శనివారం 08 ఆగస్టు 2020
Sunday - Aug 02, 2020 , 00:18:30

రాళ్ల భూమిలో.. రత్నాలు!

రాళ్ల భూమిలో.. రత్నాలు!

పొలమంటే పురుగుల మందు వాసనే ఎందుకు గుర్తుకు రావాలి? పంటచేలంటే చీడపీడలే ఎందుకు జ్ఞప్తికి రావాలి? సాగు అంటే అప్పులేనా, అన్నదాతకు కష్టాలేనా? వ్యవసాయం పండగ కాదు దండగేనా?.. కాదని చెబుతున్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల రైతు కృష్ణయ్య. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదివిన కృష్ణయ్య సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు.  30 ఎకరాల్లో సేద్యం చేస్తూ ‘ఔరా’ అనిపిస్తున్నారు. 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివిన కృష్ణయ్య రకరకాల వ్యాపారాలు చేశారు. కన్నవాళ్లకు దగ్గరగా ఉండాలని సింగరేణి నర్సరీ కాంట్రాక్టు దక్కించుకుని మొక్కలు పెంచేవారు. అప్పుడే ఆయనకు వ్యవసాయంపై మక్కువ కలిగింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలన్న ఆలోచన వచ్చింది. ఈలోగా సింగరేణి కాంట్రాక్టు పూర్తికావడంతో.. సేంద్రియ విధానంపై అవగాహన పెంచుకునేందుకు ఆయనకు అవకాశం లభించింది. చాలా రాష్ర్టాలు తిరిగారు. అక్కడ రైతులు అవలంబిస్తున్న విధానాలను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పెనుబల్లికి వచ్చి 30 ఎకరాల భూమిని కొన్నారు. ఆ బీడు భూమిని కొన్నప్పుడు తోటి రైతులు నవ్వారు. ‘ఇక్కడ పంటలు పండిస్తావా?’ అంటూ హేళన చేశారు. అది పూర్తిగా ఎగుడుదిగుడు ప్రాంతం. నీటి వనరులు అంతంతమాత్రమే. ఎలాగైనా సేద్యానికి అనువుగా మార్చుకోవాలని నేలను చదును చేయడం ప్రారంభించారు. ఇందుకు చాలా సమయమే పట్టింది. పైగా దాచుకున్న డబ్బంతా ఖర్చయింది. తీవ్ర ఆలోచనలో పడ్డ కృష్ణయ్య ఓ మిత్రుడి సూచనతో బ్యాంకులో రూ. కోటి వరకు రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో ఆరు బోర్లు వేయించారు. నీరు వృథా కావొద్దన్న ఉద్దేశంతో డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో నీరు వృథాగా పోకుండా ఉండేందుకు బావిని తవ్వించారు. వాననీరంతా అందులోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను పెంచుతున్నారు. బావిలో నీరు నిల్వ ఉండటంతో బోర్లు రీ-ఛార్జ్‌ అవుతున్నాయని చెబుతారు కృష్ణయ్య. 

ఉద్యాన పంటలతో.. 

‘పంట మార్పిడి విధానంతో చీడపీడలకు చెక్‌ పెట్టొచ్చు’ అని చెబుతారు కృష్ణయ్య. మహారాష్ట్ర బార్సీ నుంచి ప్రత్యేకంగా సీతాఫలం మొక్కలు తెప్పించి పదిహేను ఎకరాలలో నాటారు. ప్రస్తుతం ఆ మొక్కల వయసు ఏడాది. అందులో అంతరపంటగా పుచ్చను సాగు చేశారు. మార్కెట్లో డిమాండ్‌ ఉండటంతో అన్ని ఖర్చులూ పోను ఎకరానికి డబ్భు వేలు మిగిలాయి.  పంట కాలం పూర్తవడంతో వాటి అవశేషాలను కంపోస్ట్‌కు మార్చి 
ఎరువుగా వాడుతున్నారు.  అలా వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా చూస్తున్నారు.

ఇదే విధానం.. 

కృష్ణయ్య నాలుగు ఎకరాల్లో మిర్చి.. మూడెకరాల్లో టమాటా సాగు చేశారు. ఇందులోనూ సేంద్రియ విధానాన్నే అవలంబిస్తున్నారు. సాధారణంగా మిర్చికి చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ సేంద్రియ పద్ధతిని జోడించి ఎకరానికి 40 క్వింటాళ్ల  దిగుబడి సాధించి ఈ ప్రాంతంలో రికార్డు నెలకొల్పాడు. టమాటలోనూ సేంద్రియ సూత్రంతో అన్ని ఖర్చులూ పోనూ ఎకరానికి రూ. 60 వేల దాకా లాభాలు గడించారు. బొప్పాయి రైతులకు ప్రధాన అవరోధం మొక్కలు. సాగు చేయాలని ఆసక్తి ఉన్నా మొక్కలు ఎక్కడ దొరుకుతాయో తెలియక చాలామంది నిరుత్సాహానికి గురువుతుంటారు. ఈ పరిస్థితే కృష్ణయ్యకూ ఎదురైంది. అయినా వెనక్కితగ్గలేదు. నెట్లో శోధించిన ఓ సరఫరాదారును గుర్తించారు.  ఏపీ నుంచీ విత్తనాలు సేకరించారు. వాటిని జాగ్రత్తగా శుద్ధిచేసి ప్రత్యేకంగా నిర్మించిన గదుల్లో పెంచారు. ఈ విధంగా పెంచిన మొక్కలను పొలంలో నాటారు. ఇలా ఎనిమిది ఎకరాల్లో బొప్పాయి సాగుచేశారు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. కృష్ణయ్య వ్యవసాయం క్షేత్రంలో రోజూ 40 మంది పనిచేస్తారు. అందరికీ తన క్షేత్రంలో నివాస వసతి ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ. పదివేల వేతనం ఇస్తున్నారు. బియ్యం, నిత్యావసరాలు  సమకూర్చుతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. 

సేంద్రియమే ఉత్తమం -కృష్ణయ్య 

వ్యవసాయంలో ఖర్చులు పెరిగాయి. దీంతో అధిక దిగుబడుల కోసం ఆరాటం ఎక్కువైంది. ఫలితంగా రసాయన ఎరువులు విస్తారంగా వాడి నేలను విషపూరితం చేస్తున్నారు. అందుకే నేను సేంద్రియం వైపు మళ్లాను. మొదట్లో కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు దాన్ని అధిగమించాను. మన సేద్య విధానం చాలా గొప్పది. దానికి అధునాతన పద్ధతులు జోడిస్తే బ్రహ్మాండమైన దిగుబడులు సాధించవచ్చు. ప్రభుత్వం కూడా సేంద్రియ విధానాన్ని ప్రోత్సహించి రాయితీలు ఇస్తే సేద్యం బంగారం అవుతుంది. (సలహాల కోసం: 9866185197)


logo