ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 22:26:15

మంగయ్య అదృష్టం- పి.వి. నరసింహారావు

మంగయ్య అదృష్టం- పి.వి. నరసింహారావు

(దేవతలంతా బ్రహ్మదేవుని మీద కత్తిగట్టారు... ఆయన పాలన బాగోలేదని దుమ్మెత్తిపోశారు.  చతుర్ముఖుడు ఊరుకుంటాడా.  నా ప్రభావం ఏమిటో చూసేందుకు మంగయ్యను కేస్‌ స్టడీగా తీసుకుందామన్నాడు. దేవతలు వర్సెస్‌ బ్రహ్మ... మధ్యలో మంగయ్య- ఈ పోరు ఇప్పుడు రసకందాయంలో పడింది.)

మంగయ్యకు ఇరవై యొకటవ సంవత్సరం నడుస్తోంది. కోడె వయసులో మిసమిసలాడుతున్నాడు. వాడి పాలకుడికి వాడిపైన విశ్వాసం కుదిరింది. మాతృదేశ సేవా సందర్భంలో చేయవలసిన అనేక కార్యకలాపాల్లో -ముఖ్యంగా దుష్కార్య కలాపాల్లో, మంగయ్య నియామకం తప్పక జరిగేది. ప్రమాదపు పనులన్నీ మంగయ్య వాటాలోకి వస్తే, ప్రమాదం లేని పనులను నాయకుడే చూచేవాడు. అందుకని నాయకుడికి మించి ప్రమాదాలెదుర్కొనే మంగయ్యనే లోకులు మెచ్చుకోసాగారు. మంగయ్యను వెన్నాడుతున్న దేవతలకు ఈ పరిణామం మరింత నిరాశ కలిగించింది.

వారందరూ మరొక అత్యవసర సమావేశంలో కలుసుకున్నారు.

“వీడి కవచంలో ఎక్కడా వెంట్రుకవాసి సందున్నట్టు కనిపించడం లేదు!” అన్నాడొక దేవుడు.

“వాడికంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టుంది. ఏం చెయ్యాలి?” అని ప్రశ్నించాడు మరొక వేల్పు.

“అది కల్ల. ఈ మానవజాతిలోనూ, దాని స్థితిగతుల్లోనూ పర్ఫెక్ట్‌ అంటూ ఏదీ ఉండదు... ఒకవేళ పూర్వపు స్మగ్లర్‌ యజమానితో వచ్చినట్టి సంకటమే మంగయ్యకు ఈ నాయకుడితో కూడా తెచ్చి పెడితే...!”

“వండర్‌ ఫుల్‌!” అని అందరూ భళీ అన్నారు. ఈ మహాపన్నాగం మనకు ముందే ఎందుకు తోచలేదా అనుకున్నారు.

“అయితే ఒక చిక్కున్నట్టుంది. ఈ నాయకుడికి ఉంపుడు కత్తె ఉందో లేదో...”

“ఉంపుడు కత్తి లేకుంటేనేం? భార్య ఉంటే చాలదా?” అని ఠపీమని సమాధానం వచ్చింది.

“ఉండుంటుంది. కానీ ఉంపుడుకత్తె సన్నివేశం భార్యతో ఎలా పొసగుతుంది?”

“పిల్లల్లా మాట్లాడకు. మనం దేవతలం, ఏ సన్నివేశమైనా కల్పించగలం!”

వెంటనే అలాంటి సన్నివేశం కల్పించడంలో నిమగ్నులయ్యారు దేవతలు.

ఆ నాయకుడొక మంత్రిగారి వెంట జిల్లా పర్యటనకని వెళ్ళాడు. ఆయన భార్య మరుసటి రోజు తమ ఇంట్లో మంత్రి గారికివ్వనున్న డిన్నర్‌కు కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నురాలై ఉంది. మంగయ్య ఆమెకు సహాయం చేస్తున్నాడు. అదే సమయంలో పూర్వ నిర్ణయం ప్రకారం దేవతలందరూ అదృశ్యరూపంలో ఇంటినిండా తారాడుతున్నారు. చివరికేదో మిషపై మంగయ్య తన యజమాను రాలి బెడ్‌రూమ్‌ గడప దగ్గర ఆమెను కలుసుకునే సన్నివేశం కల్పించారు. ఆమె కాస్త గడపలోపల, మంగయ్య కాస్త బయట, వాయుదేవుడు ఆమె కొంగును పూర్తిగా తొలగించేశాడు. మదనుడేమో ఎప్పటిలాగే అసంఖ్య పుష్పబాణాలు కుప్పించాడు. ఆమె అంగ విన్యాసం మంగయ్యకు పూర్వమెన్నడూ కనిపించనంత మోహకంగా ఆ క్షణంలో కనిపించే అట్టు అదేదో కనుకట్టు చేశారు. ఆ ఒక్క క్షణంలో అతనికి మతిపోయే అట్టు మాయ చేశారు. అతనామె వైపు అడుగు వేయబోతున్న ఆ క్షణంలోనే, అక్కడే పొంచి ఉన్న అవతలి (అంటే బ్రహ్మానుకూల) ముఠా దేవతల్లో ఎవడో మంగయ్యను గది లోపలికి నెట్టి ఉంటాడు. ఇక వీడికి భరతం పట్టినట్టే అనుకున్నారు బ్రహ్మవిరోధి దేవతలు మహదానందంతో.. కాని ఏమాశ్చర్యం! యజమానురాలు గొంతు చించుకుని అరవడానికి బదులు చాటెడంత వికసించిన మొహంతో చారెడంత కళ్ళు మిటకరించింది. ఇంతలో రెండో ముఠా దేవుడెవడో బెడ్‌ రూమ్‌ తలుపు మూసి గడియ వేసేశాడు. ఇందులో మంగయ్య తప్పేముంది, దేవతల దుండగం కాకపోతే?

