ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 03:47:56

ఇచ్చిత్రం కత

ఇచ్చిత్రం కత

జర సేపు సోంచాయిస్తున్నట్లు మీదికి సూశి నిమ్మలంగ చెప్పింది లచ్చుమమ్మ, ‘బతుకుల ఎన్ని తిప్పలువడ్డా, ఎవ్వడు తిప్పలవెట్టినా, ఏ కష్టం అడ్డమొచ్చినా, అన్నదమ్ములందరు కల్సిమెల్సి ఒగరికొకరు ఆసర ఉంటే దేన్నన్న ధైర్నంగ ఎదిరొంచొచ్చు అనేది నేర్పుతదమ్మగీ శీన్మ’.

పొయ్యి గొల్ల లచ్చుమమ్మను పిలువు’, అంటాని బాపమ్మ అంటే పొయ్యి పిల్సొచ్చిన. నా ఎనకనే ఒచ్చింది లచ్చుమమ్మ. ‘జరకన్ని కందులున్నయి బర్పటిద్దాము రావే,’ అన్నది. అని,‘బువ్వ తినొచ్చినావే,’ అంటాని మల్లడిగింది.  ‘తిందామని కూసుంటుండంగనే నీ మనుమడొచ్చినడమ్మా, గిందుకని చెప్పలే, ఇంత తినొస్త,’ అన్నది లచ్చుమమ్మ.

     ‘ఇగ పొయ్యి తినొచ్చినవ్వు తియ్యి,’ అని లేశి వండెమింట్లకొయ్యి రెండు పచ్చ జొన్నరొట్టెలు, ఆటి మీద ఇంత కోయిగూర పెట్టుకొచ్చి లచ్చుమమ్మ చేతుల్ల వెట్టింది.  కుదార్తంగ కూసోని జోలి వెట్టుకుంట తిన్నంక, గన్మకాడ రెండు గోనె బస్తాలు పరిశి దానిమీద తాత పాత పంచె ఏశి, దానిమీద ఇసుర్రాయి పెట్టింది లచ్చుమమ్మ.  అంతట్ల అర్రలకొయ్యి ఒక గుల్లెడు కందులు తీస్కొచ్చింది బాపమ్మ. ఇసుర్రాయి ముంగల అటొకరు ఇటొకరు ఒక కాలు మడిసి, ఒక కాలు సాపి కూసున్నరు.  ఓ చేత ఒగరు కందులు ఇసుర్రాయి మొదాట్లేసుకుంట, దానికున్న గుంజను ఇద్దరు కలిసి ఇసురవట్టిండ్రు. గన్మ పక్కలనే ఉన్న పీటెమీద పండుకోని ‘బాలమిత్ర’ సదూతున్న.  జరంత సేపు ఊరోల్ల జోలి వెట్టుకున్నంక మా లచ్చుమమ్మ మెల్లెగ షురూజేసింది.  ‘నాతిరి కచ్చీరుకాడ టీవీల మంచి శీన్మ ఏసిండ్రు, మీర్రాకపోతిరి?’

‘ఏం సీన్మనే?’

‘ఏదో ఉండెనమ్మ పేరు, మతిలకొస్తలేదు, ఎంట్రామరావు, సాయిత్రి, కిష్న మంచిమంచోళ్ళు ఇంక శాన మంది ఉన్నరు.’

‘ఇంట్ల ఓ సుట్టమాయిన ఉండే, పొద్దున్నే పోయిండు గని, సీన్మ కతేందో జెప్పే జర,’

‘ఎంట్రామరావు సాయిత్రి మొగుడు పెల్లాలు. రామరావ్‌ వకీలుగిరి శేసి ఊళ్ళే మంచి పేరు సంపాయిస్తడు, ఆయ్నెంత హుషారు పిట్టెనో అంతకంటే ఎక్వ అమ్యాద పెండ్లాం సాయిత్రి, ఉత్తగ పిట్టె బుర్రుమంటనే బుగులుపడ్తది.

