బుధవారం 05 ఆగస్టు 2020
Sunday - Jul 26, 2020 , 04:30:46

ఇమ్యూనిజం వర్ధిల్లాలి!

ఇమ్యూనిజం వర్ధిల్లాలి!

హితమైన ఆహారక్రమాన్నీ జీవన విధానాన్నీ పాటించేవారు, కోపతాపాది ఉద్వేగాలకు లొంగనివారు, సకల ప్రాణికోటిని ఆదరించేవారు, విచక్షణ పాటించేవారు.. ఎన్నటికీ వ్యాధుల బారిన పడరు.- చరక సంహిత

ఒకవైపు కరోనా.. ఇంకొకవైపు వర్షాల సీజన్‌.. ఎటు చూసినా ఇన్‌ఫెక్షన్ల బాధే. బయటకు రాకుండా ఇంట్లోనే వేడివేడి తిండి తినడం, ఒత్తిడి లేకుండా ప్రశాంత చిత్తంతో ఉండటమే వీటిని ఎదుర్కోగలిగే మందు. ఇది నవతరం డాక్టర్లు అంటున్నది కాదు. ఎన్నో ఏండ్ల క్రితమే మన భారతీయ మహావైద్యుడుచరకుడు తన చరకసంహితలో చెప్పిన మాట. అందుకే, ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండి.. వైరస్‌ను తరిమికొట్టండి.. అంటూ నినదిస్తున్నారు నిపుణులందరూ. కరోనాతోపాటు ఇతర ఇన్‌ఫెక్షన్లను కూడా దగ్గరికి రానివ్వని ఆ రోగనిరోధక శక్తి ఎక్కడుంది.. ఎలా పనిచేస్తుంది..? ఎలా పెంచుకోవాలి..? 

ఇద్దరూ ఎండలో తిరిగేవాళ్లే. కానీ, ఒకరికి మాత్రం ఎండ తగిలిన చర్మం అంతటా దద్దుర్లు వచ్చేస్తాయి. ఒకే చోటు, ఒకే రకమైన వాతావరణంలో ఉంటారు. అయినా  ఒకరికి మాత్రం జలుబు, ఆయాసం పట్టుకుంటాయి. ఇన్‌ఫెక్షన్‌ వస్తే కొందరికి చాలా తొందరగా తగ్గిపోతుంది. అదే ఇన్‌ఫెక్షన్‌ మరొకరిలో ఎంతకీ తగ్గదు. ఒకే రకమైన సర్జరీ అవుతుంది.. ఒకరు త్వరగా కోలుకుంటారు. మరొకరికి మాత్రం కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది.

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ విషయంలో కూడా ఇదే వింత. అదే కరోనా వైరస్‌.. కానీ రోజుల కొద్దీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ, ఊపిరందక కొందరి ప్రాణాలు పోతున్నాయి.  కొందరికి మాత్రం ఇన్‌ఫెక్షన్‌ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఒకే వైరస్‌.. ఒకరిని ప్రాణాపాయంలోకి నెడుతుంటే, మరొకరిని ఏమీ చేయలేకపోతున్నది ఎందుకు..?ఏమిటీ వింత...ఎందుకీ తేడా..? అదే.. మన శరీరంలో ఉన్న చిత్రం... వ్యాధి నిరోధక వ్యవస్థ... ఇమ్యూనిటీ!

అపరిచిత వ్యక్తి ఇంట్లోకి రాబోతుంటే వెంటనే అడ్డుకుంటాం. ఇంట్లో ఉన్న మనుషుల పైన దాడి చేయబోతే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. అవసరమైతే చేతికి దొరికిన వస్తువులనే ఆయుధాలుగా వాడుతాం. మనవల్ల కాకపోతే చుట్టుపక్కల వాళ్లను పిలుస్తాం. లేదా పోలీసులకు ఫోన్‌ చేస్తాం. ఏం చేసైనా ఆ హాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాం. మన శరీరం కూడా సరిగ్గా ఇలాగే ప్రతిస్పందిస్తుంది. శరీరానికి అపరిచితమైనది ఏది లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసినా అడ్డుకుంటుంది. మన శరీరంపై దాడి చేయబోయే ఆ అపరిచిత కణాలు, జీవులు, పదార్థాలపై (బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర హానికారకాలు) ప్రతిదాడికి ఆయుధాలను (వ్యాధి నిరోధక కణాలు, యాంటీబాడీలు) తయారుచేస్తుంది. వాటితో యుద్ధం చేసి, శరీరం నుంచి బయటికి తరిమేయడమో, చంపేయడమో చేస్తుంది. ఇదంతా ఒక యంత్రాంగం.. కనుసన్నలలో నడుస్తుంది. పైకి కనిపించే మన చర్మం నుంచి రక్తంలో ఉండే రక్షక కణాల దాకా.. అడుగడుగునా మన శరీరం తన చుట్టూ ఓ వలయాన్ని నిర్మించుకుని ఉంది. దీన్నంతటినీ కలిపి ‘వ్యాధి నిరోధక వ్యవస్థ’గా పరిగణిస్తాం. 