బ్రహ్మ విరోధి దేవతలు పిచ్చెత్తిన వాళ్ళై వాయువేగ మనోవేగాలతో దౌడు తీశారు నేరుగా బృహస్పతి ఆశ్రమానికి. “ఇదేమిటి మా దుర్గతి గురువర్యా?” అని భోరున ఏడుస్తూ ఆయన పాదాల మీద కుప్పకూలిపోయారు.

బృహస్పతి కాసేపు ఆలోచించి మూల సమస్య ఏమిటో నెమ్మదిగా విడమర్చి చెప్పాడు: “నా ప్రియ సహచరులారా! ఈ మానవజాతి స్వభావ వైచిత్య్రాన్ని మీరు బాగా అర్థం చేసుకోలేదేమో అని నాకనిపిస్తోంది. భోళా దేవతల్లాగా స్మగ్లర్‌ ఉంపుడుకత్తె స్పందిస్తుందని మీరనుకున్నారు. మీరేమీ అనుకోకపోతే అదే మీరు చేసిన పొరపాటంటాను. ఈ భారతదేశ వైవిధ్యం ఇంతా అంతా కాదు. ఈ దేశ వాసుల్లో ఎన్నో వేర్వేరు గుంపులున్నాయి. కొన్ని గుంపుల్లో దాంపత్య విషయాల్లో ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. భార్య గదిలో పరాయివాడి అలికిడి వినిపిస్తే భర్తకు వెంటనే ఏదో బయటిపని గుర్తుకొస్తుందని ప్రతీతి. కావున ఈ రెండు సందర్భాల్లో ఒకే కార్య సరళి ఎలా పనికొస్తుంది? ఈ వ్యత్యాసాల్ని బాగా అర్థం చేసుకుని మీ వ్యూహాలను నిర్ణయించుకోండి. మీకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!” అని హితబోధ చేశాడు.

అదే సమయంలో ఎన్నికలొచ్చాయి. భారతదేశంలో వాటిని గురించి దేవతలకేమీ తెలియదు. ఈ కొత్త ఘట్టం వారికెంతో వాచామగోచరంగా తోచింది. ఐనా పోరాటం సాగించకతప్పదు. ఇంతవరకూ వచ్చాక ఇక తిరోగమనానికి ఆస్కారం లేదు. ఆ కొద్ది సమయంలో అన్ని వివరాలు సేకరించి అన్ని విద్యలూ అభ్యసించవలసిందే. వేరు మార్గమే లేదు.

ఆనాడు దేవతల దుండగం వల్ల తన నాయకుని భార్యతో మంగయ్యకొక మధుర సంబంధ స్థాపన జరిగి ఐదేళ్ళు చూస్తూ చూస్తూ దొర్లిపోయాయి. ఆ వ్యవధిలో మంగయ్య తన చుట్టూరా ఒక వందిమాగధుల గుంపునూ, ఒక కండపుష్టి ముఠానూ తయారు చేసుకున్నాడు. ఎన్నో రాజకీయ పక్షాలు సపోర్టు కోరుతూ మంగయ్య నాశ్రయించాయి. ఒక పార్టీ వారు తమ టిక్కెట్టుపై శాసనసభకు పోటీ చేయమని కూడా ప్రోద్బలం చేశారు. కానీ అదృష్టం కలసి వచ్చినప్పుడు తెలివితక్కువతోపాటు ఎలాగో ఉద్భవించే ఒక నాటురకం తెలివితేటల వల్ల మంగయ్య తనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ తెరచి ఉంచుకుని అశేష లాభం పొందాడు. ఈ లోపల దేవతలు కుట్రపై కుట్ర పన్నుతూనే ఉన్నారు. మంగయ్యను ఓడించడానికి ఇదే వాళ్ళ చివరి ఛాన్స్‌. అదీ వాడు తానే ఏరికోరి ప్రవేశించిన ఎన్నికలాటలో శత్రువును తుపాకితో చంపిందానికంటే ఎన్నికల్లో ఓడించడం ప్రతీకారానికి సభ్య పద్ధతిగా భావించబడుతున్నట్టు వారు గమనించారు. అందుకని ‘ఎలాగో మంగయ్యని ఎన్నికల్లోకి లాగాలి. లాగి చిత్తు చిత్తుగా ఓడించేయాలి!’.... ఇదీ దేవతలు తల పెట్టిన 

