శనివారం 08 ఆగస్టు 2020
Sunday - Aug 02, 2020 , 00:38:02

స్నేహం.. ఒక సైన్స్‌!

స్నేహం.. ఒక సైన్స్‌!

నాన్న కొట్టాడన్న బాధలో ఏడుస్తుంటే... భుజానపడ్డ చేయి వాడు. టీచర్‌ తిట్టినందుకు క్లాస్‌ అంతా నవ్వుతుంటే... ఓదార్చిన జాలి వాడు.అన్నతో గొడవ పడినా, అమ్మాయి ఛీ కొట్టినా... జీవితంలో ప్రతి కష్టానికీ కౌన్సిలర్‌గా నిలిచేవాడు. రాకూడని మరణం ఇంటిని పలుకరిస్తే... జరగాల్సిన కార్యక్రమాల కోసం ముందుండేవాడు. అదీ ఇదీ అని ఏముంది! నాకు ఒక తోడు కావాలి అన్న ప్రతిసారీ... గుర్తొచ్చే గమ్యం వాడు.  పేర్లు వేరు కావచ్చు కానీ... స్నేహితులుగా ఎవరో ఒకరు మన జీవితాన్ని దగ్గరుండి నడిపించే ఉంటారు. ఆడామగా, చిన్నాపెద్దా, బీదాగొప్పా...లాంటి తారతమ్యాలు ఆ బంధంలో అసందర్భమే. ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా జిగిరీ దోస్తులకు జేజేలతో..

ఫ్లాట్‌ తలుపు తీయగానే ‘ఏం సారూ!’ అని పలకరించేవాళ్లు కావచ్చు, చిరాగ్గా ఉండి ఫోన్‌ చేయగానే ‘చెప్పవే!’ అంటూ కష్టాన్ని పసిగట్టేవాళ్లు కావచ్చు. ఆఫీసులోకి అడుగుపెట్టగానే ‘నిన్న ఏమైందో తెలుసా!’ అంటూ ఊరించేవాళ్లు కావచ్చు. మొత్తానికి స్నేహితుల పలకరింపు లేకుండా గడిచే రోజు పరమ బోర్‌. జీవితమనే పండుగకి దేవుడు స్నేహితుడే! ‘ఏరా’ అన్న ఒక్క పిలుపుతో, బంధాలని మించిన భరోసాని అందించేవాడు. కానీ ఎప్పుడన్నా గమనించారా! మనం స్నేహితులని మరీ ‘టేక్‌ ఇట్‌ ఈజీ’గా తీసి పారేస్తుంటాం. చొరవ వల్లో, చులకనతోనో... ఎక్కడికి పోతారులే అన్నట్టుగా ఉంటాం! ఆ తొందరలోనే ఒకోసారి మాట తూలి అరుదైన మనుషులని దూరం చేసుకుంటాం. నా అన్నవాళ్లు లేకపోతేనేం అనే ధీమాతో ఉంటాం. కానీ మనకు దక్కిన అరుదైన వరం స్నేహం అని వాళ్లూ వీళ్లూ కాదు... ఏకంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మన ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం... ఇలా అణువణువు మీదా స్నేహం ముద్ర ఉంటుందని నిరూపిస్తున్నారు.

