గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 21:44:09

పుస్తకం ఆనందాన్నిస్తుంది... పుస్తక సమీక్ష

పుస్తకం ఆనందాన్నిస్తుంది... పుస్తక సమీక్ష

స్త్రీ హృదయ దర్పణం

ప్రతి కథలోనూ స్త్రీనే ఇతివృత్తం. ఆమె సమస్యలు, సంఘర్షణలే నేపథ్యం. ఏదో ఒక బతుకు పాఠంతో నిలిచే ముగింపు. ఇదీ ‘అరుంధతి @ 70’  కథాసంకలనానికి క్లుప్త పరిచయం. డబ్భు ఏండ్లకి కలం చేపట్టి, విజయం సాధించిన ఓ మహిళ కథే ‘అరుంధతి @ 70’. ఉన్నతమైన ఆశయాల కోసం విడిపోయే ఓ జంట గురించి రాసిన ‘ఒక ప్రేమ కథ’, వ్యసనాల మూలాలను వెతికి పట్టే ప్రయత్నం చేసిన ‘మానసరాగాలు’, క్యాన్సర్‌ కంటే ప్రాణాంతకమైన స్వార్థం గురించి చెప్పే ‘విశాలి’.. ఇలా ఈ పుస్తకంలోని ప్రతి కథా వైవిధ్యంగా సాగుతుంది. ‘ఆంతర్యం’, ‘బ్రేకప్‌', ‘పరివర్తన’... ప్రతి కథాంశమూ మనసులో అక్షర ముద్రగా మారిపోతుంది. వీటికి అదనంగా రెండు నవలికలను కూడా జోడించారు. అవి కూడా బరువుబాధ్యతలు, అనుబంధాల మధ్య నడిచే మహిళా జీవితాలకు దర్పణంగా నిలుస్తాయి. పాఠకుల హృదయాలను కదిలించే ఈ కథలు జీవన పరమార్థాన్ని బోధిస్తాయి. మంచిచెడులను విశ్లేషిస్తాయి.

జీవన స్పందనలు

హవిస్‌... పండులాంటి పిల్లవాడు. కానీ ఎదిగేకొద్దీ బలహీనపడిపోతున్నాడు. సున్నితంగా మారిపోతున్నాడు. మనవడిని చూసేందుకు తాత వడివడిన వచ్చాడు... నగరీకరణే ఆ పిల్లవాడికి నరకానికి కారణం అని తేల్చాడు. ఇదీ ‘కిరణం’ కథలోని వివరం. స్వయంప్రకాశ్‌ కోట్లకి పడగలెత్తాడు. తరాలకు తరగని ఆస్తిని సంపాదించాడు. అయినా కొడుకు భావేంద్ర ‘మాకేం మిగిల్చారు నాన్నా?’ అంటూ నిలదీశాడు. తన తండ్రి తరం అమూల్యమైన ప్రకృతి వనరులను నాశనం చేశారన్నది అతని ఆక్రోశం. పి.వి.ఆర్‌. రవికుమార్‌ తన రెండో కథా సంపుటిలో పొందుపరిచిన 21 కథలలో ఇలాంటి వాదనలు ఎన్నో ఆలోచింపచేస్తాయి. పాఠకుడిని కూడా పాత్రగా మార్చేస్తాయి. వావివరసలు మరిచే కామం (రాకూడని అతిథి), మానవత్వం దాటే ద్వేషం (మీరేమంటారు)... ఇలా ప్రతి కథా రచయిత సహజమైన స్పందనకు సృజన జోడిస్తూ సాగినదే! ఇతివృత్తాలన్నీ సమాజంలోంచి తీసుకున్నవే కావడంతో, సహజత్వం ఉట్టిపడుతుందీ రచనల్లో. ఆ ప్రత్యేకతే పాఠకుల్ని చదివేలా చేస్తుంది. 

చదివించే ప్రయత్నం

రవీంద్రానాథ్‌ ఠాగూర్‌ కవిత్వం ప్రపంచవ్యాప్తం కావచ్చు. కానీ అందుకు ఏమాత్రం తీసిపోనిది కథా నైపుణ్యం. చిన్న కథతోనే మనసును వణికించగల ప్రతిభ తనది. ఇక మలుపులు తిరిగే నవలను రాస్తే చెప్పేదేముంది. అదే ‘నౌకాభంగం’. టాగోర్‌ గీతాంజలికి దీటుగా ప్రచారం పొందిన రచన. ఓ రెండు యువజంటలు ఒకే నౌకలో ప్రయాణిస్తే... తుపాను రూపంలో విధి వాళ్లని తారుమారు చేస్తే ఉత్కంఠభరితంగా సాగే నవల ఇది. 70 ఏళ్ల క్రితమే ఒద్దిరాజు సోదరులు దీనిని తెలుగులోకి అనువదించారు. వారి అనువాద శైలి, పదాల ఎంపిక విషయంలో ఎలాంటి లోటూ లేదు. కానీ కాలం గడిచిపోవడంతో... ఇప్పటి తరానికి నాటి భాష కాస్త క్లిష్టంగా తోచవచ్చు. అందుకే ఒద్దిరోజు సోదరులలో ఒకరైన రాఘవరంగారావు తనయ రంగరాజు పద్మజ.. నాటి రచనను మరింత సులభశైలిలోకి మార్చారు. ‘హరిదాసి’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. నాటి పుస్తకానికి మరింత పఠనీయతను తీసుకురావడంలో విజయం సాధించారనే చెప్పాలి.