శనివారం 08 ఆగస్టు 2020
Sunday - Aug 02, 2020 , 00:09:36

రాజమౌళి నాకు స్ఫూర్తి!

రాజమౌళి నాకు స్ఫూర్తి!

సృజనాత్మకత, భావుకత ఉన్నవారు దర్శకులుగా రాణిస్తారు. ఈ లక్షణాలకు ఆధ్యాత్మికత.. హేతువుతో కూడిన విశ్లేషణా సామర్థ్యం తోడైతే మరింత విశాల దృక్కోణంలో ప్రపంచాన్ని వీక్షించవచ్చు. తన ఆలోచనా విధానం కూడా అదే అంటున్నారు యువ దర్శకుడు చందు మొండేటి. సనాతన హైందవ సంప్రదాయం వెనక గొప్ప సైన్స్‌ దాగి ఉందంటారు. ‘కార్తికేయ’ ‘ప్రేమమ్‌' ‘సవ్యసాచి’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన ‘కార్తికేయ-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘బతుకమ్మ’తో సంభాషిస్తూ చందు మొండేటి పంచుకున్న  భావాలివి..

మనకు ఏదైనా ఒక ఆలోచన నచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక ఆలోచనలు మస్తిష్కంలో మెదలుతూ ఉంటాయి. అవన్నీ ఓ రూపాన్ని సంతరించుకొని ఐడియాగా మారతాయి. అలా సినిమా కథకు బీజం పడుతుంది. నా దృష్టిలో సినిమా కథకు మంచి పుస్తకం, నిత్య జీవితంలోని సంఘటనలు, వార్తలు ..ఏదైనా ప్రేరణ కావచ్చు. అనంతపద్మనాభస్వామి దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడి నేలమాళిగల్లోని అనంతమైన సంపద.. ఆలయం పుట్టుపూర్వోత్తరాలు వింటున్న ప్రతిఒక్కరిలో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. పరిశోధనాత్మక జిజ్ఞాస ఉంటే మరిన్ని రహస్యాల్ని తెలుసుకోవచ్చు. ఆ సమాచారాన్నంతటినీ పేపర్‌మీద పెడితే ఆసక్తికరమైన రచన అవుతుంది. తెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే సినిమాగా మారుతుంది. అలా హృదయాన్ని స్పృశించిన ఏ పాయింట్‌నైనా విస్తృత మథనంతో సినిమా కథగా తయారుచేసుకోవచ్చు. మన వ్యక్తిగత అభిరుచులు, ఎదిగే క్రమంలో సంపాదించుకున్న జ్ఞానం కథను ఉన్నతీకరించే విషయంలో దోహదపడుతాయి.

దేవుణ్ని నమ్ముతాను

నాకు దేవుడిపై విశ్వాసం ఉంది. ఏ దేవుడినైనా పూజిస్తాను. అయితే మూఢనమ్మకాల్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా. దేవుడంటే నాకున్న నిర్వచనం వేరు.  దేవాలయాల్ని ఎందుకు నిర్మించారు? వాటి వెనకున్న ఆంతర్యం, ఉద్దేశ్యం  ఏమిటి? విగ్రహ ప్రతిష్ఠాపన ఎలా చేస్తారు? గుడిలో అందించే తీర్థం,  అభిషేకాలు, ప్రదక్షిణలు, గుడిగంటలు మోగించడం, ధూపదీపనైవేద్యాలు.. వీటన్నింటి వెనక మన ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షించే గొప్ప సుగుణాలున్నాయి. హైందవ సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనక మనిషి సౌభాగ్యాన్ని పెంపొందించే మహత్తు ఉందని నమ్ముతా. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పౌరాణిక పురుషులను పూజిస్తుంటే ఓ హీరో వర్షిప్‌ చేస్తున్నామనే భావన కలుగుతుంది. గుడిలోకీ వెళితే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ కలుగుతాయి. దేవాలయాల చరిత్రలు తెలిస్తే ప్రతి ఆలయానికి ఓ మహత్తు ఉందని గ్రహిస్తాం. ఈ కారణాల వల్ల నేను దేవుణ్ణి, మన   సంప్రదాయాల్ని విశ్వసిస్తాను.

