శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 23:14:58

ఇల్లు కాదు.. ప్రేమ మందిరం!

ఇల్లు కాదు.. ప్రేమ మందిరం!

అతడొక అమ్మాయిని ప్రేమించాడు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. అంతే, ఆత్మత్యాగం చేసుకున్నాడు. ప్రియుడు లేని లోకాన్ని ఊహించుకోలేని ఆ అమ్మాయి కూడా ప్రాణత్యాగం చేసింది. వీరి ప్రేమకు ఆ ఇల్లు ఒక మందిరం అయింది. అదే ప్రేమ మందిరం. 

అన్ని ఆలయాల్లో పొద్దున్నే సుప్రభాత శ్లోకాలు వినిపిస్తే.. ఈ ప్రేమ మందిరంలో ‘కొడుకా యాడున్నవ్‌ బిడ్డా.. అమ్మని పిలువురా.. అయ్యా నీ అడుగుల సవ్వడి కరువైపోయెనురా’ అని శోకాలు వినిపిస్తాయి. దేవాలయాల్లో అఖండ జ్యోతిలా ఈ ప్రేమాలయంలో స్మృతిజ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది.  శ్రీరామనవమి రోజున రాములోరికి జరిగినట్టే రామ్‌కోటికీ కల్యాణం జరుగుతుంది. మహబూబాబాద్‌జిల్లా బయ్యారం మండలం సంత్రాలపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. బానోత్‌ సుక్కమ్మ.. లాల్‌ దంపతుల కొడుకు రామ్‌కోటి. బాగా చదువుకున్నాడు.  ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అమ్మాయి వాళ్లింట్లో అడ్డు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన రామ్‌కోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ప్రియుడితోనే నేనూ’ అంటూ.. ఆ అమ్మాయి కూడా ఆత్మత్యాగం చేసుకుంది. ఇటు కొడుకూ దక్కకపాయె.. అటు అతడి ప్రేమా ఫలించకపాయె - అని కొడుకుపై ప్రేమతో సుక్కమ్మ గుండెలోని బాధకు ఇంట్లో గుడికట్టింది. ప్రేమ కోసం ప్రాణాలర్పించిన బిడ్డ.. అతడి కోసం ఆత్మత్యాగం చేసిన అమ్మాయి విగ్రహాలు ఇంట్లోనే పెట్టి రోజూ పూజ చేస్తున్నది. వాళ్ల ప్రేమ సజీవంగా నిలువాలని కోరుతున్నది. గుండెల్ని పిండేసే ఈ ప్రేమ కథ సినిమాకు ఇతివృత్తంలానూ పనికొస్తుంది.