శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 01:52:29

బాల్కనీలో చెట్లు పెంచుకొనే తొట్లు పెట్టుకోవచ్చా?

బాల్కనీలో చెట్లు పెంచుకొనే తొట్లు పెట్టుకోవచ్చా?

బాల్కనీలో చెట్లు పెంచుకొనే తొట్లు పెట్టుకోవచ్చా? తూర్పు, ఉత్తరం బరువు అవుతుందా?   -విరజ, వర్గల్‌

ఇంటి చుట్టూ బాల్కనీలు ఏర్పాటు చేసుకుని వాటిమీద చెట్ల తొట్లు పెట్టుకోవచ్చు. అయితే ఇంటికి తూర్పు, ఉత్తరం బాల్కనీల్లో వాటి అంచుకు సంకెన్‌ చేసి అంటే.. ‘లోతుగా చేసి’ అందులో మెత్తటి మట్టి వేసి చిన్న చిన్న మొక్కలు నాటుకోవచ్చు. కొందరు తూర్పు, ఉత్తరం బాల్కనీ అంచులకు సన్నని అరుగులాగా కట్టి దాని మీద పూల కుండీలు పెడుతుంటారు. అది సరైన విధానం కాదు. రెండు రేలింగ్‌ గోడలు కట్టి దాని మధ్యలో కూడా తొట్లు పెట్టుకోవచ్చు. ఇంటి చుట్టూ చెట్లు పెట్టాలని అనుకుంటే అందుకు తగిన వెడల్పు ఉండే విధంగా బాల్కనీలు ముందే కట్టుకోవాలి. ఇంటికి తూర్పు, ఉత్తరం బాల్కనీల్లో చెట్లు, ప్లాంటర్‌ బాక్స్‌ కట్టాక కూడా దక్షిణం, పడమర బాల్కనీల కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.  ఈ జాగ్రత్త అవసరం.


ఈ ఆధునిక కాలంలో ‘మారుతున్న మాడ్రన్‌ పరిస్థితుల్లో’ ఈ శాస్ర్తాలు ఎవరు నమ్ముతారు? సైన్స్‌ తెలియని వాళ్లు తప్ప? 

 - అందె కిషన్‌, కోరుట్ల


 మనిషి  ఎంత ప్రయత్నించినా  తన నీడను ‘లేకుండా’ చేసుకోలేదు. అలాగే తన ‘మనసును వదిలి’ తను ఒక్కడుగా ఉండలేదు. ఏ మోడ్రన్‌ యుగం వచ్చినా.. మనిషిలోని ఆలోచనలు ఆగవు. భౌతికంగా వచ్చే మార్పులు వ్యక్తిలో దేనిని మారుస్తున్నాయి చెప్పండి.

ఆకాశంలో  సూర్యోదయం కావడం మారుతుందా? . వర్షం పై నుంచి పడకుండా మారుతుందా? మార్పు ఏంటి? ప్రకృతిలో ఉన్న నియమాలు ఏవి మారుతున్నాయి. కోట్లాది సంవత్సరాలుగా భూమి తిరుగుతున్నదని అంటున్నారు.  దాని గమనంలో మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది కదా అని పాలు, పెరుగుగా అవడం మానుకుందా? మీరు అనే మార్పు వేరు. ఈ సృష్టిలో నిబంధనలు మారలేవు. మనిషే తన నిబంధనలను మార్చుకుంటున్నాడు. శాస్త్రం నమ్మకాల మీద కాదు నడిచేది.  పంచభూతాల ప్రణాళికతో ఆ నియమాల కాలమానం బట్టి సాగుతుంది. ఈ భూమిమీద కొన్ని ‘బుడి బుడి ’ యంత్రాలు వచ్చినంత మాత్రాన సృష్టి ప్రణాళిక మారదు. అర్థం చేసుకొనే వాళ్లు దేనినైనా పాటిస్తారు.


స్కూల్‌ బిల్డింగ్‌ను నాలుగు వైపుల కట్టి, మధ్యలో రౌండ్‌ కారిడార్‌ను వేసుకోవచ్చా?- గుర్రం స్వరూప, చాంద్రాయనిగుట్ట

పాఠశాలలు, కళాశాలలు విశాలమైన స్థలంలో నిర్మించడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లల మనసు పచ్చిక బయళ్లలో వృద్ధి చెందుతుంది. విద్యార్జనకు, బాలల వికాసానికి నిర్మాణం, దాని పరిసరాలు చాలా బాగుండాలి. బిల్డింగ్‌ నాలుగు మూలలా డబ్బాలా కాకుండా ‘యు’ (ఇంగ్లిష్‌ అక్షరం) ఆకారంగా నిర్మించాలి. అప్పుడు మధ్య విశాలమైన ఓపెన్‌ స్పేస్‌ వచ్చి గొప్ప  శక్తి స్థలం అవుతుంది. ఆ నిర్మాణం ఓపెన్‌ అంటే ‘యు ఆకారం’ తూర్పు ముఖంగా  లేదా ఉత్తర ముఖంగా.. పెట్టి కట్టాలి. ‘కారిడార్‌'  ఆ మూడు వైపులా వచ్చే గదులను అనుసరిస్తూ సాగాలి. అలాంటి నిర్మాణం స్కూల్‌కు  చాలా బాగుంటుంది. గుండ్రంగా వద్దు. ఆ విధంగా ప్లాన్‌ చేయండి. పాఠశాలలు చీకటి లేకుండా కళకళలాడుతూ ఉండాలి.