శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 21:42:34

పలుకుబడులు

పలుకుబడులు

అంధుడికి అద్దం చూపించినట్లు.. 

ఏదైనా ఒక విషయం గురించి ఎంత వివరించి చెప్పినా, కొంతమంది అర్థం చేసుకోలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచిస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు. ‘వీనికి ఎంత చెప్పినా దండగే.. అంధుడి ముందట అద్దం పెట్టినట్లే ఉన్నది యవ్వారం’ అని అంటారు. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడి పనిచేసినా, ఆ శ్రమను ఎదుటి వారు గుర్తించలేరు. పైగా, నిర్లిప్తంగా.. నిరాసక్తంగా ఆ పనితనాన్ని తోసి పుచ్చుతుంటారు. అలాంటివారిని ఉద్దేశించి కూడా ఈ సామెతను వాడుతుంటారు. అంధులకు ఎదుటి వస్తువులు ఏ మాత్రం కనిపించవు. అలాంటిది అందాన్ని ఒకటికి పదిసార్లు చూసుకునేందుకు వాడే అద్దాన్ని అతనికి ఇస్తే, దానివల్ల ఆ అంధునికి కలిగే ఆనందం శూన్యం. ఈ విషయాన్నే పై సామెత సూచిస్తుంది. 

దండె కొడుతడు సూడు..

‘దండె కొట్టుడు’ అంటే తూకంలో మోసం చేయడం. కిరాణ దుకాణంలో బియ్యం, చక్కెరలాంటి నిత్యావసర సరుకులు తీసుకున్నప్పుడు సరిగ్గా కిలో.. రెండు కిలోలో వచ్చేలా తూకం వేయకుండా, కొంచెం తక్కువగా ఇస్తుంటారు కొందరు వ్యాపారులు. అలాంటి సందర్భాల్లో ఈ పద ప్రయోగం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ‘కాంట కొట్టడం’ అని కూడా అంటారు. “ఓ బుజ్జి.. దుకాండ్లకు పోయి, ఓ అద్దకిల శెక్కరి దీస్కరా పో. గట్లనే జోకేటప్పుడు తరాజునే సూడు. అతను మొత్తం దండె కొడుతడు.”  అని గ్రామాల్లో మాట్లాడుతుంటారు. సరుకులను తూకం వేయడాన్ని తెలంగాణలోని అనేక చోట్ల ‘జోకడం’ అంటారు. ఈ జోకడాన్ని వేరే సందర్భాల్లోనూ వాడుతుంటారు. ఉదాహరణకు ఎవరి గురించైనా ఎక్కువ గొప్పలు చెబుతుంటే కూడా.. “అరే.. వాన్ని గంతగానం జోకుతుండేందిరా..” అని కూడా అంటుంటారు. 

అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు..

అత్త అంటే మనందరికీ తెలిసిందే. మరి దుత్త అంటే ఎవరు..? ఎవరైనా దూరపు చుట్టం అనుకుంటున్నారా..? కాదు.. దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. పెరుగు, మజ్జిగను నిల్వ చేసుకునేందుకు దీనిని ఎక్కువగా వాడుతుంటారు. ఒక కోడలికి అత్త మీద కోపం వచ్చిందట. కానీ, ఏం చేస్తుంది. అత్తేమో పెద్దావిడ. ఏమీ అనలేదు. ఏమన్నా అన్నా.. భర్త ఊరుకోడు కదా.. అందుకే ఆ కోపాన్నంతా చేతిలో ఉన్న ఈ చిన్న కుండ (దుత్త) మీద చూపి, దాన్ని విసిరేసి పగుల గొట్టిందట. అలా ఈ సామెత పుట్టిందని చెబుతారు. అందుకనే ఒకరి మీద కోపం ఇంకొకరిపైన చూపించిన సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు. ఆఫీస్‌లో బాస్‌ తిట్టినా.. ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా.. ఆ కోపాన్నంతా భార్యపై చూపిస్తుంటారు కొందరు మగవాళ్లు. భార్య కూడా కొన్ని సందర్భాల్లో భర్త మీద కోపాన్ని, వంటిట్లోని గిన్నెలు, గిలాసలపై చూపుతుంటుంది. ఇవన్నీ ‘అత్త మీద కోపాన్ని దుత్తమీద చూపినట్లే’..

మొత్తానికే ఈడ్సుక పోయిండు.. 

‘ఈడ్సుక పోవడం’ అంటే బక్కచిక్కి పోవడం. సరైన తిండి లేకపోయినా.. అనారోగ్యానికి గురై ఏమీ తినకపోయినా కొందరు సన్నబడుతుంటారు. అలాంటి సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా పిల్లగాడు బక్కగా ఉంటే.. “ఏందిరా పోరడా.. మీ అవ్వ బువ్వ పెడ్తలేదా ఏంది. పురాగ ఈడ్సుక పోయినవ్‌..” అంటుంటారు. ఈ ఈడ్సుక పోవడాన్ని మరికొన్ని సందర్భాల్లోనూ విరివిగా వాడుతుంటారు. కాళ్లు లాగడం, చేతులు లాగడాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా “నా కాళ్లు, రెక్కలు(చేతులు) ఈడ్సుకత్తన్నయ్‌” అని అంటుంటారు. ‘ఈడ్చుకెళ్లడం’ అనే పదాన్ని కూడా ‘ఈడ్సుకెళ్లడం’గా ప్రయోగిస్తుంటారు. “వాడు సూడు గొర్రెపిల్లను గొర్రగొర్ర ఈడ్సుకపోతండు” అనే మాటలు కూడా అప్పుడప్పుడూ వింటుంటాం. 


logo