మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 21:51:20

వాస్తు పెద్దపెద్ద స్థలాలకు, పెద్ద వాళ్లకేనా ..

వాస్తు పెద్దపెద్ద స్థలాలకు, పెద్ద వాళ్లకేనా ..

 వాస్తుశాస్త్రం  సకల జనుల కోసం. కొందరు దానిని దూరం పెడుతుంటారు. తామే మహాబుద్ధి జీవులమని భావిస్తారు. దీన్ని పాటించే వాళ్లంతా తక్కువ వాళ్లనీ, సైన్సు తెలియని వాళ్లనీ  అనుకుంటారు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే.. ఈ భూమే తన సౌర మండలంలో శాస్త్రీయంగా సృష్టిచట్టం మేరకు నడుస్తున్నది. తద్వారానే మనవ శరీరం కదులుతున్నది.  ఇక ఈ శాస్త్రం చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి నిర్మాణానికి వర్తిస్తుంది. పొట్టివాళ్లు, పొడుగువాళ్లు నిరుపేదలు, ధనికులు అందరూ పాటించాల్సిన ఋషి విజ్ఞాన వైభవోపేత శాస్త్రమిది.   అయితే చిన్న స్థలాల్లోనూ.. జాగ్రత్తగా తగిన విధంగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఇల్లు కట్టినా దానికి బంగారం అద్దికట్టినా, ముట్టి ముద్దతో కట్టినా.. కట్టేది  జీవగృహం కావాలి. రాజమహళ్లు, తాజ్‌మహళ్లు అక్కరలేదు. ఉండబుద్ధి అయ్యే  పూరి గుడిసె అయినా చాలు. 

ప్రధాన ద్వారం ఎంత వెడల్పు ఉందో, అంత వెడల్పు మిగతా  ద్వారాలు పెట్టొచ్చా? 

-కేవీ రమణ, ఆలేరు

ఇంట్లోని అన్ని గదులకు పెద్ద ద్వారాలు అవసరం ఉండదు. కొన్ని ప్రత్యేకమైన ఫ్యాక్టరీలు,  ప్రింటింగ్‌ ప్రెస్‌లు, ఫిల్మ్‌ స్టూడియోలు.. మొదలైన  భవనాల్లో ఆ అవసరం ఉండొచ్చు.. సింహద్వారం ఎంత ఉంటే, అంతే పరిమాణంలో మిగతా గదుల ద్వారాలు పెట్టాలన్న విధానం లేదు. టాయిలెట్‌ కట్టేదే తక్కువ ప్లేస్‌లో, దానికి నాలుగు అడుగుల ద్వారం ఎలా పెడతాం? రెండున్నర అడుగుల ద్వారం చక్కగా సరిపోతుంది.  ప్రధాన ద్వారం కొలతలు వేరుగా ఉంటాయి. మిగతా గదుల ద్వారాల కొలతలు వేరుగా ఉంటాయి. అయితే ఎత్తు విషయంలో మార్పు ఉండదు. ఇంటి పడక గదుల ద్వారాలు మూడూ, మూడున్నర అడుగులు సరిపోతాయి. 

ఇంటి ప్రహరీ  సగం గోడ, సగం జాలీలతో కట్టుకోవచ్చా? అప్పుడు దేనితో దాని ఎత్తు లెక్కించాలి?

-మనోహర్‌రావు, భీమారం

ప్రహరీని మట్టితో, సిమెంటుతో, ఇటుకలతో పూర్తిగా కట్టుకోవచ్చు. లేదా కాంక్రీటుతో కూడా కట్టొచ్చు. కొందరు పూర్తిగా మూసినట్టు ఉండవద్దు అనుకొని.. సగం ఎత్తు ఇటుక గోడతో ఆపై భాగం స్టీలు జాలీలతో అందంగా.. గాలి, వెలుతురు కోసం కడుతూ ఉంటారు.  ఎలా కట్టినా దోషం లేదు. దక్షిణం, పడమర గోడలు తప్పక తూర్పు, ఉత్తరం గోడల కన్నా ఎత్తుగానే ఉండాలి. మీరు కట్టే గోడలతో ఆ ఎత్తు తగ్గటు పెట్టుకొని, అదేవిధంగా ఆ గోడపైన స్టీలు జాలీలు పెట్టుకోవచ్చు.  ఎత్తును లెక్కించే విషయంలో మీరు గోడమీద పెట్టే జాలీలు కూడా పరిగణనలోకి వస్తాయి. అయితే తూర్పు ఉత్తరం, గోడలు దక్షణం పడమర గోడల కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. 


logo