 బాలమిత్ర పక్కలవడేసి లేశి కూసున్న.

‘సాయిత్రి మరిది కిష్న, చీట్కె పోరడమ్మా, గిచ్చి కయ్యాలు వెట్టుకుంటడు. దినాం నలుగుర్ని తన్ని మల్ల పైసలిచ్చి తోలిస్తడు. గీ యవ్వరం తెల్సిన బలాదూర్‌ ఊర్ల లంగ తిరుగుడు తిరిగేటోల్లందరు ఉత్తగ కిష్నతోని జగుడం బెట్టుకుంటరు. తన్నులు దిన్నంక పైసలిస్తడంటాని. ఈ నిచ్చె పంచాది మంచిదిగాదని కొర్కాసు తీస్కోని కిష్న ఎడ్మ చేతిమీద వాతవెడ్తది సాయిత్రి.  అంతట్లనే ఊరికెళ్ళి సాయిత్రమ్మ చెల్లెలొస్తది, గామెనే  ఇజయనిర్మల. ఇగ వొరసైనోల్లు ఊకుంటరా?...ఈమెకూ, కిష్నకూ జతకుదుర్తది.

     బాపమ్మ చెవులుగ్గబట్టి ఇంటున్నది ఊ కొట్టుకుంట.   ఆ ఊళ్ళేనే ఒగ పెద్దమనిషుంటడు. నాగబూషనం. నిజంగనే నాగుపామసోంటోడు. పేరెసోంటిదో బుద్దులు గూడ అసోంటివే. ఆనికీ రామారావుకు  పడది. నాగబూషనం చేశే అడ్డమైన పనులన్నింట్లకూ కాలడ్డం పెడుతుంటడు రామ్రావు. అది మన్సులవెట్టుకోని పగదీర్చుకునేటందుకు మోకకోసం సూస్తుంటడు నాగబూష్నం. 

ఇట్ల నడుస్తుండంగ ఎన్నడో సాయిత్రమ్మ నాయన బతికుండంగ లచ్చరూపాలు నాగబూష్నానికి ఇచ్చిండంట, అవి తీస్క రాపో అని రామ్రావు సాయిత్రమ్మని నాగబూష్నం తానికి తోలిస్తడు.

     సాయిత్రమ్మ పొయ్యేట్యాల్లకు లోపట ఇంకో మనిషుంటడు, ఈమె కిటికీ కాడ నిలవడ్తది. లోపటున్న మనిషికి పైసలిచ్చి తోలిచ్చినంక ఒక గుండేగాడు, ఆడేనమ్మ పబాకర్రెడ్డిగాడు... ఆన్ని యాత్రకు పంపియ్యమని చెప్తడు నాగబూష్నం.    తరువాత సాయిత్రమ్మకు తియ్యగ తేనసోంటి మాటలు చెప్పి పైసలియ్యకుండనే ఎనకకు పంపిస్తడు నాగబూష్నం.  సాయిత్రమ్మ ఇంటికొచ్చే తోవల పబాకర్రెడ్డి గాడు... ఆడేం మనిషమ్మ... పచ్చి నెత్తురు తాగే రాచ్చశుని లెక్కనే ఉంటడు, ఆనింట్ల పీనిగెల్ల, ఆనికి దినం బెట్ట ఆడు నాగబూష్నం ఇంట్లకెళ్ళి ఎల్లిన మన్సి గుండెల కత్తి తోటి పొడ్సుడు సూశి పానాలు  చేతిలవట్టుకోని ఇంటికొచ్చి బేవోష్‌ అయితది సాయిత్రమ్మ. ఏమయ్యిందో చెప్పమంటాని ఎంత బుల్గరిచ్చినా చెప్పది. ఒక్కతీర్గ ఏడుస్తనే ఉంటది. గంత దుక్కం పగోనికి గూడ రావద్దమ్మా’.

