గురువారం 13 ఆగస్టు 2020
Sunday - Jul 26, 2020 , 03:50:09

గమ్యం కాదు.. ప్రయాణం ముఖ్యం

గమ్యం కాదు.. ప్రయాణం ముఖ్యం

‘కెరీర్‌ పరంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. మనదైన పంథాను సృష్టించుకోవాలి. ప్రయాణమే అన్నీ నేర్పిస్తుంది..అని అన్నయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. నేనూ అదే ఫిలాసఫీని నమ్ముతా’ అని అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. ‘దొరసాని’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారాయన. తొలి సినిమాతోనే ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సోదరుడు, అగ్రహీరో విజయ్‌ దేవరకొండ రూపంలో కావాల్సినంత మోరల్‌ సపోర్ట్‌ ఉంది. ప్రయాణించాల్సిన మార్గం సుస్పష్టంగానే కనిపిస్తోంది. అయినా స్వీయ ప్రతిభతో, వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకొని నటుడిగా రాణించడమే తన లక్ష్యమని చెబుతున్నారు ఆనంద్‌ దేవరకొండ. ‘బతుకమ్మ’ పలుకరించినప్పుడు ఆయన చెప్పిన సంగతులివి..

దొరసాని’ తర్వాత  ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌' సినిమా చేశాను. గుంటూరు నేపథ్యంలో సాగే కథ ఇది.   వినోదంతో పాటు చక్కటి కుటుంబ అనుబంధాల్ని ఆవిష్కరిస్తుంది. 

‘దొరసాని’లో నేను అంతర్ముఖుడిగా, కాస్త సిగ్గరిగా  కనిపించాను. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'లో నా క్యారెక్టర్‌ అందుకు  భిన్నం. ఆవేశపరుడైన యువకుడిగా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటాను. ఈ సినిమా కోసం రెండు నెలలు  వర్క్‌షాప్‌ చేశాం. యాసలో మాట్లాడటానికి  దర్శకుడి దగ్గర శిక్షణ తీసుకున్నా.  టీమ్‌లో కొంతమంది గుంటూరు ప్రాంతానికి చెందిన వారు ఉండటంతో ఆ యాస నేర్చుకోవడం  ఈజీ అయింది. ‘దొరసాని’లో తెలంగాణ యాసలో మాట్లాడటం...రెండో సినిమాలో గుంటూరు యాసను అడాప్ట్‌ చేసుకోవడం పాత్రలపరంగా గొప్ప అనుభవంలా అనిపించింది.

నా సినిమాల గురించి ..

 ఇంతకు ముందు అన్నయ్య ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. లాక్‌డౌన్‌లో ఖాళీ దొరికింది.  అంతకుముందు నా సినిమా కథల గురించి అన్నయ్యకు చెబుదామంటే టైమ్‌ ఉండేది కాదు. అయితే ఎంత బిజీగా ఉన్నా .. స్టోరీ బేసిక్‌ లైన్‌ ఏమిటి? దర్శకుడికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఉంది? అంతకుముందు ఏమైనా ఫిల్మ్స్‌ చేశాడా? ఇలాంటివి  తెలుసుకునేవాడు. ఇప్పుడు టైమ్‌ ఉంది కాబట్టి, సినిమాల పూర్తి వివరాలు నేనే చెబుతున్నా.

కాలనీ ఫ్రెండ్స్‌లా ఉంటాం

అన్నయ్యకూ నాకూ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. చిన్నప్పటి నుంచీ కాలనీల్లో కలిసి పెరిగిన ఫ్రెండ్స్‌లా ఉంటాం. స్కూల్‌ రోజుల్లో  ఎక్కువగా క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లం. ఇప్పటికీ  కొనసాగిస్తున్నాం. ఇద్దరం కలిస్తే ఎక్కువగా  గేమ్స్‌ ఆడతాం. సినిమాలు, సిరీస్‌లు చూస్తుంటాం.   డస్ట్‌బిన్‌ పక్కన దాచిపెట్టాడు

అన్నయ్య, నేను పుట్టపర్తిలోని  బోర్డింగ్‌ స్కూల్లో చదువుకున్నాం. అన్నయ్య మూడో తరగతిలో ఉన్నప్పుడు నేను ఫస్ట్‌ క్లాస్‌లో జాయిన్‌ అయ్యాను. సాధారణంగా హాస్టల్స్‌లో ఉంటే హోమ్‌సిక్‌గా అనిపిస్తుంది. అన్నయ్య ఉన్నాడు కాబట్టి నేను   ధైర్యంగా ఉండేవాడిని.  డిన్నర్‌   తర్వాత అన్నయ్య చదువుకునే స్టడీ రూమ్‌కు వెళ్లి అక్కడే ఉండేవాడిని. టీచర్‌ వచ్చినప్పుడు అన్నయ్య నన్ను డోర్‌ దగ్గర ఉండే డస్ట్‌బిన్‌ పక్కన దాచిపెట్టేవాడు. స్కూల్‌రోజుల్లో అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ‘చిన్నప్పటి నుంచి నువ్వు నన్నే ఫాలో అవుతుంటావురా’ అని విజయ్‌ అన్న ఇప్పటికీ  అంటుంటాడు.

