శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 20:52:32

గోల్డెన్‌ ఐడియా సిద్దిపేట స్టీల్‌ బ్యాంకు

గోల్డెన్‌ ఐడియా సిద్దిపేట స్టీల్‌ బ్యాంకు

అన్నింటా ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చడానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఓ  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాల్లో ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్‌ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించారు. ఇందుకోసం బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో పట్టణంలోని పలు వార్డులలో స్టీల్‌బ్యాంకులను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా వార్డుల్లోని ఆర్పీలకు అప్పగించారు. ప్రతి ఒక్కరూ స్టీల్‌ బ్యాంకులను సద్వినియోగం చేసుకునేలా.. ప్లాస్టిక్‌ సామగ్రిని స్వచ్ఛందంగా నిషేధించేలా పాలకవర్గ సభ్యులు, ఆర్పీలు, స్వయం సహాయక బృందాలవారూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.  క్రమంగా ఇదో సామాజిక ఉద్యమంలా మారుతున్నది.

వీరిదే కీలక పాత్రసిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులను ప్రారంభించారు. మరో పదిహేను వార్డుల కోసం స్టీల్‌ బ్యాంకు సామగ్రిని తెప్పించారు. ఆయా మహిళా సంఘాల భవనాల్లో ఆ వస్తువులను భద్రపరిచారు. వాటిని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, స్టీల్‌ బ్యాంకు నుంచే సామగ్రి తీసుకెళ్లేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అన్ని కార్యాలకు అవసరమయ్యే స్టీలు పాత్రలు బ్యాంకుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్నం ప్లేట్లు, టిఫిన్‌ ప్లేట్లు, టీ గ్లాసులు, స్వీట్‌ కటోరాలు, స్వీట్‌ స్పూన్లు, కర్రీ బకెట్లు, కర్రీ స్పూన్లు, రైస్‌ స్పూన్లు, సాంబారు గంటెలు, పెద్ద బేసిన్లు.. ఇలా సమస్త వస్తువులూ ఉంటాయి. వీటిని వినియోగించినందుకు  రూ.1500 నుంచి రూ.1800 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. టెంట్‌హౌస్‌ ఖర్చులతో పోలిస్తే  ఈ కిరాయి తక్కువే. 

ప్లాస్టిక్‌ వాడితే ఫైనే..

స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. రోడ్లపై చెత్తాచెదారం వేసినా.. పాలిథిన్‌ కవర్లను వాడినా జరిమానా విధిస్తున్నారు. శుభకార్యాలు, ఫంక్షన్‌ హాళ్లలో ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు వాడితే నిర్మొహమాటంగా ఫైన్‌ వేస్తున్నారు. అయినా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ ప్లాస్టిక్‌ వైపే చూసేవారు.  ఈ విషయాన్ని గమనించి, వార్డుల్లోనే స్టీల్‌ బ్యాంకులకు ఏర్పాటు చేశారు. ఇకనుంచి ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా, ప్లాస్టిక్‌ సామగ్రి జోలికి వెళ్లకుండా.. ఇక్కడి నుంచే స్టీల్‌ వస్తువులను తీసుకెళ్లేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. నిజానికి ప్రజలకు పర్యావరణం మీద ప్రేమ ఉంటుంది. కానీ, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే.. ప్లాస్టిక్‌ను వినియోగిస్తారు. మనం చేయాల్సిందల్లా, వారికి కొత్తదారి చూపించాలి. సిద్దిపేటలో స్టీల్‌ బ్యాంకుల ద్వారా జరుగుతున్నది ఇదే. కాబట్టే, ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలిచింది. 

ప్లాస్టిక్‌కు చెక్‌..

సిద్దిపేటలో పరిపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా  మంత్రి హరీశ్‌రావు ఆలోచనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వార్డుల్లో స్టీల్‌ బ్యాంకుల ఏర్పాటుతో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గుతున్నది. స్టీలు సామగ్రి వాడకం వల్ల ఆరోగ్యానికి కూడా హాని జరగదు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో స్టీలు బ్యాంకులను ప్రారంభించాం. మరికొన్ని వార్డులకు సామగ్రి వచ్చింది. త్వరలోనే అన్ని వార్డుల్లోనూ స్టీల్‌ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నాం. ప్రజల వైపు నుంచి కూడా స్పందన బాగుంది.  - కడవేర్గు రాజనర్సు మున్సిపల్‌ చైర్మన్‌