లచ్చుమమ్మ గుడ్లల్ల మల్ల నీళ్ళు కన్లవడ్డయి నాకు. ‘కసాయిగానసోంటి కర్కోటకుడు నాగబూష్నం కిష్న మీద కేసుపెడ్తడు, నన్ను కొట్టిండంటాని. తల్లసోంటి సాయిత్రమ్మ చేతిల చెయ్యేసి ఇగ ఎవల్నీ కొట్టనని ఒట్టువెట్టినోడు ఎట్లకొడ్తడు చెప్పుండ్రి. దొంగ కేసు బనాయిస్తడు నాగబూష్నం. రామ్రావ్‌ కోరుట్ల జోర్దార్గ వాదిస్తడు కేసు, కని సాయిత్రమ్మ అవద్దం సాచ్చీకం చెప్పి కిష్నను జైల్లకు పంపిస్తది’.

బాపమ్మ మనసు పెట్టి ఇంటున్నది. లచ్చుమమ్మ ఆగకుండ చెప్తనే ఉన్నది.

‘తక్వ కోపం రాదు రామ్రావ్కు పెండ్లాం మీద. పెండ్లాం అమ్యాదని తెలుసాయె. ఇగ ఆఖిరికి చెప్తది సాయిత్రమ్మ పైసల కోసం తమ్మున్ని మరదల్ని చంపినోడు కిష్నను ఏమన్న చేస్తడని, అట్లనే మునుపు పబాకర్రెడ్డి తోటి ఖూనీ చేపిచ్చుడు కండ్లార సూస్తిని, గందుకే బుగులువడి జైలుకు తోలిచ్చిన్నని చెప్తది సాయిత్రమ్మ. ఆడుంటెనన్న పానం నిలుస్తదని ఆ తల్లి ఆశ. పిల్లలు లేని సాయిత్రమ్మ మరిదిని సాది పెద్దగ చేసిందాయె. కన్న పేమ కంటే పెంచిన పేమ పెద్దదాయె.  ఆఖర్కి ఎత్తులకు పై ఎత్తులేశి నాగబూషనాన్ని పోలీసులకు పట్టిస్తడు రామ్రావ్‌'.

 ‘గట్లనే సీన్మ కత మంచిగనే చెప్పినవు గని, 

గీ సీన్మ సూశి నువ్వు నేర్సుకున్నదేంది చెప్పు,’ అడిగింది బాపమ్మ కతంత ఇన్నంక.

జర సేపు సోంచాయిస్తున్నట్లు మీదికి సూశి నిమ్మలంగ చెప్పింది లచ్చుమమ్మ,‘బతుకుల ఎన్ని తిప్పలువడ్డా, ఎవ్వడు తిప్పలవెట్టినా, ఏ కష్టం అడ్డమొచ్చినా, అన్నదమ్ములందరు కల్సిమెల్సి ఒగరికొకరు ఆసర ఉంటే దేన్నన్న ధైర్నంగ ఎదిరొంచొచ్చు అనేది నేర్పుతదమ్మ గీ శీన్మ’.

 ‘సీన్మ పేరేందో చెప్పకపోతివి లచ్చుమమ్మా,’ అన్నది బాపమ్మ.  అదేందో ఇచ్చిత్రంగ ఉండెనమ్మ సీన్మ పేరు...అరెరే యాదికొచ్చింది ‘ఇచ్చిత్ర కుటింబం’, అంటాని నోటి నిండ నగింది లచ్చుమమ్మ.   కందులిసురుడు అయిపోయింది, లచ్చుమమ్మ పోతుంటే ఎనకకు పిలిసి సోలెడు కందిపప్పు కొంగులవోశింది బాపమ్మ.   లచ్చుమమ్మ చెప్పిన ఒగరికొకరు ఆసర అంటేందో మంచిగ అర్తమయ్యింది నాకు. logo