గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 21:45:33

ఏం మంత్రం వేశారో..

ఏం మంత్రం వేశారో..

తండ్రి ప్రేమ

వీ6లో తీన్మార్‌ న్యూస్‌ చాలా ఫేమస్‌. ప్రస్తుతం అందులో యాంకర్‌గా రాధ అలియాస్‌ ధరణి ప్రియ కనిపిస్తున్నది. తనది ప్రేమ వివాహం. ఇటీవల ఆమె తండ్రి పెట్టిన ఒక పోస్ట్‌.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయ్యింది. అందులో ముఖ్యంగా కొన్ని విషయాలు  ప్రస్తావించాలి.. ‘ఒక అమ్మాయి కోసం అబ్బాయిని వెతుకుతున్నారంటే.. వారి వెనుక ఆస్తిపాస్తులను కాదు చూడాల్సింది, కష్టించే గుణం’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు ‘అనాథలైనా ఫర్వాలేదు.. అండగా మీరుంటే చాలు మీ కూతురు సంతోషం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. నేను అలానే ఇచ్చాను. ఇప్పుడు నా కూతురు చాలా సంతోషంగా ఉంది. ఒక తండ్రిగా ఇంకేం కావాలి?’ అంటూ రాశారు. నిజమే కదా.. తండ్రికి కూతురు సంతోషంగా ఉంటే చాలు. 

‘అద్దం’ పట్టేలా.. 

హాట్‌.. చిలిపి యాంకర్‌గా పేరు తెచ్చుకున్నది విష్ణుప్రియ. ఈ మధ్య హాట్‌.. హాట్‌ వీడియోలతో అందరిలోనూ హీట్‌ పుట్టిస్తున్నది. ఇటీవలే ఓ స్కిట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది తను. అద్దానికే మాటలొస్తే ఎలా ఉంటుంది..? ఏం అంటుంది? అనే కాన్సెప్ట్‌తో ఈ స్కిట్‌ సాగుతుంది. ఇందులో తన చెల్లె కూడా నటించింది. ‘ అంతేలెండి.. మిమ్మల్ని మీకు అందంగా కనబడేలా చేసే నేను.. మీకు మాత్రం సరిగ్గా కనబడను’ అంటూ ఈ వీడియో సాగుతుంది. ‘సైజ్‌ ఎంత ఉన్నా.. క్రేజ్‌ మాత్రం కొండంతా’.. అంటూ వచ్చే డైలాగ్స్‌ నవ్వు తెప్పిస్తాయి. వర్కవుట్‌లు చేసినా పొట్ట తగ్గదేంటని విష్ణు ప్రియ అద్దంలో చూసుకుంటుంది. పైగా ఈ అద్దమే లావుగా చూపిస్తున్నదని తిడుతుంది. దానికి ఆ అద్దం.. ‘తిండి తగ్గిస్తే అదే తగ్గుతుంది’ అంటూ గొణుక్కునే సీన్‌లో ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. 

మూసలా వద్దు.. 

జీ తెలుగు చానెల్‌లో ‘కళ్యాణ వైభోగం’ సీరియల్‌కు ఫాలోవర్లు ఎక్కువ. మంగ, జైలను అభిమానించే వాళ్లు, నిత్యను తిట్టుకొనేవాళ్లూ ఎంతోమంది. మంగ, నిత్య పాత్రల్లో మేఘనా లోకేష్‌ అందరినీ ఆకట్టుకుంటున్నది. లాక్‌డౌన్‌ తర్వాత మంగకి ఇద్దరు పిల్లలు.. వాళ్లు పెద్దవాళ్లు కావడం.. ఇలా కథ సాగుతున్నది. అయితే చిన్న పిల్ల అయిన మంగని ఇద్దరు పిల్లల తల్లిగా చూడాల్సిరావడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో ఆమెకి మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. దీనికి మేఘన స్పందించింది. ‘నేను విభిన్న పాత్రలు చేయడానికి ఇష్టపడుతాను. పాత్ర ఏదైనా నేను న్యాయం చేయాలి. అది నా బాధ్యత. అభిమానులు కూడా నన్ను ఇలా ఆదరిస్తారని కోరుకుంటాను’ అంటూ పోస్ట్‌ పెట్టింది. 

క్యూట్‌ లవ్‌స్టోరీ 

మూడేండ్ల క్రితం సింపుల్‌ స్టోరీతో యూట్యూబ్‌లో ఒక సిరీస్‌ వచ్చింది. అదే గీతా సుబ్రమణ్యం. చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలు, ప్రేమలు.. ఇలా సాగుతుంది ఈ వెబ్‌ సిరీస్‌. దీన్ని బేస్‌ చేసుకొని ‘ఆహా’లో గీతా సుబ్రమణ్యం 2020 రిలీజ్‌ అయింది. దీంట్లో నక్షత్ర, కార్తీక్‌.. గీతా, సుబ్రమణ్యంగా సందడి చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు మూడు ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్‌ అయ్యాయి. ఆ తర్వాత మిగతా ఎపిసోడ్లు కూడా ‘ఆహా’లో సందడి చేస్తున్నాయి. ఆ క్యూట్‌ ప్రేమకథని వీక్షించేవారి సంఖ్యలో రోజురోజుకూ పెరుగుతున్నది.  గీత అలకలు, సుబ్రమణ్యం పలుకులు వినాలంటే ఈ సిరీస్‌ని తప్పక చూడాల్సిందే!