బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 02:07:46

పలుకుబడులు... ఎద్దు పుండు కాకికి ముద్దు!

పలుకుబడులు... ఎద్దు పుండు కాకికి ముద్దు!

ఎదుటి వారి బాధలను తీర్చకపోగా.. ఆ బాధ నుంచి కూడా ప్రయోజనం పొందాలని చూసేవారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. పొలం దున్నాలన్నా.. బండిని లాగాలన్నా ఎద్దు కాడిని మోయాల్సిందే. దీంతో కాడి రాసుకొని ఎడ్ల మూపురం మీద పుండు పడుతుంది. ఓవైపు పుండు బాధతో ఎద్దు అల్లాడుతుంటే.. కాకికి మాత్రం మహా సంబురంగా ఉంటుంది. ఎందుకంటే, ఆ పుండును పొడుచుకుంటూ, ఎద్దు మాంసాన్ని లాక్కుని తినడమే కాకికి కావాల్సింది. ఆపదలో ఉన్నవారిని ఓదార్చడానికి బదులు, మరింత బాధపెట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే.. ‘ఎద్దు పుండు.. కాకికి ముద్దు అన్నట్లే ఉన్నది’ అనేవారు. ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలి అని ఇంకొకడు అన్నాడట’ అనే సామెత కూడా ఈ కోవకే చెందుతుంది. 

బండి మిఠాయి లేసింది..

మిఠాయి లేసింది.. అంటే ఏదో స్వీటును అమాంతం మింగేయడమని కాదు.. ఎడ్ల బండిలో బరువు ఎక్కువ వేసినప్పుడు.. దాని ముందుభాగం పైకి లేస్తుంది. దాన్నే ‘మిఠాయి లేసింది’ అని అంటారు. వాహన సౌకర్యం అంతగా లేనిరోజుల్లో కాడెద్దుల బండే.. రవాణా సాధనం. వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా, ఎరువులు, ధాన్యం తరలించాలన్నా ఎడ్ల బండి ఉండాల్సిందే. పాతకాలంలో ఎత్తులు.. వంపులతో కూడిన మట్టి రోడ్లపైనే  ఎడ్ల బండి పరుగులు తీసేది. ఎప్పుడైనా ఎక్కువ బరువు వేసినప్పుడు “అరేయ్‌ పిల్లగా.. బరువెక్కువున్నది. బండి మిఠాయి లేవగల్ల. మెల్లగ పో” అని పెద్దవాళ్లు జాగ్రత్తలు చెబుతుంటారు. కొందరైతే ఒక ఊరి నుంచి మరో ఊరికి కూడా ఈ ఎద్దుల బండిలోనే వెళ్లేవారు. వీటినే ఎడ్ల కచ్చురం అని కూడా అంటారు. తెలంగాణలోని పల్లె ప్రజలకు.. ఈ ఎడ్ల కచ్చురాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. 

ఈనగాచి నక్కల పాలు చేసినట్లు..

కష్టపడి పనిచేసి.. ఫలితాన్ని మాత్రం పరుల పాలు చేసిన సందర్భంలో ఈ సామెతను  ఉపయోగిస్తారు. మనిషిలోని కష్టపడి పనిచేసే తత్వంతోపాటు, పని పూర్తయిన తర్వాత కనిపించే అలసత్వానికి ఈ సామెత అద్దం పడుతుంది. ‘ఈన కాయడం’ అంటే దూడను కనేంత వరకూ పశువును కంటికి రెప్పలా కాపాడుతూ పోషించడం. దూడ పుట్టిన తర్వాత పని అయిపోయింది కదా.. అని వదిలేసి వెళ్తే, నక్కలు వచ్చి ఆ దూడను తినేస్తాయి. అలా కాకుండా పనితోపాటు ఫలితానికి కూడా ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని పెద్దలు ఈ మాట చెబుతుంటారు. రైతులు బాగా కష్టించి పండించిన ధాన్యాన్ని, దళారులు తక్కువ ధరకు సొంతం చేసుకున్నప్పుడు ‘ఈనెగాచి నక్కలపాలు చేసినట్టయ్యింది’ 
అని వాపోతుంటారు. 

ఏర్పాటు చెయ్యలే..

తెలంగాణ గ్రామ్యంలో ‘ఏర్పాటు చెయ్యడం’ అంటే ‘గుర్తు పట్టడం’ అని అర్థం. పల్లెల్లోని వృద్ధులు ఈ మాటను ఎక్కువగా వాడుతుంటారు. చాలా రోజుల తర్వాత ఓ వ్యక్తిని కలిసినప్పుడో.. దూరపు చుట్టాన్ని చూసినప్పుడో ‘ఎవ్వల కొడుకువు బిడ్డా.. నిన్ను ఏర్పాటు చేస్తలేను’ అని అంటుంటారు. ‘నన్ను ఏర్పాటు చేసినవా..’ అని అడుగుతుంటారు. ఏవైనా వసతులు కల్పించినప్పుడు, కొత్త సంస్థలు, సంఘాలను నెలకొల్పినప్పుడు కూడా ‘ఏర్పాటు చేయడం’ అనే మాటను ఉపయోగిస్తారు. ‘కరోనా పరీక్షల కోసం కేంద్రాలను ఏర్పాటు చేయాలి’ అనో.. ‘మా సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం’ అనో
ఈ పద ప్రయోగం చేస్తుంటారు. 


logo