బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 21:58:31

ఇంటి ద్వారం ఎదురుగా గేటు తప్పకుండా పెట్టాలా?

 ఇంటి ద్వారం ఎదురుగా గేటు తప్పకుండా పెట్టాలా?

- దానం రమేశ్‌, కేపీహెచ్‌బీ

 గేట్లు సింహద్వారాలకు ఎదురుగా పెట్టాలని చెప్పలేము. ఎందుకంటే,  ఒక్కో ఇంటికి  ఒక్కో వైశాల్యం కలిగిన స్థలం ఉంటుంది. తద్వారా ఇంటి ఆవరణ కొలతలు  మారిపోతూ ఉంటాయి. అప్పుడు గేటు సింహద్వారం ఎదురుగా రావడం మంచిది కాదు.  ఉత్తరం, దక్షిణం ఎక్కువ పొడవు కలిగిన దీర్ఘ చతురస్రపు స్థలంలో ఇల్లు కట్టినప్పుడు ఆ స్థలానికి తూర్పు వీధి వచ్చినప్పుడు ఆ స్థలంలో ఉచ్ఛమైన భాగంలో ఇంటి నిర్మాణం జరుపుతాము. ఆ ఇంటికి వచ్చే సింహద్వారానికి నేరుగా తూర్పు కాంపౌండుకు గేటు పెట్టినప్పుడు మొత్తం స్థలానికి ఆ గేటు ఆగ్నేయం అవుతుంది. కేవలం మన గృహం వరకే లెక్కించవద్దు. మొత్తం స్థలానికి గేట్లు కొలతలు వర్తిస్తాయి. కాబట్టి అన్నీ సరిచూసుకొని గేట్లు నిర్ణయించాలి. 

మురుగు నీటి  గుంతలు (మ్యాన్‌హోల్స్‌) ఇంటిచుట్టూ రావడం దోషం కాదా?

- వేదుల స్నిగ్ధ, భూపాలపల్లి

 ఇంటి నిర్మాణంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా ముఖ్యమైంది. దానితోనే ఇంటి వాడుక వేడుకలాగ ఉంటుంది. అందుకోసం టెక్నికల్‌గా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా నీరు నిలువ కాకుండా సరైన ‘వాటం’తో మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటు చేయాలి.  ఈ మ్యాన్‌ హోల్స్‌ వాస్తుకు విరుద్ధం కాదు.  ముఖ్యంగా మరీ లోతైన మ్యాన్‌ హోల్స్‌ రాకుండా రోడ్డు లెవెల్‌కన్నా మ్యాన్‌ హోల్స్‌ బాటమ్‌ ఎత్తుగా ఉండేలా ప్లాన్‌ చేయాలి. ఇంటి ఫ్లోరింగ్‌ తప్పనిసరిగా మూడున్నర అడుగుల నుంచి నాలుగు అడుగులు వచ్చినప్పుడు ఇంటి చుట్టూ వచ్చే మ్యాన్‌హోల్‌ గోతులు కావు. భూమి అడుగు లెవెల్‌తోనే ఉంటాయి. మ్యాన్స్‌ హోల్స్‌ అవసరమైన చోట తప్పక వస్తాయి, అవి తప్పుకాదు. 

దక్షిణం, పడమర మాకు ఎత్తుగా ఉంది. ఇంటిచుట్టూ ప్రదక్షిణం ఎలా ఉండాలో చెప్పండి.

- బత్తుల సారయ్య, వేములవాడ

కొన్ని ఇండ్లల్లో దక్షిణం, పడమర ఎత్తున్న స్థలాలు, బండ ఉన్న స్థలాలు తీసుకొని వాస్తుపరంగా గొప్ప స్థలం అని భావిస్తున్నారు. కానీ దానిలో ఇల్లు కట్టేటప్పుడు ఆ..దక్షిణ పడమరలు అలాగే ఉంచి కింద సెల్లార్‌లో నైరుతి కట్‌ చేస్తూ ఆఫీస్‌లు, గదులు కడుతున్నారు. అది పెద్ద దోషాలను కలిగిస్తుంది. విభజన సరిగాలేక ఎత్తు స్థలాలను ముందుగా సవరించుకోవాలి. ఆ ఎత్తు పల్లాలను ప్రదక్షిణ పూర్వకంగా ఉండటానికి అనుకూలమైన సవరణ, సమస్థితిని కలిగి ఉండేలా ‘మల్లం’ చేయించాలి. ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇల్లు రాకున్నా నైరుతి ఎత్తులో ఇల్లు కట్టుకున్నా ఇంటికన్నా చుట్ట్టూ ఆవరణ ఫ్లోరింగ్‌ తక్కువ ఎత్తు ఉండాలి. ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఖాళీని వదలాలి. ఇంటికి నైరుతి, దక్షిణం పడమర ఎత్తులో ఉండగానే సరిపోదు. అవన్నీ మన అడుగులు సాగడానికి అనుకూలమైనవిగా ఉండాలి. అప్పుడే మన గృహం మన ప్రదక్షిణాలతో వాడుకలోకి వచ్చి ‘శుభస్థలం’ అవుతుంది. 

ఈ శాస్త్రం గొప్పదే అయితే, అందరూ ఎందుకు పాటించడం లేదు?

- వెల్లుట్ల లత, కోదాడ

సిగరెట్‌ తాగడం అనారోగ్యం అని తెలియకనే చాలామంది సిగరెట్టు తాగుతున్నారా?  ఇదీ అంతే.  మనిషి అభ్యున్నతి కోసం అనేక శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు.  వాటిని ‘లక్ష్య పెట్టని’ నైజం మనిషికి ఎప్పటి నుంచో వుంది. ‘నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు ఉంటా’ అనే వ్యక్తి దరిదాపుల్లోకి కూడా శాస్ర్తాలు, ఆస్తికత చేరలేవు. అంతెందుకు గొప్ప పండితుల కడుపులోనే గొప్ప నాస్తికుడు పుడతాడు. ఇది కలియుగం. దీనికి ఉన్న లక్షణాలను బట్టి నడుచుకుంటుంది. నిజాన్ని, సత్యాన్ని ఈ కాలం మనుషులు తమకు అనుకూలంగా మలుచుకొని అనుసరిస్తుంటారు. ఈ  వాస్తు, జ్యోతిషం యుగాలనాటివి కాబట్టి, మనదాకా వచ్చాయి. వాటిలో నిజం లేకుంటే ఇంతకాలం బతికుంటాయా? అన్ని కాలాల్లో అజ్ఞానులు ఉంటారు. గాలి కనిపించదు కాబట్టి లేదని చెప్పగలమా? ఆకాశం ఉన్నదని చెప్పి దోసిట్లో పట్టగలమా?  ఏది ఏమైనా మానవాళికి జ్ఞానం ఉంది. పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగతం. శాస్త్రకారులకు సంబంధం లేదు.


logo