సినిమాకంటే ఎక్కువ కష్టపడాలి

త్వరలో వెబ్‌సిరీస్‌ చేసే ఆలోచన ఉంది. రెండుమూడు ఆఫర్లు కూడా వచ్చాయి. ఇటీవల కాలంలో నేను చూసిన కొన్ని వెబ్‌సిరీస్‌లు అద్భుతంగా అనిపించాయి. మంచి వెబ్‌సిరీస్‌ను తీసుకురావాలంటే సినిమా కంటే ఎక్కువగా కష్టపడాలి. ముఖ్యంగా రైటింగ్‌ విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. ఇంగ్లీష్‌, హిందీ వెబ్‌సిరీస్‌లు చూసినప్పుడు వాటి రైటింగ్‌ ైస్టెల్‌ నన్ను బాగా ఇంప్రెస్‌ చేసింది. 

ప్రతి భాషకూ ఓ ప్రత్యేకత

ప్రాంతాలను బట్టి సంస్కృతి, సంప్రదాయాలు, అభిరుచుల్లో భేదాలుంటాయి. ప్రస్తుతం మలయాళం, కన్నడంలో సహజత్వానికి పెద్దపీట వేసే సినిమాల రూపకల్పన ఎక్కువగా కనిపిస్తున్నది. మన తెలుగులో ఆ తరహా సినిమాలు తీసే ప్రతిభ కలిగిన దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ ప్రేక్షకుల ఆమోదం లభిస్తుందో లేదో అనే అపనమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌ వేరు. తమిళ ప్రజలు కూరల్లో ఇంగువ ఎక్కువగా వాడతారు. అలాగే మలయాళీలు కొబ్బరినూనెను ఇష్టపడతారు. తెలుగు ప్రజల ఆహార అభిరుచులూ వేరుగా ఉంటాయి. అదే తరహాలో సినిమాను స్వీకరించే విధానంలో కూడా భాషకో ప్రత్యేకత కనిపిస్తుంది.

‘బాహుబలి’ తీయలేరు కదా..

తెలుగు పరిశ్రమలో ఇమేజ్‌ ఉన్న స్టార్స్‌ ఎక్కువ. ఈ విషయంలో నేను గర్వంగా ఫీలవుతా. మిగతా భాషల వాళ్లు ‘బాహుబలి’ని ఎందుకు తీయలేదు అంటే ఏం సమాధానం చెబుతాం? అలాంటి సినిమా తీయాలంటే వాళ్లకు ఓ రాజమౌళి, ప్రభాస్‌ కావాలి. భారీ బడ్జెట్‌ సమకూర్చే నిర్మాతలు ఉండాలి. తెలుగు ప్రేక్షకులు లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమాను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇతర భాషలతో పోల్చుకొని చూడొద్దు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా  జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది. మేకింగ్‌పరంగా సమకాలీన సినిమాలకు ఓ ఉదాహరణగా నిలిచింది. కాబట్టి మన తెలుగు సినిమా తనదైన ప్రత్యేకతలతో ముందుకు పోతున్నదని నేను నమ్ముతున్నా.

ఇంటెలెక్చువల్స్‌ మధ్య పెరిగా..

నా తల్లిదండ్రులు లక్ష్మీ, భాస్కర్‌రావు చిన్నతనం నుంచి  క్రమశిక్షణతో పెంచారు. అమ్మ ఆ రోజుల్లోనే గుంటూరు కాలేజీ నుంచి బీఏ  చేశారు. ఇంట్లో సుందరకాండ, భాగవతం, ఆదిశంకరాచార్యుల గురించి పెద్దపెద్ద్ద గ్రంథాలుండేవి. దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక సంఘటనల గురించి ఇంట్లో ఎప్పుడూ చర్చలు జరుగుతుండేవి. దాంతో చిన్నతనం నుంచే చదువుతో పాటు ఇతరత్రా జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం దక్కింది.  ఇప్పటివరకు నా ప్రయాణంలో ఎక్కువగా ఇంటెలెక్చువల్స్‌ మధ్యే గడిపాను. వారే నాకు ప్రపంచాన్ని కొత్తగా ఎలా చూడాలో తెలియజేశారు. నా శ్రీమతి కూడా ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం తను పీహెచ్‌డీ చేస్తున్నది.