‘డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడితే వారం రోజుల్లో నయమయ్యే జలుబు, మందులు వాడకుంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది...’ అనేది  సరదాగా అనుకునే నానుడే అయినా చాలావరకు నిజమే. మందులు వాడకపోయినా దానికదే జబ్బును తగ్గించుకునే శక్తి మన శరీరానికి ఉంది. వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి వచ్చే ఆ శక్తిని ‘ఇమ్యూనిటీ’ అంటాం. నిత్యం మనకు తెలియకుండానే ఎన్నో రకాల సూక్ష్మజీవులు మనపై దాడిచేస్తూ ఉంటాయి. అవి దాడి చేసినప్పుడల్లా మన ఆరోగ్యానికి నష్టం వాటిల్లదు. దానికి కారణం మన శరీరాన్ని కాపాడుతూ ఉండే మనలోని రక్షణ వ్యవస్థే. చిన్న జలుబైనా, పెద్ద వ్యాధి అయినా దాన్ని తట్టుకుని, ఆరోగ్యంగా బయటపడాలంటే  వ్యాధినిరోధక శక్తి బాగుండాలి. యుద్ధంలో గెలువాలంటే పోరాట పటిమ ఉంటే సరిపోదు.. అవతలి వాళ్ల కన్నా ఎక్కువ బలం ఉండాలి. ఎవరు బలవంతులో  వాళ్లే యుద్ధంలో గెలుస్తారు. బ్యాక్టీరియా, వైరస్‌ లాంటి ఇన్‌ఫెక్షన్లకు లోనైనప్పుడు మన వ్యాధినిరోధక వ్యవస్థలోని రక్షక కణాలు యోధుల్లా పోరాడుతాయి. ఇవి ఎంత బలంగా ఉంటే మన వ్యాధి నిరోధకత అంత ఎక్కువగా ఉంటుంది. 

హెర్డ్‌ ఇమ్యూనిటీ

ఈ కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’. మన వాళ్లకు హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరుగుతున్నది. అందువల్ల కరోనాను మనం సులువుగా ఎదుర్కోగలమని చెప్తున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటే.. వ్యక్తిగతంగా కాకుండా ఒక సమాజంలో అభివృద్ధి చెందే వ్యాధి నిరోధక శక్తి. ఒక సమాజంలోని వ్యక్తుల్లో 60 శాతం మంది ఆ ఇన్‌ఫెక్షన్‌కు ప్రభావితమై, దాన్ని తట్టుకోగలిగి, జబ్బు నుంచి బయటపడితే ఆ సమాజానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందని అర్థం చేసుకోవాలి. అంటే, ఇన్‌ఫెక్షన్‌కు ప్రభావితమైన కొద్దీ క్రమంగా మనలో హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందుతుందన్నమాట. అయితే, ఇప్పటి అధ్యయనాలను బట్టి మనకింకా హెర్డ్‌ ఇమ్యూనిటీ రాలేదనే చెప్తున్నారు వైద్యులు. కరోనా వైరస్‌ పదే పదే తన నిర్మాణాన్ని మార్చుకోవడమే ఇందుకు కారణం. వైరస్‌పైన ఉండే ప్రొటీన్‌ మార్కర్లు మారితే మెమొరీ కణాలు దాన్ని గుర్తుపెట్టుకోలేవు. అందువల్ల కొవిడ్‌-19కి వ్యతిరేకంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ రావడానికి ఇంకా సమయం పడుతుంది. 