ఫ్రెండ్‌షిప్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌

ప్రేమలాగే స్నేహం కూడా తొలి పరిచయంలోనే మొదలైపోతుంది. దీని వెనుక రుజువు లేకపోలేదు. 2014లో నికొలస్‌ క్రిస్టకిస్‌ వెయ్యిమందికి పైగా స్నేహితులను పరిశీలించిన తర్వాత చెప్పిన విషయమిది. వీరి జన్యువులు ఆశ్చర్యకరంగా రక్త సంబంధీకులంత దగ్గరగా ఉన్నాయి. కానీ, రోగనిరోధకశక్తికి సంబంధించిన వ్యవస్థలు మాత్రం వేర్వేరుగా కనిపించాయి. ఇది, అంటువ్యాధులు ఒకరి నుంచి వేరొకరికి సోకకుండా ప్రకృతి తీసుకున్న జాగ్రత్త కావచ్చు. ఈ జన్యుసంబంధ విషయాలన్నీ మన మెదడు గ్రహించేస్తుందట. మన ముక్కుకి సోకే వాసనలు... ఒక వ్యక్తి జన్యువులకి సంబంధించిన క్లూస్‌ అందిస్తాయట. అందుకే కొంతమందిని చూసిన వెంటనే మనసుకు దగ్గరగా అనిపిస్తారు. ఇక ఇద్దరి అభిప్రాయాలూ, అభిరుచులూ కలిస్తే... ఆ పరిచయం కాస్తా గాఢమైన స్నేహంగా మారిపోతుంది.

అలా సాగిపోయే స్నేహం, జీవితాన్ని మార్చేస్తుంది. చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఓ కుర్రాడు పేదరికం కారణంగా సరిగా చదువుకోలేకపోతుంటాడు. డబ్బు లేకపోవడంతో ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. అలాంటి వాడికి ఓ స్నేహితుడు తారసపడతాడు. తనకు తోచిన సాయం చేస్తూ, ధైర్యాన్ని నింపుతూ అండగా నిలబడతాడు. ఈ సీన్‌ జీవితంలోదే అంటున్నారు బ్రిటన్‌ సైకాలజిస్టులు. 400 మందికి పైగా పేద పిల్లలను గమనించినప్పుడు, గట్టి స్నేహితుడిని తట్టుకున్న వారి జీవితాలు మారిపోయినట్టు గమనించారు.

స్నేహం అండ ఉంటే, జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలం అని నిరూపించే ఇలాంటి పరిశోధనలు చాలానే జరిగాయి. డా.రెబెక్కా గ్రాబర్‌ అనే సైకాలజిస్ట్‌ 75 మంది జీవితాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత... వారి స్నేహితులే ఎలాంటి కష్టకాలాన్ని దాటే ధైర్యం ఇచ్చారని తేల్చింది. ఎందుకు? ఎందుకంటే... స్నేహితుల ప్రభావం మన మీద అపారం! ‘ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారు’ అన్నట్టు... మనకి తెలిసీ తెలియకుండానే నేస్తాలకు ప్రతిబింబాలుగా మారిపోతుంటాం. కాలేజి పోరగాళ్లను చూస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. Friends with Academic Benefits అనే నివేదికలో కాలేజీ స్నేహితులు మన చదువునీ, సామాజిక జీవితాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అనుకొనేరు. ఇందులో ఓ కొత్త విషయం కూడా ఉంది. ఈ ప్రభావం తెలిసి తెలిసీ మన అంగీకారంతోనే ఏర్పడుతుందట. కాబట్టి మంచి నేస్తాలను ఎంచుకోవడం మన వంతే! 

