బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 02:58:56

కొండాకోనల్లో.. గిరిజన దండారి!

కొండాకోనల్లో..  గిరిజన దండారి!

ఎద్దుకొమ్ములతో చేసిన రుమాలును తలపై పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా నృత్యం చేసే గిరిజన గోండుల పండుగ దండారి. ఒక నాగోబా జాతర.. ఒక సమ్మక్క సారలమ్మ జాతరలను చూస్తే తెలుస్తుంది గిరిజనం గొప్పతనం. యేటా గిరిజన గూడేలను పలకరిస్తుంది దండారి. ఒంటి నిండా బూడిద.. ముఖానికి మసి.. కుడిచేతిలో మంత్రదండం లాంటి రోకలి.. మెడలో చిత్ర విచిత్రమైన  దండలు, వివిధ రకాలైన పూసలు, నెత్తిన నెమలి ఈకల టోపీ, అందులో చిన్నచిన్న అద్దాలు, మేక లేదా జింక కొమ్ములు, నడుముకు కాళ్లకు గజ్జెలు కట్టుకుని నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ దండారి కోలాహలంలో గుస్సాడీ ప్రధాన రూపకాలుగా ‘చచ్చోయ్‌.. చాహోయ్‌' ఉంటాయి. వీటిని వేరువేరుగా ప్రదర్శిస్తారు. గుస్సాడీ నృత్యాలు చేసే వారిని దేవతలు ఆవహిస్తారనీ, అతని చేతిలోని రోకలి తమ శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయం అయిపోతాయనీ గిరిజనులు నమ్ముతారు. డప్పులు, తుడుం మోతలకు అనుగుణంగా గుస్సాడీ నృత్యాలు చేస్తారు. కొండాకోనల్లో నివసిస్తున్న వారు చెట్టు, చెలక, పుట్ట, గుట్టలో సహజసిద్ధంగా వెలసిన ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. చాలాచోట్ల సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్నప్పటికీ గిరిజనగూడేల్లో మాత్రం సంస్కృతికే పెద్దపీట వేస్తారు. దీపావళికి వారం రోజుల ముందునుండే ప్రారంభమయ్యే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇది కొలాం, గోండు, ఆదిమ గిరిజన తెగలకు చెందిన పెద్ద పండుగ. దీనికి 200 ఏండ్ల ఘన చరిత్ర ఉన్నది. కరోనా పరిస్థితులు సర్దుకున్నాక.. ఆ వేడుకల్ని చూసిరావాల్సిందే.logo