సహజసిద్ధం.. ఇన్నేట్‌ ఇమ్యూనిటీ

కరోనా పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా మన భారతీయులపై ప్రభావం చూపడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు మనకు సహజసిద్ధంగా ఉన్న వ్యాధి నిరోధక శక్తే కారణమని అంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనం ప్రకృతికి దగ్గరగా పెరుగుతాం. ఫలితంగా వాతావరణంలో సాధారణంగా ఉండే అనేక రకాల సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. అవి మన వ్యాధినిరోధక వ్యవస్థను ప్రేరేపించడంతో క్రమంగా అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి వాళ్లకు తరచుగా వచ్చే ఇన్‌ఫెక్షన్లు కూడా కారణమేనని అందుకే అంటారు. తరువాత తల్లిపాల ద్వారా ఇమ్యూనిటీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇలా పుట్టుకతోనే స్వాభావికంగా ఉండే వ్యాధినిరోధక శక్తిని ‘ఇన్నేట్‌ ఇమ్యూనిటీ’ అంటారు. మన చర్మంపైన, జీర్ణకోశ వ్యవస్థలో.. ఇలా శరీరంలో చాలా చోట్ల సాధారణంగా ఎన్నో రకాల బాక్టీరియా ఉంటాయి. ఫంగల్‌ స్పోర్స్‌ ఉంటాయి వీటిని ‘కమెన్సల్స్‌' అంటారు. కానీ, మనకు సహజసిద్ధంగా పుట్టుకతోనే లభించిన వ్యాధి నిరోధక శక్తి వీటివల్ల హాని కలుగకుండా అడ్డుకుంటుంది. కొన్ని రసాయనాలు ఈ రకమైన నిరోధకత రావడానికి కారణమవుతాయి. గర్భవతులుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లల్లో తీసుకునే ఆహారం ఇన్నేట్‌ ఇమ్యూనిటీ పెరుగుదలకు దోహదం చేస్తుంది. వ్యాధినిరోధకత సమపాళ్లలో ఉన్నప్పుడు ఇన్‌ఫెక్షన్లు వస్తాయిగానీ కంట్రోల్‌ అవుతాయి. జబ్బు చేసినా, శస్త్ర చికిత్సలైనా తొందరగా కోలుకుంటారు. కాని ఇమ్యూనిటీ లోపిస్తే ఇలాంటి సాధారణ సూక్ష్మజీవులు కూడా ఇన్‌ఫెక్షన్లను (ఆపర్చునిస్టిక్‌ ఇన్‌ఫెక్షన్‌) కలిగిస్తాయి. 

కణాల రక్షణ వలయం

బోన్‌ మ్యారో..వ్యాధి నిరోధక వ్యవస్థలో కీలకమైన భాగం. శోషరస వ్యవస్థ (లింఫ్‌ గ్రంథులు, లింఫ్‌), థైమస్‌ గ్రంథి, కాలేయం, ప్లీహం కూడా ఇమ్యూన్‌ వ్యవస్థలో భాగాలే. శరీరానికి హాని కలిగించే ఏ పదార్థాన్ని అయినా నాశనం చేసే వ్యాధి నిరోధక కణాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ముఖ్యంగా బి-కణాలు, టి-హెల్పర్‌, టి-సైటోటాక్సిక్‌ అనే మూడు రకాల కణాల్లో ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి యాంటీబాడీలను (బి-కణాలు) ఉపయోగిస్తే ‘యాంటీబాడీ ఇమ్యూనిటీ’ అనీ, ఇతర వ్యాధి నిరోధక కణాలను (టి-కణాలు) ఉపయోగిస్తే ‘సెల్‌ మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ’ అనీ అంటారు. బోన్‌మ్యారోలో ఉండే మూలకణాలు (స్టెమ్‌ సెల్స్‌) బి, టి కణాలను ఉత్పత్తి చేస్తాయి. బి కణాల ఉపరితలం మీద ఇమ్యునోగ్లోబ్యులిన్లు (యాంటీబాడీలు) ఉంటాయి. టి-కణాలు థైమస్‌ గ్రంథిలో పరిణతి చెందుతాయి. ఈ రెండూ రక్తం, శోషరస వ్యవస్థలోకి విడుదలవుతాయి. 

ఎందుకు తగ్గుతుందంటే?