నూరేండ్ల బంధం

సాధారణంగా కోతులు కటకటాల వెనుక ఉంటే, మనుషులు వాటిని చూసి ఆనందిస్తుంటారు. కానీ కరేబియన్‌ సముద్రంలోని శాన్‌టియాగో దీవి ఇందుకు భిన్నం. వేల కోతులు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే... వాటిని గమనించే మనుషులు మాత్రం బోన్లలో దాక్కొని చూస్తుంటారు. ఎందుకంటే... అది ఓ ‘మంకీ ఐలాండ్‌'. అక్కడ కోతుల జనాభానే ఎక్కువ. దశాబ్దాల క్రితం భారతదేశం నుంచి కొన్ని కోతులను తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టారు. వాటి స్వరూప, స్వభావాల మీద రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి మంకీ ఐలాండ్‌ హఠాత్తుగా వార్తల్లో నిలిచింది. కారణం! ఏడేండ్ల పాటు అక్కడ ఉన్న ఓ 319 కోతులను గమనించిన పరిశోధకులు అరుదైన విషయాన్ని కనుగొన్నారు. అదేమిటంటే... బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్న కోతుల ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉందట. కోతుల్లో స్నేహం ఏమిటని ఆశ్చర్యపోవద్దు. గుర్రాలు, ఏనుగులు, హైనాలు ఆఖరికి చేపలు కూడా స్నేహం చేస్తాయని ఎప్పుడో తేలిపోయింది. ‘హంప్‌బాక్‌' అనే సొరచేపలైతే స్నేహితులతో కలిసి సరదాగా అలా వేసవి విడిదికి వెళ్లి వస్తాయట. ఇంతకీ అసలు విషయానికి వస్తే... మంచి స్నేహితులవల్ల మన ఆరోగ్యం మీద తెలియకుండానే చాలా ప్రభావం ఉంటుందని చెప్పే ఇలాంటి పరిశోధనలెన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 • నమ్ముతారో లేదో కానీ, స్నేహితులు ఉంటే ఊబకాయం వచ్చే అవకాశాలు తక్కువట. ఎలా అంటారా! బాధలోనో, ఒంటరితనంలోనో ఉన్నవాళ్లు ఆ ఒత్తిడి నుంచి తప్పించుకొనేందుకు నిరంతరం ఏదో ఒకటి తింటూ ఉంటారు. కానీ నేస్తాలు ఉంటే ఒంటరితనం ఎక్కడిది? అదీ విషయం.
 •  స్నేహితులు తక్కువగా ఉన్నవారిలో రక్తపోటు అదుపు తప్పే ప్రమాదం రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు ఓ పరిశోధనలో తేలింది. Psychology and Aging అనే పత్రిక, రక్తపోటు వచ్చే అవకాశాన్ని అంచనా వేసేందుకు స్నేహితులు ఉన్నారా లేరా అన్న విషయాన్ని కూడా పరిగనలోకి తీసుకోవాలని సూచించింది.
 •  ముసలితనంలో జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం తగ్గిపోతుంటాయి. అల్జీమర్స్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, నిరంతరం నేస్తాల మధ్య ఉండేవారిలో ఈ తరహా సమస్యలు తక్కువనీ, మెదడు మహా చురుగ్గా పనిచేస్తుందనీ తేలింది.

విచిత్రం ఏమిటంటే... వయసు పెరిగేకొద్దీ మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతతల మీద స్నేహితుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్నదట. వృద్ధాప్యంలో... కుటుంబం, బంధుత్వాలకంటే కూడా స్నేహితుల అనుబంధమే సంతృప్తిని ఇస్తుందట. మిషిగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన విలియం చాపిక్‌ అనే పరిశోధకుడు చెబుతున్న విషయమిది. లేటు వయసులో ఉపయోగపడుతుందని డబ్బులను ఎలా పొదుపు చేసుకుంటామో... నేస్తాలని కూడా అలాగే పొదుపు చేసుకోమని సూచిస్తున్నాడు.

స్త్రీ పురుషుల తీరు వేరు

స్నేహానికి లింగభేదం లేదు. కాకపోతే సహజమైన స్వభావాలనిబట్టి కొన్ని మార్పులు కనిపిస్తాయి. లిడియా డెన్‌వర్త్‌ అనే పరిశోధకురాలి అంచనా ప్రకారం స్త్రీలు కలిసి మాట్లాడుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తే, పురుషులు కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. వృత్తి పరంగానో, ఆటల్లోనో పోటీ ఉన్నప్పుడు... ఆడవారికంటే మగవారే త్వరగా కలిసిపోతారట. బాక్సింగ్‌ రింగులో ముక్కులు పగిలేలా గుద్దుకున్నా, పోటీ ముగిసిపోగానే చేతులు కలిపేందుకు సిద్ధపడతారట. అందుకే ఆఫీసుల్లో ఉండే స్పర్ధలు హద్దులు దాటకూడదు అనుకుంటే... ఉద్యోగుల మధ్య సామాజిక బంధాలను మెరుగుపరచాలని సూచిస్తున్నారు.