ద్వారక నేపథ్యంలో ‘కార్తికేయ-2’

గత మార్చిలో ‘కార్తికేయ-2’ షూటింగ్‌ ప్రారంభించాం. కథానుగుణంగా ద్వారకలో చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈలోగా లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగ్‌ను నిలిపివేశాం.  ‘కార్తికేయ-2’ చిత్రాన్ని సంపూర్ణమైన సీక్వెల్‌గా భావించవచ్చు. తొలిభాగంలోని తారాగణమంతా దాదాపు ఈ సినిమాలో కనిపిస్తారు.  ‘కార్తికేయ’  తరహాలోనే ఈ సీక్వెల్‌లో కూడా దైవం, సాహసం, విశ్వాసం అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. కృష్ణుడు ఏలిన ద్వారకా నగరం నేపథ్యంలో కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి.

‘ప్రేమమ్‌' సంతృప్తినిచ్చింది

చాలామంది  దర్శకులు స్క్రిప్ట్‌ మేకింగ్‌కు ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ త్వరగా కథా రచన ముగించి సెట్స్‌పైకి తీసుకురావాలనే ఉంటుంది. కానీ అనుకోని కారణాల వల్ల అలా  కుదరడం లేదు. ఒక బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఉంటే సినిమా తీసేయాలని ప్రతి దర్శకుడూ  అనుకొంటాడు. భవిష్యత్తులో త్వరితగతిన సినిమాలు పూర్తిచేయాలనే ఉంది.  నాగచైతన్యతో తీసిన ‘ప్రేమమ్‌' రీమేక్‌ దర్శకుడిగా సంతృప్తినిచ్చింది. మాతృకకంటే తెలుగు రీమేక్‌ విషయంలో కాస్త ఎక్కువగా కష్టపడ్డాం. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాను అద్భుతంగా ఆదరించారు. 

గీతా ఆర్ట్స్‌ సంస్థలో సినిమా

నా తదుపరి సినిమాను గీతా ఆర్ట్స్‌ సంస్థలో చేయబోతున్నా.  రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి సూపర్‌ నేచురల్‌ పవర్స్‌ నేపథ్యంలో ఉంటుంది. మరో కథేమో సోషల్‌ఫిల్మ్‌. ఈ సినిమాలో ఎవరు హీరో అన్నది త్వరలో వెల్లడిస్తా.

ఆయనే ఆదర్శం  

రాజమౌళి  తీసిన ప్రతి సినిమానూ నేను స్ఫూర్తిగా తీసుకుంటా. దర్శకుడిగా, ఓ వ్యక్తిగా ఆయన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. రాజమౌళి  పనితనం, సినిమాల పట్ల విజన్‌, సాధించిన విజయాలు నాకు  ప్రేరణగా నిలుస్తాయి. మా ఇంట్లోకి ప్రవేశించగానే హాలులో ఆయన పెద్ద ఫొటో ఉంటుంది. అంతటి అభిమానం నాకు.

థియేటర్‌ ఆదరణ కోల్పోదు

ఓటీటీ వేదికలు ప్రతిభను ఆవిష్కరించుకోవడానికి చక్కటి మాధ్యమాలుగా ఉపయోగపడతాయి. అయితే థియేటర్‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎప్పుడూ ప్రత్యామ్నాయంగా మారవు. ఓటీటీ వీక్షించే ప్రేక్షకుల వర్గం వేరుగా ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.  అప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి పెద్ద సినిమా థియేటర్‌లో రిలీజ్‌ అయితే ఆ హంగామా మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. థియేటర్‌ అంటే ఓ సామూహిక భావన. వందలమంది కలిసి ఒకే రకమైన ఉద్వేగాల్ని పంచుకొంటారు. థియేటర్‌ మన జీవితాల్లో ఓ భాగం. అది ఏనాడూ ఆదరణ కోల్పోదు.


logo