పుట్టుకతోనే వ్యాధినిరోధక వ్యవస్థలో లోపాలు ఉండటం వల్ల గానీ, హెచ్‌ఐవి లాంటి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల గానీ వ్యాధినిరోధక శక్తి లోపిస్తుంది. ప్రైమరీ ఇమ్యునోడెఫీషియన్సీ (పుట్టుకతోనే ఇమ్యూనిటీ లోపం) సాధారణంగా జన్యుపరమైన కారణాల వల్లనే ఉంటుంది. జన్యులోపాల వల్ల థైమస్‌ గ్రంథి సరిగా పనిచేయకపోవచ్చు. ఏర్పడకపోవచ్చు. ఇలాంటప్పుడు టి లింఫోసైట్లు తగినన్ని ఏర్పడవు. దాంతో బి లింఫోసైట్ల ఉత్పత్తిపై కూడా ప్రభావం ఏర్పడుతుంది. తద్వారా ఇమ్యూనిటీ లోపిస్తుంది. సివియర్‌ కంబైన్డ్‌ ఇమ్యునో డెఫీషియన్సీ (ఎస్‌సిఐడి), కామన్‌ వేరియబుల్‌ ఇమ్యునోడెఫీషియన్సీ (సివిఐడి), బబుల్‌ బాయ్‌ సిండ్రోమ్‌ లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇలా పుట్టుకతోనే ఇమ్యునిటీ లోపించడం వల్ల నియంత్రించలేని విధంగా పదే పదే ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి పిల్లలు ఎక్కువ కాలం బతకరు. హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ వల్ల లింఫోసైట్లు దెబ్బతింటాయి. లింఫోసైట్‌ కణం లోపలికి వెళ్లిన ఈ వైరస్‌ దాని జన్యుపదార్థాన్ని డ్యామేజీ చేస్తుంది. సిడి4 కణాలు దెబ్బతింటాయి. ఎన్‌కె సెల్స్‌ తగ్గుతాయి. అందువల్ల హెచ్‌ఐవి ఉన్నవాళ్లకు తొందరగా ఇన్‌ఫెక్షన్లు రావడమే కాకుండా క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. మధుమేహం, స్థూలకాయం లాంటి జీవనశైలి వ్యాధులు ఉన్నప్పుడు కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. 

ఆయుర్వేదం ఏం చెబుతున్నది?

మనవైద్యమైన ఆయుర్వేదం ప్రకారం ఇమ్యూనిటీ అంటే ఓజస్సు. ఇది పెరిగి, రోగం తగ్గాలంటే ఆహార, విహార, ఔషధాలనే మూడు పద్ధతులు పాటించాలి. అందుకే ఔషధాల్లా పనిచేసే అల్లం, పసుపు, జీలకర్ర, మిరియాల వంటి వాటిని ఆహారంలో భాగం చేసింది. ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచేవే. విహారం అంటే వ్యాయామం జీవనశైలిలో భాగమని కొన్నేండ్ల క్రితమే మన భారతీయ వైద్యులు తెలిపారు. కొవిడ్‌ మాత్రమే కాదు.. ఏ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవాలన్నా వేడి వేడి ఆహారం  తీసుకోవడం, గోరువెచ్చని నీరు తాగడం చాలా అవసరమంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ సీజన్‌లో ప్రతిరోజూ పొద్దున్నే అల్లం, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, పుదీనా వంటివి వేసి, తయారుచేసిన కషాయం తాగాలి. రోజూ ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతమై, వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపించే ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. 

బి కణాలు

ఇవి ప్లాస్మా కణాలుగా మారి ఒకవైపు యాంటీబాడీలను, మరోవైపు బి-మెమరీ కణాలను ఉత్పత్తి చేస్తాయి. యాంటీబాడీలు వ్యాధికారక జీవిపై ఉండే యాంటిజెన్‌ (ఒక రకమైన ప్రొటీన్‌)తో చర్యలు జరిపి దాన్ని నిర్వీర్యం చేస్తాయి. మెమరీ కణాలు వాటి యాంటిజెన్లను గుర్తు పెట్టుకుని, అవి మళ్లీ దాడి చేసినప్పుడు చర్యలు జరిపేందుకు సిద్ధంగా ఉంటాయి. ఫలితంగా జబ్బు రాగానే వెంటనే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ (వ్యాధినిరోధక చర్య) జరుగుతుంది. అందువల్లే మనకు కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు ఒకసారి వస్తే మళ్లీ రావు. వాక్సిన్‌ తీసుకున్నప్పుడు కూడా ఈ బి మెమరీ కణాలే ఆ వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. 

