సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 22:38:29

జై తెలంగాణ

జై తెలంగాణ

ఎంట్రామారావు అంటే గుండెకాయ తీసి కలకత్తా పాన్‌ని పొట్లంగట్టినట్లు పొట్లంగట్టి ఆయన చేతిలపెట్టేటంత దిల్లగీ మా మూర్తిగానికి. ఆయ్న శీన్మలల్ల చేప్పే మంచి మంచి డైలాగులన్నీ నా తోటి రాపిచ్చుకుని బట్టీపట్టిండు. ఆనికి తెలుగు మాట్లాడనీకెనే సరీగ రాదు ఇగ సదువుడు ఏడికెళ్ళి ఒస్తది, రాసుడేడికెళ్ళి ఒస్తది. ఓల్‌ సిటీల పుట్టిపెరిగిండాయే. గందుకే ఇస్కూల్ల గూడ సెకండ్‌ లాంగ్వేజి తెలుగు తీస్కున్నడు. మల్ల ఉర్దూ, ఇంక అంగ్రేజి దంచి కొడ్తడు.

ఎంట్రామారావు తర్వాత ఆ అభిమానమంత చంద్రాలు సార్మీదికి మళ్ళింది. అదేడిదాంక పోయిందంటే చేతిమీద పచ్చబొట్టు పొడిపిచ్చుకునేదాంక పొయ్యింది.

ఇగ ఆయ్న ఓడిపొయ్యినంక గూడ అయ్న మీద ప్యార్‌ మొహబ్బత్‌ అట్లనే ఉన్నది. గింత కూడ బిగడాయించలే.

అంతట్లనే తెలంగాణ లొల్లి ఊపందుకున్నది. ఇగ ఆడికెళ్ళి షురూ అయ్యింది మా ఇద్దరి నడ్మ దుష్మనీ. నేనేమో కేసియ్యారు సార్‌ అంట, ఆడేమో బాబు అంటడు. అరే! లాగులేసుకున్నప్పటి సంది ఉన్న దోస్తాన గూడ ఖాతర్‌ జెయ్యకుండ నా మీదికి ఊకెనే ఎగురుతుండేటోడు. కలిసినప్పుడల్ల బహేజ్‌ జేసేటోడు. ఇగ ఇద్దరం కొట్టుకునుడొక్కటే తక్వ. ఈ విషయంల ఇద్దరి నడ్మ నిచ్చె పంచాదే.

చంద్రాలు సారు రెండుకండ్ల సిద్ధాంతం చెప్పినప్పుడు నన్ను బిల్సి చూశ్నవా అన్నడు. నేను ఎన్నితీర్ల చెప్పిసూశ్నా. ఆనిది ఎంత మొండిపట్టంటే అంత. ఇగ దేవుడు దిగొచ్చినా ఇనేటోడు కాదు. దిమాక్‌ లేకుండ ఊకే ఒర్లెటోనితోని నేను మాట్లాడను. ఆఖరికి బాబు సారు లోక్సభ ఇస్పీకరుకు తెలంగాణ ఇయ్యొద్దని  ఫైస్లా చేశి ఉత్తరం రాశిండో, ఇగ ఆయాల్టి నించి ఇయ్యాల్టి దాంక మల్ల బాబు సార్‌ దిక్కు మళ్ళి సూడ్లే మా మూర్తి గాడు. కుత కుత ఉడికిపోయిండు. ఆయ్నకు జానీ దుష్మన్‌ లెక్క తయారయ్యిండు. అప్పటిదాంక నేనెంత మొత్తుకున్నా ఇననోడు ఒక్కసారి గిట్లెట్ల తయారయ్యిండో సమజ్గాలే. ఏడ ఎన్ని దెబ్బలు తిన్నా ఊకుట్టరు గని మూర్తి అసోంటోనికి సరీగ ఈగో మీద పడ్డ దెబ్బ ఆన్ని కింద మీద చేసింది.

ఇక్కడిదిక్కేమో ఉద్యమం ఊపందుకుంటున్నది. దినాం నాకు ఫోన్‌ చేసి ‘యాడున్నవ్‌' అని అడిగి ఆడు ఏడుండో చెప్పేటోడు. ఉంటే ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ కాడ, లేకుంటే ఏ చౌరస్తల రాస్త రోకో అయితే ఆడ, ఏడ మీటింగ్‌ ఉంటే ఆడ. ఇగ ఏడ లేకుంటే సకల జనుల సమ్మెల ఏ గవుర్మెంట్‌ అఫీస్లనో తేలేటోడు. ఈనిదేమో ప్రైవేటు బ్యాంకుల డ్యూటి, బ్యాకెండుల. పొద్దుగాలనే ఏడింటికల్ల బ్యాంకుకు పొయ్యి పనంత సుదురాయించుకుని బయటపడి నాకు ఫోన్‌ చేసేటోడు. నాది గిట్ల ప్రైవేటు నౌక్రీనే, అండ్ల మల్ల సేల్సు డ్యూటి. రోడ్లువట్టుక తిరిగే ఉద్యోగమాయే. ఎప్పుడు తయ్యారుగుంటుంటి. ఏడ లొల్లి చెయ్యాల్నంటే ఆడికి ఇద్దరం సోపతిగ పొయ్యేటోళ్ళం.

