గురువారం 13 ఆగస్టు 2020
Sunday - Jul 26, 2020 , 03:30:24

అనాథల... ‘అంతిమ’ నేస్తం

అనాథల... ‘అంతిమ’ నేస్తం

 సమాజ సేవే  పరమార్థంగా భావించే వారు చాలా తక్కువ మంది. కోట్లు సంపాదించడం కన్నా.. ఉన్నదాన్ని పదిమంది కోసం ఖర్చు చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు వారు. మంచాల జ్ఞానేందర్‌ గుప్తా  అలాంటివారే. తన తండ్రి మంచాల శంకరయ్య పేరుతో చారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  మానవతావాదిగా అందరి మన్ననలూ అందుకుంటున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్‌ తాత మంచాల రాజేశం గుప్తా, స్వాతంత్య్ర సమరయోధుడు. బాల్యం నుంచీ జ్ఞానేందర్‌ మీద తాత ప్రభావం ఎక్కువే. మధ్యతరగతి కుటుంబం వారిది. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో చిరుద్యోగం చేసేవారు. ఉద్యోగాన్ని కూడా ఓ పాఠంగా భావించి.. వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆ అనుభవంతో.. నిజామాబాద్‌ జిల్లాకు వచ్చి  అక్కడే ఓ వెటర్నరీ మెడికల్‌ దుకాణాన్ని ప్రారంభించారు. నిజాయతీ, విశ్వసనీయత పెంచుకుంటూ అందరి తలలో నాలుకగా మారారు. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. రెండు పెట్రోల్‌ బంకులు, రెండు కోళ్ళ ఫారాలు నెలకొల్పారు. శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. నేర్చుకునే మనసు ఉండాలే కానీ, ప్రతి అనుభవమూ విలువైందే. జ్ఞానేందర్‌ విషయంలో ఆ మాటే నిజమైంది.

ఒక్క సంఘటనతో మార్పు 

జ్ఞానేందర్‌ గుప్తా అయ్యప్ప భక్తుడు. ఏటా శబరిమలై వెళ్తారు. అలా ఒకసారి దర్శనానికి వెళ్తుండగా.. బెంగళూరు వద్ద రోడ్డుపై ఒక మృతదేహం కనిపించింది. ఎవరో అనాథ. చుట్టుపక్కల ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఒక వ్యక్తి ముందుకువచ్చి, మృతుడు తనకు బాగా తెలుసునని చెప్పాడు. కానీ, మృతదేహాన్ని తరలించేందుకు తన వద్ద డబ్బులు లేవన్నాడు. అందుకే అభిమానాన్ని చంపుకుని మౌనంగా ఉండిపోయానని చెప్పాడు. అక్కడే ఉన్న జ్ఞానేందర్‌ ఆ మాటలు విని కదిలిపోయారు. ఆర్థిక సాయం అందించి, అంతిమ సంస్కారాలు ఘనంగా చేయాలని సూచించారు. ఈ సంఘటనే ఆయనలోని సేవా గుణాన్ని బయటకు తీసుకువచ్చింది. 

అందరి తోడుగా..

మొదట రూ.11 లక్షల ఖర్చుతో వైకుంఠ రథానికి కావాల్సిన వాహనాన్ని కొన్నారు.  ఆ తర్వాత  తన తండ్రి మంచాల శంకరయ్య పేరుతో ఓ చారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోనే రెండు స్వర్గలోకయాత్ర రథాలు కొన్నారు. ఆ తర్వాత కనగర్తి, వేములవాడ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, బోధన్‌, బాన్సువాడ ప్రాంతాల్లో ఐదు రథాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రథాన్ని ఉచితంగా పంపించడమే కాదు.. భోజనాలు కూడా  అందిస్తున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దుఃఖంలో ఉంటారు. వండుకోవడానికి కూడా మనసు రాదు. అందుకే, ఓ యాభై మంది ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. మృతదేహాన్ని జాగ్రత్త పరిచేందుకు అవసరమైన ఫ్రీజర్లు, శవపేటికలను  ఉచితంగానే సమకూరుస్తారు. వాటి ద్వారా ఈ ఏడేండ్లలో సుమారు 15వేలకు పైగా అంతిమయాత్రలు నిర్వహించారు. రోజూ సగటున 18 అంతిమయాత్రలకు స్వర్గలోకయాత్ర రథాలను పంపిస్తున్నారు. ఇందుకు ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. 

సేవలతో ముందుకు..

భగవద్గీత అంటే శవగీతం కాదు చైతన్య స్రవంతి. పరమాత్మ బోధనల్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భగవద్గీత ప్రతులను బహూకరిస్తున్నారు. ఇప్పటి వరకు 2200 మందికి శ్రీగీతను పంపిణీ చేశారు. వేసవిలో ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. ఉచిత అంబలి కేంద్రాలు, చలివేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజల దాహం తీరుస్తున్నారు. గ్రామాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను అందజేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో  భాగంగా మొక్కలు పంపిణీ చేస్తున్నారు. పేదల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్ఞానేందర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ట్రస్టు సేవలపై టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ విద్యార్థులు ఓ అధ్యయనం నిర్వహించారు.  జ్ఞానేందర్‌ పనితీరును ప్రశంసించారు.

నిరుపేదలకు సాయం

మానవసేవే మాధవ సేవ.. సంఘ సేవే సర్వేశ్వరుని సేవగా భావిస్తున్నా.  తాతపేరు, తండ్రి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఓ ట్రస్టును స్థాపించాను. వైకుంఠయాత్ర రథాలను ఏర్పాటు చేశాను. వ్యాపారంలో వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నా. ఎవరైనా ఫోన్‌ చేస్తే అంతిమయాత్రకు అవసరమైన సేవలందిస్తాం. ఈ కార్యక్రమాలకు నా కుటుంబ సభ్యులంతా సహకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వర్గలోక యాత్ర రథాలను ఏర్పాటు చేయడమే నా లక్ష్యం.- మంచాల జ్ఞానేందర్‌ గుప్తా ఫౌండర్‌, మంచాల శంకరయ్య చారిటబుల్‌ ట్రస్టు 

తాజావార్తలు


logo