టి కణాలు

వీటిలో కొన్ని మాక్రోఫేజ్‌లుగా మారి, అపరిచిత హానికారక కణాలను మింగేస్తాయి. వాటి యాంటిజెన్లను టి-హెల్పర్‌ (టిహెచ్‌) కణాల దగ్గరకు తీసుకెళ్తాయి. అప్పుడు టిహెచ్‌ కణాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా బి-కణాలను ప్రేరేపిస్తాయి. ఇవి ఇంటర్‌ల్యూకిన్లు, లింఫోకైన్స్‌ అనే ప్రొటీన్లను కూడా విడుదల చేస్తాయి. ఇంటర్‌ల్యూకిన్లు సైటోటాక్సిక్‌ టి-కణాలను (కిల్లర్‌ కణాలు) ప్రేరేపిస్తాయి. ఇవి ఎఫెక్టార్‌ టిసి (సైటోటాక్సిక్‌-టి), టి మెమొరీ (టిఎం) కణాలుగా మారుతాయి. వీటిలో టి మెమరీ కణాలు లింఫ్‌ గ్రంథుల దగ్గరికి వెళ్లి, మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ (సెకండరీ) వచ్చినప్పుడు దానితో పోరాడుతాయి. 
ఎన్‌కె సెల్స్‌ - క్యాన్సర్‌ ఎవరికైనా రావచ్చు. కానీ కొందరిలో ఎన్‌కె సెల్స్‌ క్యాన్సర్‌ రాకుండా ఆపుతాయి. గొంతు, సర్విక్స్‌ లాంటి భాగాల్లో హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్‌వల్ల క్యాన్సర్‌ వస్తుంది. ఇలా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే క్యాన్సర్లను ఎన్‌కె సెల్స్‌ అడ్డుకుంటాయి. అసాధారణ కణం కనిపించిన వెంటనే దాన్ని చంపివేస్తాయి. కొన్ని రకాల రసాయనాలవల్ల లింఫోసైట్లు ఎన్‌కె సెల్స్‌గా మారుతాయి. 

