ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 22:00:59

మంగయ్య అదృష్టం... పి.వి. నరసింహారావు

మంగయ్య అదృష్టం... పి.వి. నరసింహారావు

వాస్తవం చెప్పాలంటే మానవులనబడే ఒక అవకతవక జాతిని సృజించాలన్న విచిత్ర సంకల్పం నా ప్రాణనాథులు బ్రహ్మదేవులకు కలిగిన లగాయితు వారి శాఖలో ఏదీ సరైన నిర్ణయం జరగడం లేదు. ఆ జాతిలో ఏముందో కాని, అంతా అకటావికటంగానే వ్యవహారం సాగుతోంది. భాగ్యలేఖన శాఖలో న్యాయం, తర్కం, ఔచిత్యం, చివరకు మామూలు వివేకం... అన్నీ మృగ్యమయ్యాయి (హర్షధ్వానాలు). మీరందరూ దివ్యదృష్టి సంపన్నులు. నా మనవి మన్నించి ఒక్కమారు కళ్ళుమూసి ఆ భూమి అనబడే నిర్భాగ్యగ్రహాన్ని తిలకించండి. మన భాగ్యలేఖన శాఖవారి పుణ్యమా అని ఆ మానవ ప్రపంచం సాంతం గందరగోళంలో అల్లల్లాడిపోతోంది (సభికులు కళ్ళు మూసుకుని చూశారు). మొట్టమొదట నేనెంతో శ్రద్ధతో పెంచిన విద్యాశాఖ దుర్గతి చెబుతాను.. అల్లదిగో, ఆ మనిషిని చూడండి ఆప్రాంతంలోనే అంతటి మహావిద్వాంసుడు లేడు. మా శాఖ అతడ్నెంతో ప్రేమిస్తుంది.నాకైతే అతడంటే ప్రాణం. నేనెంతో ఆసక్తితో అతని మేధస్సును పెంచాను. అలాంటి విద్వచ్చిఖామణి బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడు. కదలాడే శవంలా కనపడుతున్నాడు. ఈ దారుణానికి కారణం భాగ్యలేఖన శాఖ వారి కుచ్ఛితబుద్ధికాక మరేం కాజాలుతుంది?... ఇక ఆ రెండో వాణ్ణి చూడండి. వర్ణించశక్యం కాని ఆకారపుష్టి, పొట్ట చీరితే మాత్రం అక్షరం ముక్క కానరాదు. అతగాణ్ణి భాగ్యలేఖనం వారేం చేశారో తెలుసా మీకు? కోటీశ్వరుడు! విద్వాంసులు, కవులు, గాయక శిఖామణులు వాడికి అస్తమానం జోహార్లర్పిస్తారు. వాడికి వారాపాదించని సద్గుణమంటూ లేదు. వాడి పొగడ్తలో వారాడని అబద్ధం లేదు... అది పచ్చి అబద్ధమని తెలిసి కూడా! ఇలాంటివే అఘాయిత్యాలన్నీ.... ఒక ఆరోగ్యంగా ఉన్న మనిషి అకస్మాత్తుగా ఏదో దుర్ఘటనలో చచ్చిపోతే మరొక పరమ రోగిష్టివాడు మార్కండేయుని అవతారమై ఎడతెరిపి లేకుండా జీవిస్తుంటాడు... దేవతాబంధువులారా! ఇంకేమేమని ఆ భూగ్రహం పైన జరుగుతున్న అనంతమైన అన్యాయాల జాబితాను ఏకరువు పెట్టను? భాగ్యలేఖనం వారు నిరంతరం ఇలాంటి అవివేక నిర్ణయాలు చేస్తుంటే దీన్ని ప్రతిఘటించడం తక్కిన దేవతలందరి విద్యుక్త ధర్మం కాదా? కావున కార్యాచరణ శాఖలన్నింటివైపున నేనీ సభలో భాగ్యలేఖన శాఖ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతూ మీ ఏకగ్రీవామోదాన్ని అర్థిస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు!’

