శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 23:35:50

అక్షరాల..అగ్నిధార!

అక్షరాల..అగ్నిధార!

డా. దాశరథి కృష్ణమాచార్య.. నిజాం అరాచక పాలనలో మగ్గిపోతున్న తెలంగాణను తన కవిత్వంతో  తట్టిలేపిన ప్రజాకవి. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఈ మట్టి ఖ్యాతిని చాటిచెప్పిన దార్శనికుడు. ఆయన  ‘ఇద్దరు మిత్రులు’ (1961)తో  సినీరంగ ప్రవేశం చేసి అద్భుత గీతాలెన్నో రాశాడు. తన పాటలతో అందరి మనసుల్నీ దోచిన ఈ కవితాశరథి , సినిమా పాటల పయోనిధిగానూ ప్రసిద్ధుడయ్యాడు. తెలుగు సినిమా పాటకు ఉర్దూపద సౌందర్యాన్ని అద్దిన ఘనతా ఆయనదే.  

తెలంగాణ ప్రజల కన్నీళ్ళను అగ్నిధారగా మలచి నిజాం మీదికి ఎక్కుపెట్టిన మహాకవి.. దాశరథి కృష్ణమాచార్య. ఆయన 1925 జూలై 22న (అప్పటి) వరంగల్‌ జిల్లా చిన గూడురులో జన్మించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన ధైర్యశాలి దాశరథి. ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కావ్యాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు. 1961లో ఆచార్య ఆత్రేయ తాను దర్శకత్వం వహిస్తున్న ‘వాగ్దానం’  సినిమా కోసం ప్రసిద్ధ కవులతో పాటలు రాయించుకోవాలని భావించారు. ఆ ప్రయత్నంలో దాశరథిని మద్రాసుకు పిలిపించారు. ఆ సమయంలో ప్రాణంపోసుకున్నదే  ‘నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా’! ఇదే దాశరథి రాసిన మొదటి సినిమా పాట. కానీ, అదే సంవత్సరం అన్నపూర్ణా పిక్చర్స్‌వారి ‘ఇద్దరు మిత్రులు’  కోసం రాసిన ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ’ పాటే ముందుగా రికార్డయ్యింది. మొదటి పాటతోనే తెలుగు సినిమా పరిశ్రమలో దాశరథి పేరు మారుమోగిపోయింది. ఉర్దూ పదసౌందర్యాన్ని, ఖవ్వాలీల గుబాళింపును తెలుగు సినిమా పాటల్లో ప్రవేశపెట్టిన తొలి కవి దాశరథే. ‘ఇద్దరు మిత్రులు’లోని ‘నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి’ తెలుగు సినీచరిత్రలో మొట్ట మొదటి ఖవ్వాలీ పాట.

సరళ సౌందర్యం 

సరళమైన పదాలలో బలమైన భావాన్ని అందించడంలో ఆయన మేటి. ‘మంచి మనసులు’(1962)లోని ‘నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే’, ‘చదువుకున్న అమ్మాయిలు’(1963)లోని ‘వినిపించని రాగాలే కనిపించని అందాలే’, ‘కన్నెవయసు’(1973)లోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’, పూజ(1975)లోని ‘ఎన్నెన్నో జన్మలబంధం నీదీ నాదీ’, ‘గూడుపుఠాణి’ (1972)లోని ‘తనివితీరలేదే నా మనసు నిండలేదే’..  వంటి ప్రణయ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి.

కోటి రతనాల వీణ

దాశరథి వీణ పాటల స్పెషలిస్ట్‌. ‘ఆత్మీయులు’(1969)లోని ‘మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే’, ‘అమాయకురాలు’(1971)లోని ‘పాడెద నీ నామమె గోపాలా’ వంటి వీణ పాటలు ఇప్పటికి ఏ సంగీత కచేరీకి వెళ్ళినా వినిపిస్తూనే ఉంటాయి. ‘సుడిగుండాలు’(1967)లో ఆయన రాసిన ‘వినరా సోదర భారత యోధుల’ అనే దేశభక్తి గీతం (బుర్రకథ శైలిలో) సుదీర్ఘమైంది. ఈ పాట చాలా పెద్దగా ఉందనే ఉద్దేశంతో దర్శకుడు రెట్టింపు పారితోషికం ఇస్తామంటే ఆయన ఒప్పుకోలేదు. ‘నేను స్వాతంత్య్ర సమరయోధుడిని. ఈ పాట రాసే అవకాశం రావడం నా అదృష్టం’ అంటూ సున్నితంగా తిరస్కరించాడు.  ‘పదండి ముందుకు’(1962)లో రాసిన  ‘మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో’,‘మనసు మాంగల్యం’(1971)లోని  ‘ఆవేశం రావాలి ఆవేదన కావాలి’ పాటలు  అభ్యుదయ పంథాలో ఉద్యమ చైతన్యాన్ని, స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తాయి. అంగారాన్ని, శృంగారాన్ని రంగరించుకున్న కవిగా సాహిత్యరంగంలో  పేరుగాంచిన దాశరథి  2500 పై చిలుకు పాటలు రాశారు. 1987 నవంబర్‌ 5న ఆ అగ్నిధార శాశ్వతంగా ఆగిపోయింది.

భక్తి గీతాలు రాయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. ‘రంగులరాట్నం’(1967)లో ‘నడిరేయి ఏ జామునో స్వామి నిను జేర దిగివచ్చునో’ అనే పాట ఇప్పటికీ మనల్ని భక్తిభావనలో తేలియాడిస్తూనే ఉంది.  ‘రాము’ (1968)లోని  ‘రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా! దీనులను కాపాడ రారా కృష్ణయ్యా!’, ‘మేనకోడలు’ (1972)లో  ‘తిరుమల మందిర సుందరా’ వంటి పాటలు హృదయాల్ని కట్టిపడేస్తాయి. సంగీత దర్శకులిచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా, మహావేగంగా పాటలు రాయడంలో దాశరథి దిట్ట. ‘ఆత్మగౌరవం’(1966)లో అయితే, ఏకంగా ఓ రష్యన్‌ ట్యూన్‌కు పాట రాసి భళా అనిపించాడు. అలాగే ‘మూగమనసులు’(1964)లోని ‘గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది’ అనే పాట తమిళ ట్యూన్‌లో, జానపద శైలిలో రాశాడు. సినీరంగంలో వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా పాటలు రాస్తున్న కాలంలో.. సినీకవిగా స్థిరపడాలనే ఉద్దేశంతో మద్రాసులోని ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ  తర్వాత పూర్తిగా కవిత్వ రచనకు, సినిమా పాటలకే  తన సమయాన్ని వెచ్చించాడు.