నది 

బతుకమ్మ.

‘బంగారమసొంటి మనిషి.. నడితొవ్వల కాటగలిపే...ఆయిన జాగల ఆయన పాయే..ఆయినొక్కడుంటే నాకు గీ గోస ఎందుండు..యాన్నన్న మారాజోలె.. ఇంత వాచిమేను కొలువు చేసు..వండుకోని ఉన్నదో లేనిదో తిని మలుసుక పంటుమూ..కోతిమీరికి ఉప్పు నిరపకాయకు సుత అవుతలికి తోలక పోవు..ఇప్పుడు కోడల్దాని తోటి గిన్నిగిన్ని మాటలు పడవడితిని...కోతకు అమ్మిన గోదోలే ఐపాయే నా బతుకు..’ అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది.

 ‘బతుకమ్మా...నాకేమన్నై గిట్ల జప్పన సచ్చిపోతే ఎట్ల బతుకుతవే...బస్టాండ్ల ఇడిచి పెడితే తొవ్వ పట్టుకోని సక్కగ ఇంటికొచ్చే తెలివి లేకపాయే..ముగ్గురు మూన్నెల్లు ఉండుమంటే...ఆడికి ఈడీకి ఎట్ల తిరుగుతవే...ఏమోనే నిన్నిడిసి నా పానం తుర్తిగ పోదు’ అనేవాడు నారాయణ.

 ‘అబ్బో..నీ కండ్ల ముంగట నేనే పోవాలే..పోతగూడ...పుట్టెడు రోగాల పుట్టను నేను..అయినా ఈ బట్టేవాజి కోడండ్లతోటి నేనేడ నెగ్గుత.. నువ్వయితే ఎవ్వల నొప్పియ్యకుంట నిబాయించుకొత్తవు...ఏడుకొండలసామికి నిత్తె మొక్కుతాన..నాకు ముత్తైదసావు రావాల్నని..’ అనేది బతుకమ్మ.

*  *   *

బతుకమ్మ  శ్మశాన వాటికకు చేరుకున్నది. నారాయణ ఖనన స్థలానికి దూరంగా కర్రా సంచీ కింద పెట్టింది. పాదాల మీద కూర్చుంది.

‘నాయనా.. ఈడ ఇల్లుకట్టుకొని నిమ్మలంగున్నవా.. నాయనా... నన్నే ఆగం జేసినవా నాయినా... నా పానంబోయినంక నీ దాపుకే పెట్టుమని అడిగిన... వెండి బంగారం అడిగిన్నా...ఏం కొడుకుల సాదినవు నాయినా... ఏం కోడండ్లను తెచ్చుకున్నవు నాయినా.. అత్తమామ తోటి ఆడిబిడ్డల తోటి నీతోటి సుత ఒక్కమాట పడకపోతి...వీల్లతోటి మాటలు పడితిని..పానం దస్సుమనవట్టే నాయినా... ఇప్పటికిప్పుడు సీతమ్మని మింగినట్టు బూమి పగిలి నన్ను మింగినా మంచిగుండు అనిపియ్యవట్టే...... ....’ తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది.

ఒంటిగంట దాటింది. రోడ్డుమీదకి వచ్చింది బతుకమ్మ. ఐదు రూపాయల భోజనం తీసుకుంటూ ఉంటే జామకాయల గంప నెత్తిన పెట్టుకొని వెంకటమ్మ పరీక్షగా చూస్తూ ఉంది.

‘ బతుకమ్మ వదినే... ఏంది గీడికి వచ్చినవూ..’ అంటూనే  వెంకటమ్మ కూడా భోజనం తీసుకుంది.

బతుకమ్మ విషయమంతా ఏడుస్తూ చెప్పింది. ఇద్దరూ కలిసి శ్మశానం వెనుకగల శివాలయానికి వచ్చారు.

