శనివారం 08 ఆగస్టు 2020
Sunday - Aug 01, 2020 , 23:46:09

కరాటే కపుల్‌!

కరాటే కపుల్‌!

ఆడవాళ్లు కాలు బయటపెట్టింది మొదలు.. ఇంటికి చేరేవరకూ భయమే. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దారుణాలే అందుకు  కారణాలు. స్త్రీలు తమను తాము కాపాడుకోవడానికి ‘స్వీయ రక్షణే’ పరిష్కారమని గ్రహించారు ఆ దంపతులు. స్త్రీ శక్తికి ప్రతీక అయిన ‘రుద్రమదేవి’ పేరుతో సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీని స్థాపించి.. అనుకోకుండా వచ్చే ఆపదలను తరిమి కొట్టేలా ఆడవాళ్లలో ధైర్యాన్ని నింపుతున్నారు కరాటే లక్ష్మి, రవి.

‘రుద్రమదేవి’ సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ.. ఆడపిల్లల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతూ, ఆపదను ఎదురించేలా ధైర్యాన్నిచ్చే పాఠశాల. ఈ అకాడమీ ద్వారా మహిళలకు కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు లక్ష్మి, రవి దంపతులు. తెలంగాణలో మహిళల రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న ‘షీ టీమ్స్‌'తో కలిసి  అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు 20 ఏండ్లుగా లక్షల మంది మహిళలకు స్వీయ రక్షణ పాఠాలు నేర్పించారీ కరాటే కపుల్‌.

పోలీస్‌ అవుదామని..

వరంగల్‌ జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన లక్ష్మికి పోలీస్‌ కావాలని కోరిక. కూతురి కోరికను గుర్తించిన తండ్రి వెంకటరత్నం, ఆరో తరగతిలో ఉండగానే లక్ష్మికి కరాటే నేర్పించారు. చాలా శ్రద్ధగా కరాటే నేర్చుకుంటున్న లక్ష్మిని ప్రోత్సహించిన మాస్టర్‌, అందులోని అనేక మెళకువలను నేర్పించి, కఠిన శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నది లక్ష్మి. 2001 నుంచి 2003 వరకూ కుమిత్‌ కేటగిరీలో.. వరుసగా చాంపియన్‌గా అవతరించింది. తర్వాత ‘బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌', కరాటే మాస్టర్‌ రవిని పెండ్లి చేసుకున్నది. వీరిద్దరూ కలిసి మహిళల రక్షణకు,  కరాటేకూ జీవితాన్ని అంకితం చేశారు. ఇంటిపేరుతో కంటే.. కరాటే లక్ష్మి, కరాటే రవిగానే అందరి మనసుల్లో స్థిరపడిపోయారు. 

ఆ దాడితోనే అకాడమీ.. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2008లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులపై జరిగిన యాసిడ్‌ దాడి, అప్పట్లో పెనుసంచలనం సృష్టించింది. ఈ ఘటన లక్ష్మి-రవి దంపతులపై తీవ్ర ప్రభావం చూపింది. అమాయకులైన ఆడపిల్లలపై దాడులను నిరోధించేలా ఏదైనా చేయాలని సంకల్పించారు. ఈ  క్రమంలోనే ఆడవాళ్లలో ఆత్మైస్థెర్యం నింపేలా ‘రుద్రమదేవి సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ’ని ప్రారంభించారు. తాము నేర్చుకున్న విద్యనే మహిళలకు ఉపయోగపడేలా శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలు నుంచి కాలేజీల వరకూ, అన్ని వయసుల మహిళలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి.. ధైర్యవంతులుగా తయారు చేశారు. సులభమైన టెక్నిక్స్‌తో ఈవ్‌ టీజింగ్‌, చైన్‌స్నాచింగ్‌, దాడుల నుంచి మహిళలు తప్పించుకునేలా తీర్చిదిద్దారు. స్కూల్‌, కాలేజీ విద్యార్థినులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, అంగన్‌వాడీలు, లేడీ కండక్టర్లు, సాఫ్ట్‌వేర్‌, ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థల్లో ఉద్యోగినులకు కరాటేలో మెళకువలు నేర్పించారు.  వీరి ప్రతిభను గుర్తించిన పోలీస్‌ ఉన్నతాధికారులు, ఆత్మరక్షణ పద్ధతుల్లో పోలీసులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. అలా మొదలైన ప్రస్థానం.. కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీస్థాయి వరకూ పోలీసులకు శిక్షణ ఇచ్చేలా సాగింది. ప్రస్తుతం రోజూ నలభై బ్యాచ్‌లకు పాఠాలు బోధిస్తున్నారు. తెలంగాణలో స్కూళ్ల పీఈటీలకు, 400 మంది గురుకుల విద్యార్థినులకు కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ ఇచ్చి.. వారి ద్వారా మరింతమంది విద్యార్థినులను తీర్చిదిద్దారు. కార్పొరేట్‌ కంపెనీలూ ఈ దంపతుల సేవలు పొందుతున్నాయి. ‘చాలామంది విద్యార్థులు కరాటే తమకు అన్నివిధాలా ఉపయోగపడుతున్నదని చెబుతున్నారు. పోకిరీల నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారో వివరిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతారు లక్ష్మి.  ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణే మహిళకు.. వేయి ఏనుగుల బలం!

ఆత్మరక్షణను పాఠ్యాంశం చేయాలి 

స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు తిరుగుతూ ఆత్మరక్షణపై శిక్షణ ఇస్తున్నాం. లక్షల మందికి శిక్షణ ఇచ్చినా.. ఇంకా చాలామందికి అవసరం ఉంది. ఆత్మరక్షణను పాఠ్యాంశంగా పెడితే ప్రతి ఆడపిల్లా  నేర్చుకుంటుంది. అంతేకాదు.. ఈ టెక్నిక్స్‌ తెలుసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి సమస్యలనైనా, దాడులనైనా ఎదుర్కోగలుగుతారు. - రవి, మాస్టర్‌

అమ్మాయిలకెంతో అవసరం

కరాటే అబ్బాయిలే నేర్చుకోవాలని రూలేం లేదు. ప్రతి అమ్మాయి కూడా సెల్ఫ్‌ డిఫెన్స్‌ మీద పట్టు  సాధించాలన్నది మా లక్ష్యం. దాడుల బారిన పడినప్పుడు అమ్మాయిలు భయపడిపోతున్నారు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కరాటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దాడులను  ఎదుర్కోగలిగే ైస్థెర్యాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రతి ఆడపిల్లా కరాటే నేర్చుకుంటే మంచిది.- లక్ష్మి, మాస్టర్‌


logo