గురువారం 13 ఆగస్టు 2020
Sunday - Jul 26, 2020 , 03:39:06

కలగూరగంప!

కలగూరగంప!

కరోనా.. మన మూలాల్ని గుర్తుచేసింది. ‘పల్లె జీవనం గడుపుదాం’ అనే ఆలోచనను రేకెత్తించింది. ఊర్లలో అయితే చెట్లు.. చేమలు.. స్వచ్ఛమైన కూరగాయలు.. పండ్లు.. సహజమైన వంట దొరుకుతాయి. ఆహ్లాదంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా బతికే అవకాశం కలుగుతుంది. కానీ.. ఉన్నట్టుండి పట్నం వదిలి వెళ్లగలమా? పట్నంలోనే పల్లె జీవనపు అనుభూతిని పొందలేమా? ఏమో.. పట్లోళ్ల శ్రీదేవి ‘కలగూరగంప’ మనల్ని పల్లెవాసులుగా మార్చొచ్చేమో?! 

చిల్కూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్లే దారి.. గేటెడ్‌ గృహసముదాయాలు.  అందులోనే అందంగా ముస్తాబైన ఓ ఇల్లు.. అందంగా అంటే.. అద్దాల మేడ కాదు..  లతలు.. తీగలు వేలాడుతూ.. పచ్చని పందిరివేసినట్లున్న ఇల్లు.. పల్లెలో ఉన్నట్టు అరుగు.. దానిమీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్న మహిళలు..

ఆషాఢమాసపు చల్లని గాలులు వీస్తుండగా.. సుగంధ ద్రవ్యాల సువాసనలు గుప్పుమంటున్నాయి.. పచ్చని పందిళ్ల చిగురుటాకులు రారమ్మన్నట్టు స్వాగతం పలుకుతున్నాయి. ఆ ఇంటి ఓనరే పట్లోళ్ల శ్రీదేవి. ఆమె ఒక ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌.

‘కలగూరగంప’ అనే యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా పల్లె సంస్కృతిని ప్రతిబింబిస్తూ దేశ విదేశ్లాలో ఉన్నవారికి మూలాల్ని పరిచయం చేస్తూ.. ఊరికి రప్పిస్తున్న ఆదర్శ మహిళ. ఆ ఇంటి లోపలికి వెళ్లీ వెళ్లగానే కనిపించే వెంపలి చెట్టు. ఎంతకాలమవుతుందో కదా వెంపలిచెట్టును చూసి? ‘కామంచి పండ్ల’ రుచి చూడక ఎన్ని రోజులు అవుతుంది? ‘సోంపు’ తినడమే కానీ మొక్కల్ని ఎప్పుడైనా చూశామా?.. ఇవన్నీ చూస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. పట్నం పక్కనే గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్నామా? లేక పల్లెటూర్లో ఉన్నామా? అన్న ఆలోచన కలుగుతుంది. గజిబిజి జీవితంలోపడి మూలాల్ని మరచిపోతున్నామనే భావన స్ఫురణకు వస్తుంది. ఆ ఆలోచనతోనే పట్లోళ్ల శ్రీదేవి ఓ కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు.

బాల్యమంతా పల్లెలోనే: శ్రీదేవిది వికారాబాద్‌ దగ్గర్లోని ఒక చిన్న పల్లెటూరు. బాల్యమంతా గ్రామీణ ప్రాంతంలోనే గడిచింది. తండ్రి ప్రభుత్వ టీచర్‌. తల్లి ప్రొఫెసర్‌. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల్లో బిజీగా ఉండటంతో  నాన్నమ్మ.. తాతయ్యలతో ఎక్కువ అనుబంధం ఏర్పడింది. వాళ్లతో

కలిసి పొలానికి వెళ్లడం కలిమికాయలు.. సీతాఫలం.. అల్లనేరేడు పండ్లు.. బలుసుడు పండ్లు వంటివన్నీ ఆస్వాదించేవారు. బాల్యంలో గట్లపైన దొరికే పొన్నగంటి కూర.. బచ్చెలి కూర.. పిండిపువ్వు కూరతోనే ఇంట్లో భోజనాలు ఉండేవి.  చాలా ఇష్టంగా తినేవారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇవన్నీ వైద్య విలువలు ఉన్న ఆకుకూరలు. నిత్యం తింటే ఏ రోగాలూ.. నొప్పులూ దరిచేరవు. బ్రేక్‌ఫాస్ట్‌.. స్నాక్స్‌లో జొన్నరొట్టెలు.. తైదంబలి.. బొబ్బెరి గుడాలు.. చిట్టి ఉలువలు ఉండేవి. ప్రకృతి జీవనమంటే ఆమెకు చాలా ఇష్టం. చదువు పూర్తయ్యాక.. పెండ్లయ్యాక ఇవన్నీ ఉండవేమో అని ఎప్పుడూ బాధ పడుతూ ఉండేవారు. 

