శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 03:11:20

తలరాత మార్చిన పలక..

తలరాత మార్చిన పలక..

వందేళ్ల క్రితం వరకు అక్షరాభ్యాసం మొత్తం ఇసుక మీదే నడిచేది. ఇసుకను నేలపైన నున్నగా పరిచి, దానిపైనే చూపుడు వేలితో అక్షరాలను దిద్దించేవాళ్లు. ఆ తర్వాత కాలంలో ఇసుక స్థానాన్ని రాతిబండ ఆక్రమించింది. నున్నని బండలపైనే అక్షరాలు నేర్పించేవారు. అనంతరం గనుల నుంచి తీసిన రాతి పొరలను చేతులతోనే పలకలుగా మార్చారు. కొంచెం గరుకుగా ఉన్నప్పటికీ, దానిపైనే ఆ తరం పిల్లలు అక్షరాలు నేర్చుకునేవారు. 

యంత్రాలతో నునుపు: కొంతకాలం తర్వాత ఆ రాతిని చిన్నగా కోయడంతోపాటు నున్నగా మార్చేందుకు ఇంగ్లాండ్‌ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ఈ యంత్రాల రాకతో పలకల రూపంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. రాతి పలకను కొలతల ప్రకారం కత్తిరించి, సన్నగా చేసిన తర్వాత నాలుగు చెక్కల మధ్యలో అమర్చేవారు. దానిపైన అక్షరాలను రాసేందుకు కూడా అదే రాతిని పుల్లలుగా వాడేవారు. తదనంతరం రాయలసీమ ప్రాంతంలో దొరికిన తెల్లని రాయిని పుల్లలుగా వాడారు. ఆ తర్వాత సున్నంతోపాటు పలురకాల పదార్థాలను కలిపి పోతపోసి, కృత్రిమంగా బలపాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ బలపం గీతలు తెల్లగా, స్పష్టంగా కనిపించడంతో బాగా ప్రాచుర్యం పొందింది. పలకలు, బలపాల తయారీ వ్యాపారంలో ఏర్పడిన పోటీతో అనేక పరిశోధనలు చోటుచేసుకున్నాయి. చాక్‌పీస్‌ తరహాలోనే రంగురంగుల బలపాలు కూడా ఉత్పత్తి అయ్యాయి. 

కృత్రిమ పలక.. ఎనామిల్‌ స్లేట్‌: పలక పరిణామ క్రమంలో ‘ఎనామిల్‌ స్లేట్‌' పేరుతో కృత్తిమ పలక తయారైంది. చెట్టు బెరడు పొట్టుతో ఈ కృత్తిమ పలకలను రూపొందించి, ప్లాస్టిక్‌ తొడుగులను ఏర్పాటు చేశారు. నిన్నమెన్నటి దాకా ఏ పిల్లాడి చేతిలో చూసినా, ఈ ఎనామిల్‌ పలకే కనిపించేది. ప్రస్తుతం ఈ- పలకలు రంగప్రవేశం చేయడంతో క్రమంగా కనుమరుగవుతున్నాయి. 

ఈ- పలకల హల్‌చల్‌: చేతిలో ఇమిడిపోయే కంప్యూటర్‌లా పనిచేసే ఈ పలకలు.. ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటితో విద్యార్థులకు అనేక అనుకూలతలు ఉన్నాయి. అక్షరాలు రాయడం, దిద్దడంతోపాటు పాఠాలు కూడా ఇందులోనే వినే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈతరం పిల్లలు డిజిటల్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ‘మా పిల్లలు టచ్‌స్క్రీన్‌పై అక్షరాలు దిద్దుతున్నారు’ అని చెప్పుకోవడానికే ఇప్పటి తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలే బోధిస్తుండడంతో  ట్యాబ్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. 


logo