సభలోంచి ఉబికిన హర్షధ్వానాలతో రోదసి దద్దరిల్లింది. ఎంతో సేపు మరెవ్వరి మాటా వినే ‘మూడ్‌'లో సభికులు కనిపించనే లేదు. చివరకు మెల్లమెల్లగా శాంతత తిరిగివచ్చి ముందు కార్యక్రమం కొనసాగింది. భాగ్యలేఖన శాఖ తాలూకు అభాగ్యులు తప్ప మిగతా వారందరూ పరమోత్సాహంతో గాలిలో తేలిపోతున్నారు. భాగ్యలేఖన వారు ముద్దాయిల్లా కనిపించారు. సభవారి వైఖరి తనకు వ్యతిరేకంగా ఉన్నట్టు బ్రహ్మదేవుడు పసికట్టాడు. అంతేకాక సభికులందరూ స్వయంగా భార్యే భర్తగారికి ఘోర పరాభవం చేసే ఆ దృశ్యాన్ని ప్రత్యేకమైన ఆసక్తితో చూస్తున్నారని గమనించాడు. ఈ వైఖరిని మినహాయిస్తూ సరస్వతి ఉపన్యాసంలోని అసలు సరకుపై అంతగా ప్రశంసించదగిందేదీ ఆయనకు కనిపించలేదు. పైపెచ్చు ఆయనకు మరింత చీదర కలిగిస్తూ కుడివైపు విష్ణువూ, ఎడమవైపు శివుడూ అదోలా ముసిముసి నవ్వులు చిలకరిస్తున్నారు. చివరకు శివుని కంఠాభరణమైన ఫణిరాజు కూడా సరస్వతి ఉపన్యసించినంత సేపూ అదేపనిగా మహదానందంతో పడగ ఆడిస్తున్నాడు. ఎంత దారుణం! బ్రహ్మదేవుడు సమాధానం చెప్పడానికి లేచాడో, లేదో సభవారి విరోధ చిహ్నాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. నలువైపులా హూటింగూ, హేళన పూర్వకమైన కేకలూ కూతలూ వినవచ్చాయి. అవి సృష్టికర్త కంఠస్వరాన్నే వినపడకుండా చేస్తాయా 

అనిపించింది.

గతంలో ఏ దేవతా సభలోనూ ఎన్నడూ చూడని అసభ్య ప్రవర్తన ఆనాడు కానవచ్చింది. ఇలాంటి సమన్వయ సభా సమావేశాలు ఎంతో గాంభీర్యంతో సాగించడమే సదా సర్వదా జరుగుతూ వచ్చింది. ఐతే ఆ కేకల్లో కూడా ఏమాత్రం జంకకుండా తన గంభీరోపన్యాసం సాగించాడు. ఆయనకు నాలుగు ముఖాలుండటం ఎంతో ఉపయోగ పడింది. నలువైపులా ఒకేసారి తన వాగ్ధాటిని ప్రసరిస్తూ సభికులందర్నీ అదరగొట్టగలిగాడు. అంతేకాక భాగ్యలేఖన శాఖంటే దేవతలకు ద్వేషభావమున్నప్పటికీ మనసుల్లో భయం కూడా ఉంది. కావున కాసేపు కేకలు పెట్టినా తదుపరి అయిష్టంతోనైనా సరే, ఆయన మాట వింటూ కూర్చున్నారు.

బ్రహ్మదేవుని ఉపన్యాసం ముందుకు సాగింది. ‘నాతోటి దేవతల్లారా! నా సృష్టిలో ఎక్కడ గాలించినా భర్తను అర్థం చేసుకునే భార్య కానరాదని నాకు బాగా తెలుసు. నా భార్యామణికి కూడా ఇది వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. వాస్తవానికి చాలామంది భార్యలు తమ భర్తలను అర్థం చేసుకోకపోవడమే కాక భర్తలు చేస్తున్న ఏ పనినైనా సరే, నిరసిస్తారు కూడా. ఐతే ఈ బ్రహ్మాండ సంచాలనం చేస్తున్న మీబోటి విజ్ఞులకు వాస్తవ పరిస్థితి తెలియనిది కాదు. అసలు భాగ్యలేఖన శాఖ పనిచేసే పద్ధతిని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే ఉంటారు. ఒక అతి జటిలమైన పాపపుణ్య గణితం మీద తయారయ్యే క్రెడిట్‌ కార్డుల ప్రణాళిక ననుసరించి కోట్లాది ప్రాణుల్లో ప్రతి ఒక్కరి ఖాతా కంప్యూటర్లలో భద్రపరిచి దాని ద్వారా లెక్కవేసిన ఒక్కొక్క జీవిత ఫలం నమోదు చేయబడుతుంది. ఏ ఇద్దరు జీవుల జీవితాలూ అన్ని విధాలా సమానమై ఉండవన్న సత్యం మీరు గమనించే ఉంటారు. పొరపాటునైనా యాదృచ్ఛికంగానైనా అలా ఎన్నడూ జరగదు. ఈ ఒక్క సత్యమే చాలు, నా శాఖ కరెక్టుగా పనిచేస్తుందని రుజువు చేయడానికి. ఇంతకూ నా ప్రాణేశ్వరి చెప్పిందేమిటి? విద్వాంసుడెవరో బిచ్చమెత్తుకుంటున్నాడనీ, ఎవడో రోగిష్టివాడు చాలాకాలం బతుకుతున్నాడని. ఇది కొంతవరకు విసంగతమే కావచ్చు.