మిత్రశత్రువు

‘కొన్నిసార్లు ఒకే మనిషి నాకు శత్రువులాగా, మిత్రుడిలాగా కనిపించేవాడు’ అంటారు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. ఆ మాట నిజమేనని తర్వాత కాలంలో తేలింది. ఇలాంటివాళ్లకి ‘ఫ్రెనిమీ’ (ఫ్రెండ్‌ + ఎనిమీ) అని పిలుస్తారు. అంతలోనే గొడవపడుతూ, అంతలోనే కలిసిపోతూ సాగే బంధమిది. ‘ముఖ్యంగా ఇప్పటి బిజీ లైఫ్‌లో, స్నేహితులతో కాలం గడిపేందుకు వీలు చిక్కడం లేదు. కాబట్టి ఆఫీసులోనో, పొరుగింటివారితోనో ‘బలవంతం’గానే స్నేహాన్ని కొనసాగాల్సిన పరిస్థితి. అందుకే ఈకాలంలో ఫ్రెనిమీలు ఎక్కువైపోయారు’ అంటున్నారు సైకాలజిస్టులు.

డబ్బుతో..  నేస్తాల్ని కొనలేరు 

డబ్బుతో స్నేహాన్ని కొనవచ్చా అన్న ఆలోచన వచ్చింది ‘హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌' పరిశోధకులకి. ఇందుకోసం 2,500 మంది దినచర్యలను విశ్లేషించారు. సంపాదనే ముఖ్యం అనుకున్నవాళ్లు స్నేహితులతో కాలం గడిపేందుకు మొగ్గు చూపలేదు. పైగా ఎంత సంపాదిస్తే... తన ‘విలువ’ అంతగా మెరుగుపడుతుందనే ఆశలో పరుగులు తీస్తున్నారు. ఫలితం! వారిని నిరాశా నిస్పృహలు కమ్ముకుంటున్నాయి. ‘మనిషికి స్నేహబంధాలు ముఖ్యం. అవి మనకు భద్రతా భావాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్నేహితులను ఎప్పటికీ డబ్బుతో భర్తీ చేయలేం’ అని తేల్చారు పరిశోధకులు.

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ నిజమేనా! 

సోషల్‌ మీడియా యుగంలో ‘ఫ్రెండ్స్‌' అన్నమాట వింటే ఫేస్‌బుక్‌లో పరిచయస్తుల జాబితానే గుర్తుకువస్తుంది. తీరిక లేని మన బతుకులకు... ఫేస్‌బుక్‌ స్నేహానికి అండగా నిలబడుతున్నది కదా అనే నమ్మకం కుదురుతున్నది. ఈ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ మీద కూడా చాలా పరిశోధనలే జరిగాయి. ఫేస్‌బుక్‌లో వీలైనంత మంది స్నేహితులను పోగేసుకోవాలనే ఆశ, ఒత్తిడికి దారితీస్తుందని ‘ఎడిన్‌బర్గ్‌ బిజినెస్‌ స్కూల్‌' పరిశోధకులు తేల్చారు. హోదా, డబ్బులాంటి భౌతిక విషయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు... ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ని కూడా వస్తువులలాగానే పరిగణిస్తుంటారనీ... పరపతి కోసం వీలైనంతమందిని పోగేసుకునే ప్రయత్నంలో ఉంటారనీ మరో పరిశోధకుడు హెచ్చరిస్తున్నాడు. సమస్య ఇక్కడితో ఆగడం లేదు. తమ మిత్రులు ఫేస్‌బుక్‌లో పెట్టే ‘స్టేటస్‌'లను చూసి వాళ్లంత సుఖంగానో, సంతోషంగానో లేము అనే న్యూనత  కొందరిని కుంగదీస్తున్నట్టు తేలింది. పైగా స్క్రీన్‌మీద ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడినప్పుడు... మన మెదడు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఏతావాతా తేల్చిందేమిటంటే... లైక్‌ల కోసమో, పరపతికి చిహ్నంగానో సాగే ఫేస్‌బుక్‌ స్నేహాలు ప్రతికూలమైన ప్రభావం చూపిస్తాయి. అలా కాకుండా మనసుకు దగ్గరైన వారితో అభిప్రాయాలను పంచుకునేందుకో, సలహాలను స్వీకరించేందుకో ఫేస్‌బుక్‌ని వేదికలా మార్చుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందట. 