ఇమ్యూనిటీ.. ఇలా పెంచుకుందాం

  • అసలే వర్షాకాలం ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. దీనికి కరోనా తోడయింది. రాబోయేది చలికాలం. ఎటు చూసినా ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. వర్షాకాలం వచ్చే డెంగ్యూ, మలేరియా లాంటివాటిని దోమల్ని అరికట్టడం ద్వారా నివారించవచ్చు. కాచి వడబోసిన నీరు తాగుతూ వర్షాకాలపు ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవచ్చు.  కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ.. కొంతవరకు సురక్షితంగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ, దీన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం మనలోపలి రక్షక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం. వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. 
  • శారీరక వ్యాయామం : వ్యాయామం చేసినప్పుడు మనం శ్వాస ప్రక్రియ వేగం పెరుగుతుంది. ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటాం. దాంతో గుండె పంపింగ్‌ బాగా జరుగుతుంది. ఫలితంగా రక్తప్రసరణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వ్యాధినిరోధక వ్యవస్థ ప్రేరేపితం అవుతుంది. అంతేగాక కొవ్వు కరిగి శరీరంలోని హానికర పదార్థాలు వెళ్లిపోతాయి. మెటబాలిజమ్‌ వేగవంతం కావడంతో బోన్‌మ్యారో ఎక్కువ కణాలను తయారుచేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో యాంటి ఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఫీల్‌ గుడ్‌ హార్మోన్లయిన ఎండార్ఫిన్లు పెరుగుతాయి. అందుకే రోజూ గంట సేపైనా వ్యాయామం చేయాలి. 
  • మానసిక ప్రశాంతత : ఒత్తిడివల్ల కార్టిసాల్‌ హార్మోన్‌ పెరుగుతుంది. ఇది శరీర జీవక్రియలన్నింటిపైనా ప్రభావం చూపిస్తుంది. బీపీ, షుగర్‌ పెరుగుతాయి. యాంగ్జయిటీ ఎక్కువ అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉంటే రోగాలతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. అందుకే, అధిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రాణాయామం, యోగా చేయాలి. సానుకూల దృక్పథం అలవరచుకోవాలి. టైం మేనేజ్‌మెంట్‌  అలవాటు చేసుకోవాలి. 
  • కంటినిండా నిద్ర : పొద్దంతా పనిచేస్తున్నప్పుడు శరీరం లోపల చిన్నచిన్న గాయాలు అవుతాయి. కండరాలు సన్నగా చిరిగిపోవచ్చు. ఇలాంటి ఎన్నో మరమ్మతులు మనం నిద్రలో ఉన్నప్పుడు జరుగుతాయి. తగినంత నిద్ర ఉంటే శరీర అవయవాల పైన ఒత్తిడి తగ్గి వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అందుకే రోజుకి 8 గంటల నిద్ర తప్పనిసరి. 
    • జీవనశైలి: మన శరీరం నడవడానికి, అటూ ఇటూ తిరగడానికి డిజైన్‌ చేయబడింది. కానీ  నడవడం ఎప్పుడో మర్చిపోయాం. అన్నీ కూర్చుని చేసే పనులే. దాంతో కేలరీల వినియోగం జరగట్లేదు. కొవ్వు పేరుకుపోయి వ్యాధి నిరోధక వ్యవస్థను స్తబ్దుగా ఉండేలా చేస్తున్నది. అందుకే, అపసవ్య జీవనశైలి నుంచి బయటపడాలి. వీలైనంత ఎక్కువగా నడుస్తూ ఉండాలి. 
  • దురలవాట్లకు దూరం: పొగతాగడం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లు శరీరంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తాయి. ఇమ్యూన్‌ సిస్టమ్‌లో భాగమైన కాలేయంపై ఆల్కహాల్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే మన ఇమ్యూనిటీ అంత బలంగా ఉంటుంది. 
  • మంచి ఆహారం: వ్యాధి నిరోధక కణాల ఉత్పత్తిని పెంచేవి, ఇమ్యూనిటీని బలోపేతం చేసే పోషకాలు ఆహారం ద్వారానే అందుతాయి. యాంటి ఆక్సిడెంట్లు, జింక్‌, ఐరన్‌ లాంటి ఖనిజ లవణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. జింక్‌ ఎక్కువగా తీసుకుంటే వైరస్‌ శరీరంలోకి వచ్చినా తొందరగా వైరల్‌ లోడ్‌ తగ్గుతుంది. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా తగినన్ని యాంటి ఆక్సిడెంట్లు, సూక్ష్మపోషకాలు అందుతాయి. ప్రాసెస్‌ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. చాలామంది పిల్లలకు పండు కొనివ్వడానికి బదులు అయిదు రూపాయల చిప్స్‌ ప్యాకెట్‌ కొనిస్తుంటారు. ఇలాంటి అలవాట్లవల్ల చిన్నప్పటి నుంచే వ్యాధి నిరోధక వ్యవస్థ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అందుకే, పిల్లలుగా ఉన్నప్పుడే మంచి ఆహారాన్ని అలవాటు చేయాలి. 
  • సప్లిమెంట్లు: విటమిన్లు, మినరల్స్‌ తక్కువ మోతాదులో అయినప్పటికీ మనకు అత్యంత అవసరమైనవి. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలని చెప్తున్నారు. అయితే కొన్ని విటమిన్లను సొంతంగా వాడకూడదు. విటమిన్‌ ఎ, డి, ఇ, కె లాంటివి పరిమితికి మించి తీసుకుంటే అనర్థం. విటమిన్‌ డి పరిమితి దాటి ఎక్కువగా తీసుకుంటే క్యాల్షియం అంతా అదే తీసేసుకుని శరీరానికి హానికరంగా పరిణమిస్తుంది. అందుకే, వీటిని డాక్టర్‌ సూచిస్తే తప్ప తీసుకోకూడదు. ఆడవాళ్లకు 35 ఏండ్లు దాటాక కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ సప్లిమెంట్లు తీసుకోవాల్సి వస్తుంది. అయితే డాక్టర్‌ సలహాతోనే వాడాలి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ఇమ్యూనిటీ పెరగడానికి జింక్‌, విటమిన్‌ సి, బి-కాంప్లెక్స్‌ సప్లిమెంట్లను ప్రతిరోజూ ఒక టాబ్లెట్‌ చొప్పున వాడవచ్చు.


logo