ఇగ మూర్తిగాని గొంతు ఏమన్న తక్వ గొంతా, వాయమ్మొ ఈడ ఒర్లితే ఒక మైలు దూరం ఇనవడుతుండేటిది. ఆని స్లోగన్లన్ని ఉర్దూలనే. సుట్టుముట్టున్నోల్లందర్ని జర్ర సేపట్ల ఒక్కటి చేశి ఒక ఊపు ఊపేటోడు. గాయల్ల గూడ నిచ్చె చేశినట్లే నా టీం పోరలందర్ని ఫీల్డ్‌ మీదికి తోలిచ్చేటప్పటికి మూర్తిగాడు ఫోన్‌ చేశిండు.

‘కాకా, ఎల్లుండే మిల్లియన్‌ మార్చ్‌, మన యూనివర్సిటీ పోరలతానికి పోదాం ఇయ్యాల,’        అన్నడు. నేను సై అంటే సై అన్న. ఇప్పుడంటే జరకంత పెద్దగయినం గని ఆయల్ల గూడ అంత పెద్దగ ఏం లేం. మా అంటే నలభయ్యో, నలభయ్యొక్కటో గంతే, ఇయ్యల్టికి పదేండ్లు కూడ నిండలే. ఇగ యూనివర్సిటీల సదూకునేటోల్లంత మాకంటే శిన్నోల్లే, గందుకని ఆల్లందర్ని పోరలనే అంటుంటిమి.

నేను ఆన్ని ఆని ఆఫీసుకాడ ఎక్కించుకొని యూనివర్సిటీకి పొయ్యేట్యాల్లకు, ఇటు తార్నాక కాడి గేటు బంద్‌ చేసిండ్రు, అటు విద్యానగర్‌ కాడి గేటు బంద్‌ చేసిండ్రు. ఎట్లనన్న లోపటికి పోదామంటాని నడిమద్దెలున్న కింది రోడ్లకెళ్ళి గుసాయించి లేడీస్‌ హాస్టల్‌ పక్క సందులకెల్లి ఎల్లి ఆరట్స్‌ కాలేజి కాడికి పొయ్యినం. ఆ కాలేజి ముంగల ఉన్న చమన్‌ కాడ బండి వెట్టి ఆరట్స్‌ కాలేజి ముంగలున్న హాస్టల్‌ క్యాంటీన్‌ కాడికి పొయ్యేట్యాల్లకు, ఆడ మస్తు మంది పోరలు జమయ్యిండ్రు. అందరు మొకాలకు దస్తీలు కట్టుకున్నరు. అవుతల తార్నాక దిక్కు తోవల పోలీస్‌ ఇస్టేషన్‌ కాడ మొత్తం రోడ్డు బందు వెట్టిండ్రు, సీఆర్పీయెఫ్‌ జవాన్లు ఇంతింత పెద్ద తుపాకులు పట్టుకోని ఇవుతలున్నోల్లని అవుతలికి పోనిస్తలేరు. ఆ జవాన్లెనక పోలీసులున్నరు.

మన పోరలు తక్వ పోరలా, ఈడికెళ్ళి ఆల్ల మీదికి రాల్లిసురవట్టిండ్రు. ఆడికెల్లి సీఆర్పీయెఫ్‌ జవాన్లు మైకుల ‘ఎల్లిపోండ్రి లేకుంటే మర్యాదగుండదని’ చెప్పవట్టిండ్రు. మనమేమన్న ఇనే రకమా. ఇవుతలికెల్లి మన పోరల తిట్టవట్టిండ్రు. ‘దమ్ముంటే రాండిరా సూస్కుందాం’ అంటాని. ఆ నార్త్‌ ఇండియన్‌ జవాన్లకు మన పోరల తెలుగు ఏం అర్తమయితది.

అవుతలికెళ్ళి అట్లనే మైకుల ఒర్లుతనేఉన్నరు.

జర సేపటికి మా మూర్తిగానికి కోపమొచ్చింది. మెల్లెగ నలుగురు పోరలని జమ జేసి ఆల్లకు ఓల్‌ సిటీ గలీజ్‌ కూతలు నేర్పిండు. అసలే మన యూనివర్సిటీ పోరలను ఇసుంటరారా నాయనా అంటే ఇల్లంత ఒచ్చే రకం. ముద్దుగ ఈడు నేర్పిన మాటలు శిల్క పలుకుల్లెక్క జోరుగ పలికిండ్రు.

నేను సూస్తనే ఉన్న అవుతలి దిక్కు సీఆర్పీయెఫ్‌ జవాన్లకు మంటలేశి టియర్‌ గ్యాస్‌ బుల్లెట్లు మా దిక్కు పేల్చిర్రు. నేను ఎంకకెనకు నడుస్తనే ఉన్న, ఒక టియర్‌ గ్యాసు షెల్‌ నా భుజానికి తాకి ఎనక పడ్డది.. మా మూర్తిగాడు నిజంగ మొండి పాసే. ఆ షెల్‌ తీస్కోని ముంగలికి ఉర్కి ఆ సీఆర్పీయెఫ్‌ జవాన్ల దిక్కు ఇసిరి మల్ల ఎనకకు ఉర్కొచ్చిండు. అప్పటివరకు నేను బండి తీసి తయ్యారుగున్న. ఆన్ని ఎక్కిచ్చుకొని ఇంటికాడ దింపేట్యాల్లకు కండ్లన్ని ఎర్రగయ్యి లేవలేకుంటయ్యిండు. మల్ల తెల్లారి ఆనికి జరం పట్టింది.  అయినా ఊకుంటమా మేము మల్ల తెల్లారి మిల్లియన్‌ మార్చ్‌కు తయారయ్యి ఆడ శితం దుమ్ములేపినం.


logo