కానీ ఇందులో భాగ్యలేఖన శాఖ తప్పేముంది? మీరెవ్వడినైనా పేర్కొనండి... మనిషికానీ, కుక్కకానీ, పక్షికానీ, పురుగుకానీ, నత్త కానీ, మరేదైనాకానీ... అందుకు సంబంధించిన క్రెడిట్‌ కార్డును క్షణంలో మీముందుంచుతాను. ఆ వ్యక్తి అదృష్టం ఈషణ్మాత్రమైనా మరొక విధంగా ఉండజాలదని మీరే ఒప్పుకుంటారు. అయితే మీ ఉద్రేకాతిరేకంలో ఒకే వ్యక్తికి ధనం, ఆరోగ్యం , పాండిత్యం, అధికారం వగైరా కట్టబెడితే ఇక మరో వ్యక్తికి సర్వరోగాలూ, దారిద్య్రం, నిరక్షరాస్యత, బానిసత్వం మొదలైనవన్నీ ఇవ్వక తప్పుతుందా? ఇలాగే జరిగితే ఈ విశ్వంలో సంతులనమంటూ ఏమైనా ఉంటుందా? ఇదేనా ప్రబుద్ధులైన మీరు శాసించవలసింది? కాస్త దీర్ఘంగానూ, గంభీరంగానూ ఆలోచించి తీర్పు చెప్పండి!’

‘చూడండి, ఎంత చాకచక్యంతో, వాక్చాతుర్యంతో అసలు పాయింటుని మరుగున పడేస్తున్నాడు! ఎలా తప్పుదారి పట్టిస్తున్నాడో!! ’ అని సభ్యులు గుసగుసలాడుతున్నారు. శివపత్ని పార్వతి అప్పటికే ఆగ్రహావేశంలో ఉంది. ఇంక సహించలేక  ఠపీమని లేచి నిలుచుంది. బ్రహ్మగారి మృదుభాషణాన్ని అతి కటువుగా మధ్యనే అడ్డగిస్తూ కేకలు వేయసాగింది. 

‘ఇక చాలించండి, బ్రహ్మగారూ! ఈ స్వాతిశయాన్ని కట్టిపెట్టండి. మీ శాఖ ఎలా నడుస్తుందో తెలియని వారెవ్వరూ లేరిక్కడ! అసలు విషయం ఒక శాఖవారి నిరంకుశత్వం... ఒకే ఒక్క శాఖ మిగతా సమస్త శాఖల పైన చలాయిస్తున్న తప్పుడు పెత్తనం, మీ కంప్యూటర్లూ, కార్డులూ ఏమున్నా, బ్రహ్మగారూ! నా సోదరి లక్ష్మి పరమ మూర్ఖులందరికీ ఐష్టెశ్వర్యాలు కట్టి పెడుతూండటం కానీ, మహావిద్వాంసులు పస్తులు పడుకుంటుంటే పాపం, సరస్వతి చూస్తూ ఉండటం కానీ, నిండు ఆరోగ్యంతో ఉన్న మనిషిని యమరాజు ఉన్నపట్టుగా లేపుకపోవడం కానీ... ఇలాంటి తలతిక్క అదృష్టాలను మెచ్చేవారెవ్వరూ ఉండరు. భాగ్యలేఖన శాఖవారు కొంత భూతదయ, కొంత దయాదాక్షిణ్యాలు అలవరచుకోవాలని మేమందరం గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాము. నేటి వారి అతర్క్య వైఖరిని విరమించుకోవాలి. వెంటనే అలాంటి మార్పు రాకపోతే మా శాఖలేవీ సహకరించేది లేదు. భాగ్యలేఖనం వారి ఆట కట్టడం ఖాయం. తదుపరి పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నాను. ఈ మా వజ్రసంకల్పాన్ని మీరెంత శీఘ్రంగా తెలుసుకుంటే అంత శ్రేయస్కరమని మనవి చేస్తున్నాను!’..బ్రహ్మవైపు చుర చుర చూస్తూ ఆమె కూర్చున్నది. 