కలల కుటీరం: ఎమ్మెస్సీ క్లాస్‌మేట్‌ కల్యాణ్‌తో ప్రేమ.. పెండ్లి. ఆ తర్వాత, కెరీర్‌ గురించిన ఆలోచన. దీంతో ఫుల్‌ బిజీ అయిపోయారు. హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యి బిజినెస్‌ పెట్టారు. వీళ్లకు ఇద్దరు అమ్మాయిలు. తల్లిదండ్రులు బిజీగా ఉంటే పిల్లలు కోల్పోయేదేమిటో చిన్నప్పుడే గ్రహించారు శ్రీదేవి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయకూడదు.. వ్యాపారం చేసి.. నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలి అని నిశ్చయించుకున్నారు. చిన్నప్పటి పల్లెటూరి జ్ఞాపకాలు.. ఇంటిముందర సాంపిజల్లి.. అలుకేసి.. రథం ముగ్గేసిన అనుభవాలు ఎప్పుడూ గుర్తొచ్చేవి. అలాంటి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కలిగింది. ఈ క్రమంలోనే తన ఇంటినొక పల్లెటూరి వాడకట్టులా డిజైన్‌ చేసుకున్నారు. 

 యూట్యూబ్‌ చానెల్‌: పల్లెటూరి వాతావరణాన్ని తాను మిస్‌ కావడం లేదు. కానీ.. తనలాంటి వాళ్లు ఎంతోమంది ఉంటారు కదా? వాళ్లతో తన ఆలోచనలు పంచుకోవాలి.. పల్లెను చూపించాలి అన్న లక్ష్యంతో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించారు. అదే ‘కలగూరగంప’. పొలం దున్నిన దగ్గర్నుంచి.. నారువేసి.. నీరుపోసి.. పంట పండించి.. వండే వరకు అంతా ఈ చానల్‌లో కళ్లకు కడతారు. ‘మామిడికాయ తొక్కు’ వీడియోలో శ్రీదేవి తొక్కు చేసిన.. ఎలా చేయాలో చెప్పిన విధానం చాలా సహజంగా ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ఏదో ఓ వందమంది చూస్తారని అనుకున్న వీడియోను వేలల్లో చూశారు. దీంతో వీడియోలు చేయడం కొనసాగించాలని అనుకున్నారు. ‘ఏం పేరు అయితే బాగుంటుందమ్మా’ అని కూతురు అడిగితే.. ‘ఏదో ఒకటి కలగూర గంపలెక్క పెట్టరాదూ’ అన్నారు శ్రీదేవి. అంతే,  ఆ చానెల్‌ను ‘కలగూరగంప’ అని రిజిస్టర్‌ చేశారు. తర్వాత ఒక మల్లెచెట్టు వీడియో పెట్టారు. ఊహించని స్పందన వచ్చింది. ఇలా ఎన్ని వీడియోలు చేసినా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఆమె ప్రత్యేకత ఏమిటంటే.. ఏ వీడియో చేసినా తాను చిన్నతనంలో చూసిన దానికి అన్వయిస్తూ చెప్తారు. ఆ మాటలు అందర్నీ పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్తున్నాయి. 

ఆలోచనలు పంచుకోవడమే

నా బాల్యం మరుపురానిది. కానీ, అది గత జన్మలా మారిపోయింది. అంతులేని కోరిక.. భగీరథ ప్రయత్నం.. తోడుగా నా జీవిత భాగస్వామి.. వెరసి నేను కలలుగన్న కుటీరాన్ని హైదరాబాద్‌కు చేరువలో నిర్మించుకున్నాను. అందమైన వనం.. అమ్మమ్మ వంటలు.. ఆరోగ్య సూత్రాలు.. నా ఆలోచనా స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు  ఓ రూపమే ‘కలగూరగంప’. తప్పక చూడండి.  అభిప్రాయం చెప్పండి. - పట్లోళ్ల శ్రీదేవి 


logo