శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 22:02:16

ఎంత పెద్ద పక్షో...

ఎంత పెద్ద పక్షో...

ప్రపంచంలోని అతిపెద్ద పక్షుల్లో ఉష్ట్రపక్షి (ఆస్ట్రిచ్‌) మొదటిది. రెండోది ‘ఈము’. ఇది ఆస్ట్రేలియాకు చెందింది. కానీ అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే దీని జీవన విధానం అలాంటిది. ఈము గురించి మరింత తెలుసుకుందామా...

ఈము ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. దీని శాస్త్రీయ నామం ‘డ్రొమైస్‌ నొవాహలండై’ రేటైల్‌ జాతికి చెందింది. ఈ జాతి పక్షులకు రెక్కలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఎగురలేవు. ఆస్ట్రిచ్‌, రియా కసోవరి, కివీ పక్షులు కూడా ఈ జాతికి చెందినవే.  ఎత్తులోనే కాదు... వేగంగా పరుగుపెట్టే పక్షుల్లోనూ ఇదే రెండోది. ఇవి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో 30 నిమిషాలు ఆగకుండా పరుగెడతాయి. కాస్త నెమ్మదిగా నీటిలో కూడా ఈదగలవు. 5 నుంచి 6 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వీటి జీవితకాలం 25-30 ఏండ్లు. వీటి కాళ్లు బలంగా మూడు వేళ్లతో ఉంటాయి. ఇవి ఎంత బలమైనవంటే ఇనుప కంచెను కూడా కాళ్లతో విరిచేయగలవు.   మెడ పొడవుగా నీలం రంగులో ఉంటుంది. శరీరం అంతా గోధుమరంగులో ఉంటుంది. చర్మం మందంగా పొలుసులుగా ఉంటుంది. అందుకే ఏ వాతావరణాన్ని అయినా ఇవి తట్టుకోగలవు.  ఆకులను, కూరగాయలను, విత్తనాలను, పండ్లను తింటాయి.  చిన్నచిన్న పురుగుల్ని గుటుక్కుమనిపిస్తాయి. ఆహారం జీర్ణం కానప్పుడు గులకరాళ్లను మింగుతాయి. అరుదుగా మాత్రమే నీళ్లు తాగుతాయి.