ప్రతీకారచర్య.

మరి అదెలా సాధించాలి? దేవతలు ఆలోచించసాగారు. ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయించడమా? కాదు కాదు, ఓటర్ల విచిత్ర వైఖరి మూలాన ఒకవేళ కొంపదీసి మంగడే గెలిస్తే ఇంక మన దేవతల పరువు ప్రతిష్టలేం కావాలి? పోనీ, మంగయ్య చేత ఇండిపెండెంటుగా పోటీ చేయిస్తే? ఊహూఁ , అదీ కుదరదు. అప్పుడప్పుడూ రాజకీయ పార్టీల వారందరూ(ఓటర్ల మాటల్లో) పచ్చి మోసగాళ్ళని నిర్ణయించి ఎవడో అపరిచిత యువకుణ్ణి స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించవచ్చు వాళ్ళు. అలాగైతే మంగయ్యను అధికార పార్టీ అభ్యర్థి చేస్తే... అమ్మబాబోయ్‌! ఆ పని అసలే చెయ్యొద్దు. గతానుభవం వల్ల అధికార పక్షం పైన ఓటర్లు అస్తమానమూ కారాలు మిరియాలు నూరుతున్నా, ఆ పక్షానికి గెలిచే అనేక సౌలభ్యాలు ఇప్పటికీ ఉండడంచేత ఒకవేళ అభ్యర్థి చచ్చిచెడీ గెలిచిరావచ్చు కూడా... మొత్తం మీద దిక్కుతోచక కింకర్తవ్యతా మూఢులౌతున్నారు, తాము సాధించలేనిదేమీ లేదని విర్రవీగిన దేవతలు.

ఇంతలోనే వాళ్ళకొక రామబాణం లాంటి ఉపాయం తోచింది. ఇంక దానికి తిరుగులేదంటే లేదు. ఎంతకాదన్నా దేవతలు దేవతలే మరి! సంతోషపడుతూ, గర్వపడుతూ, వారు ముందు కార్యక్రమం సాగించారు. 

మంగయ్య ‘బాస్‌' దుర్గారావు రాజకీయ రంగంలో సుప్రసిద్ధుడయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పెద్ద పెద్ద నాయకులకూ, మంత్రులకూ, ఉన్నతాధికార్లకూ ఇస్తూ వచ్చిన అతిథి సత్కారాలూ అన్య సేవలూ ఫలించిన ఫలితంగా ననండి, ఆయన భార్య ఎంతో సౌజన్యభావంతో చేస్తూ వచ్చిన మహా మర్యాదల ఫలితమనండీ, ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభకు పోటీ చెయ్యడానికి ఆయనకు టిక్కెట్టివ్వడం జరిగింది. ఈ సందర్భంలో దేవతలు చేసిన కృషి కూడా మరువదగింది కాదు. ఆయనకు టిక్కెట్టు దొరకడమంటే అప్పుడే పదిమందిలో చర్చలోకి వచ్చిన మంగయ్యకు దొరికే ప్రమాదం తప్పిపోయినట్టేగా మరి! ఎలాగో ఆ పీడ వదిలిపోయినందుకు దేవతలందరూ సంతోషించారు.

ఐతే దుర్గారావుకు టిక్కెట్టు ఇప్పించడం మాత్రమే చాలదని దేవతలు గ్రహించారు. మంగయ్య మోసం చేసి, వేరు పార్టీల ప్రోద్బలానికి లొంగి ఏ క్షణంలోనైనా దుర్గారావును విడిచి స్వతంత్రుడుగా పోటీకి తయారుకాడని ఏం నమ్మకం? అదీగాక భాగ్య లేఖన శాఖవారు మంగయ్యకు సహాయం చేయాలనే దురుద్దేశంతో ఎవరిచేతనైనా వాడికలాంటి సహాయం చేయించి అభ్యర్థిగా నిలబెడతారో ఏమో? ఇంత దూరదృష్టితో ఆలోచించి మంగయ్య విరోధ ముఠా దేవతలు మరొక పాచిక వేశారు. logo