మా ముగ్గురి కల అది

కరోనా సంక్షోభంలో మేం ఆరంభించిన ‘మిడిల్‌క్లాస్‌ ఛారిటీ ఫండ్‌'కు అద్భుతమైన స్పందన లభించింది. తమ బాధల్ని, కష్టాల్ని బయటకు చెప్పుకోలేని మధ్యతరగతి కుటుంబాల్ని శక్తిమేర ఆదుకున్నామనే సంతృప్తి మిగిలింది.  నాకు చారిటీ కార్యక్రమాలు చాలా ఇష్టం. అర్బన్‌ ఫారెస్ట్రీ, చెరువుల్ని పరిరక్షించే చర్యల్ని చేపట్టాలనే ఒక ప్లాన్‌ ఉంది. అందుకు భారీ వనరులు అవసరమవుతాయి. హైదరాబాద్‌ ఒకప్పుడు వందల సరస్సులతో అందంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ కనుమరుగవుతున్నాయి. నగరం అవతల ఏదైనా చెరువును పునరుద్ధరించి.. దానికి నలువైపులా చెట్లను పెంచి ఓ అరణ్యంలా తయారుచేయాలన్నది నాకు, అన్నయ్యకు, నాన్నకు ఓ డ్రీమ్‌. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. 

ఇప్పుడే పెళ్లి వద్దంటున్నాడు

అన్నయ్య దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ‘ఇప్పుడైతే ఆ ఉద్దేశం లేదు’ అని చెబుతాడు. కొంతకాలం సింగిల్‌గా ఉంటే కెరీర్‌ మీద  ఫోకస్‌ చేయొచ్చనే ఆలోచన కావచ్చు. ఓ సందర్భంలో అన్నయ్య పెళ్లి గురించి మట్లాడుతూ.. ‘వయసు పైబడితే పెళ్లి చేసుకోలేకపోయానే? పిల్లలు ఉంటే బాగుండేది కదా? అని ఎవరూ బాధపడొద్దు. పెళ్లి విషయంలో ఎవరైనా సరే రైట్‌ టైమ్‌లో డెసిషన్‌ తీసుకోవాలి’ అన్నాడు. 

సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నాడు

నేను హీరోగా అరంగేట్రం చేయబోతున్నానని నాన్న..అన్నయ్యతో చెప్పినప్పుడు ‘కెరీర్‌ విషయంలో మీరు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏ విషయంలోనూ అడ్డుచెప్పలేదు. ఆనంద్‌ను కూడా అదే పద్ధతి ఫాలో అవమని చెప్పండి. ప్రయాణమే అన్నింటిని నేర్పిస్తుంది. ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాడు. అయితే సినిమానే ప్రేమిస్తూ కష్టఫలాన్ని నమ్మే  వ్యక్తులతో మాత్రమే కలిసి కెరీర్‌ కొనసాగించాలి. అప్పుడు అపజయాలు ఎదురైనా మంచి విషయాల్ని నేర్చుకున్నామనే సంతృప్తి ఉంటుంది’ అని అన్నయ్య సలహా ఇచ్పాడు. అన్నయ్య ఫిలాసఫీని నేను నమ్ముతాను.

మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అమ్మానాన్నా ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా ఇద్దరికి క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందించారు. కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ వాళ్ల అభిప్రాయాల్ని మాపై రుద్దలేదు. మాకు ఇష్టమైన రంగాల్ని ఎంచుకుంటే ప్రోత్సహించారు.  నటుడు కావాలన్నది ఒకప్పటి నాన్న కల. కుటుంబ బాధ్యతలతో పాటు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో దానిని నెరవేర్చుకోలేకపోయారు. అన్నయ్య  హీరో అవడంతో నాన్న డ్రీమ్‌ తీరిపోయింది. అన్నయ్య విజయం తాలూకు ఆనందాన్ని అమ్మానాన్నా పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. తొలుత ఏదైనా ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌  చేద్దామనే ఆలోచనతో నన్ను అమెరికా నుంచి ఇండియాకి  రమ్మని చెప్పారు. ఇక్కడకు వచ్చిన తర్వాత యాక్టింగ్‌ వైపు మనసు మళ్లింది. ఎలాంటి ముందస్తు ప్లాన్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చాను. అంచనాలు లేకుండా చేస్తున్న ఈ ప్రయాణమే చాలా బాగుంది. సహజత్వాన్ని, వాస్తవిక జీవితాన్ని ప్రతిబింబించే పాత్రల ద్వారా నటుడిగా నిరూపించుకోవాలని ఉంది. నాన్నకు యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. కార్తీ ‘ఖైదీ’ మాదిరిగా పక్కా నేటివిటీని చూపించే సినిమాల్లో నన్ను హీరోగా చూడాలన్నది నాన్న ఆశ.logo