మళ్ళీ భూనభోనాంతరాళాల్లో ప్రతిధ్వనించే హర్షధ్వానాలు-ఈ మారు అదొక రకమైన పెంకితనంతో, ఏదో లయబద్ధంగా, బ్రహ్మగారి నాలుగు ముఖాలపై ఆదితాళంలో చెంపదెబ్బలు చరిచినట్టు వినపడ్డాయి. ఉభయ పక్షాల్లో ఏదీ వెనక్కి తగ్గే సూచనలేమీ కనిపించలేదు. ఆ విస్ఫోటన పరిస్థితిని ఎలాగో అదుపులోకి తేకపోతే భయంకర పరిణామాలు తప్పవని స్పష్టంగా కనిపించింది. అనుక్షణం పెచ్చు పెరిగిపోతున్న ఆ టెన్షన్‌కేదో నిష్కాసనమార్గం కల్పించడమే ఏకైక ఉపాయమని తోచింది. కానీ అదెలా సాధించడం?

సభికులందరి దృష్టి సహజంగా, అప్రయత్నంగా విష్ణుమూర్తి వైపు ప్రసరించింది. దేవతలందరిలో ఉపాయంగా సమస్యలను పరిష్కరించే శక్తి (వాటిని పుట్టించే శక్తి కూడా) ఆయనకే ఉందని అందరూ నమ్ముతారు. ఆలోచించడం, ఎత్తువేయడం, దాన్ని అమలు చేయడం... అన్నీ ఆయనకు కరతలామలకం. చిక్కు సమస్యలన్నీ ఆయనకే రెఫర్‌ చేయబడుతాయి. ఈ జగత్తును నిర్వహిస్తూ ఏ క్షణంలో ఏ గొడవ పుట్టుకొచ్చినా దాన్ని పరిహరించడం ఆయన శాఖ అనుదినం చేసే పని. ఐతే విష్ణువుతో చిక్కేమంటే సులభంగా అందుబాట్లో ఉండడు. ఎక్కడో అతిదూరంలో పాల సముద్రంలో, శేషశయ్యపై పవళించి ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడి కంటే అక్కడికి భ్రమణం చేస్తూ, తన అర్థాంగి లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో హాయిగా గడుపుతుండేవాడు. అప్పుడప్పుడు ఒకే ఒక వటపత్రం మీద కూడా శయనించి పయనించేవాడు అలా పూలరంగడిలా విహరిస్తున్నా యావద్బ్రహ్మాండంలో ఎప్పుడెక్కడ ఏమేం జరుగుతున్నదీ అతి సూక్ష్మంగా గమనిస్తూ ఉండేవాడు.

అదృష్టవశాత్తు ఈ సమావేశానికి మాత్రం విష్ణుమూర్తి ఎలాగో హాజరయ్యాడు. తన గరుడ విమానంపై పయనిస్తూ అర్ధాంగి లక్ష్మీసమేతుడై శేషశయ్యను కూడా లగేజీలో తీసుకొచ్చాడు. అయితే లక్ష్మీదేవి విష్ణుపత్ని కావడంతోపాటు ప్రస్తుత తగాదాలో తన ధనదేవత హోదాలో పాల్గొంటోంది. చర్చ సందర్భంలో ఆమె కూడా బ్రహ్మగారి శాఖవారికి నోరారా వడ్డించింది.

అందరూ తనవైపు చూడటమే తడవుగా విష్ణువు స్పందించాడు. మందహాసంతో అందరినీ ముగ్ధులను చేస్తూ పండొలిచి చేతిలో పెట్టే శైలిలో ఇలా అన్నాడు: ‘ దేవతాసహచరులారా! నేను అర్థం చేసుకున్న మేరకు ఉభయులూ పట్టువిడువని ఈ తగాదాలో తేలిన ప్రశ్న ఏమంటే - మిగతా శాఖలన్నీ సహకరించకపోయినా, భాగ్యలేఖన శాఖ నిర్ణయం అవశ్యంగా జరిగి తీరుతుందా? ఇదే మూల ఛాలెంజి లాగుంది. నా అంచనా నిజమంటారా?’

నిజమేమిటి, నిజమున్నర అంటూ అందరూ అంగీకరించారు. విష్ణుమూర్తి ఆ పైన అందుకుని, ‘అలాగైతే ఈ సమస్య వైశాల్యాన్ని తగ్గించి దీనినొక స్థానిక సమస్యగా మార్చడమే శ్రేయస్కరమను కుంటాను. తదుపరి దాన్ని నెమ్మదిగా పరిష్కరిస్తూ దాని దుష్పరిణామం సృష్టిలో మరెక్కడా పడకుండా జాగ్రత్తపడాలి. దీని కొరకొక సులువైన మార్గం సూచించడానికి మన గురుశ్రేష్ఠులు బృహస్పతిని అర్థించండి!’