ఫ్రెండ్‌షిప్‌ బెంచ్‌ 

బాధలో ఉన్న స్నేహితుడి మాట విని.... తనని ఓదార్చడమే ఓ గొప్ప థెరపీ. ఈ సూత్రంతోనే జింబాంబ్వే పరిశోధకులు ఓ అరుదైన ప్రాజెక్టును చేపట్టారు. అదే ‘ఫ్రెండ్‌షిప్‌ బెంచ్‌'. 2016 నాటికి జింబాబ్వే నిరుద్యోగంతో, ద్రవ్యోల్బణంతో సతమతమైపోతున్నది. ప్రజలు, ముఖ్యంగా యువత ‘ఇలా బతకడం కంటే చావడం మేలు’ అన్నంత డిప్రెషన్లో కూరుకుపోయారు. వాళ్లందరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు తగిన వ్యవస్థ అక్కడ లేదు. కాబట్టి ప్రతి ఆరోగ్య కేంద్రం బయటా ఓ బల్ల వేశారు. దానికి ‘ఫ్రెండ్‌షిప్‌ బెంచ్‌' అని పేరు పెట్టారు. వాటిమీద కొంతమంది పెద్దవాళ్లను కూర్చోబెట్టారు. డిప్రెషన్‌తో అక్కడికి చేరుకునేవాళ్లు... పెద్దల దగ్గర తమ గోడు చెప్పుకుంటారు. ఆ పెద్దలు తమ జీవితానుభవంతో తోచిన సలహాలు ఇస్తారు. ఇలా ఆరు సెషన్లు గడిచిన తర్వాత... బాధితులలో ఉద్వేగం, ఆత్మహత్య యోచన గణనీయంగా తగ్గిపోయాయని తేలింది. వేలమంది ఈ ప్రాజెక్టు వల్ల లాభపడటంతో కొవిడ్‌ సమయంలో ఈ ‘ఫ్రెండ్‌షిప్‌ బెంచ్‌'ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

మనసుకు శ్రీరామరక్ష

 • ఓసారి మీ స్కూల్‌ రోజుల్ని తల్చుకోండి. పిల్లలందరూ కలిసి, క్లాసులో కాస్త బలహీనంగానో అమాయకంగానో ఉన్న పిల్లాడిని ఏడిపించడం గుర్తుండే ఉంటుంది. ఇతరుల ఎగతాళికి లక్ష్యంగా మారిన పిల్లలు నిరాశలో మునిగిపోవడం తెలిసిందే. అలాంటి సమయంలో ఓ స్నేహితుడి అండ దొరికిన పిల్లలు మాత్రం, ఆ ఒత్తిడినుంచి సులువుగా బయటపడినట్టు నెదర్లాండ్స్‌ పరిశోధకులు తెలుసుకున్నారు.
 • స్నేహితులు ఉన్నవారు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ డిప్రెషన్‌లో కూరుకుపోయినా... త్వరగా దానినుంచి బయటపడతారు. ఇంగ్లండులోని వార్‌విక్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిరూపించిన విషయమిది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే... స్నేహితులు డిప్రెషన్‌లో సాయపడ్డారే కానీ, ఆ డిప్రెషన్‌ వాళ్లకి అంటుకోలేదట.
 • జీవితంలో రాజపూజ్యమే కాదు... అవమానం కూడా పలుకరిస్తుంది. ట్రాఫిక్‌లో ఎవరో మన కాలర్‌ పట్టుకోవచ్చు, ఆఫీసరు నలుగురి ఎదుటా తిట్టొచ్చు... ఇలాంటి అవమానాలు మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. కానీ, అది జరిగే సందర్భంలో నేస్తం పక్కన ఉంటే కనుక, దాని ప్రతికూల ప్రభావం చాలావరకు తగ్గిపోతుందని Developmental Psychologyలో ఓ వ్యాసం చెబుతున్నది.
 • ఇంతేనా! నేస్తాలతో ఒత్తిడి తగ్గుతుందని, సంతోషం మెరుగవుతుందని, ఆత్మవిశ్వాసం ఉరకలు వేస్తుందని  పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

