గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 21:53:08

టాయిలెట్ల కోసమూ.. మ్యూజియం!

టాయిలెట్ల కోసమూ.. మ్యూజియం!

ప్రతి ఒక్కరికీ టాయిలెట్ల ఉపయోగంపై అవగాహన ఉంటేనే వ్యాధులను నివారించవచ్చని సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ భావించారు. ‘స్వచ్ఛ్‌ భారత్‌'కు ముందే ప్రజా మరుగుదొడ్ల వ్యవస్థాపనను ఓ ఉద్యమాన్ని స్వీకరించారాయన. టాయిలెట్ల ఉపయోగంతోపాటు వాటి చరిత్ర, ఆధునికతకు సంబంధించి సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం ‘టాయిలెట్‌ మ్యూజియం’ ఏర్పాటు చేశారు. 

అన్నిటికన్నా భిన్నంగా..

1992లో ఢిల్లీలో టాయిలెట్‌ మ్యూజియం ఏర్పాటైంది. ఇది అన్ని మ్యూజియాలకంటే భిన్నం మైంది. కాబట్టే, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ప్రపంచ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్య సమితి అధికారులు  దీనిని సందర్శించారు. టాయిలెట్‌ మ్యూజియం అంటే.. కంపుకొట్టే భవనం కానేకాదు. సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌లో అంతర్భాగమైన ఈ ప్రదర్శనశాల అత్యాధునికంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది. 

మరుగుదొడ్ల చరిత్ర..  మానవ నాగరికతతో కలిసి అవి ఎలా పరిణామం చెందాయి.. వంటి వివరాలు ఇక్కడ సచిత్రంగా లభిస్తాయి. రాజుల కాలంలో వాడిన విలాసవంతమైన కుర్చీ ైస్టెల్‌ టాయిలెట్లు.. చిత్ర విచిత్ర నమూనాల్లోని రకరకాల టాయిలెట్ల మోడల్స్‌ ఇక్కడ కనిపిస్తాయి. దేశ విదేశాలనుంచి కొత్త మోడల్స్‌ కూడా వచ్చి చేరుతుంటాయి. అందుకేనేమో, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా, ప్రతి సారీ ఏదో ఒక కొత్త మోడల్‌  కనబడుతూనే ఉంటుంది. ఇక్కడున్న ఒక ఎలక్ట్రానిక్‌ నమూనా టాయిలెట్‌ సీటుపై కూర్చుంటే మన శరీర  ఆరోగ్య వివరాలన్నీ (బీపీ, టెంపరేచర్‌, షుగర్‌ మొదలైనవి) అదే  తెలుపుతుంది. మరో మోడల్‌లో.. విసర్జిత పదార్థాలు వెంటనే అధిక ఉష్ణోగ్రతలో బూడిదయ్యే విధానం అబ్బురపరుస్తుంది.ఏ సమాచారం కావాలన్నా వివరించడానికి గైడ్స్‌ సిద్ధంగా ఉంటారు. మానవ విసర్జకాలను కంపోస్ట్‌ ఎరువుగా మార్చే టాయిలెట్‌ నిర్మాణాల గురించీ మనకు అవగాహన కల్పిస్తారు. మ్యూజియానికి వంద అడుగుల దూరంలో బయో గ్యాస్‌ప్లాంట్‌ ఉంది. దీనితోపాటు వ్యర్థజలాల్ని శుద్ధి చేసే విధానాన్ని కూడా ఇక్కడ చూపెడుతారు. 

ఎంతో ప్రయాస..

మూడు దశాబ్దాలక్రితం ఈ మ్యూజియాన్ని నెలకొల్పడం కోసం సులభ్‌ సంస్థ ఎంతో కష్టపడాల్సివచ్చింది. సంస్థ ఢిల్లీలోనే ఉండటంవల్ల పలు దేశాల ఎంబసీలు, హైకమిషన్లతో సంప్రదించడంతో కొంతవరకు పని సులువైంది. వారి సహకారంతో వివిధ దేశాలనుండి టాయ్‌లెట్లకి సంబంధించిన వివరాలు, నమూనాలు సేకరించారు. ఒకే విషయంపై సంపూర్ణ మ్యూజియాన్ని నెలకొల్పడమంటే పెద్ద సవాలే కదా!  మ్యూజియంలో చైనాకు చెందిన ‘టాయ్‌ కమోడ్‌', అమెరికాలోని ‘ఎలక్ట్రిక్‌ టాయిలెట్‌', జపాన్‌ దేశంలో వినియోగించే అధునాతన ‘ఎలక్ట్రానిక్‌ టాయిటెట్‌'లను చూడొచ్చు. దాదాపు 50కి పైగా దేశాల్లో ఉపయోగిస్తున్న టాయిలెట్ల నిర్మాణాలను ఫొటోల ద్వారా ఇక్కడ సందర్శించవచ్చు. ఈ మ్యూజియం సందర్శన వయోధికుల్ని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. యువతకు ఒకటిరెండు తరాల వెనుకటి సమాజాన్ని పరిచయం చేస్తుంది. సృష్టిలో దేన్నీ అసహ్యించుకోకూడదన్న ఎరుక కూడా మనలో కలుగుతుంది. సులభ్‌ సంస్థకు కృతజ్ఞతలు.  టి. సంపత్‌ కుమార్‌, ఢిల్లీ logo