శనివారం 08 ఆగస్టు 2020
Sunday - Aug 01, 2020 , 23:55:00

‘వాకీటాకీ’ గ్రామం

‘వాకీటాకీ’ గ్రామం

సాధారణంగా పోలీసులు, రైల్వే ఉద్యోగుల చేతుల్లోనే వాకీటాకీలు చూస్తుంటాం. ఇతర అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు వినియోగించడం  గమనించే ఉంటాం. కానీ, మామూలు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాకీటాకీలను వాడటం ఎప్పుడైనా చూశారా? 

కనీసం  విన్నారా? 

** *

.. అలాంటి గ్రామం ఒకటుంది. అదే జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలోని తాండ్య్రాల. చెత్త సేకరణ కార్మికులను నిత్యం అప్రమత్తం చేసేందుకు ఆ గ్రామ సర్పంచ్‌ గంగప్రసాద్‌ ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్‌ మిషన్‌, చెత్తసేకరణకు వాడకొక్క ఆధునిక చెత్త డ్రమ్ములను కూడా ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూ ఆయన ..  గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 

2019లో  పల్లెప్రగతిలో చేపట్టిన పనులకుగాను మండలస్థాయిలో అవార్డును అందుకున్నారు. గత రిపబ్లిక్‌ డే నాడు.. కలెక్టర్‌, ఎస్పీల చేతుల మీదుగా పురస్కారమూ స్వీకరించారు. 

తాండ్య్రాలలో పన్నెండు వార్డులు ఉన్నాయి. జనాభా నాలుగున్నరవేలు. గతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో, చెత్తసేకరణలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విషయంలో కాస్తా జాప్యం జరిగేది. దీంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చేంది. అయితే, తనకు ఓట్లేసి గెలిపించిన

వారి పట్ల బాధ్యతగా   ఉండాలని సర్పంచ్‌ గడిల గంగప్రసాద్‌ భావించారు. ప్రతిక్షణం గ్రామంలోని అధికారులు, సిబ్బంది ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలుసుకోవడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తనతో పాటు.. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్లు,  పంచాయతీ కార్యదర్శి  కోసం మొత్తం పన్నెండు వాకీటాకీలను తెప్పించారు. సర్పంచ్‌ నిత్యం వాకీటాకీ  ద్వారా సిబ్బందితో మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలు తెలుసుకొంటున్నారు. వారికి అవసరమైన సూచనలు అందిస్తున్నారు. పారిశుద్ధ్యం, వీధిదీపాల సమస్యలు.. ఏమైనా తన దృష్టికివస్తే వాకీటాకీల ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.  పారిశుద్ధ్య సిబ్బంది వ్యర్థాలను సులువుగా సేకరించేందుకు వీలుగా చెత్త సేకరణ మిషన్‌ను కొనుగోలు చేశారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్న ఉద్దేశంతో బయోమెట్రిక్‌ ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు. పంచాయతీ ఉద్యోగులను జనం సులువుగా గుర్తుపట్టాలనే ఉద్దేశ్యంతో యూనిఫామ్‌ తప్పనిసరి చేశారు. హరితహారంలో నాటిక మొక్కలకు ట్యాంకర్‌తో ఎప్పటికప్పుడు నీళ్లు పోయిస్తున్నారు. ఒక్క మొక్కా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అనేక ప్రశంసలు

సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్న తాండ్య్రాల సర్పంచ్‌ గంగప్రసాద్‌ను జగిత్యాల కలెక్టర్‌ రవి అభినందించారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి కలెక్టర్‌ ఇటీవలే గ్రామంలో పర్యటించారు. పంచాయతీ పరిధిలో వాకీటాకీలు వినియోగం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చెత్త సేకరణకు హ్యాండ్‌స్టిక్‌ మిషన్‌ వాడకాన్ని పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాల పంచాయతీ అధికారులూ తాండ్య్రాల గ్రామాన్ని సందర్శించి,  పారిశుద్ధ్య పనులకు ఆధునికతను జోడిస్తున్న తీరును పరిశీలించాలని కలెక్టర్‌ రవి డీపీఓకు సూచించారు. ‘నేను కతార్‌ దేశంలోని మున్సిపాలిటీలో ఇరవై ఏండ్లు పనిచేశా. అక్కడ ఉపయోగించిన టెక్నాలజీతో గ్రామాన్ని అభివృద్ధిచేయాలని నా సంకల్పం. వాకీటాకీల ద్వారా తక్షణం సమస్యలు తెలుసుకోగలం. త్వరగా పరిష్కారం లభిస్తుంది’ అంటారు సర్పంచ్‌ గడిల గంగప్రసాద్‌. ఇదే బాటలో.. మిగతా పల్లెలు కూడా ఆధునికత వైపుగా అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

ప్రజల సహకారంతో ..

గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలు, వార్డు సభ్యులతోపాటు సర్పంచ్‌ సహకారంతో ముందుకెళ్తున్నాం. ఈ ఏడాదిలో రెండు సార్లు జిల్లా స్థాయిలో అవార్డు అందుకోవడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. గ్రామంలో పారిశుద్ధ్య పనులతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం.- చెదలు నారాయణ పంచాయతీ కార్యదర్శి, తాండ్య్రాల


logo