‘అయ్యో వదినే... మా ఇంటి పక్కన ఉన్నప్పుడు పొలగాల్లు చిన్నగ ఉండిరి.. అన్నా నువ్వు మస్తు గోస పడ్డరు.. ఈ కాలం బాడుకావులు ముండలూ గిట్లనే తయారయిండ్లు.. గందుకే నేనెవ్వలకు చేయి చాపకుంట గీ గంప పెట్టుకొని తిరుగుతాన..ఈ గుల్లెనే మలుసుక పంటన్న... నువ్వు ఏడవకు.. నీకిన్ని జామకాయలు పోపిత్త.. ఈ పక్కకే బడి ఉన్నది. ఆడ పెట్టుకొని కూసో.. నీ బువ్వ కుక్కలు తినయి..’ అంది వెంకటమ్మ.

రెండు రోజులుగా బతుకమ్మ జామకాయలు అమ్ముతున్నది.

పెద్దకొడుకూ చిన్నకొడుకూ వచ్చారు.

‘అవ్వా ఏందే..యెనుకులాడీ యెనుకులాడీ తకాయించి పోతిమీ... సావుదాలక మమ్ముల బదునామ్‌ చెయ్యవడితివీ... మాకు సాలీసాలని జీతాలాయే.. ఎల్లీఎల్లక ఏదో అంటమూ.. నిన్నుగాక ఎవలనంటమే.. పెండ్లాలనంటే లొల్లి అయితది కాదే..’ అన్నాడు పెద్దకొడుకు.

‘నేను మీకు లచ్చలు కోట్లు సంపాయించి ఇయ్యలేదు కొడుకులాలా..ఇచ్చినోల్లనే మెడలువట్టి నూకవట్టిరీ... నేను మీకు బుక్కెడు కూడుకు బరువైతున్న...నా సావుకే ఎదురుసూడ వడితిరి.. ఇగో వెంకటమ్మత్త బతుకుత లేదా...నేను గిట్లనే బతుకుత.. కాల్లురెక్కలు ఆడినన్ని దినాలు ఈడ ఉంట..నాకు అత్త సోపతున్నది.. నేను కింద పడ్డనాడు మీరు కాకపోతే మంది అయితరా..నన్ను పారేసేది మీరే కదా బిడ్డా..ఈడనే నా పానం పోతది...జెర మీ అయ్యదాపుకే పెట్టుర్రి’ అంది బతుకమ్మ.

‘నిన్ను నాయిన దాపుకే పెడుతంగని.. ఇంటికి పా..పోదాం..’ అంటూ చిన్నకొడుకు చేయి పట్టుకున్నాడు.

‘నేను రాను బిడ్డా..ఈడ మంచిగనే ఉన్నది. ఇన్నన్ని పండ్లు అమ్ముకుంటాన...పొద్దంత బడి పిల్లగాల్ల తోటి పొద్దుపోతాంది, శీకటైతే అత్తమ్మ తోటి ఎనుకటి ముచ్చట్లతోటి నిర్ద పడుతాంది.ఈ గోడ మీదికెల్లి సూత్తే మీ అయ్య బొంద కనపడుతాంది. ఆయన కండ్ల ముందట ఉన్నట్టుంది’ అంది బతుకమ్మ.

‘నీ యవ్వా..ముచ్చట్లు బాగానే చెప్తానవు గనీ పా..’ అన్నాడు పెద్దకొడుకు.

‘ఓ..కొడుకా.. ఉండనియ్యిపో.. నాకు సోపతి ఉంటది పో.. మీ అవ్వని నేను కంటికిరెప్పలెక్క సూసుకుంటా పో..మీకు బుద్ధిపుట్టినపుడల్ల రాండ్లి.. కాయో పండో పట్టుకోని రాండ్లి..’ అంటూ వెంకటమ్మ నచ్చ చెప్పింది.

ఇద్దరూ వెళ్లిపోయారు.

‘వదినే... కొడుకుల మనుసు తండ్లాడుతదీ

....మొగబాయిగాండ్లు ఊకే ఇల్లుపట్టుకొని ఉంటారూ...ఏందో శాత్రముండే సూడు.. కోటి వరాలు బోసినా కోడలు బిడ్డగాదూ.. అల్లుడు కొడుకు గాడూ.. అని..రేపు మంచంల పడితే కోడలు బిడ్డ చేసినట్టు చేత్తదా..ఆషేది..కొడుకు తండ్రికి చేత్తడేమో...తల్లికి ఎట్ల చేత్తడు...కాల్లు రెక్కలు ఆడంగనే పోవాలే..’ అంది బతుకమ్మ.