ఏదో కొండంత బరువు తల పైనుంచి దిగిపోయినట్టు సభాగృహంలో పెద్ద నిట్టూర్పు వినపడింది. తనకు చేతకాని పనిని పక్కవాడి ఒడిలో పడేయడంలో కలిగేహాయి అది. మానవుల్లో వలెనే దేవతల్లో కూడా నిర్ణయం తీసుకునే బాధ్యత తప్పితే అందరూ సంతోషిస్తారేమో! ఇంతవరకు భ్యాగలేఖన శాఖపై దేవతలందరికెంత ఉక్రోషముండినా, నిజంగానే ఉభయపక్షాల మధ్య హోరాహోరీ పోరంటూ జరిగితే, దాని భయంకర పరిణామాలెలా ఉండొచ్చో!’


కొంత వాళ్ళకు వాళ్ళకు బోధపడటం మొదలైంది. తగాదా పెట్టడం వరకైతే పెట్టారు కానీ పెట్టిందాన్ని పెరకడమంటే వాళ్ళతరం కాదని అందరికీ తెలుసు. విష్ణుదేవుని ఆదేశం వింటూనే బృహస్పతిగారి ముడతలు పడిన ఫాలభాగం పైన మరిన్ని ముడుతలు కనిపించాయి. దీర్ఘాలోచనలో నిమగ్నుడై మెల్లిగా లేచి విష్ణువుకు నమస్కారం చేస్తుంటే అందరి దృష్టి ఆ ముడతల పైనే నిలిచింది. ఆయన మందహాసంవల్ల ముడతలన్నీ అర్ధవర్తులాకారంలోకి మారాయి. దేవతలనుద్దేశించి ఆయన ఇలా ప్రారంభించాడు:


‘దేవతాపుంగవులారా! విష్ణుభగవానుని లీలలు మనోవాచామ గోచరములైనా ఆ మహనీయుని ఆనతిలో నాకొక మహత్తర భావం స్పష్టంగా కనపడుతోంది. ఈ వివాదాన్ని స్థానికీకరించడంలోని వివేకానికి తల ఒగ్గుతున్నాను. ఇందుమూలాన తగాదా పరిధి తగ్గి ఒక్క అంశానికే (ఇష్యూ) పరిమితమౌతుంది. మిగతా బ్రహ్మాండమంతా ప్రశాంతంగానూ, కలహరహితంగానూ ఉండిపోతుంది. అందుకని నేనీ విధంగా ప్రస్తావిస్తున్నాను; ఒకే ఒక వ్యక్తిని, వీలైతే మనుష్య జాతివాడిని, మనం పరీక్షాంశంగా ఎంపిక చేసుకోవాలి. ఆ ఒక్క వ్యక్తిని గురించి దేవతల ఉభయపక్షాలకూ సంపూర్ణ స్వేచ్ఛనివ్వాలి. ఆ వ్యక్తి అదృష్టం గురించి భాగ్యలేఖన శాఖకు ఎన్ని ఉన్నతోన్నత మహర్దశలైనా ఇచ్చే అవకాశం ఉంటే, తక్కిన శాఖల వారందరూ అతనికెంతైనా హాని కలిగించవచ్చు. చివరకేమౌతుందో దాన్ననుసరించి జయాపజయాల నిర్ణయం జరుగుతుంది. ఇక మళ్ళీ హెచ్చరిస్తున్నాను. మిగతా బ్రహ్మాండమంతటా పూర్వవత్‌ అందరూ క్రమశిక్షణ తు.చ. తప్పకుండా పాటించాలి!’ ఈ ప్రస్తావననందరూ ఏకగ్రీవంగా అంగీకరించి తదనుసారం తీర్మానించడం జరిగింది.ఇక మిగతా కార్యక్రమాన్ని గురించి బృహస్పతి ఇలా ఆదేశించాడు: 

ఈ టెస్ట్‌ కేస్‌ వ్యక్తిని చూడాలంటే దయచేసి కళ్ళు మూసుకుని భూగ్రహంవైపు చూడండి (దేవతలలాగే చూడసాగారు).  

(ఆ దేవలోక వివాదం ఎన్ని మలుపులు తిరిగిందో, ఇంకెన్ని చర్చలకు దారితీసిందో .. వచ్చేవారం చదవండి)


logo