ఏదో మాటవరసకు చెప్పుకోవడానికి ఈ పరిశోధనలు కానీ... స్నేహితులు పక్కన ఉంటే జీవితం అరచేతిలో ఉన్నంత భరోసాగా ఉంటుందని మనకు తెలియదా! ఏ బతుకు మలుపులో జారిపడినా... చేయందించే బలమైన హస్తం వాళ్లదేనని నమ్మకం కదా! అందుకే భాగస్వామిని ఎన్నుకున్నంత బాధ్యతగా స్నేహితులను కూడా ఎంచుకొంటాం. ఓ విశ్లేషణ ప్రకారం మన జీవితంలో వేలమంది తారసపడతారు. వారిలో నాలుగువందల మంది మాత్రమే కాస్త దగ్గరవుతారు. అందులో 33 మంది మాత్రమే స్నేహితులుగా మిగులుతారు. వారిలో అయిదుగురు మాత్రమే ఆప్తమిత్రులుగా మారతారు. ఎంత అంతర్ముఖులైనా.... పిలిస్తే పలికే నేస్తం ఒక్కరైనా ఉండి తీరాలని చెబుతున్నారు. ఆకలి వేసినప్పుడు ఆహారం ఎంత ముఖ్యమో... మనసు ఖాళీ అయిపోయినప్పుడు దాన్ని మాటలతో నింపే ఫ్రెండ్‌ కూడా అంతే ముఖ్యమంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎలాగో... తరచూ స్నేహితులతో కూడా గడపాల్సిందే. ఇంకెందుకాలస్యం... మీ మిత్రులను పలుకరించేందుకు, చేజారిన స్నేహాలను మరోసారి నిర్మించుకునేందుకు ఇంతకంటే మంచి తరుణం ఇంకేముంటుంది!

 • స్నేహితుల సాంగత్యం వల్ల మనలో రోగనిరోధకశక్తి బలపడుతుందనీ... జలుబు దగ్గరనుంచి రకరకాల అంటువ్యాధులను సమర్థంగా ఎదుర్కొంటామనీ మరో అంచనా!
 • సిగరెట్‌ ఓ వ్యసనం, ఇక డ్రగ్స్‌ అయితే జీవితాన్నే నాశనం చేస్తాయి. కానీ, స్నేహితుల అండ ఉంటే ఈ వ్యసనాల నుంచి బయటపడవచ్చు అని రెండు వేర్వేరు పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
 • చుట్టూ స్నేహితులు ఉన్నవారిలో ఎలాంటి నొప్పి అయినా ఇట్టే మాయం అయిపోతుంది. అది కూడా కాస్తోకూస్తో కాదు... మాత్ర వేసుకున్నంత బాగా. స్నేహితులవల్ల ఎండార్ఫిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం.
 • ఓ 13 ఏండ్ల పాటు 2,700 మంది జీవితాలను గమనించిన పరిశోధన తేల్చిందేమిటంటే... స్నేహితులు ఉంటే మన వృద్ధాప్యం కూడా వెనకబడిపోతుందట. ఇలాంటివారిలో వయసు మీద పడినా చురుకుదనం, పటుత్వం అంతలా తగ్గక పోవడం ఆశ్చర్యకరం.
 • ఆ మధ్య అమెరికాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధన జరిగింది. ఇందుకోసం గుండెజబ్బు ఉన్న ఓ వెయ్యి మందిని ఎన్నుకొన్నారు. ఓ అయిదేండ్లు గడిచిన తర్వాత వీరిలో స్నేహబంధాలు ఎక్కువగా ఉన్నవారు వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవడం గమనించారు.


logo