మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 02:43:11

పంటలకు దిక్కు.. తాతాయి దేవతలు!

పంటలకు దిక్కు.. తాతాయి దేవతలు!

పూర్వీకుల ప్రతీకాత్మక విగ్రహాలను పంటపొలాల వద్ద ప్రతిష్ఠించి తాతాయి దేవతలుగా కొలిచే సంప్రదాయం ఏండ్లనుంచీ వస్తున్నది. తాత అంటే తాతయ్య.. ఆయి అంటే తాతమ్మ. పెద్దల దీవెనలతో పంటలు బాగా పండాలని మొక్కుతారు. జూన్‌-జూలై మధ్యలో ‘తాతాయి సంబురాలు’ జరుగుతాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఆచారం కొనసాగుతున్నది. ఒక రకంగా మనుషులనే దేవతలుగా పూజించే సంస్కృతి ఇది. పొలాలకు కాపుగాసే పెద్ద మనుషులను పంటలకు తలాపున పెట్టుకొని.. వారి దీవెనలు అందుకునే పండుగ ఇది. తెలంగాణ సంస్కృతిలో పెద్దలస్మృతి ఒక పరంపరగా ఎలా కొనసాగుతుందో తాతాయి సంస్కృతి తెలియజేస్తున్నది. 

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఎరువు మందుల కన్నా తాతాయిల కాపుపైనే వారికి నమ్మకం ఎక్కువ. సబ్బండ వర్ణాలు ఇదే ఆచారాన్ని పాటించడం.. తాతాయిలను పూజించడం మరింత ఆశ్చర్యపరిచే విషయం. ఆధునిక జీవనం గడుపుతూ కూడా పురాతన సంప్రదాయాలు.. జానపద విశ్వాసాలను పదిలంగా ఉంచుకోవడం గొప్ప విషయం.  

ఎటువంటి పురుగూ కూడా తమ పంటను నాశనం చేయకుండా చూడాలని పెద్దలనే దైవంగా పూజించే ఈ ‘తాతాయిల విగ్రహాలు’ ఒకప్పుడు రాళ్లతో చేసినవి  ఉండేవి. ఇప్పుడు చెక్కతో చేయిస్తారు. తాత రుమాలు ధరించి చుట్ట చేత పట్టుకొని ఉంటే.. తాతమ్మ ముదురు రంగు చీర కట్టుకుని - ఒక చేత్తో తమ బిడ్డలను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. మనుషులే పొలం గట్టున కూచుని.. పంటకు  కాపలా కాస్తున్నట్టుగా ఉంటారు ఈ తాతాయి దేవతలు. logo