‘అంతే వదినే..అనుకుంటం కని ఎట్ల రాసున్నదో..’

‘అబ్బో..నీ కండ్ల ముంగట నేనే పోవాలే..పోతగూడ...పుట్టెడు రోగాల పుట్టను నేను..అయినా ఈ బట్టేవాజి కోడండ్లతోటి నేనేడ నెగ్గుత.. నువ్వయితే ఎవ్వల నొప్పియ్యకుంట నిబాయించుకొత్తవు...ఏడుకొండలసామికి నిత్తె మొక్కుతాన..నాకు ముత్తైదసావు రావాల్నని..’ అనేది బతుకమ్మ.

‘మా పెద్దకొడుకు ఉండే కాడ ఒగ ముసలవ్వ మంచముల పడ్డది.. బోడగుండు చేపిచ్చింన్లు.. కోడలూ ఒగ తిట్టుడు గాదూ.. ఒగ గునిపిచ్చుడు గాదూ.. చెంపలు పిండుతదీ.. నెత్తిమీద మొట్టకాయలు ఎత్తది.. ఆ గోస ఎవలకు రావొద్దు వదినే...మనుసు ఒక్క షిత్తం చేసుకోవాలే.. ఏదన్న మింగి పానం దీసుకోవాలే..’ అంది బతుకమ్మ.

రోజులు గడుస్తూనే ఉన్నాయి..సీజన్లో దొరికే

పండ్లు అమ్ముకుంటున్నది. కొడుకులు పలుకరించి పోతూనే ఉన్నారు.

*  *   *

‘ వెంకటమ్మ వదినే..నీ ధైర్నం ఉండుట్ల ఆరునెలల సంది ఇంత బ్యారం చేసుకున్న..ఇంత నీడ సూపిచ్చినవు..తోడబుట్టిన తోడోలే ఉన్నవూ..

ఎవలకు చెయ్యి చాపకుంట బతికినా.. ఒగ పదియెను వెయిల దాకా కూడినయి..సావు కరుసుకు మాగున్నయి...కొడుకులు కోడండ్లు నువ్వా నేనా అని తన్నుకునుడు ఉండది. బొందల గడ్డ సుతం దగ్గరనే ఉన్నది. మంచిదినం సూసుకోని ఎప్పుడు పానమిడిసినా రందిలేదు..నా బొడ్లే సంచిలనే పైసలున్నయి... మీ అన్న దాపుకే పెట్టుమని షెప్పు.. పుణ్యముంటది వదినే..’ అంది బతుకమ్మ.

‘ నీ పిచ్చి మొకంగాల...ఏ..ఊకో... ఉసిరిత్తోలే ఉన్నవూ... మనుమండ్ల పెండ్లి సూడవా... సచ్చినవుతీ..సామదోడ్లే పడి... ఏ..మల్లగిట్ల అనేవు...’

‘అంతేంటవా వదినే..నీ నోటి వాక్యాన అయితే నీ నోట్లే షెక్కరి పోత్తగనీ.. సరేగనీ రేపు మా ఆడిబిడ్డ ఇంటిదాక పోయెత్త.. జెరన్ని పండ్లున్నయి..నీ గంపల పోసుకో.. పొద్దూకే వరకు వత్త ’ అంది.

తెల్లవారింది...

వెంకటమ్మ బేరానికి వెళ్ళింది.

బతుకమ్మ శ్మశానానికి వెళ్ళింది. నారాయణ ఖనన స్థలం మీది జిల్లేడు చెట్టూ పిచ్చి మొక్కలూ  పెరికివేసింది, దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది. దానిమీద ఒరిగి తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. కొద్దీ నిమిషాల్లోనే ఆమె గొంతు మూగపోయింది. శరీరంలో చలనం శాశ్వతంగా ఆగిపోయింది.